RSS

కొంపా -గోడూ

    నాకు చిన్నప్పటినుండి స్వంతయిల్లు వుండాలి అనేది ఓ పెద్ద కోరిక. దేవుడ్ని నాకు స్వంతగృహం కావాలని కొరుకున్నాను. యిచ్చాడు, కాని అందులొనే వుండి స్వగృహ ఆనందం కలిగించమని కోరుకోలేదనుకుంటాను.(నివాసముండటం) యివ్వలేదు....

    మా అమ్మగారు ఉద్యొగస్తురాలవటం వల్ల మేము మా అమ్మమ్మగారింటికి దగ్గరలోనే వుండవలసివచ్చెది.వారిది స్వంత యిల్లు. వారికి దగ్గరలోనె ఎలాంటి సదుపాయాలులేకపోయినా సర్దుకుపొవాలసివచ్చేది. చిన్నచిన్న చెల్లెళ్ళు . అమ్మమ్మగారి అవసరం ఎంతయినావుండేది..నరసాపురంనుండి తణుకు వచ్చిఓయిల్లు అద్దెకి తీసుకున్నారు,ఆ యింట్లొ కింద గచ్చు, పెద్దపెరడు, బావి అన్ని వుండెవికాని పైన రూఫ్ తాటాకులు.అయినా పరవాలేదనుకోండి, సమస్య ఏమిటంటె మా ఉరిలొ కోతులెక్కువ.రోజూ మా అమ్మ వంట చేసి ఉదయమే 7గంటలకల్లా స్కూలుకి వెళ్ళెవారు . మేము స్కూలుకి వెళ్ళెవాళ్ళం. చెల్లెలు అమ్మమ్మగారింటికి .నాన్నగారు తాళంపెట్టి స్కూలుకి వెళ్ళెవారు. 10గంటలప్రాంతంలొ,ఓ పెద్దకోతి (రాజా కోతనెవారు) పైనుండి తాటాకులు తీసేసి శేరు బియ్యంతొ వండిన యిత్తడి గిన్నె పట్టుకుపోయి తినేసి ఆ గిన్నె అక్కడ యిక్కడ పక్కవాళ్ల దొడ్లొ పడేసి వెళ్ళిపోయేది. మేము స్కూలునుంచి వచ్చిన తరువాత ఆ గిన్నె వెతుక్కు తెచ్చుకోవడం మళ్లి వండుకోవటమ్ . నెలలో ఓ పదిరోజులు ఈ భాగవతం , ఆ తిప్పలు భరించలేక ఆ పక్కనే మరో కొత్తగా కట్టిన యింట్లొకి మారాము. ఆ యిల్లు పెంకుటిల్లు, కాని క్రింద సిమ్మెంటు, నాపరాళ్ళు కాదు కదా కనీసం "దిమ్మిశ" కూడా సరిగ్గా చేయలేదు , కరెంటు లేదు. మేమే నేల శుభ్రంగా చేసుకొని పేడతొ అలికి ముగ్గులు పెట్టుకొని ,అవసరం మాది కనుక సర్దుకొని కాలక్షేపం చేసెవాళ్ళం.ఓ సారి తుఫానుకి మాయింటికి ,వెనుకవున్న టెలిఫొన్ ఆఫీసికిమధ్యలొ వున్న గోడ పడిపోయింది. వీళ్ళూ కట్టించరు , ఆఫీసువాళ్ళు కట్టించరు , మా యింటి ఓనర్సు మధ్య మధ్యలో వస్తూ వెడుతూవుండేవారు. ఓ మూడు గదులు వాళ్ళు వుంచుకున్నారు. ఓ సారి చీరల మూట వాడి దగ్గర ఓ చీర కొని ( మా అమ్మగారు, ఓనరు ఆడావిడే కలసి) నాకు వాళ్ళ అమ్మాయికి రెండు ఓణిలుగా చేసి తీసుకున్నారు. సరే ఓ రోజు రాత్రి 8 గంటలకి భోజనాలు చేసి కంచాలు కడుగుతుంటే ( అప్పట్లొ మేమే కంచాలు కడుక్కొవలసివచ్చెది. పనిమనిషికి యిచ్చెవారుకాదు) ఓ రాయి వచ్చిపడింది, ఏమిటా అని కంగారూ, ఏడుపులు , రాగాలు. గోడవతల నైట్ డ్యూటిలొ వున్నతను విసిరిన రాయి అది. తరువాత మా నాన్నగారు రంగంలోకి దిగి తెలుసుకున్నదిఏమిటంటె మా ఓనరుగారి అమ్మాయనుకొని నా మీదకి రాయి విసిరాడు( అ అమ్మాయికి అతనికి ప్రేమసంకేతమని) ఇదంతా ఆ ఓణి వల్ల వచ్చిన గొడవ. ఏక చీరతో చేసిన ఓణిల పొదుపు విని నాన్నగారి చివాట్లు అమ్మకి,, ఇంకొ యింటికి మారాము.ఈ ఇల్లు తిరుపతి కొండలా వీధి వైపు పెరట్లొ కూడా 12 మెట్లతొ ఎత్తుగావుండేది. ఆ యింట్లొ మేము చాలా బాగా ఆనందంగా గడిపాము.దొడ్లొ కూరలమొక్కలు ,పనసచెట్టు, అరటిమొక్కలు,మల్లెపూలు, చాలా బావుండెది నేను వ్రాసిన ఒకటి అరా కధలు కాలేజి మేగ్జైన్ లొ చూసికొని గర్వంగా వుండెది, ఆ తరువాత టీచరుగా కొనీ రోజులు ఉద్యొగం, ఆ తరువాత మా పెండ్లి, కానినాకు తెలియకుండానే నాలో ఎప్పటికయినా ఓ చిన్నయిల్లు స్వతంగా వుండాలనే కొరిక అలాఅలా పెరుగుతూనేవుంది.

    పూనాలొ నివాసం. ఓ మూడు సంవత్సరాలు అద్దెయిల్లు, ఆ తరువాత గవర్నమెంటు క్వార్టర్సు. బాగానె వుండెదికాని స్వంతయిల్లు అందని ద్రాక్ష.

1981లో టిచర్సు అంతా కలసి స్థలాలు తీసుకోంటున్నారని, మీకు ఇంటరెస్టు వుందా అని నాన్నగారి ఉత్తరం, నేను కూడా టీచరుగ కొన్ని రోజులు చేశానుకదా, టీచరుగారి అమ్మాయిగా మాకు దొరకొచ్చునని అన్నారు. సరే! తీసికిన్నాము, డబ్బులేవి? వెంటనే చేతి గాజులు ,మంగళసూత్రం తాడు బ్యాంకులొ పెట్టి లోన్ తీసుకున్నాము. మా అమ్మాయిని మాఫ్రండ్సుతొ శంకరాభరణం సినిమాకి పంపి బ్యాంకు పని చూసుకొని వెనక మేము హాలుకి వెళ్ళాము. పసుపుతాడు తొ వున్న నన్ను చూసేసరికి మా అమ్మాయికి వింతగాఅనిపించింది,చిన్నదే కాని గ్రహణశక్తి ఎక్కువేను,దానికి. చిన్న చిన్న మాటలతొ నా స్వంత యింటి కల గురించి చెప్పేసరికి తాతలు దిగివచ్చారు, ఆ తరువాత లోను తీర్చి వస్తువులు తెచ్చేసుకున్నాము. అలా స్థలం అమిరింది.

    మేము వరణ్గావ్ వెళ్ళినతరువాత మా తమ్ముడి వడుగుకి తణుకు వస్తే మా చేత మా నాన్నగారు శంఖుస్థాపన చేయించి హౌసులోన్ పెట్టుకొని సలాహా యిచ్చి పంపారు. నా పోరు పడలేక కొంత లోను, మరి కొంత మా నాన్నగారి నోటిమాటతొ తెచ్చినదానితొ(అప్పుగానే)మొత్తానికి ఓ ఆరుగదుల డాబా యిల్లు మా స్వంతమయింది గృహప్రవేశం బాగానే చేసుకున్నాము కోరిక తీరింది, అప్పు తీర్చేశాము. కాని మేము ఉద్యోగరీత్యా వరణ్గావ్ లొ వుండటంవల్ల అద్దెకివ్వడం వాళ్ళు పాడు చేయడం, రిపేర్లు, ఇత్యాది బాధలు------

" పూణె" వెనక్కి తిరిగిరావడం, అక్కడే సెటిల్ అవాలనుకొని( మా వారి ఆరోగ్య రీత్యా) ఆ యిల్లు నెట్ సహాయంతొ అమ్మేయడం, మళ్ళీ పూనాలొ కొనెవరకూ స్వంతయిల్లు లేదే అని బాధ. తపన, రిటైరైసమయానికి మాదగ్గర సొమ్ము మా అబ్బాయి పేరు మీద కోంత లొనుతో మళ్ళీ ఓ రెండు బెడ్ రూముల ఫ్లాట్ (1000స్క్వేర్ ఫీట్) తీసుకున్నాము. ఇంటీరియర్ డెకరేటర్ తొ చక్కగా అలంకారాలు చేయించుకున్నాము.మళ్ళీ బ్రహ్మాండంగా గృహప్రవవేశం చేసుకున్నాము. మేము పూనాలో సెటిల్ అవడం చూసి మా అమ్మాయి " ఢిల్లీ" నుండి పూనా వచ్చేసింది. వాళ్లది స్వంత ఫ్లాటేను, కొంచెం దూరంలో, తీసుకున్నారు, రిటైరు అయిన వెంటనే మా అబ్బాయి పేరు మీద తీసికున్న లోను తీర్చెసాము. అబ్బాయి వివాహం . అబ్బాయి కూడా పూనా రావడం, మేము ,మా అత్తగారు, వివాహం తరువాత యిల్లు చిన్నదని సరిపోదని మళ్ళి పెద్దయిల్లు, తీసికోవడం, చిన్న ఫ్లాట్ అమ్మేయడం, అబ్బాయిపెళ్ళయి కోడలు , మనవరాలు, మంచి సెంటరు లో పెద్ద ఫ్లాట్ , అంతా చక్కగావుంది, అంతా బాగుంది --

    ఆ తరువాత మా వారికి గొదావరీతీరంలో ఉండాలనే కోరిక, ఇదిగొ రాజమండ్రీ లో గొదావరి గట్టున మళ్ళీ అద్దె ఇల్లూ....

అందుకే దేముడిని కోరిక కోరుకొనేడప్పుడు
క్లియర్ గా కోరుకోవాలి
కన్ఫ్యూజన్ లెకుండా, లేకుంటే ఇంతే సంగతి.....

అమ్మ ఉత్తరం


    ఈ రోజు పోలాల అమావాస్య.పూజ చేసుకున్న ప్రతి సంవత్సరం ఆమ్మ పంపిన ఈ ఉత్తరం తీయడం చదువుకొని పూజ చేసుకోవడం.దాన్ని జాగర్తచేసుకోవడం. ఇంతవరకు ఏ పుస్తకంలో ను వ్రాయలేదు. అంత బద్దకం.కాని ఒకటి తీసి చదివినప్పుడల్లా అనందమేను.అప్పట్లొ అందరి యోగక్షేమాలు తెలుసుకునే ఆసక్తి వుండేది. ఆ అభిమానం ఆప్యాయత అలా ఉండేది.. ఇప్పుడు నేను నా పిల్లలు నా సంసారం, ఏమిటొ ఇలా మారిపోయాను.

ఈ ఉత్తరంలో అందరి కుశలము, పూజ ఎలా చేసుకోవాలో , కధ, అన్ని వ్రాసి 6-8-1974పోస్టు చేసిన ఉత్తరం.ప్రస్తుతం మా పిల్లలకు చాలాబంధుత్వాలే తెలీదు,చుట్టాలు మాట దేముడేరుగు, పక్క ఫ్లాటులో ఎవరుండేది కూడా తెలీదు.

    చి"సౌ" లక్ష్మిని మీ అమ్మ ఆశీర్వదించి వ్రాయునది. ఇక్కడ మేమంతా క్షేమం. నీవు చి"ఫణి బాబు, చి"రేణు.క్షేమమని తలుస్తానురేణు ఏం చేస్తోంది. డేకుతోందా, కూర్చుంటోందా? కబుర్లు బాగా చెబుతోందా, రోజు మంచము మీదనుండి క్రిందకు ఎన్నిసార్లు పల్టీ కొట్తిస్తున్నారు. అది పడిపోతే చూస్తూకూర్చుంటున్నారా, రేణు మామయ్య బాగా నడుస్తున్నాడు.(రేణుకంటె ఓ పదినెలలు పెద్దవాడు)అల్లరి చాలా చేస్తున్నాడు, నిన్న పెద్ద అక్క ( నేను) పంపిన రాఖీ అందుకొని చిన్నక్క చేత కట్టించుకున్నాడు. ఇంకా మాటలేమిరాలేదు.అరుణ , దేవి (ఇప్పుడు లేదు)రామం వాణి క్షేమం. నాన్నగారుక్షేమం. నీ ఆరోగ్యమెట్లున్నది? చిట్టివారి కోడలుఇక్కడే వున్నది(ఇంటి ఓనరుగారికోడలు)తెలుగు భాషా ప్రవీణ రెండవ శ్రేణిలో పాసయినది.భర్త (చిట్టి పంతులుమెట్రిక్ పరీక్షకు కట్టించినది. అమ్మమ్మ, తాతయ్య క్షేమం.రవణ అమ్మక్కయ్య(రవణ అమ్మక్కయ్య కూతురు)ఏలూరు వెళ్ళినారు. రవణ అక్కడే నోము పట్టినది. నాదెళ్ళవారింట్లొ అందరు క్షేమం(అమ్మ మేనమామగారింట్లొ). హైమతల్లిని తండ్రిని తాతను, నాయనమ్మను పెద్దతిరుపతి తీసుకువెళ్లినది, ఇంకా రాలేదు.(అప్పటికి ఈ హైమ 5నెలల పసిపాప, మా అమ్మగారి చిన్న మేనమామ గారి మనవరాలు)ఎల్లారమ్మ ( మా అమ్మగారి పెద్ద మేనమామగారి మనవరాలు)రెండు వారాలు హైదరాబాదులోచేసుకొని 3,4, వారాములకు మార్టేరు. నిన్ననే వచ్చినది. మధిరవారింట్లొ అందరూ క్షేమం.(మా అమ్మగారి పెద్దతల్లిగారింట్లొ) శ్యామలత్తయ్యగార్కి మరల ఏలూరు అయినది.(అమ్మగారి మేనమామగారి కూతురు హైమకి అమ్మమ్మ.)మామయ్య ఒక్కడే వెళ్లానాడు. కృష్ణ కు ఈ సంవత్సరము చదువైతేకాని కాపురం మార్చరు.సుందరం అత్తయ్యగారి(ఎల్లారమ్మ తల్లి) వెంకటనారయణ ఇంటర్మీడియ్ ట్ పాసు అయినాడు.పెద్దత్తయ్యగారి కోడలు పురిటికి వెళ్లినది( నా మేనత్త) క్రిష్ణ పాసయినాడు. రాధ, కుమారి పరిక్ష పోయినది.

పోలాల అమావాశ్య 17-8-74 తేది,శనివారమునాడు అయినది, దొరికితే కందమొక్కలు 2కాని 3 కాని పెట్టుకొని పూజ చేసుకొనవలెను. పసుపు కొమ్ములు పసుపు దారము 9 పోచలు వేసి మూడు కట్టి ఒకటి అమ్మవారికి ఒకటి నీవు ఒకటి పిల్లకు మెడలొ కట్టుకొనవలెను,9గారెలునైవేధ్యము , 9గారెలు వాయనము ఇవ్వవలెను, 7 చొ"న కూడా చేయవచ్చును, మొక్కదొరకనిపక్షములొ పోలేరమ్మ దేవత అని సంకల్పము చేసుకొని పూజ చేయవలెను, ముత్తయిదువు దొరకనిచో అమ్మవారికే వాయనమిచ్చి మీరె తినవచ్చును .మొక్కపెట్టు స్తలము అలికి పద్మములు పెట్టిపూజచేయవలెను. దీనిలో వెనుక కధ ఉన్నది, ఆ కధచెప్పుకొని అక్షింతలు అమ్మవారికి వేసి నీవు వేసుకొని పిల్లకు వేయవలెను. పిల్ల ఆరోగ్యం జాగర్త. విసుక్కోకు,బాబు అల్లరి చేస్తూంటే పూనా పంపేయమనిచెబుతోది అరుణ, అందుచే మామయ్య పూనా వచ్చేస్తూన్నాడని రేణుకుచెప్పు. ఇంక విశేషాలు లేవు, వెంటనే ఉత్తరం వ్రాయి, నోము అన్ని వారాలు చేసుకున్నావా?-------


    ఇదండీ! ఉత్తరం. మరి యిప్పుడు ఇంత ఓపిక వ్రాసెటంత సమయము ఎవరికివున్నాయంటారు? ఓ ఫోనుకాల్ అంతే మరి, వింటాం అంతే , వదిలేస్తాము. కాని ఉత్తరంలొ వున్న అనుభూతి , ఆనందం వస్తాయంటారా? ఇప్పటికి ఎన్నో సార్లు చదివాను, అయినా కొత్తగానే వుంటుంది. అందుకనే నేను పిల్లలతో ఫోను చేసినా సరే ఓ మెయిల్ కూడా పంపండి. నాకు కావలసినన్నిసార్లు తీసి చదువుకుంటాను అని, అమ్మొ! టైపు చేసి చేతులు నొప్పిపడుతున్నాయి, వుంటాను.

నా మనస్సులో మాట

   మార్పు అనేది మానవ సహజం.మారాలి కూడాను.ఆ మార్పు వచ్చినపుడు ఆనందంగా స్వాగతం పలకాలి. నేను మారను. ఇది వరకు ఎలా వుందో అల్లాగే వుండాలి. నా చిన్నపుడు ఇలాగే వుండేది ఇప్పుడు అలాగే వుండాలి ఆంటే కుదురుతుందా చెప్పండి.ప్రకృతి సహజంగానే కాలాల్ని మారుస్తుంది. దానికి అనుగుణంగా మనకి మారె సహజగుణం నేర్పుతుంది.మొన్న మేము పొరుగూరికి వెళ్ళివచ్చాము. అక్కడ కొంతమంది మా చెలెల్లు గారింట్లొ చదువులు , పిల్లలు వారి అబిరుచులు ఏవో మాట్లాడుకున్నారు, నాకు తోచినది చెప్పాలనుకున్నా చెప్పలేదు. కొత్తవారుకదా ఏమనుకుంటారోననిపించింది. కాని వారి మాటలని విన్నతరువాత నాకు తోచినది.---

    కొందరు తల్లితండ్రులు వాళ్ళపిల్లలని బలవంతంగా యిష్టంలేని చదువులు చదివిస్తారు.పిల్లలకు ఏ కోర్సు మీద అభిరుచి వుందీ? వాళ్లు ఎందులో రాణించగలరు?ఏమీ ఆలోచించరు, వాళ్లకి యిష్టమయినదే చదివిస్తారు,యిది చదివితేనే బాగుంటుంది. మంచి ఉద్యోగంవస్తుంది అలాగా వివరంగా చెబితె పరవాలేదు,బలవంతంగా వీళ్ళమీద రుద్దడం మాత్రం మంచిదికాదు.పిల్లలకు వాళ్ల కెపాసిటి తెలుసును. వాళ్ళు ఏది చదవాలి ఎందులో వాళ్ళు బాగా పైకి రాగలరు? కాని పెద్దలకి చెప్పాలంటే భయం.ఒకవేళ చెప్పినా పేరెంట్స్ వినరు. వాళ్ళు చెప్పినదే చేయాలంటారు. ఫలితం సరిగ్గా మార్కులు రాకపోవడం, ఫ్రస్ట్రేషను,డిప్రెషను.

చిన్నపిల్లలు వాళ్లకి ఏం తెలుసండి? మాతల్లితండ్రులు మమ్మల్ని పెద్ద చదువులు చదివించలేకపోయారు,పెద్దకుటుంబం . మేము అలాగాకాదు, మాకున్నది ఒక్కడే,వీడిని అన్నిసౌకర్యాలతో , దర్జాగా చదివిస్తాముమంచి స్కూలు, పేరుపొందిన సంస్థలో కోచింగు,అసలు అందుకోసమేగా మేమిద్దరం ఉద్యోగాలు చేస్తున్నది.కష్టపడుతున్నది?-- తల్లితండ్రుల మాట.

   తల్లితండ్రులు ఈ తరం పిల్లల్ని అర్ధంచేసుకోవాలి,వాళ్ల అభిరుచులు తెలుసుకోవాలి, వాళ్ల అభిప్రాయాల్ని గౌరవించాలి,వాళ్ల యిష్టా అయిష్టాలని తెలుసుకోవాలి, పిల్లలకోసం యింత సంపాదిస్తున్నాం ,యింత సేవ్ చేస్తూన్నాం,అని కాకుండా యింత సమయం పిల్లలతో గడిపాము, వారి మనసులోమాట తెలుసుకున్నాం,మా యిద్దరి మద్య మంచి వారధి నిర్మించుకున్నాం,అనేలా వుండాలి, వాళ్ళకి ఏం తెలుసులే అని కాకుండా వారి వ్యక్తిత్వానికి వారి మాటకి ప్రాధాన్యత యిచ్చి వారి మాటవిని చెప్పె అవకాశం యిచ్చి,స్నేహంగా, సన్నిహితంగా మెలగాలి.పిల్లలతో ఇండొర్ గేమ్స్ ఆడి ,స్క్రాబిల్ ఆడి పదవిజ్ఞాన్నాన్ని పెంచి, బిజినెస్ ఆట తొ వారి వ్యాపార దక్షత వ్యవహారతీరు గమనించచ్చును, చదరంగం ఆటతో యుక్తులు వారి షార్పునెస్ పెంచె ప్రయత్నం చేసి వారికి దగ్గరగావుంటూ,వారి ఇంటరెస్ట్ తెలుసుకోవచ్చును,చిన్న చిన్న కధలతో ఆటలతో మంచి ఏదో చెడు ఏదొ తెలియబరచి, ముఖ్యంగా చెప్పకండి, చేసి చూపించండి, చెప్పె నీతులకన్నా మన ఆచరణేముఖ్యం. మనం చేసె పనులు ,అలవాట్లు, మంచిగా వుంటె అవే నేర్చుకుంటారు.అనుకరణ మానవ సహజం. మనం మంచిగావుంటే అంటే చేసే వృత్తి నమ్మకంగా వుండటం ,సామాజిక, నైతికవిషయాలలో,అలవాటులలో,ప్రవర్తనలో,మన నడవడిక,మనమాట,పెద్దలకి మనం యిచ్చె గౌరవం, ఎంత ప్రాధాన్యత యిస్తూన్నమన్నది,చెప్పెవికావు, మనం ఆచరిస్తే, తరువాత తరానికి అభ్యాసం అలవాటు అవుతాయి. రేపటి అభ్యుదయానికి పునాది అవుతుంది.

   ఇంజనీరింగు, డాక్టరీ కోర్సులే కాకుండా,ఇంకా చాలా చాలా మంచి చదువులే వున్నాయి. ఈ కోర్సు నాకు నచ్చింది యిది చేస్తాను, అనే పుత్రరత్నాని ప్రోత్సాహించి సపోర్టు చేయండి. నేను ఇంక చదవలేను నా వల్లకాదు అంటె సమర్దించి తన కాళ్ళమీద తాను నిలబడకలిగే స్వయంఉపాధి పధకాల సహాయంతొ తనకు తాను నిలదొక్కుకునేందుకు సాయపడండి. మనసు విప్పి మాట్లాడే అవకాశం వుండేటట్లు చూసుకోవాలి.( వాళ్ళ పిల్లలు యింత బాగా చదువుతారు, మనల్ని చూసి నవ్వుతారేమో అలాంటి ఆలోచన రానీయకూడదు)పిల్లల దగ్గరనుండి మనకి కావలసినది గౌరవంకంటే ఆత్మీయత(అపనాపన్). మననుండి పిల్లలకు మమకారం మీకు మేము వున్నామనే భరోసా.

   మార్పు వచ్చింది కానీ,కొన్నిచోట్ల ఇంకా రాలెదు.పెద్దవాళ్ళ మూర్ఖత్వం, పిల్లల మొండితనం చూసిన తరువాత రాసిన సంగతండి ఇది. ఈ మధ్యన తల్లితండ్రుల ఒత్తిడి తట్టుకోలేక, విధ్యార్ధుల ఆత్మహత్యలు నివారించే బాధ్యత మనమీదే ఉందికదా !!

కదంబ పుష్పం
    మహాపద్మాటవీ సంస్థా కదంబ వనవాసినీ

    సుధాసాగర మధ్యస్థా కామాక్షీ కామదాయినీ"    అమ్మ వారికి ప్రీతిపాత్రమైన కదంబ పుష్పాన్ని ఈ వేళ మా సొసైటీ లో ఒకరు ఇచ్చారు. మీఅందరితోనూ పంచుకోవాలని అనిపించింది.

   మా ఇంటి కదంబవాసినికై మా ఇంట తనంత తానై వచ్చిన కదంబ పుష్పం.

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes