RSS

నాకూ నిండాయి రెండేళ్ళు....

   ఏమిటో బ్లాగులు వ్రాయడం మొదలెట్టిన ప్రతీ వాళ్ళూ,ఏడాదయ్యింది, రెండేళ్ళయిందీ అని వ్రాసేవాళ్ళే. నేను కూడా అదేదో అనేస్తే, నాకూ మనశ్శాంతుంటుంది.ఈవేళ్టికి నేనూ రెండేళ్ళు పూర్తిచేశానండి. అయితే ఏమిటీ, మమ్మల్నేం చేయమంటారూ అని అడక్కండి. మర్రిచెట్టుకింద ఓ మామూలు మొక్కలా, ఏదో గాలికీ, ఎండకీ, వర్షానికీ వయస్సొచ్చేస్తోంది.పోనీ ఎప్పుడైనా ఓ టపా పెడదామా అంటే, కరెంటు పోవడమో ఏదో ఒకటి.రాత్రిళ్ళు పెడదామా అంటే,ఇరవైనాలుగ్గంటలూ ఆ కంప్యూటరు వదలరే మా మర్రి చెట్టు గారు!మొదట్లో కొద్దిగా సంసారపక్షంగా వ్రాసేదాన్ని, ఈయన బ్లాగులేమో రాజధాని స్పీడులో వెళ్తున్నాయి, ఇదికాదు వ్యవహారం అని, నా పధ్ధతి మార్చేశాను.అప్పటినుండీ నా టపాలు కూడా చూడ్డం ప్రారంభించారు.పోనీ ఆయనలా రోజుకోటి రాయడానికి, నేనేమైనా రిటైరయ్యానా ఏమిటీ? అంత సుఖం కూడానా?

   పోనీ ప్రొద్దుటే బ్రేక్ ఫాస్టు చేసేసి, ఊరిమీదకెళ్ళిపోతాను, ఆ టైములో వ్రాసుకోవచ్చుగా అని సలహా ఓటీ! ఇంట్లో తుడుపులు,పూజా, మనకి వంటా ఎవరు చేస్తారమ్మా?మళ్ళీ పన్నెండునరయేసరికి, టేబుల్ మీద అన్నం గిన్నె లేకపోతే రోజెళ్ళదూ.అదేదో సీరియల్ చూస్తూ,టేబిల్ మీద గిన్నెలు సర్దేస్తారు,ఖర్మకాలి కుక్కరు పెట్టలేదా ఇంక నా పని అయిపోయిందే! మరి అవ్వా కావాలి, బువ్వా కావాలి అంటే ఎలా కుదురుతుందీ? అందుకే 'బువ్వ'కే సెటిలైపోయి, అమావాశ్యకో,పున్నానికో ఓ టపా వ్రాయడం. అలా మూలుగుతూ, ముక్కుతూ మొత్తానికి ఓ 'శనగ' పైన టపాలు వ్రాశాను. మళ్ళీ ఈ 'శనగ' అంటే ఎమిటనుకుంటున్నారా, మా శ్రీవారి కోనసిమలో, కొబ్బరికాయలు కదూ, వాటిని లెఖ్ఖ పెట్టేటప్పుడు, వందని శనగ అంటారుట. ఏం శనగలో ఏమిటో, లెఖ్ఖల్లోకూడా తిండి యావే! ఏం చేస్తాంలెండి, చేసికున్నవాడికి చేసికున్నంతా! 40 ఏళ్ళవుతోంది, ఇంక మారేదేమిటి లెండి? ఏ కూర చేసినా, అందులో ఆవ పెట్టవోయ్ అనడమే.పైగా ప్రతీదానికీ ఆయనక్కవలిసినలాగ చేయమనడం. పోనిద్దురూ,ఉద్యోగంలో ఉన్నంతకాలం డబ్బాలోనే కదా తిన్నారూ,అని జాలి పడిపోయి, ఏదో ఆయనకు నచ్చే విధంగానే చేసిపెడుతున్నాను.చేయడం మొదలెట్టానుకదా అని రోజుకోటి అడగడం. అందుకే మొగుడైనా, పిల్లలైనా నెత్తికెక్కించుకోకూడదంటారు.

   మా తమ్ముడి భార్య, తణుకులో ఏవో నోములూ, వ్రతాలూ చేసికుంటోంది, పోనీ మనమెలాగూ చేసికోలేదూ, ఆ నోమేదో చూసి, ప్రసాదం తీసికుంటే, ఓ కాస్త పుణ్యమైనా వస్తుందీ అని, మా అమ్మను చూసినట్లుంటుందీ అనుకుని, తణుకు వెళ్ళొస్తానండీ అన్నాను.అల్లుడి బెట్టుసరి చేయొద్దూ, నువ్వొకర్తివే వెళ్ళూ అని, టిక్కెట్లు రిజర్వ్ చేశారు. దేంట్లోనూ బస్సులో! అడక్కడక్క ఒకసారి అడిగిందీ, పోనీ ట్రైనులో చేద్దామని ఉండొద్దూ, అబ్బే ఓసారి ఇలా బస్సుల్లో వెళ్తే, మళ్ళీ జీవితంలో ఎప్పుడూ అడగదూ, దీనికిదే మందూ అని అనుకున్నట్లేకదా!అంతా కలిపి ఓ వారం రోజులు! అదీ చూస్తాను, ఈ వారంరోజులూ, ఆయనక్కావలిసినట్లుగా వండి, తిండెవరు పెడతారో? అప్పుడు తెలిసొస్తుంది, భార్య తడాఖా ఏమిటో!

   నా టపాలకి నారుపోసి, నీరుపొసిన మీ అందరికీ కృతజ్ఞతలు. వ్యాఖ్యలు పెట్టిన వారి పేర్లన్నీ వ్రాసే ఓపిక లేదు,అదిగో మా ఇంటాయన అదేనండి శ్రీవారు ఫొనుచేసేశారు, పన్నెండున్నరకల్లా తయారూ, కుక్కరు పెట్టుకోవాలి......

పిలుపులు

   ఫలాన రోజున మా అబ్బాయి వివాహము మీరు తప్పకుండా రావాలి. వివాహము హైద్రాబాదులో, వస్తారు కదా, లేదంటరా రెసెప్క్షను ఫలానరోజున పోనీ అప్పుడు రండి. పిల్లలని ఆశీర్వదించినట్లుగాను వుంటుంది, మన పాత స్నేహితుల్ని కలవవొచ్చును ఏమంటారు?ఇది పెళ్ళి పిలుపు పిలుపుతో బాటు ఉచిత సలహా.అదేమిటీ, అమ్మాయి వాళ్ళది ఎక్కడో తూర్పు గోదావరి అన్నట్లున్నారు?ఏమిటోనండీ,అందరికీ సౌకర్యంగా ఉంటుందని హైదరాబాద్ లో చేయమన్నామూ అని సాగతీసుకుంటూ చెప్పడం! మగపెళ్లివారికైతే బాగానే ఉంటుంది, వీళ్ళ కొడుకో, కూతురో ఆడబడుచో ఇంకోళ్ళెవరో ఆ ఊళ్ళోనే ఉండడంతో వీళ్ళకేమీ ఫరవాలేదు. కానీ, ఎక్కడో ఉండే ఆడపెళ్ళి వారికి, అంతంత దూరం వచ్చి
కూతురు పెళ్ళి చేయాలంటే ఉండే కష్టం అసలు, అవతలివాళ్ళు ఎందుకు గుర్తించరో, నాకైతే ఇప్పటికీ అర్ధం అవదు.

   పిల్లాడి తరపు వాళ్ళలాగ, ఏదో పెళ్ళికి ఒకరోజు ముందరొచ్చేసి, పని కానిచ్చేయడం ఆడపిల్ల తల్లితండ్రులకి కుదరదుగా. ఓ నెల ముందునుంచి ఎన్నెన్ని ఎరేంజిమెంట్లు చేయాలి? క్యాటరింగు,ఫొటోలు, బట్టలు ఒకటేమిటి,ప్రతీ దానికీ పాపం ఆ తండ్రే కష్టపడాలి. అదీ ఏ ఉద్యోగమైనా చేస్తూంటే, ఆఫిసుకి శలవు పెట్టడం దగ్గరనుండి అన్నీ సమస్యలే.పోనీ వీళ్ళకి తెలిసిన చుట్టమో,పక్కమో ఉన్నాడనుకుందాము, అన్నిటినీ అతనిమీద వదిలిపెట్టేయలేడు కదా. చివరి నిమిషంలో ఏదైనా లోటుపాట్లొస్తే, చివాట్లు తగిలేది ఈయనకేగా.ఎవరిమీద బాధ్యత పెట్టామో ఆయన్ని ప్రతీదానికీ శ్రమ పెట్టడానికి మొహమ్మాటం.ఈ గొడవలన్నీ పడలేక, ఓ పోర్షనోటి అద్దెకు తీసికుని అక్కడే భార్యనుంచేసి,ఓ నెలరోజులు ఎలాగోలాగ కాలక్షేపం చెయ్యాలి.పొనీ ఈవిడ ఒక్కర్తీ ఉంటోందీ, చేసుకోలేదేమో అనుకుని, ఏదో సహాయం చేద్దామని,ముందుకు వద్దామనుకున్నా సవాలక్ష సమస్యలు. ఇంట్లో భార్యని కన్విన్స్ చేయాలి.ఆవిడేమీ అపోహ పడకుండా!అబ్బబ్బ ఎన్నెన్ని సమస్యలండి బాబూ, వీటికి కారణం ఎవరూ, మగపెళ్ళివారి గొంతేరమ్మ కోరిక!

   ఇదివరకటి రోజుల్లో, ఆడపెళ్ళివారి స్వగృహమో, వసతి గృహమో,ఏదీ లేకపోతే, స్వంత ఊళ్ళోని,ఏ కల్యాణమండపం లోనో చేసేవారు, కారణం స్థానబలం.ఎటువంటి లోటుపాట్లొచ్చినా, మేమున్నామంటూ ముందరకి వచ్చేవారు, చుట్టాలూ, స్నేహితులూనూ.ఇప్పుడలా కాదే, మొగపెళ్ళివారే డిసైడ్ చేస్తారు, ఏ కల్యాణమండపం లో చేయాలో.పైగా ముందరే చెప్పేస్తారు, మా అబ్బాయి ఆఫిసు స్నేహితులూ, కాలేజీ ఫ్రెండ్సూ వస్తారు, వాళ్ళకి విడిగా రూమ్ములుండాలండోయ్, ఎక్కడో హొటల్లో ఉండమంటే ఏం బావుంటుందీ? పెళ్ళికొడుకు తరఫునయ్యే ఖర్చు ఓ వెడ్డింగ్ కార్డొకటే. అవికూడా పోస్టు ఖర్చులేకుండా, హాయిగా స్కాన్ చేసేసి పంపేస్తున్నారు.పోనీ ఎంతమంది రావొచ్చో అయినా చెప్పగలరా అని అడిగినా, ఎంతమందని చెప్పగలమండీ,అప్పటికీ అందరినీ పిలవడమే లేదూ, మీకు అనవసరంగా శ్రమైపోతూందనీ అంటాడే కానీ ,నెంబరు మాత్రం చెప్పడు.పోనీ ఆ వచ్చేవాడైనా ఒక్కడూ వస్తాడా,కొత్తగా పెళ్ళిచేసికున్న భార్యతో వస్తాడా అన్నదీ తెలియదు.ఏదో హనీమూన్ లా ఉంటుందీ అనుకుని, పెళ్ళిరోజుకి పొద్దుటే, భార్యతో తయారు.వీళ్ళిద్దరికీ విడిగా ఓ రూమ్మూ.ఇలాటి 'జంటలు' ఇంకా ఎంతమందొస్తారో ఆ భగవంతుడిక్కూడా తెలియదు.ఎలాగూ శలవు పెట్టి వచ్చాం,హొటల్ లో రూమ్మిచ్చారూ అని, పెళ్ళితరువాత ఓ రెండు రోజులుండే ప్రోగ్రాం చేసికుంటాడు.ఏదో పెళ్ళిరోజుకైతే ఫరవా లేదు కానీ, ఈ స్నేహితుల హనీమూన్ కూడా, స్పాన్సర్ చేయమంటే కష్టం కాదూ?

   స్వంతఊళ్ళో, చేసికుంటే ఈ గొడవలన్నీ ఉండేవి కావుకదా.మగ పెళ్ళివారి తరఫున ఇంటినుండి బయలుదేరేది ఎవరూ, తల్లీ, తండ్రీ, పెళ్ళికొడుకూనూ ( స్నాతకం పీటలమీద కూర్చోవాలి కనుక వాళ్ళూ, తాళి కట్టాలి కాబట్టి ఆ అబ్బాయీనూ).ఇంక ఏ ఒడుగో ఏదో కూడా చేయాలంటే, ఇంకో రోజు ముందరే రావాలి.ఇంక మిగిలిన వాళ్ళంటారా, పెళ్ళికి తప్పకుండా రావాలేం అంటారే కానీ, ఎలా రావాలో అంటే రిజర్వేషనూ వగైరాల గురించి నోరెత్తరు. పైగా అడిగితే, మేమే తత్కాల్ లో టికెట్లు తీసికోడానికి,రేప్పొద్దుటే క్యూలో నుంచోవాలిటా, అని ఓ ముక్కన్నారే అనుకోండి, ఇంకేం అడుగుతాం?రెండు నెలల ముందునుంచీ, పెళ్ళి మాటలు జరుగుతున్నాయి కదా, రిజర్వేషను చేయించుకోలేదంటే నమ్మే మాటేనా? మనం పెళ్ళికి పిలిస్తే, వెళ్ళడానికి ఎరేంజ్మెంట్స్ ఏం చేశారూ అని అడగడం, ఇదే వాళ్ళు పిలిస్తే తత్కాల్ అంటూ చెప్పడం.ఇదివరకటి రోజుల్లో మగ పెళ్ళివారంటే, ఓ బస్సు కుదుర్చుకుని,దాన్నిండా చుట్టాలూ, స్నేహితుల్నీ తీసికుని, మహ అయితే పెళ్ళికొడుక్కి వేరే టాక్సీలో పంపేవారు.ఇప్పటికీ వోల్వో బస్సుల్లో 'ఫలానా వారి పెళ్ళి'అంటూ చూస్తూంటాము.

   ఇన్ని కబుర్లు చెప్తారూ, మీరు మాత్రం ఏం చేశారూ అని అడగొచ్చు. అమ్మాయి పెళ్ళి కి,వరంగాం లో( పూణె కి 350 కి.మీ) ఉంటున్నా, పెళ్ళికొడుకు తరఫు వారు ఢిల్లీ లో ఉంటున్నా, ఇద్దరికీ, వచ్చే చుట్టాలకీ సౌకర్యంగా ఉంటుందని
పూణె లో చేశాము. అయినా ఏ కష్టమూ లేకుండా, కారణం,మా వియ్యాలారు ముందరే చెప్పేశారు, మా స్టే గురించి మీరేమీ శ్రమ పడొద్దూ అని.అలాగే, మా అబ్బాయి ఎంగేజ్మెంటు టైములో మావారే హైదరాబాద్ వెళ్ళడానికి, తిరిగి రావడానికీ బాధ్యత తీసికున్నారు. ప్రొద్దుటే చేరి, రాత్రికి మళ్ళీ ట్రైనెక్కేశాము.

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes