RSS

స్క్రీన్ షాట్లూ, పీడీఎఫ్ లూ....

ఇది వరకు వారపత్రికలలో వంటలూ - వార్పులూ , కథలూ- కవితలు , పాటలు - పద్యాలు , ముఖచిత్రాలు పుస్తకాల అట్టలకి, పక్కింటి అమ్మాయి కి ముగ్గులు - అల్లికలు   అవి తీయగా  ఓ పది కాయితాలు మిగిలేవి పేపరు రద్ది వాడి కిచ్చేందుకు.
 . ఆ తర్వాత  అవి అలాగే చదవడం , అవి కలగాపులగా అవడం, అప్పుడు కొంచెం కాయితాలయితే ' స్టేప్ లరు'  తో పిన్ చేయడం, ఎక్కువగా వుంటే కంఠాణీ తో లేకపోతే మేకు తో మూడు కన్నాలు చేసి దారంతో కుట్టుకొని చదవడం , బాగుండేది ! అవి  కలబోసిన కదంబ మాల గా ,  నెల చివరి రోజ్జుల్లో మధ్యతరగతి సబ్బులాగ  (అరిగి పోయిన సబ్బు ముక్కలన్ని కలిపితే రంగు రంగుల సబ్బు మిశ్రమ వాసనలతో వుంటుంది లెండి !)  ఇంక ఆ కాగితాలు  అప్పుడు అటు ఇటూ పెత్తనాల కెళ్ళడం.
అంగుళాల గ్రాఫ్పేపరు మీద ఇంటూ మార్కు లతో మేటీ డిజైను , కార్బను పేపరు తో ఎంబ్రాయిడరి డిజైనులు తీసుకోవడం !
 భలే గా వుండేది!
 అదే అలవాటు తో ఇప్పుడు అంతర్జాలంలో పాత పత్రికలలో  నేను పుట్టని క్రితం కథలు చదవడం , చిన్నతనం లో నాకు నచ్చి , కుట్టేందుకు కదరని డిజైను కంటపడేసరికి , గ్రాఫ్ పేపరు, పెన్సిల్ తో  తయారయ్యాను.  అది చూసి మా శిరీష ఒక నెమలి ని ఎదురు బెదురుగా నాకు కావలసిన విధంగా చేసి  పది నిమిషాలలో printout  ని నా చేతిలో పెట్టింది. సంతోషమే సంతోషం ! చిన్నపిల్లలా కుట్టడం పూర్తిచేసాను. ఇంతకు ముందు చాలా పెద్ద డిజైనులు కుట్టినా అవి అన్ని ఒక ఎత్తు . ఇదొక ఎత్తు . దీనితో చిన్నతనం జ్ఞాపకాలు , అవీ గుర్తొచ్చాయి .అవన్నీ అటకెక్కేసి ఇప్పుడేమో స్క్రీన్ షాట్లూ, పీడిఎఫ్ లూనూ... ఆరోజుల్లో కొన్ని గంటలు పట్టేవి, ఇప్పుడేమో క్షణం లో అయిపోతోంది...

మొట్టమొదటి సారి ప్రచురింపబడిన ఆణిముత్యాలు. ఓ రెండు ., నేను కుట్టిన డిజైన్ 

హల్లో... ఏమీ తోచడం లేదంటారా....


   మా స్నేహితురాలు ఫోన్ చేసి ఏమీ తోచటం లేదు అంటూ మొదలు పెట్టింది. ఏమీ తోచడం లేదనేసరికి  నేను అందుకున్నాను.  అదేమిటండీ ! ఇదివరకయితే “ తోచక తోటికోడలు పుట్టింటికి వెళ్ళింది “ అనే సామెత వుండేది . ఇప్పడు సమయం సరిపోవడం  లేదనేవారే కాని ,తోచడం లేదంటారేమిటి? అంటూ ఆశ్చర్యంగా “ మీకు Whatsapp, FB,  , లాంటి కల్పతరువుండగా అలా అంటారేమిటి?  మన స్నేహితులతో కబుర్లు చెప్పండి, కంటికి కనిపించినవి , మీకు నచ్చినవి ఫొటో లు తీయండి. అందరితో పంచుకోండి, లేదంటే మీ దగ్గరి చీరలు కట్టుకొని సెల్ఫీ తీసుకొని  ఆచీర ఎప్పుడు కొనుక్కున్నారో, ఎవరు యిచ్చారో, ఆ ముచ్చటలు రాయండి. కాదంటరా, మీరు చేసిన బ్రేక్ ఫాస్టు , వండిన వంట, షేర్ చెయ్యండి. కొత్త డిషెస్ అయితే వాటి విధానం కూడా రాయండి.
  అయ్యొ ! మీరు రచయిత్రి కాదంటారా ?  అబ్బే ! అవి కధలు కాదుకదండీ ! మీఅనుభవాలు, అనుభూతులు అందరితో పంచుకోవడం , దీనితో మీ సోషల్ కమ్యూనికేషన్ పెరుగుతుంది.  ఏమిటీ, అందరికి నచ్చదంటారా? అందరికి నచ్చాలని రూలు ఏమి లేదు కదా? నచ్చితే కొంతమంది లైక్ లు పెడతారు, లేక కామెంట్లు పెడతారు, విమర్శిస్తారు, విమర్శ్లలతో ముందుకి వెళ్ళిపోండి,. ఏడాది తిరిగేసరికి వర్ధమాన రచయిత్రి అయిపోతారు.నిజంగా చెబుతున్నానండి. మీ కబుర్లు తియ్యగా వుంటాయి.వాటికో రూపం యిచ్చి వీటిలొ పెట్టండి. ఎందుకయినా మంచిది మనిద్దరం కలసి తీసుకున్న ఫొటో లు జాగ్రత్త గా పెట్టుకుంటాను.వర్ధమాన రచయిత్రి తో అంటూ నాకు అవకాశాం వస్తుంది, ఏమంటారు? అరే! నన్ను చూడండి, నాకు ఏమి వచ్చునని ? ఏ దో తను రాస్తున్నారని, రాయడం మొదలుపెట్టాను. ఏం రాయాలో తెలీక, మా వారు రాసినదానికి ప్రతిగా రాయడం మొదలుపెట్టాను. చదివిన వారు ప్రొత్సహించారు,కొంతమందికి నచ్చలేదు, కాని నాకు మాత్రం  తృప్తిగా ఉండేది.. పొద్దు, శంకరాభరణం, తురఫ్ ముక్క, మాలిక, కొముది ల్లో గడి నింపి పంపడమంటే ఎంత బావుండేదో చెప్పలేను. వాటి కోసం తొందరగా పని పూర్తి చేసేసుకొని ఎదురుచూసేదాన్ని. ఇప్పుడు అన్ని మూత బడిపోయాయి  నాకు ఇంటరెస్టు తగ్గిపోయింది.  కానీ  వీటితో కొత్త పరిచయాలు, స్నేహాలు, ఏర్పడ్డాయి.చాలా సంతోషమనిపించింది. బ్లాగులతో మా వారు బాబాయిగా మారితే నేను అందరికి పిన్ని గా మారిన నాకు, ఎన్నో కొత్త బంధాలు, వారి ఆప్యాయత,  వెల కట్టలేని అభిమానం  నాస్వంతమయ్యాయి. అయినా అప్పుడప్పుడు కెలుకుతూ వుంటాను. ఎవరినీ నొప్పించకుండా, నిందించకుండా, రాస్తే తప్పులేదు.తెల్లారితే ఎంతోమంది పలకరింపులు, వారి అభిప్రాయాలు, అభిమతాలు, కొత్తవిషయాలు, తెలుసుకోవడం అన్ని చాలా బాగుంటాయి.సీరియస్ గా చెబుతున్నాను. ఇందులో ఒకసారి ప్రవేశించి చూడండి, తోచకపోవడమన్న మాటే వుండదు. కాదంటే ఆరోగ్యవంతంగా వుండేలా చూసుకోండి.  మీ నియంత్రణ లో అవి వుండాలి కాని వాటి కి అలవాటు పడిపోకండి.బానిసలుగా మార్చేస్తుంది. దేనికి అతి పనికిరాదు కదా! పిల్లలతో , స్నేహితులతో అనందంగా చిన్నప్పటి  జ్ఞాపకాలు, ముచ్చట్లు, గుర్తు చేసుకొండి. మీ అనుభవాలు, చిన్న చిట్కాలు అందరితో పంచుకోండి.. ఏమీ తోచడం లేదంటూ మాత్రం ఫోన్ చేయకండి. ఒకే! వుంటాను.

" పొరుగింటి మీనాక్షమ్మను........."


      ' ఇంటి గుట్టు లంకకు చేటు " అని పెద్దలంటే, ఇప్పటివారు, ' ఇంటి ' గుట్టు ఫేస్ బుక్కు లో పెట్టి రట్టు చేయకే ' అంటున్నారు.   ' ఆ ' ఇంటి కాకి ఈ ఇంటి మీద వాలకూడదు' అని ఇదివరకువారంటే, ఇప్పుడు, ' ఆ ఇంటి పావురం ఈ ఇంటిమీద వాల కూడదు ' అంటున్నారు ( కాకులెక్కడున్నాయి, అన్నీ పావురాలె గా)   ' ' పొరుగు ఇంటి మీనాక్షమ్మను చూశారా ' , ' పొరుగు ఇంటి పుల్లకూర రుచి ' కి బదులుగా, ' పొరుగు ఇంటి మీనా ని చూశారా, తను పెట్టిన పోస్టుకి, ఇన్ని లైక్కులూ, ఇన్ని కామెంట్లూ వచ్చాయిట, అంతేకాదు, ఇంతమంది షేర్ చేసుకున్నారట' -- ఇదీ పరిస్థితి. ( భాష మారినా భావం మారిందంటారా?)   ' అందరిమీదా కేకలు వేసే పులిలాటి ఆఫీసరు, ' ఇంటిలో పిల్లి'. మరో ఇంటిలో పెత్తనం అంతా ఆవిడదే. ఆవిడే ఆ 'ఇంటి ' యజమానురాలు. ' ఇంటి ' ఆయన వంట ' ఇంటి ' కుందేలు అని అప్పటి మాటైతే, ఇప్పుడు ' ఇంటి ' కి ఇద్దరు, సమాన బాధ్యతలతో సమాన హక్కులతో, జంట గా జత గా ఉంటున్నారు.   ' కొంతమంది ' ఇంటి ' కంటే గుడి పదిలమన్నట్టుగా, శలవు రోజున 'ఇంటి' కంటే మాల్స్ లో గడిపే ప్రబుధ్ధులు ఉన్నారు.   ' ' ఇల్లు' కట్టి చూడు, పిల్ల పెళ్ళి చేసి చూడు  అని వారంటే, క్యాంపస్ ఉద్యోగం రావడమేమిటీ, లోను తీసికుని ' ఇల్లు' కట్టేస్తున్నారు  ( అదే లెండి ఫ్లాట్ ). దానికి ఎడ్వాన్సు కట్టే డబ్బు, రిటైరయిన తండ్రికొచ్చే సొమ్ము బాపతు, లోన్ తీసికున్నందుకుకాను, ఓనర్ షిప్ మాత్రం కొడుకు పేరు.   ' ' ఇల్లు' కట్టగానే సరిపోతుందా, ముందున్నది ముసళ్ళపండగ అన్నట్టు, వాయిదాలు ( EMI) కట్టడం. ' ఇంటి' వాడయ్యాడు కదా , స్వీట్ హోం.. 'ఇంటి ' కి ఇల్లాలు కావాలి కదా, వివాహం హ్యాపీ మ్యారేజ్. రిటైరయిన తల్లితండ్రులతో కలిసి ఉండేసరికి ' ఇల్లు ' చిన్నదవడంతో, ' ఇల్లు' ఇరకాటం ఆలి మర్కటం. పడక ' ఇంటి' ముచ్చట్ల బదులు ' ఇంటింటి' రామాయణం (  घर घर की कहानी..)    ' తిన్న ' ఇంటి' కే వాసాలు లెక్క పెట్టేవారనేవారు. ఇప్పుడు వాసాలెక్కడ, స్లాబ్ కదా. సిటీ లో అద్దెకిచ్చామా, స్లాబ్ చూస్తూ, ఖాళీ చేయకుండా  ' స్లాప్ ( slap)  ' ఇచ్చే మహానుభావులెందరో.    ' ' ఇంటి ' లో wi-fi  పెట్టి, password  జాగ్రత్తగా పెట్టుకోకపోతే, ' ఇంటి ' దొంగని ఈశ్వరుడైనా పట్టలేన్డన్నట్టుగా అయిపోతుంది. ' ఇంటి ' కి వచ్చినవారికి మంచినీళ్ళతో  wi-fi password  కూడా ఇచ్చేశామనుకోండి, అంతకు మించి అతిథి సత్కారం  మరోటి లేదు.  ( అతిథి దేవో భవ ).
   ' అమ్మాయిని పెద్ద ' ఇంటి ' లో ఇవ్వాలని, పేద ' ఇంటి ' అమ్మాయిని, తెచ్చుకోవాలని ఇదివరకు అనుకుంటే, అమ్మాయి కానీ, అబ్బాయికానీ  స్వంత ఫ్లాట్ ఉందా, ప్రేమ పేరుతో పెళ్ళిళ్ళు చేసుకునే యువతీయువకులు చాలామందే ఉన్నారు.
   ' మీ ' ఇల్లు'  చిదంబరమా, లేక మధుర ( మీనాక్షి) మేనా,  అని గడుసుగా అడుగుతారు.    ' మా ' ఇంటి ' సభ్యులు నలుగురు, నలుగురూ బ్లాగర్లే, నాలుగు  FB Account లూ,  నాలుగు  Saving Account లూ. Like లతో.,  Comments లతో   Happy  గా ఉన్నామని ఓ ఇల్లాలు చెబితే, ' అమ్మ నీ 'ఇల్లు' బంగారం గానూ ' అనుకున్నాను..
    ' మా 'ఇంటి ' లో Quiz సమాధానాలు  Messenger లో పంపుతున్నాను కనక సరిపోయింది, లేకపోతే వంట ' ఇంటి' లో పోపులపెట్టి లాగ, దేవుడి గూటిలో వత్తుల పెట్టిలా అయిపోయుండేది నా Tab.   '  Homemaker  అనండి,  Housewife  అనండి, ' ఇంటి' కి దీపం మాత్రం ఇల్లాలే. ' ఇంటి' ని స్వర్గం చేసినా, ' ఇంటి' ని నరకం చేసినా ' ఇంటి' ఇల్లాలి చేతిలో మాత్రమే ఉంది.
   ' అయినా పొరుగు ' ఇంటి ' సంగతులు నాకెందుకూ?  నా ' ఇంటి ' సంగతులు నేను చూసుకోకా... కథ కంచికీ మనం ' ఇంటి' కీ....  


పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes