RSS

అస్సలు దాచుకోరండి బాబూ...

   నిన్నంతా కళ్ళజోడు లేక, ఏమీ చదవడం కుదరక, పొనీ టి.వీ. ఏనా చూద్దామనుకుంటే, అంతా గందరగోళంగా ఉండడంతో కట్టిపారేశాను.పోనీ ఏదైనా టపారాద్దామా అంటే, ఆ అక్షరాలు కనిపించి చావవూ. అసలు నా సరుకెదొ నేనే తెచ్చుకొక, ఆయనకి చెప్పడం ఏమిటీ, నా ఖర్మ కాపొతే! ఉత్తి పెట్టి కాస్తా తెచ్చారుట, దాంట్లో కళ్ళజోడు ఉందో లేదో చూసుకోవద్దూ? ఈవేళ ఆయన వ్రాసినటపా చదివితే తెలిసింది, అదంతా కావాలనే చేశారని, కంప్యూటరు దగ్గర తనే కూర్చోవచ్చని ప్లానన్నమాట!

    వీరి ఫోర్మన్ ఒకాయనుండేవారు, ఉద్యోగంచేసే రోజుల్లో, ఆయన ఇంట్లో, ఏదైనా తద్దినం లాటివి ఉన్నప్పుడు, ఈయనవి డెంచర్లు కాస్తా దాచేసేదిట, లేకపోతే ఏదొ ఒకటి తినేస్తారని. ఈయనకి పోనీ అలాటిదేమైనా చేద్దామన్నా, అసలు ఆ డెంచర్లే వాడరు! పైగా ఏమైనా అనడం తరవాయి, ఓ టపా రాసేస్తానూ అని ఓ బెదిరింపోటీ. అసలు ఈ కంప్యూటరు లో బ్లాగులు వ్రాయడం మొదలెట్టిన తరువాత, ఆయన వ్రాయని విషయం లేదు! ఏదైనా మాట్లాడాలంటే భయం వేస్తోంది.
అసలు మా పిల్లల్ని అనాలి, వాళ్ళకి నాన్నంటే ఎంతో ప్రేమా అభిమానమూనూ. అప్పుడెప్పుడో రాజమండ్రీ వెళ్ళినప్పుడు, ఈయన బర్త్ డే కి ఓ కంప్యూటరోటి కొనిపెట్టాడు మా అబ్బాయి,ఈయనేమో తెలుగు టైపింగు నేర్చేసికుని, ఇదిగో ఊరిమీద పడ్డారు. దానికి సాయం మీరందరూ కూడా ఉత్సాహపరిచేసరికి,ఇంక ఆయన్ని పట్టేవాళ్ళెవరూ? అవునులెండి, చేసికున్నవాళ్ళకి చేసికున్నంతా అని ఊరికే అన్నారా?పోనీ మా పిల్లలు, అమ్మ అంత శ్రమ పడిందీ, చదువుకునే రోజుల్లో, వాళ్ళతో కూర్చుని, పాఠాలు చదివించేదీ,కావలిసినవన్నీ వండి పెట్టేదీ అనెమన్నా గుర్తుంటుందా, అబ్బే, నాన్నే అసలు చాలా మంచివారూ, మేము అడిగినట్లుగా మాక్కావలసిన వారితో, పెళ్ళి జరిపించారూ లాటివే గుర్తు! వాళ్ళ దృష్టిలో అమ్మ ఎప్పుడూ హిట్లరే ! అది నీట్ గా ఉంచూ, ఇదిక్కడ పెట్టూ, అదక్కడ పెట్టొద్దూ అనే నా సాధింపులే గుర్తుంటాయి. వీళ్ళందరూ కలిసినప్పుడు ఇవే మాటలు. ఏదైనా తప్పు పని చేసేటప్పుడు మాత్రం నావైపు చూస్తారు, అమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో అని.

   ఈయనది అదో టైపు. శీతాకాలంలొ ఫుల్లుగా ఫాన్ పెట్టి పడుక్కుంటారు. చలేస్తోందండీ, అంటే సర్క్యులేషన్ ఉండాలోయ్ అంటారు. ఎంత చలైనా సరే ఓ బనినోటి వేసుకునే ఉండడం. మీరందరూ వేసుకుంటారని నానా తిప్పలూ పడి, అన్నేసి స్వెట్టర్లల్లితే, ఒక్కటీ వేసుకోరేమండీ, అంటే వద్దంటారు. అసలు ఈయనదేమైనా సిక్స్ ప్యాక్కా ఏమిటీ, అందరికీ చూపించుకోడానికీ? ఏమిటో, ఎవరి పిచ్చి వాళ్ళకానందం!మొత్తానికి ఈమధ్యన ఏమనిపించిందో ఏమిటో, చలేస్తోందోయ్ అనగానే ఓ స్వెట్టరు,అదొకటే మిగిలింది ఇక్కడ, మిగిలినవన్నీ మా ఇంట్లో ఓ సూట్ కేసులో పెట్టి పైన పెట్టేశారు. ఎప్పుడో వెళ్ళినప్పుడు తీసి తెచ్చుకోవాలి. లేకపోతే ఆ ఇచ్చిన స్వెట్టరు గొడ్డుతోల్లా తయారుచేస్తారు, ప్రతీ రోజు వేసేసికుని. దాన్ని ఉతకలేక చావాలి మళ్ళీ.

   చెప్పానుగా, మా శ్రీవారు ఏదీ దాచుకోరు, ఏం జరిగినా, ఏం మాట్లాడినా ఓ టపా వ్రాయాల్సిందే. ఎందుకండీ ఇలా మన కాపరం కాస్తా బయట పెట్టేస్తున్నారూ అంటే, ఏం చేయనూ ఇంట్లో వాళ్ళెవరూ నా మాటలు వినడం లేదూ, పోనీ బయటివాళ్ళైనా వింటున్నార్లే అంటారు. ఈయన ఖబుర్లన్నీ వినడానికి ఎవరూ లేకపోతే, మా మనవడు చి.అగస్థ్య తో చెప్పుకుంటారు. ఇంతా చేస్తే వాడికి రేపు జనవరి ఏడో తారీక్కి, ఏడాది నిండుతుంది. ప్రస్తుతానికి వాడొక్కడే ఈయనకి faithful listener! రేపెప్పుడో వాడికి మాటా, నడకా వచ్చిందంటే అవుతుంది ఈయన పని! అసలిదేం అలవాటో, ఒక్కటీ దాచుకోరు.జరిగినదేమిటో, ఎవరో ఒకరికి చెప్పేదాకా, నిద్ర పట్టదు. అసలు దాపరికం లేదండి బాబూ!అలాగని అన్నీ చెప్పరండోయ్, మొన్నటికి మొన్న రోడ్డుమీద పడ్డ సంగతి, తను వ్రాసిన టపా చదివేసే ముందర, బావుండదని నాతో చెప్పారు. అయ్యో అయ్యో అంతలా పడితేనైనా చెప్పొద్దుటండీ, ఏ సున్నం బెల్లం పట్టేస్తానేమో అని భయం! పోనీ అలాగని మా అందరిగురించీ పట్టించుకోరా అందామంటే అదీ కాదూ, ఫోన్లోనైనా సరే మాటలో తేడా వచ్చిందంటే పట్టేస్తారు ఏమిటీ వంట్లో బాగో లేదా అంటూ! డాక్టరుదగ్గరకు వెళ్ళేదాకా వదలరు.

   ఆ మధ్య నాకు వంట్లో బాగోలేదని అనగానే ఎంత హడావిడీ, ఈ.సీ.జీలూ, బేరియం టెస్టులూ, సుగరూ మొత్తం ఇంజను ఓవర్ హాలింగు చేసినంత చేసేశారు.మరి ఆయనకెదైనా జరిగినప్పుడు నాతోనైనా చెప్పాలా లేదా? ఏమైనా అంటే, ఊరికే ఖంగారు పడిపోతావూ అంటారు. ఔనమ్మా, నాక్కాక ఇంకెవరికుంటుంది ఖంగారు?

   ఇంకో విషయం- మొత్తానికి మా ఫ్రెండ్స్ తో చిట్ మళ్ళీ చేరానోచ్!మా శ్రీవారు 'ఊరికే ఏవేవో ఊహించేసికుని, వాళ్ళందరితోనూ కచ్చి చెప్పేశావు.అందరికీ ఎవరో ఒకరు ఉండాలి,just for change of scene' అని!

ज्योत से ज्योत जगाके चलो-జ్యోత్ సె జ్యోత్ జగాకె చలో...

    మేము రాజమండ్రీ లో ఉండగా,మా శ్రీవారు బ్లాగులోకంలో ప్రవేశించినప్పుడు, మన జ్యోతి తో పరిచయం అయింది.అదికూడా,మావారి బ్లాగు రూపం మార్చే సందర్భం లో.అంతవరకూ ఏదో స్కూల్లో వ్రాసే కాంపోజిషన్లా ఉండేది ఆయన బ్లాగు రూపం! అలాగే ఉంటుంది కాబోసు అనుకున్నాను.నాకేం తెలుసూ? క్రమక్రమంగా అంతర్జాలంలోని మిగిలినవారివి, అందులో జ్యోతి గారి బ్లాగులు చూసిన తరువాత తెలిసింది- బ్లాగుని ఎంత అందంగా తయారు చేసికోవచ్చో-మావారికేమీ ఈ కంప్యూటర్లూ వ్యవహారం తెలియదూ, ఏం చేయడం? ఆవిడనే అడిగేస్తే పోలా అన్నారు.మరీ కొత్తవాళ్ళని అడిగితే బాగుండదేమో అన్నాను.మనమేం అప్పడుగుతున్నామా ఏమిటీ,మా బ్లాగుకి కొద్దిగా అలంకారాలు చేసి పెట్టమ్మా అని అడగ్గానే, చేసి పెట్టేశారు.

   'లక్ష్మి గారిచేత కూడా ఓ బ్లాగు మొదలెట్టించకూడదా' అని అడగ్గానే,ఆ పని కూడా చేసేసి,దానికి డెకొరేషనూ వ్యవహారం తనే చేసి,'అబ్బో ఇలా ఉంటుందా బ్లాగాలంకారం' అనిపించేలా చేశారు. తరువాత్తరువాత, మాకూ కమ్యూనికేషనూ పెరిగింది. మధ్య మధ్యలో,ఏదో విషయం మీద టపాలు వ్రాయమని అడగడం ( వనభోజనాల టపా) వగైరా వగైరా..నా బ్లాగు గురించి తెలుగు పేపర్లో వచ్చినప్పుడు, మాకు ఫోను చేసి చెప్పడం..

    ఆవిడకీ, మాకూ చుట్టరికం ఏమీలేదు.ఇప్పటిదాకా ఒకళ్ళనొకళ్ళు చూసుకోలేదు, అయినా సరే ఏదో ఆత్మబంధువులా దగ్గరయ్యారు. ప్రతీ పరిచయం కమర్షియల్ అవుతున్న ఈ రోజుల్లో,ఎటువంటి పరిచయం లేని వారికి, స్వలాభాపేక్ష లేకుండా, అడిగిన వెంటనే సహాయం చేయడంలోనే కనిపిస్తోంది, జ్యోతి అభిమానం, స్నేహ భావం.

    నేను కొత్తగా కంప్యూటరు నేర్చుకున్న రోజుల్లో, షడ్రుచులు అనే బ్లాగులోకి వెళ్ళి, కొత్త కొత్త వంటలు చూసేదాన్ని. ఆ తరువాత, ఈ బ్లాగు నిర్వహిస్తున్నది మన జ్యోతి అని తెలిసిన తరువాత చాలా సంతొషం అయింది. అలాగే, నన్ను 'పొద్దు' లో గడి నింపకూడదా అని మెయిల్ పంపారు. వీటికి సహాయంగా, చిన్నప్పుడెప్పుడో చదివిన గైడ్ లాగ, గడి స్లిప్పులు ఒకటీ!

    జ్యొతి కి ఇంత టైమెలా ఉంటుందా ,ఇన్ని బ్లాగులు నిర్వహించడానికీ, వీటికి సాయం న్యూస్ పేపర్లలో వ్యాసాలు వ్రాయడానికీ అని ఆశ్చర్యపడిపొతూంటాను.అన్నన్ని వెరైటీ టాపిక్కులమీద వ్రాయడానికి ఎంతో జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఒకటే సరిపోదు, వ్రాయడానికి ఓర్పూ, సహనం ఉండాలి.నాకు నెలకో టపా వ్రాయడానికే ప్రాణం మీదికి వస్తోంది.అంత ఓపిక ఎక్కడిదమ్మా?

    ఇలాగే తెలుగు బ్లాగర్లకీ ఇంకా ఎన్నెన్నో విషయాలమీద టపాలు వ్రాస్తూ,తనకి తెలిసిన సంగతులు అందరితో పంచుకుంటూ, వారి ఆనందాన్ని ఇంకా పెంచుతూ,ఆయురారోగ్యాలతో ఎన్నెన్నో ఇలాటి పుట్టిన రోజులు జరుపుకోవాలని, ఆ భగవంతుడిని ప్రార్ధిస్తూ, మన జ్యోతి కి జన్మదిన శుభాకాంక్షలు.

    ఈ సందర్భంలో మాకు అత్యంత ఇష్టమైన ఈ పాట వినండి.

మా బుల్లి బుల్లి ట్రిప్పులు
   మార్గశిరమాసం మొదటి గురువారం ఈరోజు శ్రీనివాసుని దర్శనానికి బయలుదేరాము.ఇదివరకు ఈ గుడి గురించి రాసాను. ఇది మాకు చాలా ఇష్టమైన మందిరం. ఎలాంటి ఆటంకాలు లేకుండా (నిన్న టైర్లో హవా పోయిందిగా)తీసుకెళ్ళాడు. నిన్నటి కారే, అతనే డ్రైవరు.మేము దర్శనం చేసుకొని బయటకు రాబోతూంటే మాకొక వ్యక్తి కనిపించారు.అతన్ని ఎక్కడో చూసాను ఎక్కడా?ఆలోచిస్తే సర్ఫ్రరోష్ లో సలీం, బాలక్రిష్ణ నరసింహరాయుడు సినిమా, సూర్యవంశం యివన్ని గుర్తు వస్తున్నాయి. మావారు కాస్త దూరంలో వున్నారు. మా మరిది ని పిలిచి " నాగూ" ఇతను ఎవరంటావూ అని అడగ్గానే ప్రతి తెలుగు సినిమాలో విలన్ గా వేస్తాడే అతనేనూ అనడంతోటే అతన్ని పలకరించి షేక్ హేండు యిచ్చెసరికి పాపం హడిలిపోయాడనుకుంటాను. ఈ ఆంటీ ఏమిటీ? అని, మావాళ్ళు నమ్ముతారో లేదోనని చెప్పి ఓ చిన్నపుస్తకం తీసి ఆటోగ్రాఫ్ తీసేసుకున్నాను.చిన్నవాడేను, సినిమాల్లో పెద్ద వయసు విలన్ గా చూపిస్తారు. ఓ అడుగు ముందరకివేసి మా వారికి చెప్పాను ఆయన పరిచయం చేసుకొని మాట్లాడారు.అతను ఎవరో కాదు,బాలీవుడ్ నటుడు 'ముఖేష్ ఋషి'! ఆ తరువాత అక్కడే ప్రసాదం తీసుకొని బయట " క్యూ" చూసి హడిలిపోయాము. జనాలు నిలబడలేక కూర్చున్నారు. అంతమంది వున్నారు. మేము వెళ్ళినపుడు అంతా ఖాళీయేను, అంతా మా అదృష్టం. అమ్మవారి దగ్గర చాలాసేపు గడిపాము. ఆ తరువాత అక్కడనుండి " బనేశ్వర్" వెళ్ళాము.

   " బనేశ్వర్" నిజానికి " వనేశ్వర్" వనంలోవుంది ఈ శివుని గుడి. పెద్ద చెట్లు,లతలు రకరకాల పూవులు చాలా బాగుంది. గుడి లోపల గర్బగుడి చుట్టూ చిన్న చిన్న తాలాబ్ లా లాంటివి ఓ ఆరు వున్నాయి. అందులో ఒకదానిలో చేపలు, మరొకదానిలో తాబేళ్ళు, ఓకదానిలో మంచినీరు, వెనుక వైపు వున్నాదానిలో నీరు లేదనుకోండి. సహ్యాద్రి కొడలలో వున్న ప్రతి గుడి కి శివాజీ మహరాజు కి ఏదో ఒక లింకు వుంటుంది. లోపల శివదర్శనంచేసుకొని బయటకు వచ్చేసరికి అక్కడే పక్కనున్న హాలులో అప్పుడే పెళ్లి చేసుకున్నా దంపతులుని దేవుని చుట్టు ప్రదక్షిణానికి పంపారు. పెళ్ళికొడుకు పెళ్ళికూతురే చిన్నవాళ్ళు. వాళ్ళకి తోడు ఇంకా చిన్న పిల్లలు సాయం. ఎదో బొమ్మల పెళ్ళిలా అనిపించింది. ఇంకా యిప్పటికి బాల్యవివాహాలు జరుగుతూనే వున్నాయన్నమాట. మరీబాల్యం కాదనుకోండీ, 18 సంత్సరాలు పెళ్ళికూతురికి 20 సంవత్సరాలు పెళ్ళికొడిక్కిను, తెలుసుకున్నాములెండి.పసుపు రాసిన మొహలతో పసుపు బట్టలతో ఎంతో కళగా సిగ్గు సిగ్గుగా ఒకరి చేయి ఒకరు పట్టుకొని చూడముచ్చటగా వున్నారు. ఈ మద్య కాలంలో ఇంత చిన్న జంటను చూడలెదు. ఆ గుడి వెనుక అంతా అడవెనూ, కొంత పిక్నిక్ సాట్ లా చేసారు. పిల్లలకి ఆడుకునేందుకు , బాగా ఏర్పాటు చేసారు.

   అక్కడనుండి వాపసు "పూనే" వస్తూ వస్తూ కారులోంచే " దగుడు సేట్ వినాయకుడ్ని " చూపింఛి మహాలక్ష్మీ మందిర్ వెళ్ళి దర్శనం చెసుకొని మా మనవడు "క్రెచ్చి" నుండి వచ్చె సమయానికి ఇంటికి వచ్చేసాము. మా శిరీష ఆ రోజు ఉదయం 4 గంటల ఫ్లయిట్ లో " చెన్నె" వెళ్ళి రాత్రి 11 గంటలకు తిరిగి వచ్చేసింది. సో, అలాగా మార్గశిర గురువారం నాడు రెండు లక్ష్మీ గుడులు చూసుకునే భాగ్యం కలిగింది.

   ముంబైలో లో మహలక్ష్మి దేవాలయం చూశాము. మిగిలిన విశేషాలన్నీ మావారి టపాలో చదివే ఉంటారు.

భీమాశంకరుడి దర్శనాభిషేకం...
   మా యింటికి వచ్చిన బంధువలగురించి మా శ్రీవారు రాసిన టపా చదివారుకదా! సరే మొదటి రోజు భీమశంకర్ వెడదామని ప్లాన్ చేశాము. వీళ్ళ ట్రైన్ రావడం ఆలస్యమవడంవలన తెల్లవారి త్వరగా బయలుదేరదామనుకున్న వాళ్ళం ఆలస్యంగా బయలుదేరాము. కబుర్లు చెప్పుకుంటూ వెడుతున్న మాకు కొద్దిదూరం వెళ్ళేసరికి టైరు లో హవా తుస్. అది మార్చి మళ్ళీ బయలుదేరేసరికి నా కనిపించింది గుడి తలుపులు వేసేస్తారేమోనని. సరే!చూద్దాం ఆ శంకరుడు ఏం చేస్తాడో? కిందటిసారి వెళ్ళినపుడు అతి ప్రయత్నం మీద దర్శనం చేసుకున్నాము. చాలా రష్ గా వుంది.మేము నాలుగు ఫామీలీలు కలసి దర్శనం చేసుకొని అందరం తలో ఒక వంట చేసుకొని వనభొజానాలు కానిచ్చి తంబూలా ఆడుకొని సరదాగా గడిపి వెళ్ళాము. అ తరువాత చాలా మంది ఆంధ్రా నుండి వచ్చేవారు షిరిడి,నాసిక్,పూనె వచ్చి అష్టవినాయక్ దర్శనం,జ్యోతిర్లింగాలలో ఒకటైన భిమాశంకర్ చూసివెడుతునారని చెప్పి మేము వీళ్ళని తీసుకొని బయలుదేరాము.వాళ్ళు మామీదే వదిలేసారు ఎక్కడకి తీసుకువెళ్ళాలనేది. సరే! ఈ సారి ఎలా అవుతుందో దర్శనం , చూద్దాం. డ్రైవరు నెమ్మదస్తుడేనూ, బాగానే నడుపుతున్నాడు. కారు కూడా పరవాలేదూ, ఇండికా, ఎ.సి అదీ పెట్టాడు. ఘాట్ రోడ్డు మీద జాగర్తగానే తీసుకువెళ్ళాడు. చాలాదూరంలోనే ఆపేసి ఇక్కడనుండి నడిచివెళ్లాలన్నాడు. ఇదివరకటికి ఇప్పటికి ఆదాయం బాగుందనుకుంటాను. సిమెంటు దారి మెట్లు, అపక్క ఈపక్క చాలా కొట్లు కనిపించాయి.పనులు బాగానే జోరుగానే జరుగుతున్నాయి. అంతే కాకుండా డోలీలు కూడా వున్నాయి. మధ్యలో చెట్ల నీడలు, చల్లటి గాలులు,కోతుల కంపెనీతో హాయిగా మెట్లు దిగుతూ వెళ్ళిపోయాము. ( కొండ ఎక్కడం కాదిక్కడ,మెట్లు దిగాలిక్కాడ)

    గుడిలో ప్రవేశించి అక్కడే కూర్చున్న ఓ పూజారిగారిని అడిగాను అబిషేకాలు, ఏదయినా పూజ లాంటిదీ వుందా అని? చాలా ఆలస్యంఅయిపోయిందీ, ఏమీ వుండదని అనుకొంటూ,రుద్రాభిషేకానికి అంటుంటే ఆశ్చర్యంగా వుందా వుంటే యివ్వండీ,ఏమండీ, రుద్రాభిషేకానికి తీసుకోండీ, అంటూ అరిచినంతపని చేసాను. దర్శానానికే కాని ఏ పూజ కి అవకాశం వుండదులే అనుకొని మనసుకి సమాధానపరిచేసుకున్నాను అప్పటికేనూ, అలాంటిది ఆ అవకాశానికి మురిసిపోయి నేను చదివే లలితా సహస్రనామానికి ఫలితం దక్కిందనుకొని మురిసిపోయాను. లోపలికి తీసుకెళ్ళి రెండు పీటలు వేసి మమ్మల్ని కూర్చొమన్నారు, మా మరిది , భార్యా, ఓ పక్కన లోపలేకూర్చున్నారు. వారు చేసుకోలేదులెండి. ఇంకా ఎవరేనా వస్తారేమొ ననుకున్నాను అబ్బె ఎవరూ రాలేదు. మేమేను. అ రోజుకి మాదే ఆఖరి అభిషేకం. చాలా బాగా చేయించారు.రుద్రం, నమకం చమకం చాలా చక్కగా చదివారు. పంచామృతాలు అన్నీమంచిగా యిచ్చి చేయించారు.(ఒక్కోక్కసారి మరీపొదుపు పాటించేస్తారు కదా)అనుకోని అదృష్టం యిది.అక్కడున్న అందరు బ్రాహ్మలూ గొంతు కలిపి నమకం చమకం చదువుతుంటే ఆహ్ ! అద్బుతం. మనసారా తృప్తిగా ఆ శంకరుని సేవించుకొని వచ్చాము.ఇంక మా జయ (తోటికోడలు) ఎంత మురిసిపోయిందో చెప్పలేను.అక్కయ్యగారు మంచిగా ప్లాన్ చేసారండి అంటూ--

   ఆ తరువాత బయట కాసేపు కూర్చొని ఫోటోలు తీసుకున్నాము. ఇంతలో గుడి తలుపులు మూసేస్తామన్నారని బయటకు వచ్చేసాము. మా కోసం అగినట్లుగా ఆగి మా చేత అభిషేకంచేయించుకున్న శివయ్యకి బై చెప్పి వచ్చేసాము.మా జయ కొంత షాపింగ్ చేసింది. కోతుల్ని తప్పించుకొంటూ , మెట్లు ఎక్కుతూ పైకి వచ్చి అక్కడె వున్న దుర్గ గుడి కి వెళ్ళి కారులొ వెనక్కి బయలుదేరాము. అపుడు ఆకలి తెలిసివచ్చింది.కొంత ఘాట్ రోడ్డు దాటిన తరువాత గుబురుగా వున్న చెట్ల దగ్గర ఆగి ఆ నీడలో మా కోడలు శిరిష (చాలామంది బ్లాగ్ మిత్రులకి పరిచయం అయింది కదా ఈ మధ్య.) అందరికీ తలో మేథీ పరోటాల పేకెట్, తలో పేకెట్ పెరుగు అన్నం, చక్కాగా పేక్ చేసి యిచ్చినదీ తినేసి తిరుగు ప్రయాణం మొదలుపెట్టి రాత్రి 8 గంటలకి ఇంటికి చేరుకున్నాము. ఇదండీ, మా మొదటి రోజు ట్రిప్పు.
పైన ఇచ్చిన ఫొటోల్లో, అమ్మవారిపైన అద్దంలో కనిపించేది భీమాశంకరుని ప్రతిబింబం.

'లక్ష్మీ పురాణం'- రెండవ భాగం


    సరే! ఆ తరువాత పెద్దపూజారిగారింటికెళ్ళాము.ఆయన భార్య ఓ పెద్దావిడ. కనీసం ఓ 75 సంవత్సరాలుండవచ్చు.నాతో ఎలా పూజ చేస్తావు? మీకు అక్కడ సత్ సంగ్ లాంటివి వున్నాయా అని అడిగారు. మాములుగా రోజూ దీపంపెట్టి అష్టలక్ష్మీ స్తోత్రం,మండపాక ఎల్లారమ్మ దండకం చదుతాను. శుక్రవారం మాత్రం పాయసం లేకపోతే షీరా చేసి నైవేద్యం పెట్టి లలితా సహస్రనామం చదువుతాను.ఇంతలో ఆవిడ లోపలకెళ్ళి పసుపు కుంకుమ లతో విప్పేసిన చీర ఉండ చుట్టినట్ట్లుగా తెచ్చి, నా ఒడి పట్టమని చెప్పి దానిలో వేశారు.
ఇలాంటివి ఎక్కడ చూసానబ్బా , అనుకుంటుంటే గుర్తుకి వచ్చింది.పొద్దున్న గుడిలో మేము యిచ్చిన చీర అలంకరించినపుడు తీసేసిన చీర యిలాగే చుట్టలా చుట్టి ఒక గంపలోపడేశారు.అంబా తాయి శేషవస్త్రం అని చెప్పియిచ్చారు. నా నోటంట మాటే రాలేదు. కళ్ళు ఆనందభాష్పాలతో నిండిపోయి ఆ తల్లి తప్పితే మరేమి కనిపించలేదు.ఇంతలో ఆ పక్కవాళ్ళకి ఈ పక్కవాళ్ళకి వాళ్ళ కోడలు చెప్పినట్టున్నారు. వాళ్ళు వచ్చి " తుమ్ చి నసీబ్ కూప్ చాన్ హై" అని నా దగ్గర ఆశీర్వాదం తీసుకొని వెళ్ళారు. నిజానికి వాళ్ళు నా కంటె వయసు లో పెద్దవారేను.

   ఆ తరువాత భోజనాలు అవీ అయి హోటలుకి వెళ్ళి కవరు తీసి చూసిన మాకు ఎంతో ఆశ్చర్యమనిపించింది.రంగు ,అంచు , అదే పట్టు చీర కాదంటె తేడా తెలియాలికదా అన్నట్లుగా ఆకుపచ్చ రంగు అంచు. నేనిచ్చినది బాటిల్ గ్రీన్.ఆ రోజు అక్కడే నిద్ర చేసి ఆ మరునాడు రూమ్ ఖాళీ చేసేసి కింద లాబీ లో " దేశ్ పాండే" కోసం ఎదురు చూస్తూండ గానే అతను వచ్చి ఎలాగు ఇంత దూరం వచ్చారు కదా " గోవా" చూసివెడతారా? అంటే, లేదు,లేదు వెళ్ళిపోతాము. అనగానే సరే ఒక పని చేద్దాము.రత్నగిరి దగ్గర "పావస్" అని వుంది. అదేదో యోగి పేరు చెప్పారండి. గుర్తు రావటం లేదు. అక్కడికి వెళ్ళివద్దామన్నాడు.అంత ఇంట్రస్టు లేకపోయినా అతను ఆయనకి భక్తుడట. సరే బాగుండదని హారతి అయి నైవేధ్యం పెట్టెవరకూ కాకుండా దర్శనం చేసుకువచ్చేద్దామన్నాము.సరే అంటూ సామాను డిక్కిలో పెట్టి బయలుదేరాము.ఆ ప్రసాదం తీసుకొని వెళ్ళాలి ఆ మహనైవేద్యం కోసం జనాలూ యిక్కడకు వస్తారు, అది తీసుకునేందుకు పెట్టి పుట్టాలి. కావలన్నావారికి దొరకదు.ఆయన దయ ఉంటేనే మనకి ప్రాప్తం వుండేది అంటూ చెప్పాడు. ఇంతలో ఓ చిన్న సందులో యిటికల ట్రక్కు అడ్డంగా అటక్ అయిపోయింది దాన్ని తీసేందుకు క్రేన్ వచ్చి మాకు దారి దొరికి అక్కడకి వెళ్ళేసరికి సరిగా హారతి సమయానికి వెళ్ళాము.అతని ధర్మామా అని హారతీ, ప్రసాదం దక్కాయి.మాకు రాసి పెట్టి వుందనుకుంటాను. అందుకే దారిలో అవాంతరం.

    తిరిగి మమ్మల్ని బస్ స్టాండు తీసుకెడుతుండగా రోడ్డు మీదే పూనె బస్ దొరికింది. మళ్ళి డ్రెవర్ సీట్ వెనక ముగ్గురు కూర్చునే సీట్ లో ఇద్దరం కూర్చుని వచ్చాం.ఎక్కే జనాలందరూ మూడొ మనిషి ఉన్నట్లే భావించి వెనక్కి వెళ్లి కూర్చున్నారు.మొత్తానికి హాయిగా సంతృప్తిగా , ఆనందంగా స్వార్ గేట్ లో దిగామండి.ఇక్కడ ఎవరు వస్తారూ? మాకోసం కారు తీసుకొని, పైగా రాత్రి పదకొండు గంటలయింది. ఆటోవాడు ఎంత ఎక్కువ అడుగుతాడో అనుకొంటూ ఆటో కోసం చూస్తుంటే మా దగ్గరకి మామా ( పోలిసు) వచ్చి ఎక్కడకి వెళ్ళాలీ? రేంజిల్సు అనడం తోటే ఓ రిక్షాతన్ని పిలిచి యిందులో వెళ్ళండన్నాడు. సరే ! దొరకడమే ఓ పెద్ద అదృష్ట మనుకొని ఎక్కి జాగర్తగా ఇంటికి వచ్చేసాము.మీటరు మీద కంటె ఒక్క పైస ఎక్కువ తీసుకోలేదు.మిరాకిల్ కదా! మొత్తం ప్రయాణం అంతా మిరాకిల్ కదా !

   ఇదండీ, మా కొల్హాపురీ యాత్ర విశేషాలు,మార్గశిరమాసంలో లక్ష్మీ పురాణం లాగా మా స్నేహితులు మళ్లీ మళ్ళీ చెప్పించుకుంటారు,ఇంకోటేమిటంటే ఆ ఫోను నెంబరు పలకటం లెదు. మేమెలా వెళ్ళామొ మాకు తెలీదు. అంకుల్ గారిల్లు అదీను, ప్రయత్నిస్తే దొరకొచ్చు కాని రాసి పెట్ట్టి వుంటే జీవితంలో మళ్ళి కలుస్తాం లేకుంటే ఆ లక్ష్మీ మహిమే అనుకుంటాము ..మేము మరీ ఎక్కువగా యాత్రలు చేయలేదనుకోండి. చేసినవి మాత్రం బాగా గుర్తుండిపోయాయి. అందులో కొన్ని దేవుని మహిమ లేక యాదృచ్చికమా! అని అనిపిస్తుంది. మార్గశిరమాసంకదా మా స్నేహితులు కొంతమంది మా కొల్హాపురి యాత్రానుభవం చెప్పమని అడుగుతూవుంటారు.ఇప్పటికి ఎన్నో సార్లు చెప్పాను. అయినా అడుగుతారు, నేను చెబుతూవుంటాను.చెప్పినపుడల్లా ఓ రకమైన అనుభూతి, ఆనందం, భక్తి పారవశ్యం --- కార్తీకపురాణం లా నేను చెప్పే లక్ష్మీ పురాణం విని ఆనందిస్తారు.(మా కొల్హాపురీ ప్రయాణ విశేషాలు) మాకు దేవుని వద్దకు వెళ్ళినపుడు కొన్ని కొన్ని మరపురాని సంగతులు జరుగుతూ వుంటాయి.వాటిలో యిదొకటి.

    పైన చూపించిన మొదటి ఫొటో( నీలం రంగు) అమ్మవారి శేష వస్త్రం. రెండోది మేము అమ్మవారికి సమర్పించుకున్నలాటి చీర.

'లక్ష్మీ పురాణం'--మొదటి భాగం    మార్గశిర మాసం వచ్చేసింది.మా జీవితం లో జరిగిన ఓ అద్భుతమైన సంఘటన మీ అందరితోనూ పంచుకోవాలని ఈ టపా.మరీ పెద్దదయిపోతోందని రెండు భాగాల్లో వ్రాస్తున్నాను.


   మాశ్రీవారు ఉద్యోగంలో వున్నప్పటి మాట.మా అబ్బాయి చదువుకి గుడ్గావ్ లో వున్నాడు. అమ్మాయి ఢిల్లి లో వుంది. మా అత్తగారు హైద్రాబాద్ లో వున్నారు.సో, మేమిద్దరమే పూనాలో వున్నాము. ఓ రోజు దేశ్ పాండే అనే అతను కొంత సమాచారం కోసం మా యింటికి వచ్చారు. వారికి టీ, బిస్కట్లు యిచ్చి నేను కిచ్చన్ లో పని చూసుకుంటున్నాను.వారి మాటలు నాకు వినిపిస్తున్నాయి. అతను కొలహాపూర్ నుండివచ్చానని తెలియగానే, పనిమానేసి నేను కూడా వెల్లికూర్చున్నాను.నాకు అక్కడకి వేళ్ళాలని చిరకాల కోరిక.మా వారికి అలాంటి ఇంట్రస్టు చాలా తక్కువ.ఒక్క తిరుపతి తప్పితే ఇంక ఎక్కడకి వెళ్ళె శ్రద్ద లేదు.ఇంతలో ఫోను వచ్చి ఆయన లోపలకు వేళ్ళారు.నేను నాకు కావలసిన కరవీరలక్ష్మి గుడి గురీంచి, దర్శనం తొందరగా అవుతుందా, అక్కడి పూజలు గురించి,వివరాలు అడిగితే తనకి తెలిసినవి చెప్పి రండి ఆంటి,మీకు దగ్గరవుండి చూపిస్తానంటూ కబుర్లు చెబుతూ డిన్నర్ టైమ్ అయిందికదా డిన్నర్ తీసుకొనివెళ్ళమని బలవంతపెట్టి పంపిచాను.అమ్మవారికి చీర పెడితే ఆమె దగ్గరపెట్టి తిరిగి అదే మనకి పసుపు కుంకుమల తో యిస్తారని చెప్పాడు.ఆ తరువాత ఓ రెండు రోజులు శలవు రావడంజరిగింది. మా వారితో కొలహాపుర్ వెడాదామండీ,అనగానే , సరే, అనేసారు.చిత్రంగా,అసలు అంత తోందరగా ఎక్కడకి కదలరు అటువంటిది, వెంటనే ఫోన్ చేసి ఓ హొటల్ లోరూమ్ బుక్ చేయమని పూజకి టిక్కట్ అదీ తీసుకొమ్మని చెప్పారు.

   అమ్మవారికి చీర తీసుకునెందుకు లక్ష్మీ రోడ్ వెళ్లి మూలచంద్ దుకాణంలో పట్టుచీరలు చూపించమని నా దగ్గర, మా అమ్మాయి దగ్గర లేని రంగు సెలెక్టు చేసాను.గొప్పగా తెలివిగా(మామూలుగా మా వారే షాపింగ్ చేస్తారు.అలాంటిది మరి నన్ను కూడా తీసుకెళ్ళారు. యిదో చిత్రం) ఇంతలో నా వీపు మీద ఎవరో తట్టి చీర నా కోసం తీసుకుంటున్నావా? నీ కోసమా ? అని అడిగినట్లయింది. ఒక్కసారి ఉలిక్కిపడ్దానండీ, నిజంగా వెనక్కి తిరిగిచూస్తే ఎవరూ లెరు,తను కౌంటరు దగ్గరకి వెడుతున్నారు.స్పృహలోకి వచ్చినదానిలా ఆయన్ని పిలిచి చెపితే నీ భ్రమ అంతానూ,అంటూ యివేమీ కాదూ మేము ఛూడని చీరలూ చూపించమన్నాము. పైకి వెళ్లండీ,(ఆంతస్థు) పెద్దరేంజ్ లో వుంటాయి అని పంపాడు.పైకి వెళ్ళి మంచి చీర చూపించు బాబూ, అంబా తాయి కి తీసుకువెళ్లాలి అని అడిగాము. మాకు నచ్చిన ఎర్రనిపట్టు చీర బాటిల్ గ్రీన్ అంచుతో వున్నది తీసుకున్నాము,ఆ కొట్టు అతను కూడా బ్లవుజ్ పీసు త్రికోణాకారంగా మడత పెట్టి యిచ్చాడు.నిజంగాఆ లక్ష్మీ దేవియే నాతో మాట్లాడినట్లనిపించింది.

    ఓ రకమైన ఎక్సైట్ మెంట్ తో స్వార్ గేట్ వెళ్ళి బస్ లో డ్రెవర్ వెనక ముగ్గురు కూర్చునే సీటు లో యిద్దరం కూర్చున్నాము. జనాలు ఎక్కుతున్నారు వెనక్కి కూర్చుంటున్నారు..మూడో వారెవరో ఎక్కుతారని మేము జరిగి కూర్చోవడం, మా సీట్లో ఖాళీ లెనట్లుగా వాళ్ళు వెనక్కివెళ్ళడం. అలాగా హాయిగా విశాలంగా కూర్చొని కొల్హాపూర్ వెళ్ళామండి.స్టాండు లో బస్ దిగేసరికే ఆ అబ్బాయి అక్కడ వున్నాడు.మమ్మల్ని తన కారులో హోటల్ లో దింపి మీరు లంచి తీసుకొని తయారుగావుండండి. రేపు పూజకి దర్శనానికి మా అంకుల్ తో చెప్పాను.పట్ట్తుపంచ అది తెచ్చుకున్నారుగా, మద్యాహ్నం మూడు గంటలకి నర్సింగ్ వాడి వెడ్దామని చెప్పి వెళ్లిపోయాడు. నిజానికి మాప్రోగ్రాములో యివేమీ లేవు. రూమ్ కూడా చాలా బాగుంది. అన్నట్లుగానే నర్సింగ్ వాడి లోని దత్తమందిర్ తీసుకేళ్లాడు. అక్కడ్నుండి జ్యోతిబా మందిర్ చూపించి వెనక్కి వచ్చేసరికి రాత్రి 9 గంటలయింది.మమ్మల్ని తొందరగా పడుకొమ్మని ఉదయమే 5 గంటాలకల్లా గుడిలో ఉండాలని చెప్పి వెళ్ళిపోయాడు. ఓ రెండు గంటల తరువాత మళ్ళీ వచ్చి సుమారు పదకొండింటికి సారీ, అంకుల్ నాకు తెలీక చీర తిరిగి యిస్తారని చెప్పాను,(మా చీర సంగతి షాపులో అనుభవం చెప్పాములెండి) కాని యివ్వరట.పూర్వం అలా శేషవస్త్రం యిచ్చేవారట.మీరు మరీ పట్టుచీర తెచ్చారుకదా మరి ఎలాగ పరవాలేదా, ఉదయం 8 గంటలకి గుడి దగ్గర కొట్లు తీస్తారు మామూలు చీర తీసుకోవచ్చును. వెరి వెరీ సారీ ఆంటీ, ఇంతలో నేను అదేం పరవాలేదు ఓ సారి అమ్మవారికి తీసుకున్నది ఆవిడకేను అలా మార్చేది ఏమీ లేదూ లేదూ, ఇంతకీ పూజకి దానికి ఎంతడబ్బులివాలి? ఏ పూజకి టిక్కెట్టు తీసుకున్నారని అడిగాను.ఏ పూజ ఏమిటీ ఆంటీ మొత్తము అన్నీను,షోడశోపచారాలునూ,మద్యాహ్నం దేవుని ప్రసాదానికి ఓ అయిదుగురి జంటలకి పెద్దపూజారి గారింట్లోఅందరికి భొజానాలకి,అంతా మీదేను, రేపు అంకుల్ చెబుతారు ఎంతయినదీనూ అని చెప్పి వెళ్లిపోయాడు. నాకు బెంగ అయ్య బాబోయ్! ఎంతవుతుందో ఏమొనూ , ఏమీ బెంగ పడకు రేపు ఎ.టి.ఎమ్ లో డ్రా చేస్తానులే అని ,మావారి భరోసా!

   ఉదయమే మావారు పట్టుపంచె కండువా (పూజకి అవే వేసుకోవాలి) నేను మా తమ్ముడు పెళ్ళికి పెట్టిన కొత్త బనారస్ చీర తో తయార్రయేసరికి మళ్ళి కారుతో అతను వచ్చేసాడు.గుడి ఆవరణలో అడుగు పెట్టేసరికి నన్ను నేను మరిచిపోయానండీ, యిది నాపూర్వ జన్మ సుకృతం! కళ్ళారా చూసే అదృష్టం కలిగింది.మావారు అతని అంకుల్ (గుడి దగ్గర అంకుల్ కి అప్పగించి అతను వెళ్ళిపోయాడు)ముందర నడుస్తున్నారు, నేను అటు యిటు చూస్తూ నెమ్మదిగా వెడుతున్నాను. ఇంతలో మరాటీ లో ఎంతసేపు, తొందరగా రా!,తర్వాత చూద్దుగానిలే అని అరిచేసరికి గబ గబా చేతిలోవున్న చీర, పసుపు కుంకుమ, పూలు గడప యివతల వున్న వెండి పళ్ళెంలో పెట్టి లక్ష్మీ దేవి వైపు చూసేసరికి ఓ చిన్న పలుచని తడి బట్ట తో అభిషేకం చేసి పొడిచీర కోసం చూస్తునట్లుగా కనిపించింది ఆ తల్లి.మేము యిచ్చిన చీర ఆవిడకు కట్టడం, పూలతో అలంకరణ, మా వారు లోపలకెళ్ళి ఓ పెద్ద వెండి గిన్నెలో(గంధపుగిన్నెలా వుంది) అందులో అమ్మవారి ప్రతిమ నుంచి అభిషేకం, అష్టోత్తరపూజ, ఇంకా ఏవేవో మొత్తం ఓ రెండు గంటల పూజ చేయించారు. నిజపాద దర్శనం చేసుకున్నాము. మా వారయితే ఆ తల్లి పాదపద్మములను చేతులతోసృశించి తన శిరసు తో తాకి ధన్యులయారు. ఆయన అదృష్టం అదీ ! ఆ లక్ష్మీదేవి గర్బగుడి లోకి ఆడవాళ్ళకి ప్రవేశం లేదు. పూజ తరువాత నా ఒడిలో బియ్యం కొబ్బరికాయ వక్కలు పండ్లు, మేము తెచ్చిన చీర మీద బ్లవుజ్ పీస్ ప్రసాదంగా యిచ్చారు.ఆ తరువాత ఆయన వారింటికి తీసుకవెళ్ళారు. అక్కడ మమ్మల్ని కాళ్ళు కడుక్కోకుండానే వారి పూజ గదిలోకి తీసుకువెళ్లి నన్ను నాలుగు కాళ్ళ పీట మీద కూర్చోపెట్టి నాకు ఒడిలో బియ్యం పూలు పళ్లు పసుపు కుంకుమ లతో చీర పెట్టారండీ! నమ్ము నమ్మకపోండీ! అచ్చంగా ఆదేవికిచ్చిన చీరలాంటిదేను, ఆ రంగు, ఆ టెక్చరూ అదీనూ--- నేను మొహమాటంతో బ్లవుజ్ పీసు చాలండీ అనేసరికి అలాకాదూ మీరు పూజ చేసుకొని వచ్చారనిచెప్పి యింట్లో అందరూ కాళ్ళకి నమస్కరించారు. నాకు మా వారితో ఆ చీర సంగతి చెప్పాలని ఓ ఉబలాటం.కాదంటారా మరి ఆ దేవి మహిమ కాకపోతే ఆ షాపులో అలగా, ఆరాత్రి అతనలా అనడం, తోందరగా తీసుకురా అని పూజారిగారనడం, ఆచీర ఆవిడకు కట్టడం,ఇక్కడకు తీసుకువచ్చి మళ్ళి అలాంటి చీరే నాకు పెట్టింఛడం, ఏమిటంటారు యిదంతా,----

హాయ్ బాల గణపయ్యా...


    పార్వతి తనయా గణపతి దేవా పరుగున రావేరా ఓ దేవా పరుగున రావేరా---

    మూషిక వాహనా ముందు వేడితిని దారి చూపవే వేగముగా---
చిన్నపుడు ఎపుడో నేర్చుకున్న పాట యిన్ని సంవత్సరాల తరువాత అనుకోకుండా నోటినుంచి వచ్చింది. పాట పూర్తిగా గుర్తు రాలేదు.
నిన్న మా అమ్మాయి యింటి కి వెళ్ళాము. వెడుతునే లోపలకి అడుగు పెట్టెసరికి ఈ బాల గణపతి కనిపింఛాడు. చూసారుగా ఎంత ముద్దువస్తున్నాడో,చేతులెత్తి దణ్ణం పెట్టాలనేకంటే ఎత్తుకు లాలించాలనిపించిందనుకోండి,
ఇంతకీ పారవశ్యంతో పరవశించిపోతున్న ఈ బాల గణపతికి ఏ పాటలు పాడుతున్నాడో, ఏ కధలు వినిపిస్తున్నాడో ఈ మూషికవాహనుడు మరి--

   అమ్మా, ఎలావుందీ, అని ఇంకా ఏదో అడుగుతోంది. అబ్బే ! ఏమీ వినిపించందే, అలా చూస్తునే వుండిపోయాను. ఎంత బాగుందనుకున్నారూ !

చెప్పిన మాట వినరు...

   ఈరోజు భక్తి టి.వి లో గరికపాటి వారి మహభారతం వినేందుకు కూర్చున్నాము. ఆయన చెబుతు చెబుతూ మధ్యలో చిన్న చిన్న ఉపకధల్లాంటి విషయాలు చెబుతూవుంటారు కదా, దృష్టిలోపమేకాని సృష్టి లోపంకాదని చెప్పారు,బాగానేవుంది, అలా చెబుతూ పొద్దునే లేచేసరికి చెట్టునుండి రాలిన గన్నేరుపూలు ఎంత అందంగా వుంటాయండీ అసలు, కాని అలావుంచుతారా? అబ్బే, చీపురు పెట్టి తుడిచేయరూ, ఏమన్నా అంటే నీట్ నెస్ అంటారు, ఏమి నీట్ నెస్ అండి పూలు అలావుంటే ఎంత బాగుంటుందీ,అని అన్నారో లేదో మాశ్రీవారికి విపరీతమైన నవ్వే నవ్వూ---.అమ్మయ్య ఇప్పటికైనా తనకి ఓ తోడు దొరికిందని( నీట్ నెస్ గురించి చిరాకు పడేవారు!)

   ఎందుకంటారా మా యింటిలో అందరూ ఈ నీట్ నెస్ కోసమై నా వల్ల పీడింపబడుతున్న బాధితులన్నమాట.అదేమి పాపమో, భగవంతుడు నన్ను ఇలా ఎందుకు పుట్టించాడో నాకు తెలీదు, ఇలా అంటే ,ఎందుకేమిటీ మమ్మల్ని పీడీంచేందుకే అని టక్కున సమాధానం చెబుతారు.అసలు ఈ శుభ్రత అన్నది కూడా ఒక రోగమని అంటారట. అదంతా నాకు తెలీదు కాని పనిమనిషిని పెట్టుకోకుండా నేనే పనులు చేసుకుంటాను.చిన్నయిల్లే కదా ,చీపురుతో తుడవడం, తడిబట్టతో తుడవడం, గిన్నెలు తోముకోవడం,బట్టలు ఉతుక్కోవడం, అన్ని చేసుకోవడం, నడుంనొప్పికి మందులేసుకోవడం, మూవ్ రాసుకోవడం,బయటనుంచి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోమనడం,కాళ్ళు సరిగా తుడుచుకొని రమ్మనమనడం, హయిగా రోజూ ఇస్త్రి బట్టలు వేసుకోమ్మనమనడం,అన్నం తిన్న తరువాత, కంచంచుట్టూ పడ్డ మెతుకులు, ఓపిగ్గా కూరలోంచి ఏరిన పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు పక్కనే వున్న చిన్నగిన్నెలో వేయమనడం, అవి డస్టుబిన్ లో వేసి కంచం వాష్ బేసిన్ లో పెట్టమనడం, సోఫాలలో కూర్చున్నపుడు కుషన్లు వాటి చోటులోనే వుంచండీ అనడం ,ముఖ్యంగా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ సోఫా మీద వేస్తారే వెనక్కాల అవీ పూర్తిగా కిందకిపడిపోయేలా కూర్చోవడం,సెంటర్ టేబుల్ మీద పెట్టినవి తీసిచేతిలో పట్టుకోవడం,కర్టెన్లకి చేతులు తుడిచేయడం, పుస్తకాలు చదివి వాటిని అలాగే బోర్లా పెట్టెయడం,లేకపోతే పేజి మడతపెట్టేయడం, మంచంమీద తరగడాలు అటూ ఇటూ పడేయడం,యిదుగో యిలాంటి విషయాల్లోనే వస్తుందినాకూ మా యింట్లో వాళ్ళకీను----

   ఓసారి ఏమయిందంటే మా స్నేహితులు డాక్టరు గారింటికి వెళ్లాము, ఆయన మాతో మాట్లాడుతూ భోజనంచేసి తడిచేతులతో కర్టెన్ పక్కకి జరుపుతున్నారో తుడుచుకుంటున్నారో కూడా గమనించకుండా "గిలా హాత్ మత్ లగానా,నేప్కిన్ లే లేవ్ " అని మా అబ్బాయి మీద అరిచినట్లుగా అరిచేసేసరికి పిన్ డ్రాప్ సైలెన్సు ఐపోయింది. ఆ తరువాత నేను సిగ్గుతోచచ్చిపోయానంటే కూడా తక్కువేను,వాళ్ళ యింట్లో ఆయన్ని అల్లా అనడం నిజంగా తప్పేను, కాని ఏం చేయను చెప్పండీ, అదీ నా బలహీనత. ఆలోచిస్తుంటే నేను అందరిని ఎంత బాధ పెడుతున్నానో తెలుస్తుంది కాని మానుకోలేకపోతున్నాను.

   నిన్న మా స్నేహితులొకరు షిరిడీ వెళ్తున్నారంటే, ఒకసారి కలుసుకోవాలని వెళ్ళాము. ఆవిడ నాకు ఈ నీట్ నెస్ విషయంలో పెద్దక్కయ్య!నేనే అనుకుంటే నాకంటే ఛాదస్థం ఆవిడకి.ఇంట్లో ద్వారం దగ్గర మట్టుంటుందని చేతిలో చీపురూ, చేట తో వెళ్తారు ఆవిడ. మరీ అంతకాదుకానీ, నేను ప్రొద్దుటా సాయంత్రం తుడుస్తానంతే. ఇంక ఆవిడ ఎక్కడ పడితే అక్కడ నీళ్ళతో శుభ్రపరచడం అలవాటు. వాళ్ళమ్మాయి అంటుందిటా " చేప పిల్లలా అస్తమానూ నీళ్ళదగ్గరే ఉంటావెందుకూ" అని!

    పిల్లలు అడ్డాల్లో ఉన్నంతకాలం నా మాట విన్నారు. ఇప్పుడు పెళ్ళిళ్ళయిన తరువాత 'అమ్మయ్య ఈవిడ గోలోటి తప్పింది బాబూ..' అనుకుంటున్నారు. అందుకోసం మనవల్నీ, మనవరాళ్ళనీ పట్టుకున్నాను! ఏం చేస్తాను పుట్టుకతో వచ్చిన బుధ్ధీ!

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes