RSS

ఈ రోజు ETV-2 'తీర్థయాత్ర' లో 4.30 కి మా 'అమ్మ'



   మా ఊరు తణుకు సమీపంలో మండపాక అనే గ్రామంలో యల్లారమ్మ గుడి వుంది. అమ్మవారి విగ్రహం చాలా చక్కగా సాలగ్రామ శిలతో అందంగా ఆకర్షణీయంగా వుంటుంది అమ్మవారి ముందరి కుడి చేతిలో ఖడ్గము, వెనుక కుడి చెతిలో ఢమరుకము, ముందరి ఎడమ చేతిలో పాయసపాత్ర, వెనుక ఎడమ చేతిలో త్రిశూలము తో అలరారుతూ వుంటుంది. భక్తులు సహస్రనామార్చన చేయించుకున్న తరువాత మహర్నివేదన జరిగాక, శ్రీ అమ్మవారి కిరీటము పై పుష్పములుంచి దండకము చదువుతారు, ఆ దండకము చదివేటప్పుడు ఆ భక్తుల కోర్కెలు సఫలమయెసూచనగా ఆ కిరీటమునుండి పుష్పములు ప్రసాదించును.ఆ దృశ్యం కనులవిందుగా వుండి శరీరమంతా ఝల్లుమని పులకిస్తుంది. భక్తుల శ్రద్ద యందు కాని మ్రొక్కుబడులలో కాని లోపమున్న యెడల ఒక్క పుష్పం కూడా కిందకి జారక అలాగే వేళ్ళాడుతూ వుంటుంది. కొంతసేపటికి ఆ లోపాన్ని పలికించి, అధర్మ, అనైతిక కోరికల్ని, కాకుండా సరిదిద్దుకునేలా చేసి పుష్పములని ప్రసాదించే చల్లనితల్లి.ఎల్లలు లేని యల్లారమ్మ. మా అమ్మ.

   మాకు ప్రత్యక్ష దేవత. మేము ఎప్పుడు ఆంధ్రా వెళ్ళినా ఆమె దర్శనం చేసుకొని వస్తాము. ఎలాంటి కష్టం వచ్చినా అమ్మా, అని నోరారా పిలిస్తే అభయమిచ్చే దేవత. అలాగే ఓసారి ఆలయానికి వెళ్ళినపుడు ఈ టి.వి. 2 వారు షూటింగు తీసారు. అక్కడె వున్న మమ్మల్ని కూడా టి.వి. లోకి ఎక్కించేసారు. .

   అదే కార్యక్రమం ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకి తీర్దయాత్ర లో చూపిస్తారని scroll లో చూశాము. అమ్మవారి దర్శనం తో మమ్మల్ని కూడా చూసేశయండి. ఒ.కె.

అందుకే అంటారు దేనికైనా యోగం ఉండాలీ అని...

   క్రిందటి సారి ఓ టపా వ్రాశానుగా, నా 'సిరిసిరి మువ్వ' గురించి. అది కాస్తా సైలెంటైపోవడం తో కొంచం సుఖపడ్డాననుకోండి, అయినా మరీ అలాగే ఉంటే బావుండదు కూడానూ.మా అమ్మో, అమ్మాయో, చెల్లెళ్ళో ఫోన్లు చేస్తూంటారు. గత వారం పదిరోజులనుండీ,అన్నీ మిస్డ్ కాల్సే. మరీ ఊరంతా చెప్పుకోలేనుకదా, ఇలా నా ఫోను మౌనవ్రతం పాటిస్తోందీ అని, వాళ్ళందరూ లాండ్ లైనుకి చేయడం మొదలెట్టారు. అదేమో వినిపించి చావదూ.బి.ఎస్.ఎన్ ఎల్ వారి ఫోను మరీ!

   మా వారేమో గవర్నమెంటు పక్షి కదూ, ప్రస్తుతానికి కొత్త ఫోనోటి కొనడానికి agreed in principle ట!దానికి ఫండ్స్ ఎప్పుడు ఎలాట్ చేస్తారో, కొత్త ఫోను నాచేతికి ఎప్పుడొస్తుందో, అంతా పోలవరం ప్రాజెక్ట్ అంత గొడవా! పొనీ రేపు 28 వ తారీఖుకైనా కొనిపెట్టే యోగం ఉందేమో అనుకున్నా. మామూలుగా, మా శ్రీవారు, పెళ్ళిరోజుకి ఇంట్లో అందరికీ ఉపయోగించే వస్తువు కొనడం ఓ ఆనవాయితీ లెండి. దానికి పైగా నాకోసం అంటారు.

   పెళ్ళైన కొత్తలో ఓసారి, స్టీలుది అమాందస్తా కొని తెచ్చారు! ఏదో నేను వేసుకునేలా ఓ గాజో, గొలుసో కొంటారుకానీ, ఈ దిక్కుమాలిన అమాందస్తా ఏమిటండి బాబూ, పైగా నీకుపయోగంగా ఉంటుందోయ్ అంటూ సమర్ధింపోటీ!రుబ్బురోలు తేలెదు బతికించారు. మొన్నెప్పుడో ఒక యాడ్ చూశాను. భార్య బట్టలుతుకుతూంటే నడుం నొప్పండీ అని ఏదుస్తోంది, పోనీ ఓ వాషింగ్ మెషీనైనా కొనిపెడతాడేమో భర్తా అని, అప్పుడు ఆ మహానుభావుడు, 'అర్రే అలాగా, అయితే 'మిరాకుల్' ఆయిల్ తెస్తా మసాజ్ చేసికో'అంటాడు.అదృష్టం ఏమంటే మా శ్రీవారు ఆ యాడ్ చూడలెదు!అయినా యాడ్లే ఉండాలా ఏమిటీ, ఆ బుర్రనిండా పుంఖానుపుంఖాలుగా ఎన్నెన్నో ఐడియాలు, ఎలాగైనా కోనసీమవారూ మరి!పెళ్ళిరొజుకి రుబ్బురోళ్ళూ, కల్వాలూ, అమాందస్తాలూ ఇచ్చేటంతటి మోస్ట్ రొమాంటిక్ కారెక్టరు మా శ్రీవారు!!

   నా ఫోను నోరు పడిపోయిందని చెప్పానుగా, నిన్న ఏదో పుస్తకం తీస్తూంటే అదికాస్తా కింద పడింది. పోనీ పూర్తిగా విరిగిపొయినా పీడా వదిలేది. అయినా దానికి ఇంకా ఆయుద్దాయం ఉంటే, అదెందుకు విరుగుతుందీ.మా శ్రీవారు ఇంట్లో లేకపోయుండకపోతే, నేనే దాన్ని కిటికీలోంచి విసిరేసేదాన్ని. అంత అదృష్టమా!'అయ్యో కిందపడిపోయిందే' అనుకుంటూ, దాని భాగాలన్నీ అసెంబుల్ చేశారు. మొత్తం అదీ ఇదీ చేసి మొత్తానికి దాని సౌండు తెప్పించేశారండోయ్!అయినా ఆ మాయదారి ఫోను ఇంత ద్రోహం చేస్తుందనుకోలెదు. ఏదో సౌండు పోయిందీ, ఇప్పటికో ఇంకో పుష్కరానికో కొత్త ఫోనొస్తుందిలే అనుకున్నదంతా ఫ్లాప్ షో అయింది.అమ్మయ్య కొత్త ఫొను కొనఖ్ఖర్లేదూ అని ఆ మొహంలో ఎంత సంతోషమో!
అందుకే అంటారు దేనికైనా యోగం ఉండాలీ
అని!

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes