RSS

मै भी कभी बहू थी !

   ఈ వేళ మా అత్తగారి తిథి పెట్టడానికి రాఘవేంద్ర మఠానికి వెళ్ళాము. ఆవిడ వరసకి నాకు అమ్మమ్మకూడా అవుతారు.ఆవిడ 2007 లో 95 ఏట పోయారు.ఇప్పటికి 3 సంవత్సరాలయింది. ఏమిటో ఈవేళంతా ఆవిడగురించే ఆలోచనలు.
నా పెళ్ళై 38 ఏళ్ళయింది.అంటే నేను 35 సంవత్సరాలు కోడలుగా ఉన్నానన్నమాట!ఒక్కవిషయంలో మాత్రం నేను చాలా అదృష్టవంతురాల్ని, ఆవిడ నాచేతిలోనే ప్రశాంతంగా కన్నుమూశారు.ఆవిడ దగ్గరనుండి ఎన్నో నేర్చుకున్నాను, జీవితం గురించి ఆవిడలో కలిగిన మార్పులూ వగైరా. మీ అందరితోనూ పంచుకోవాలనిపించింది.

   నా పెళ్ళై వచ్చి, నాకు శ్రీమంతం చెయ్యడం, ఆవిడ షష్ఠిపూర్తీ ఒకే రోజున అయ్యాయి.అప్పటికే మా ఇంట్లో నాకు ఇద్దరు తోడికోడళ్ళు.ఇంట్లో మాశ్రీవారే ఆఖరి కొడుకు,ఈయన తరువాత ఓ అమ్మాయీ.కోడలొచ్చిన వేళన్నట్లు,నా పెళ్ళి తరువాత, మా ఆడపడుచు పెళ్ళయింది. 1975 లో మా మామగారు పోయారు.అయినా ఆవిడ అమలాపురంలో లంకంత ఇంట్లో ఒక్కరే ఉండేవారు,కొన్ని వాటాలద్దెకిచ్చేసి.మా బావగారు చాలా కాలం దగ్గరలోనే ఉద్యోగం చేస్తూండడంవల్ల,ఆయనే ఎక్కువగా అక్కడికి వెళ్తూ వస్తూ ఉండేవారు.ఇంకో బావగారేమో హైదరాబాదు లో ఉండేవారు.మాకు ఏడాదికో రెండేళ్ళకో అక్కడికి వెళ్ళే వీలవుతూండేది.ఎప్పుడో చూడాలనిపించినప్పుడు, పూనా మా దగ్గరకి వస్తూండేవారు.మేము పిల్లలతో అమలాపురం వెళ్ళినప్పుడు మాత్రం,నన్ను పూచిక పుల్ల ముట్టుకోనిచ్చేవారుకాదు.వంటా వార్పూ ఆవిడే. "ఏం చేస్తావులెద్దూ, రోజూ పిల్లలకి చేసి అలిసిపోతూంటావు,ఇక్కడికి వచ్చినప్పుడైనా రెష్టు తీసికో" అనేవారు. ఉన్న వారంరోజులూ,ఏదో ఒకటి చేస్తూండడమే. ఎంతచెప్పినా సంవత్సరాలకొద్దీ ఇంకోళ్ళకి పెట్టిన చెయ్యి! అవతలివాళ్ళు చేస్తే మడీ,ఆచారం కుదరదు,అలాగని మరీ నన్ను మడికట్టుకుని చేయమని అడగడం ఎందుకూ అని! ఏదిఏమైనా నాకు అమలాపురం వెళ్తే మాత్రం హాయిగా ఉండేది.

   మాకు వరంగాం ట్రాన్స్ఫర్ అయిన తరువాత, ఓ మూడు నెలలకి అక్కడికి వచ్చారు. అంతకుముందు, పూనా వచ్చినప్పుడల్లా, ఆవిడ మా అమ్మేమో అనుకునేవారు,పక్కవాళ్ళంతా!వరంగాం వచ్చేటప్పటికి, ముందుగానే చెప్పేశారు- నాకు 10.30 కి భోజనం పేట్టేయి తల్లీ, నాకు మీలాగ టిఫినీలూ వగైరా అలవాటులెవమ్మోయ్'-అని.మాకు అక్కడ క్వార్టర్ లో చుట్టూరా గార్డెనూ అదీ ఉండేది. దాంట్లో తులసి కోటా, పువ్వులచెట్లూ అన్నీ ఉండేవి.ప్రొద్దుటే ఆరింటికల్లా నిద్ర లేవడం అలవాటేమో, కొంచెం కష్టం అయేది,ప్రొద్దుటే ఈవిడా, పిల్లల్ని స్కూలుకి తయారుచెయ్యడం, ఆయన ఫాక్టరీకి తయారవడం, ఒక్కటే బాత్ రూమ్మూ. అందరికీ ఎవరిపనులు వాళ్ళకి అయిపోవాలి,ఎవరిని కాదంటే వాళ్ళకి విసుపులూ,కోపాలూ,
మీరే ఉహించుకోండి, మా ఇల్లెలా ఉండేదో!ఇంత హడావిడిలోనూ ఆవిడ స్నానం చేసేసి, తులసికోట దగ్గరకు వెళ్ళడం,దానిచుట్టూ ప్రదక్షిణలూ,బయట స్కూళ్ళకెళ్ళే పిల్లలకి తమాషాగా ఉండేది.పిల్లలు స్కూలుకీ,ఆయన డ్యూటీ కీ వెళ్ళగానే,కాఫీ త్రాగేసి,మళ్ళీ గార్డెన్లో చక్కర్లూ!ఇవన్నీ అయ్యేసరికి పదిన్నరా అయ్యేది.అప్పటికి స్నానం పానం పూజా పునస్కారం పూర్తిచేసికుని, ఆవిడకి పప్పూ,కూరా,ఓ పచ్చడీ ( మళ్ళీ ఊరగాయ కాదు!), పులుసూ పెట్టి భోజనం పెట్టడం!ఓ కునుకు తీసి, మళ్ళీ ఒంటిగంటన్నరకల్లా కాఫీ పడాల్సిందే. ఈ ప్రోగ్రాం అంతా ముందే చెప్పేశారు.ఆవిడకు కావలిసినట్టుగా చెయ్యకపోతే, ఆయన బాధపడతారేమో అని,అప్పుడప్పుడు కష్టమనిపించినా,ఎప్పుడూ నాగా మాత్రం పెట్టలేదు!అందుకనే ఈవిడను చూడ్డానికి వచ్చే తెలుగువారితో ఆవిడంటూడేవారు-' మా కోడలు, లోపల ఏమనుకున్నాసరే బాధ్యతగా అన్నీ టైముకి చేసేస్తూంటుంది. భోజనం పెట్టిందీ అంటే గడియారం చూసుకోనఖ్ఖర్లేదు, పదిన్నరయిందన్నమాటే!' అనేవారు.

   ఎక్కడైనా ఎవరైనా పోయారని విన్నారో, ఇంక ఈవిడకి బెంగొచ్చేసేది, పెద్దకొడుకు దగ్గరకు వెళ్ళిపోవాలని, అంతే ఆయన్ని పట్టుకుని పీకేసేవారు!పోతే పెద్దకొడుకు చేతిలోనే పోవాలని.ఏమిటో అన్నీ అనుకున్నట్లే జరుగుతాయా? మా పెద్ద బావగారు సడెన్ గా పోవడం, ఆవిడకో పెద్ద దెబ్బ. పెద్దబావగారు లేకపోవడంతో, అమలాపురం లో ఉన్న ఇల్లు అమ్మకానికి పెట్టేశారు. అప్పుడు మాత్రం ఆవిడ చాలా బాధపడ్డారు, మామూలు టీచర్ ఉద్యోగం చేస్తూ, పదిహేను గదుల ఇల్లు కట్టించడమంటే, మా మామగారు ఎంత కష్టపడ్డారో ఆవిడ కళ్ళారా చూశారు,అయినా సరే, ఆ ఇంట్లో ఏమేం సామాన్లెక్కడెక్కడున్నాయో ఓ కాగితం మీద వ్రాసి ఉంచారు.వాటన్నిటికీ కాళ్ళొచ్చేశాయి, అది వేరే సంగతి లెండి.

    పెద్ద బావగారు పోయిన తరువాత, మాదగ్గరా, చిన్నబావగారిదగ్గరా ఉంటూండేవారు. దురదృష్టవశాత్తూ,మా చిన్న బావగారూ, ఆయనపోయిన ఏడాదిలోనే మనవడూ పోయేటప్పటికి, ఇంక ఆవిడ లో ఒక టైపు నిర్వికారం వచ్చేసింది.ప్రపంచంలో ఇంక ఇంతకంటె ఆ భగవంతుడు ఏం చెయ్యగలడూ అని.పోన్లే ఉన్న ఒక్క కొడుకు చేతిలోనన్నా పోయే అదృష్టం ఉండేలా చెయ్యి దేముడా, అనుకొని, మాదగ్గరకు వచ్చేశారు.

    ఆవిడలో 35 సంవత్సరాలూ, ఆవిడలోని మార్పులన్నీ చూశాను, 60-70 ల్లో కొత్తకోడలుగానూ,70-80 ల్లో ఇద్దరు పిల్లల తల్లిగానూ,80-90 ల్లో ఓ అత్తగారి గానూ నాకెన్నో అనుభవాలున్నాయి ఆవిడతో. ఏం చెప్పినా, ఆవిడ చివరి నాలుగు సంవత్సరాలకీ, మా దగ్గరకు వచ్చేసరికి,ఆవిడని చూసి జాలి పడాలో, లేక ఎప్పటికైనా మనమూ అలాగే ఉంటామేమో అనే భయమో ఏదో తెలియదు, బాధ్యత మాత్రం ఎప్పుడూ మర్చిపోలేదు.ఆవిడలో వచ్చిన మార్పు చూసి, ఎంతో నేర్చుకున్నాను, పరిస్థితులకి అనుగుణంగా ఎలా ఎడ్జస్ట్ అవాలో, ఎలా ఉంటే మనకి మనశ్శాంతి ఉంటుందో,అన్నీ ఆవిడను చూసే నేర్చుకున్నాను.

బాధ్యత నుంచే బంధం ఏర్పడుతుంది,బంధం నుంచే అనుబంధం ఏర్పడుతుంది. ఆవిడ పోయినప్పుడు, ఆవిడ మొహం మీది ప్రశాంతత చూసిన తరువాత, నేను తీసికున్న బాధ్యత సరీగ్గానే నిర్వర్తించాననే అనిపిస్తూంది. అందుకే ఇన్ని జ్ఞాపకాలు.

నాకూ ఓ గుర్తింపోటొచ్చేసింది!!


పైనిచ్చినది ఈవాళ్టి(27/06/10) ఈనాడు వసుంధర లో నాబ్లాగ్గుగురించి వచ్చినది. జ్యోతి గారు ప్రొద్దుటే ఫోను చేసి చెప్పారు. ఏదో నాకు తెలిసిన వంటకం గురించి వ్రాయడం,అది నచ్చడం,పైగా దానిగురించి పత్రికలో పడడం అబ్బో, చాలా సంతోషంగా ఉంది.సుజాత గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జ్యొతి మాకు ఫోను చేసి చెప్పడం,తనబ్లాగ్గులో వ్రాయడం--అన్నీ ఈ ఆదివారం ఓ స్పెషల్ గా చేశాయి !

అదన్నమాట సంగతి!!

    ఏడాదినుండి బ్లాగ్గులు వ్రాస్తున్నాను. ఎంతండీ, మాశ్రీవారు ప్రారంభించిన పది పదిహేను రోజులకి మొదలెట్టాను.నాకేమైనా రిటైరుమెంటా,ఆయనలా రోజూ ఒక్కో బ్లాగ్గు పోస్ట్ చేయడానికీ, ఇల్లంతా తుడుచుకోవడం,తడిగుడ్డతో మళ్ళీ తుడవడం,వంటా వార్పూ,పూజా పునస్కారం ఎన్ని పనులు? ఆయన ఛాన్సు దొరికితే కంప్యూటరు ముందర సెటిల్ అయిపోవడం.ఇంక నాకెక్కడదీ ఛాన్సూ? ఏదో సంసారపక్షంగా ఉంటుందీ అని ఏవేవో వ్రాసేదాన్ని.జనసంచారం ఎక్కువ ఉన్నట్టు కనిపించలేదు, మా శ్రీవారి ఇంగ్లీషు బ్లాగ్గులా!

    ఓవైపు ఆయనేమో, రోజుకోబ్లాగ్గుచొప్పున వ్రాసుకుంటూ పోతున్నారు, పైగా 300 పైచిలుకి వ్రాసేనని ఓ గొప్పా!వ్రాసుకోవడం మానేసి,నాలా ఇంటిపనులు చూడమనండి,తెలుస్తుంది,ఎవరెక్కువ వ్రాయగలరో!వదిలేయండి ఆ గొడవ,ఇక్కడ ఎవరెక్కువ వ్రాశారూ అని కాదు,ఆయనదానికి అంత ట్రాఫిక్కు ఎందుకొస్తోందీ అని ఆలోచించా.ఆయనేమీ తెలియని విషయాలు వ్రాయడంలేదు,వ్రాసే భాషలో తేడా! పైగా ఈ విషయం ఆయనతో అన్నానంటే ఇంకా నెత్తికెక్కేస్తారు!పైగా ఛాన్సుదొరికితే తూ.గో.జి, ప.గొ.జీ అంటారు.అలాటివారినడిగి లాభంలేదు.మనమే ఏదో పరిష్కారం ఆలోచించాలి.

   ఎనాలిసిస్ మొదలెట్టాను.ఆయన వ్రాసే పధ్ధతి మామూలుగా మనం మాట్లాడేటప్పుడు ఉపయోగించే భాష ఉంటుంది.అంతకంటె ఎక్కువేం ఎక్స్ పెక్ట్ చేస్తాంలెండి... అయ్య నాశ్రీవారూ ఇదన్నమాట కిటుకు! పైగా ఈమధ్యన చాలా బ్లాగ్గుల్లో నామీద ఆడిపోసుకోవడంతోటే సరిపోతూంది. టిట్ ఫర్ టాట్, ఆమాత్రం నాకు వ్రాయడం రాదా అనుకుని రాణి రుద్రమదేవినీ, ఝాన్సీలక్ష్మీ బాయినీ గుర్తుచేసేసుకుని, ' భాగ్ ఫిరంగీ భాగ్ ఫిరంగీ...' అనుకుంటూ మొదలెట్టేశాను.

    కానీ ఇలా వ్రాయడం మొదలెట్టిన తరువాత అనుకున్నాను- ఈ వయస్సులో పాపం ఆయన్ని కష్టపెట్టడం ఎందుకూ అని, అయినా ఆయనెక్కడికి వెళ్తారు-మామిడికాయ పప్పూ, కందా బచ్చలి కూర,ఆవపెట్టి కూరలూ చేసి ఈయన వేవిళ్ళకోరికలెవరు తీరుస్తారులెండి? ఈవేళ్టికీవేళ, మామిడికాయపప్పూ, చామదుంప (ఉప్మా) కూర చేస్తే ఆవురావురుమంటూ తిన్నారు!

    అయినా చదివేవాళ్ళున్నారనీ, వినేవాళ్ళున్నారనీ, మరీ పేట్రేగిపోతే ఎంతకాలం ఊరుకుంటాం చెప్పండి. ఎప్పుడూ ఆయనవ్రాసేవే చదివేసి, నన్నేదో రాక్షసనుకుంటారని,నేనూ ఉన్నదేదో వ్రాస్తున్నాను.
ఒక్కవిషయం గమనించాను-ఇలా పధ్ధతి మార్చేటప్పటికి, ఎప్పుడూ రాని వారు కూడా నా బ్లాగ్గులోకి వచ్చి 'ఇక్కడేదో గొడవ జరుగుతోందీ' అని పసికట్టేశారు! పైగా ఇప్పుడు పాత బ్లాగ్గులు చదువుతూంటే, ఛా ఇదేమిటీ మరీ చాదస్థంగా వ్రాశానూ అనిపిస్తోంది
An Idea changes life!!

ఉత్తి ఉడుకుమోత్తనం !!!

    మాశ్రీవారికి అలవాటేగా, ఛాన్సు దొరికితే చాలు, నన్నూ,మా ప.గొ.జి వాళ్ళనీ ఎత్తిపొడవడం. నిన్నంతా ప్రయాణం బడలికతో కంప్యూటర్ దగ్గరకే వెళ్ళలేదు. ఈయన గారికి పాపం మూడు రోజుల కంప్యూటరు ఉపవాసం తరువాత, పూణే ఇంకా వచ్చేమో లేదో, కంప్యూటరు దగ్గరకూర్చుని, తన 'ఖున్నస్' అంతా వ్రాసేసికున్నారు, ఈ బ్లాగ్గులో

   అసలు ఒకటి చెప్పండి-పెళ్ళికి పూర్వం ఇంట్లో నాన్నగారు 'అమ్మాయీ' అని పిలవడం, చెల్లెళ్ళు,తమ్ముడు 'పెద్దక్కా' అనడం, ఏదో అమ్మ ఒకత్తీ పాపం 'లక్ష్మీ' అని పిలిచేది. బయటివాళ్ళందరూ ( అంటే చుట్టాలు) పేరయ్య శాస్త్రిగారి అమ్మాయీ అనేవారు. పెళ్ళైన తరువాత, అత్తగారూ, మామగారూ 'ఏమమ్మా' అనేవారు. పిల్లలు పుట్తుకొచ్చిన తరువాత, రేణూ కీ మమ్మీ, ఆ తరువాత హరీష్ కీ మమ్మీ అని పిలిచేవారే కానీ, అసలు నా పేరెవరికైనా గుర్తుండిందనుకోను. ఫాక్టరీ ఎస్టేట్ లో అందరికీ మిస్సెస్.ఫణిబాబు. అసలు నా పేరు నాకే గుర్తుంటుందా అనిపించేది. అదేదో కథలో ఓ ఈగ తన పేరు మర్చిపోయిందిట, అలాగయ్యింది నా పరిస్థితి! ఎప్పుడో, ప్యాన్ కార్డుకీ,వోటరు కార్డుకీ,పాస్ పోర్ట్ కీ నా పేరు గుర్తొచ్చేది ఆయనకి. బ్యాంకు ఎకౌంట్లన్నీ ఆయనపేరుమీదే. నా పేరు వ్రాయకపోతే పెన్షన్ ఇవ్వరేమో అని భయ పడికానీ, లేకపోతే అక్కడా ఉండేది కాదు!

   ఈ ముఫైఏడేళ్ళూ ఏ శుభకార్యానికీ వెళ్ళలేకపోయాము అనేక కారణాలవల్ల. మొత్తానికి ఈయన రిటైరైన తరువాత ఎలాగో మూడ్ వచ్చి ఎవరు పిలిస్తే వాళ్ళింట్లో శుభకార్యాలకి వెళ్ళాలని నిశ్చయించుకున్నాము.మేము రాజమండ్రీ వెళ్ళినప్పుడు, మా ఎపార్ట్మెంటు సొసైటీ లో మాత్రం, నలుగురైదుగురు లక్ష్మిలుండడంతో, నన్ను 'పూనా లక్ష్మి గారు' అనే పిలిచేవారు. ఏంచేస్తాం అంతకంతా!మొత్తానికి పరిస్థితిలో కొంతైనా మార్పొచ్చిందికదా అని సంతోషం!

    మా పెళ్ళైన తరువాత మా ఆడపడుచు పెళ్ళికి వెళ్ళినప్పుడైతే మరీ అన్యాయం- 'ఫణి పెళ్ళాం ఎవరూ' అంటే 'అదిగో చేతికి గాజులుకానీ, మెళ్ళొ నగలు కానీ లేకుండా ఉందే తనే'అనడం కూడా విన్నాము! పరిస్థితులు ఎప్పుడూ ఒక్కలాగే ఉండవుగా!

    ఇప్పుడు చెప్పొచ్చేదేమిటంటే, మా శ్రీవారు తననేదో, మావాళ్ళందరూ తక్కువ చేసి చూశారూ అనుకోనక్కర్లేదు.అక్కడ ఉన్నవాళ్ళకి, నా పేరే గుర్తులేదు, ఇంక ఈయన్ని ఎవరు గుర్తు పెట్టుకుంటారూ?అయినా వాళ్ళకింకేమీ పనిలేదా!అస్సలు గొడవంతా ఎక్కడొచ్చిందంటే, అక్కడ పాపం ఈయనకి వాళ్ళ కోనసీమ వాళ్ళెవరూ దొరకలేదు. అదీ ఉడుకుమోత్తనం! ఎవరితో చెప్పుకుంటారూ, అందుకని ఆ ఉక్రోషం తో ఉన్నవీ లేనివీ వ్రాసేయడం! మరి మా అత్తగారి/మామగారి వైపు వాళ్ళింటికి వెళ్తే వాళ్ళందరూ 'ఫణి పెళ్ళాం' అనలేదూ? ఇప్పుడు మా వాళ్ళందరూ 'లక్ష్మి మొగుడు' అనేటప్పటికి మాత్రం పొడుచుకొచ్చింది పేద్ద, అడిగేవాళ్ళు లేక !!!

    చెప్పాలంటే, అక్కడ మ్యారేజ్ హాల్లో, అందరికీ విడిగా రూమ్ములున్నాయి కావాలంటే, ఉండాలని ఉంటే ఉండేవారే,మళ్ళీ ఇంకా ఎన్నిసార్లు 'లక్ష్మి మొగుడు' అని వినాల్సొస్తుందో అని, పిల్లల వంక పెట్టి,కాచిగూడా, మా వియ్యాలారింటికి
వెళ్ళిపోయారు. అక్కడైతే ఈయన ఎంతైనా వియ్యంకుడు గారు కదా, అన్ని మర్యాదలూ జరుగుతాయి! నేను మాత్రం ఎన్నో సంవత్సరాల తరువాత చాలా బాగా ఎంజాయ్ చేశాను! చుట్టాల్లో కూడా, ఇదివరకటికీ,ఇప్పటికీ ప్రవర్తనలోకూడా చాలా మార్పొచ్చింది, వస్తుంది లెండి ఎందుకు రాదూ!

    రాత్రంతా చుట్టాలందరితోనూ కబుర్లతోటే గడిచిపోయింది. ఎన్ని సంవత్సరాల కబుర్లో! అందరూ అమ్మమ్మలో/మామ్మలో అయ్యేపోయారు! వాళ్ళ పిల్లల్నీ,మనవల్నీ, మనవరాళ్ళనీ పిలవడం, పరిచయం చెయ్యడం, అసలు టైము ఎలా గడిచిపోయిందో తెలియేలేదు, తెలిసేసరికి తెల్లారి పెళ్ళి టైము అయ్యేపోయింది.

    ప్రొద్దుటే శ్రీవారి ఫోన్నూ-ఇంకో పది నిమిషాల్లో వస్తున్నానూ, ఆటో వెయిటింగులో పెట్టి, రెడీగా ఉండూ అంటూ. ఓమాటు వాళ్ళకి చెప్పేసివచ్చేస్తానండీ అన్నా కాని వినకుండా, ' ఏం అఖ్ఖర్లేదు,రాత్రంతా కబుర్లు చెప్పుకున్నారుగా,నీ గురించేం బెంగపెట్టుకోరులే' అంటూ ఆటోలో కూర్చోపెట్టేశారు! ఇదంతా క్రిందటిరోజు అందరూ 'లక్ష్మి మొగుడూ' అన్నదానికి ఫలితమన్నమాట!
ఇన్నాళ్ళకి ఒక్కసారంటే ఒక్కసారి అలా పరిచయం చేసేసరికి, అసలు రంగంతా బయట పడిపోయింది!! ఉత్తి ఉడుకుమోత్తనం! అంతే ఇంకేమీ లేదు !

ముగ్గురు పిల్లలతో...

    మా అబ్బాయీ,కోడలూ ముంబై ఏదో పనిమీద వెళ్ళవలసివచ్చేసరికి, నవ్య,అగస్థ్య లను నేను చూస్తానూ అన్నాను.ఏదో, మా శ్రీవారుకూడా సహాయం చేస్తారనే సదుద్దేశ్యంతో. ఏదో నా తిప్పలేవో నేనే పడిఉంటే గొడవుండేదేకాదు.పైగా, 'పిల్లల్ని ఈ వర్షంలో తిసికెళ్ళడం కష్టం. నేను,ఈవాళ్టికి బయటకు ఎక్కడా తిరగడానికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటానులే' అని ఓ ఎష్యూరెన్స్
కూడా ఇచ్చేశారు. పోనీ మనిషికి మనిషుంటే తోడూ అనుకొని బాగానే ఉందీ అనుకున్నాను.

   నిన్న నవ్య పుట్టినరోజుకి చేసినవే, మిగిలినవి బ్రేక్ ఫాస్ట్ గా పెట్టేసి, పేద్ద వంటా అదీలేదుకదా, పిల్లాడిని చూసుకోవచ్చనుకున్నాను.మా కోడలు వెళ్ళేముందరే, అగస్థ్యకి ఏదైనా అవసరం వస్తే
వేయవలసిన మందులూ అవీ, చెప్పి నీట్ గా ఓ కాగితంమీద వ్రాసేసి ఇచ్చింది.ఏమీ అవసరం లేకపోయేయనుకోండి.

    ఈ మొగాళ్ళున్నారే, చిన్న పిల్లలు ఆడుతూ పాడుతూంటే చూస్తారుకానీ, ఏడిస్తే ఊరుకోపెట్టడం మాత్రం చెయ్యలేరని తెలిసిపోయింది. స్నానం చేసి, పూజ చేసికుందామని, ఈయనని కొంచెం పిల్లాడిని చూస్తూండమని చెప్పాను. మంచం మీద పొడుక్కోపెట్టినా పాకుతూ మంచం చివరకు వచ్చేస్తాడని, ఈయనని చూడమన్నాను.అసలు పిల్లల్ని చూడ్డం వస్తేకదా,మా పిల్లలటైములోనూ, ప్రొద్దుటే 7.00 గంటలకి ఫాక్టరీకి వెళ్ళిపోతే, తిరిగి సాయంత్రానికే రావడం.రోజంతా పిల్లలతో ఏమేమి తిప్పలు పడ్డానో ఈయనకేం తెలుసూ? పిల్లలు క్రమశిక్షణగా పెరగడం అంతా ఈయన ఘనతే అనుకుంటూంటారు.

   మా అగస్థ్యకి వాళ్ళ అమ్మ ఇంట్లోనూ, డే కేర్ లో ఆయాలూ ఎత్తుకోవడం అలవాటుచేసేశారు. క్రింద పడుక్కోబెడితే చాలు భోరుమని ఏడుపూ.ఒళ్ళో సేఠ్ లా కూర్చోవడం.పోనీ ఒక్కసారి ఎత్తుకోండీ అంటే, ఓ నిమిషం ఎత్తుకుని, మంచంమీద పడుక్కోపెట్టేస్తారు. వాడేమో ఏడుపూ.ఏమైనా అంటే విసుగూ.పోనీ వాడికి పట్టడానికి పాలైనా కలుపుతారా అంటే,అదీ లేదూ. న్యాపీ తడిసిపొతే మార్చడం కూడా రాదు.

    పోనీ నవ్యతోనైనా సరీగ్గా ఉంటారేమో అనుకుంటే అదీ లేదు.చిన్నపిల్ల,కొంచెం ఏక్టివ్ గా ఉంటుంది. అమ్మా నాన్నా లేకపోతే తనే ఇంటి పెద్దా అనుకుంటుంది.ఇల్లంతా కలియబెట్టేస్తూంటుంది. ఈయనకేమో చిరాకు. అలా కాదండీ, పిల్లల్ని అది చేయకూ,ఇది చేయకూ అంటే వినరూ ఈ రోజుల్లో, మాటల్లో పెట్టి వాళ్ళ దృష్టి మార్చాలీ అంటే, మూతి ముడుచుక్కూర్చుంటారు!
దీనితో ఈ వేళంతా ముగ్గురు పిల్లల్ని చూడ్డం అయింది మొత్తానికి.

చుట్టరికాల revival--part 2

    చుట్టరికాల రివైవల్ ప్రస్థానంలో హైదరాబాదు వెళ్ళాము. ట్రైనులో మా శ్రీవారు అలవాటు ప్రకారం ఓ కుర్రజంటతో పరిచయం చేసికున్నారు.ముందుగా వారి పాప( ఏణ్ణర్ధం వయస్సు) తో కబుర్లు మొదలెట్టారు. నాకు ఎప్పుడూ ఈయనతో గొడవే. ఊరికే అందరితోనూ పరిచయం చేసికుంటారూ, వాళ్ళకి నచ్చుతుందో లేదో అని అంటూంటాను. పూణే స్టేషన్ లో తెలుగు పుస్తకాలు కొన్నారు, కానీ చదువుకోడానికి మాత్రం తీయరు, అదేదో రేషను కొట్లో ఇచ్చినట్లుగా, ఒక్క పుస్తకమే ఇచ్చి, దాన్నే చదువుతూండమంటారు!ఎంతసేపని చదువుతామూ? అయినా సరే అన్ని పుస్తకాలు కొంటారా, కావలిసిందేదో చదువుకోవచ్చుగా అంటే, ఠాఠ్, అన్నీ బయట పెట్టేస్తే, ప్రతీవాడూ అడుగుతాడూ, మన ప్రయాణం పూర్తయేసరికి పుస్తకం రూపు మారిపోతుందీ అంటారు. మరీ గొడవచేస్తే, పుస్తకాలు కొనడం మానేస్తారేమో అని భయం! ఆయన ట్రైన్లో పరిచయం అయిన వారితో ఖబుర్లు చెప్పుకుంటూంటే, నా దారిన నేను ఏమీ పట్టనట్లు పుస్తకం ( ఆయన రేషన్ లో ఇచ్చినది!) చదువుకుంటూ కూర్చున్నాను.

    ఆయన కబుర్లు పూర్తవడం, నేను పుస్తకం చదవడం పూర్తి చేయడం ఒకేసారి జరగడంతో, ఇంకో దిక్కులేక, వారితో కబుర్లు మొదలెట్టాను. వారితో గడిపిన సమయం చాలా బాగా జరిగింది. దాని గురించి మావారు ఓ బ్లాగ్గు కూడా వ్రాశారు.

    ఇప్పుడు అర్ధం అయింది, ఆయన కనిపించిన ప్రతీ వారితో ఎందుకు పరిచయం చేసికుంటారో. ఈ పరిచయమే అవకపోతే మంచి స్నేహితులని మిస్ అయిపోయుండేదాన్ని కదా! ఈ మాట మావారితో అన్నానా ఇంక కాలరెత్తేసికుంటారు! 'చూశావా అస్తమానూ సణుక్కుంటూంటావు,అందరితోనూ పరిచయాలు వద్దండి బాబూ అని, ఇప్పుడు చెప్పు నేను చేసేది తప్పూ అని!'. ఏం చేస్తాం అన్నిరోజులూ మనవి కావుకదా! ఒకటి మాత్రం ఒప్పుకోవాలి, పెళ్ళిలో శ్రీ అవధాన్లు గారి గురించి చెప్పగానే, మా 'ఇమేజ్' మాత్రం పెరిగిపోయింది.

    ఇంక పెళ్ళి సంగతికొస్తే, అక్కడ ఉన్నవాళ్ళందరూ మా అత్తగారివైపు వాళ్ళే. తెలుసుగా నా పరిస్థితి ఎలా ఉండిఉంటుందో? మరీ ఇదివరకటిలా కాదనుకోండి, ఎంతైనా నేనూ ఓ అమ్మమ్మ/నాన్నమ్మ స్టేజికి వచ్చానుగా!నాకూ ఓ 'స్టేటస్' ఇచ్చేశారు! మనవరాళ్ళూ, మనవలిగురించే కబుర్లు చెప్పుకుంటే అసలు గొడవే ఉండదు!పాతరోజుల్లో అయితే ఇలా పెళ్ళిళ్ళకెళ్ళినప్పుడు, అత్తగారివైపు చుట్టాలందరికీ అడుగులకి మడుగులొత్తవలసివచ్చేది. హాయిగా ఇన్నేళ్ళ తరువాత అయితే ఓ సౌలభ్యం కూడా ఉంది. ఎవరైనా కనిపించినా గుర్తుచేసికోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఓ పోజు పెట్టామనుకోండి, అవతలి వాళ్ళు 'డిఫెన్సివ్ మోడ్' లోకి వెళ్ళిపోతారు! మరీ కుదరలెదనుకోండి, ఎవరో పిలిచినట్లుగా ' ఆ వస్తున్నా' అంటూ వీళ్లని తప్పించుకోవచ్చు ! ఇంత హడావిడిలోనూ, మా మామగారి వైపు చుట్టం ఒకాయన కలిశారు. ఆయన, మావారి పెదనాన్నగారి కొడుకు. ఆయనా, మా'తోటికోడలూ' అప్పటికీ అననే అన్నారు-' ఇక్కడిదాకా వచ్చి ఓసారి మా ఇంటికి రాకుండా వెళ్తున్నారే' అని.అబ్బే ఈ వేళ సాయంత్రం వెళ్ళిపోతున్నామూ, ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా వస్తామూ,అని ఓ స్టాండర్డ్ డయలాగ్గు చెప్పేశారు!
అందరితోనూ కబుర్లు చెప్పి. లంచ్ పూర్తి చేసికుని, సిఖ్ విలేజ్ నుంచి, ఎస్సార్ నగర్ దాకా ఓ ఆటో మాట్లాడుకుని, మా చెల్లెల్ని కలుసుకోవడానికి వెళ్ళాము. నేను వస్తున్నానని, మా అమ్మ తణుకునుండి వచ్చింది. వాళ్ళతో ఓ రెండు గంటలు గడిపి, మా వియ్యాలారింటికి కాచిగూడా తిరిగి వచ్చేశాము.రాత్రికి మళ్ళీ పూణే ఎక్స్ ప్రెస్ ( అదే మేము ప్రొద్దుట వచ్చిన ట్రైనే) లో ఎక్కి తిరిగి వచ్చాము. తిరుగు ప్రయాణం గురించి కూడా ఆయన ఓ బ్లాగ్గు వ్రాశారు.

    అక్కడితో వ్యవహారం పూర్తయిందనుకుంటున్నారేమో, మా అత్తగారి,అక్కయ్యగారి, కొడుకు కి, కూతురూ వాళ్ళూ పూణే లో ఓ ఫ్లాట్ కొనుక్కున్నారు. మేము వెళ్ళిన పెళ్ళి ముహూర్తమూ, వీళ్ళ గృహప్రవేశ ముహూర్తమూ ఒకేసారి అవడం వలన మేము వెళ్ళలెకపోయాము. తిరిగి రాగానే వాళ్ళని కలుసుకోవడానికి వెళ్ళి, వాళ్ళందరినీ భోజనానికి పిలిచారు. ఆయనా,మా 'తోటికోడలూ', వాళ్ళమ్మాయీ, అల్లుడూ, ఇద్దరుపిల్లలూ అందరూ కలిసి వచ్చారు, భోజనానికి. దీనితో మొత్తానికి మా అత్తారివైపు అందరికీ,అతిథి సత్కారం పూర్తైనట్లే !! ఆ వచ్చిన వారి కొడుకు ఒడుగుట కాకినాడలో. అదే ముహూర్తానికి మా మనవడికి అన్నప్రాశన హైదరాబాద్ లో, లేకపోతే ఆ ఛాన్సు వదిలేవారు కాదు !!

ఇదండీ సంగతి !!!

చుట్టరికాల revival

    గత 40 ఏళ్ళలోనూ బాగా దగ్గర వారి వివాహాలకు గానీ, ఇంట్లో శుభ కార్యాలకి గానీ ఏవేవో కారణాల వల్ల వెళ్ళలేకపోయాము.మా శ్రీవారు రిటైరు అయినప్పటినుండీ ఓ కొత్త వ్యవహారం మొదలెట్టారు.చుట్టాలందరితోనూ సంబంధాలు పునరుధ్ధరించడం. వాళ్ళు దగ్గరవారైనా సరే, దూరంవారైనా సరే,వారింట్లో శుభకార్యానికి వెళ్ళడం. ఆయనతో పాటే మరి నేను కూడా వెళ్ళాలిగా!
దానికి ఓ పేరుకూడా పెట్టుకున్నారు--' చుట్టరికోధ్ధరణ అభియాన్' అని!( Operation revival of relationships)

    ఈ సందర్భంలోనే మా అత్తగారి పెద్దక్కయ్య గారి పెద్దకూతురి, పెద్దకూతురు కొడుకు వివాహానికి మేము భాగ్యనగరానికి ఈ వేళ వెళ్తున్నాము! ఇక్కడితో అవలేదు, ఈ నెల మూడో వారంలో
మా వారి అత్తగారి పెద్దమేనమామగారి పెద్దకూతురి,కూతురు కొడుకు పెళ్ళికి మళ్ళీ రాజధానీ నగరానికి వెళ్తున్నాము. ఇంతే కాదండోయ్ రాజమండ్రీ లో ఉండగా, మా వారి చిన్నవదినగారి
పెదనాన్నగారి కూతురింటికి
వెళ్ళి వారిచ్చిన అతిథిసత్కారాలు స్వీకరించి,తరువాత మా చిన్నబావగారి అమ్మాయితో కలిసి,మా వారి చిన్నవదిన చిన్నపెదనాన్నగారి కొడుకింటికెళ్ళి అక్కడ కూడా
పసుపు కుంకాలూ, చీరా తీసికుని వచ్చాను!

    ' ఏమీ తోచనమ్మ తోటికోడలి పుట్టింటికి వెళ్ళింది' అని పూర్వకాలపు సామెత. కానీ ఇంకో రెండడుగులు ముందుకు వేసి, మా చినబావగారి కూతురితో కలిసి తన పినమావగారి ఇంటికి కూడా వెళ్ళొచ్చాము! ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ఎప్పుడు ఎక్కడ పిలిచినా, మావారు ముందరే టిక్కెట్టు రిజర్వు చేసేస్తారు! ఎక్కడో చెప్తే చాలు, డేట్ అటూ ఇటూ అయినా ఫర్వాలేదు, మేము రెడీ, చుట్టాలూ బి రెడీ!

గమనిక : ఇది స్నేహితులకి కూడా వర్తిస్తుంది !
!

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes