RSS

అత్తగారూరికే అనలేదు.....

    మా అత్తగారు, తన ముద్దుల కొడుగ్గురించి, కాపరానికి వచ్చిన కొత్తలోనే చెప్పారు. పాపం ఏదో విసుగెత్తి చెప్పుంటారులే అని అనుకునేదాన్ని. ఇప్పుడనుకుంటున్నాను, పాపం ఆ వెర్రి ఇల్లాలు ఎంత విసిగిపోయి చెప్పుంటారో అని! అయినా కొడుగ్గురించి, కొత్తకోడలుతో అలా చెప్తారని ఎవరైనా అనుకుంటారా, చిత్రం కానీ. నలభైఏళ్ళకి తెలిసింది, ఆవిడన్నది అక్షరాలా ఎంత నిజమో. అబ్బబ్బబ్బ... ఒక్కపనీ టైముకి చెయ్యరు. ఇంట్లోకి ఏదైనా కావలిసొస్తే, పది రోజుల ముందరి నుంచీ చెప్తే, చివరకి డబ్బా ఖాళీ అయేసమయానికి తెస్తారు. పైగా ఇంకోటీ, " పూర్తిగా అయిపోయిందా, ఇంకా కొన్ని రోజులొస్తుందా..." అనోటీ! సరుకులన్నీ నిండుకుపోతే కొంపకి దరిద్రం చుట్టుకుంటుందమ్మా, అని మా అమ్మమ్మగారు ( అత్తగారు), చెప్పిందే ఎప్పుడూ నాకు వేదవాక్యం. అంతే కాకుండా, మా ఇంట్లో అయిదుగురప్పచెల్లెళ్ళల్లో పెద్దదాన్నవటం చేత, ఈ వ్యవహారాలన్నీ, నాకూ కొద్దిగా అనుభవం ఉంది.

   తణుకు లో మా చుట్టాలొకళ్ళుండేవారు లెండి, ఎప్పుడైనా మేము శలవలకి వాళ్ళింటికి వెళ్తే, ఏదో భోజనానికి పిల్చేవారు, అక్కడిదాకా బాగానేఉంది, కానీ మమ్మల్ని చూసిన తరువాత, భర్తని సరుకులకోసం బజారుకి పంపడం చూసినప్పుడు మాత్రం, అదోలా ఉండేది! పైగా మా ఎదురుగుండానే, కూరల సంచీ, సరుకుల సంచీ ఖాళీ చేస్తూ, వాటి ధరవరల పట్టిక కూడా చెప్తూండేవారు! ఆ వివరాలన్నీ విన్న తరువాత, ప్రశాంతంగా ముద్ద దిగమంటే ఎలా దిగుతుందీ? పోనీ అలాగని వాళ్ళకేమైనా డబ్బుకి ఇబ్బందా అంటే అదీ లేదూ, ఉట్టి బధ్ధకం!

    పోనీ అలాగని మాశ్రీవారు డబ్బు ఖర్చుపెట్టడంలో ఏమైనా మైజరా అంటే అదీ కాదూ. ఏమిటో అది చెప్పిందీ, మనం చేసేదేమిటిలే అనుకోడం. మళ్ళీ అతిథిసత్కారాలకేమీ లోట్లేదు. దానికి సాయం విడిగా ఫ్లాట్ తీసికునుంటున్నామేమో, ఎవరినీ అడిగే అవసరం కూడా లేదు. పలకరించిన ప్రతీ వాళ్ళనీ పిలిచేయడమే. పైగా వాళ్ళు వచ్చీ రాగానే, నావైపోసారి చూడ్డం, అక్కడకి ఆమాత్రం మర్యాదలూ, సత్కారాలూ తనొక్కరికే తెలుసున్నట్టు ! ఆ వచ్చినవాళ్ళని ఉత్తినే మంచినీళ్ళిచ్చి పంపుతామా ఏమిటీ, ఏదో ఇంట్లో ఉన్న సరుకుతో నాకు తోచిందేదో, ఆదరాబాదరాగా తయారుచేయడం. మళ్ళీ ట్రే లో పెట్టి హాల్లోకి తెచ్చినప్పుడు మాత్రం నా మొహంలోకి చూస్తే ఒట్టు ! ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం అందరికీ మర్యాదలు చేయాలి, ఇంట్లో ఫలానా వస్తువు తెండీ అంటే మాత్రం, తనకు తోస్తేనే కాదు తేవడం ! ఇంట్లో ఏం సరుకుందో, కూరుందో ఓ సారి చూస్తే ఏం పోయిందిటా? పోనీ తనకు ఆమాత్రం టైములేకపోతే, చెప్తేనన్నా వినాలా ? అబ్బే అదీ లేదూ.

   సరుకులనే కాదు, ఎవరేనా వస్తే వాళ్ళ చేతుల్లో ఓ బ్లవుజు పీసేనా పెట్టకపోతే బావుంటుందా, ఇంట్లో చూస్తే, డ్రెస్స్ మెటీరియల్సూ. మరీ అందరికీ అలాటివి పెట్టలేముగా. ఇన్నేసి డ్రెస్స్ మెటీరియల్స్ ఎందుకండీ అంటే, సరదాగా కూతురికీ, కోడలుకీ ఎప్పుడైనా పెట్టడానికి బావుంటుందీ, పైగా నువ్వు కూడా ఆ చీరలు మానేసి హాయిగా డ్రెస్సేసికో అంటూ జ్ఞానబోధలోటీ , అసలు రహస్యం ఏమిటంటే, నాకోసం చీర ఒకటే కొంటే సరిపోతుందా, దానికి మాచింగు బ్లౌజు పీసూ, లోపలేసికోడానికి మాచింగు పెట్టీ కోటూ, మళ్ళీ వీటన్నిటికీ, పీకో, బ్లౌజు కుట్టు కూలీ, అన్నీ కలిపి తడిపి మోపెడౌతున్నాయిట, అందుకోసం హాయిగా డ్రెస్సేసికో అని! మరీ ప్రయాణాల్లో ఫరవా లేదు కానీ, మనవైపు ఏ పేరంటానికో, ఈ డ్రెస్సుల్లో వెళ్తే బావుంటుందా. ఏమిటో ఆయనకి తోచదూ, చెప్తే వినరూ... ఇలా ఉంది కాపరం ......

ప్రేమనేది ఉన్నట్టా లేనట్టా...

    మా చిన్నప్పుడు, దేముడికి పూజ చేయాలంటే, పెరట్లోకెళ్ళి, ఏ మందార పువ్వులో, నందివర్ధనం పువ్వులో కోసి, దేముడి మందిరం ముందర పెట్టేవాళ్ళం. అమ్మో నాన్నగారో పూజ చేసుకున్న తరువాత ఏమైనా మిగిలితే దేముడికి మనమూ ఓ పువ్వు పెట్టేసి, మనకున్న కోరికలేవో చెప్పేసి, లెంపలెసేసికుని ఓ దండం పెట్టుకునేవాళ్ళం. పెళ్ళై కాపరానికి వస్తే ఏముందీ, పూనా లో ఓ రెండు రూమ్ములూ, దాంట్లోనే ఓ మోరీ (అదేనండి, మనవైపు అంట్లు పడేస్తామే అలాటిదన్నమాట), అక్కడే స్నానాలూ, అక్కడే వంటా వార్పూ, స్టోర్ రూమ్మూ all in one అన్నమాట. ఇంక మిగిలిన ముందరి రూమ్ములోనే, ఓ మంచం, కబ్బోర్డూ, ఓ రేడియో ( అప్పటికింకా టి.వీ లు రాలేదు ). ఇంక ఇంటికి ఎవరైనా గెస్టులు వస్తే, మా ఇద్దరి బిచాణా all in one లోకి మారిపోయేది. ఆ వచ్చినవాళ్ళెవరో నిద్ర లేచే లోపలే, నిద్ర లేవాలి. ఏమిటో ఈ జీవితం అనిపించేది. తణుకు లో ఉన్నప్పుడు ఎంత మహరాజభోగం లా గడిచేదీ? ఏమిటో అవన్నీ గుర్తు తెచ్చుకుని ఏం లాభం?

    ఏ పండగో పబ్బమో వస్తే ఎలా ఉండేది మనవైపూ, గుమ్మానికి మామిడాకుల తోరణం కంపల్సరీగా ఉండవలసిందే. మరి ఇక్కడో, మామిడి చెట్టెక్కడో వెదుక్కోవాలి. చేసికున్నంతా అని ఓ దండం పెట్టి ఊరుకోవడం. అదృష్టం కొద్దీ మా అమ్మాయి పుట్టిన వేళా విశేషం అనండి, ఫాక్టరీ వాళ్ళు కొత్తగా కట్టిన క్వార్టరోటి దొరికింది. మరీ ఇక్కడున్నంత అన్యాయం కాపోయినా, ఏదో మూడు రూమ్ములూ, ఓ కిచెనూ ఉండేవి. ఇంక పువ్వుల విషయంలో, మా శ్రీవారు ప్రతీ రోజూ ఫాక్టరీ నుంచి, పూజకి పువ్వులు తెచ్చేవారు. అవికూడా ఏమిటీ, మందార మొగ్గలు, మర్నాటికల్లా విచ్చుకునేవి. ఎంత ఓ పిల్లకి తల్లినైనా, ఇంకా అప్పటికి నిండా ఇరవైయేళ్ళైనా లేవు, ఏదో అప్పటికింకా నెత్తిమీద జుట్టులాటిదీ, మరీ సవరాల అవసరం లేకుండా ఓ జడ లాటిదీ ఉండేవి. అదేదో ఉన్నంత కాలమూ, ఓ దండో, పువ్వో పెట్టుకోవాలని ఉండదా ఏమిటీ. మా శ్రీవారికేమో అలాటి ఈస్థటిక్ సెన్సనేది ఉన్నట్టు కనిపించలేదు. ఎప్పుడు చూసినా మందార మొగ్గలే కానీ, ఇంట్లో ఓ భార్యుందీ, తనకి పువ్వులు పెట్టుకోవాలనుంటుందీ అని ఎప్పుడైనా తడుతుందా అంటే అదేం కనిపించలేదు. చివరకి చెప్పగా చెప్పగా మొత్తానికి నా పోరు పడలేక, బజారుకెళ్ళి అవేవో లిల్లీ పువ్వులూ, బంతి పువ్వులూ తెచ్చారు! ఇంక జన్మలో మళ్ళీ అడక్కుండా ! ఎప్పుడో పధ్ధెనిమిదో ఏటే ఇల్లొదిలి వచ్చేస్తే జీవితంలో ఈ పువ్వులూ, భార్యా... అనేవెక్కడ తెలుస్తాయి? ఒకటి లెండి, ఇంటినిండా పుస్తకాలు మాత్రం పుష్కలంగా ఉండేవి.

   ఏదో అప్పుడప్పుడు ఏ కథో చదివి మొత్తానికి మా శ్రీవారిలోనూ ఓ కదలికేర్పడింది. దానికి సాయం ఫాక్టరీలో ఆయన తోటి వారు, భార్యలకోసం ఫాక్టరీ అంతా రౌండ్లు వేసి, మల్లెపువ్వులూ, జాజి పువ్వులూ, గులాబీలూ కలెక్టు చేయడం మొదలెట్టడం చూశారో ఏమో, తనూ మొదలెట్టారు. ఏమొచ్చినా అతివృష్టీ, అనావృష్టీనూ... వాళ్ళ ఫ్రెండ్ల కంటే ముందరే వెళ్ళి కోసేసికోడం. ఫాక్టరీ నుండి వచ్చిన తరువాత డబ్బా తెరిస్తే, దాన్నిండా ఓ దాంట్లో మందారాలూ( దేముడికి లెండి), ఇంకో దాంట్లో గుభాళించే మల్లేమొగ్గలూ, పైగా వాటిలో వెరైటీలోటి. ఈయనకేమీ పనిలేదా, భార్యకోసం పువ్వులు కోయడం తప్పించీ అనుకోకండి, పాపం పనిదొంగ మాత్రం కాదు ఎప్పుడూ! ఏదో తనకి ఉండే తీరిక సమయం గంటలోనే ఈ నిర్వాకాలన్నీనూ. ఆ పువ్వులన్నీ మాల కట్టేటప్పటికి గంట పట్టేది. ఓ సారెప్పుడో మాటవరసకి ఆయనతో అన్నానంతే, మర్నాటినుంచీ, ఓ దండ కట్టి మరీ తెచ్చేవారు!

   మేము వరంగాం వెళ్ళినప్పుడైతే క్వార్టరు చుట్టూరా ఓ పేద్ద గార్డెనే. అన్ని రకాల పువ్వులూ, పళ్ళూ అబ్బో ఒకటేమిటి ! జీవితానికింకేం కావాలీ అనుకున్నంత సేపు పట్టలేదు, అందుకే అంటారు దేనికీ దిష్టి కొట్టకూడదూ అని.1998 లో తిరిగి పూణే వచ్చాము. అప్పటికి ఆ జడా లేదూ, ఆ పువ్వులూ లేవు! ఏదో శుక్రవారం పూజ కోసం పువ్వులూ, తోరణానికి ప్లాస్టిక్కు మామిడాకులూ, ప్లాస్టిక్కు బంతి పువ్వులూ మిగిలాయి.

    ఏదో ఊరికే వస్తున్నాయని పుష్కలంగా పువ్వులు తెచ్చేవారా ? నిజంగా నా మీద ప్రేముండే తెచ్చేవారా? ఏం లేదూ ఇప్పటిదాకా డబ్బులెట్టి ఓ మూర దండైనా తెచ్చిన పాపాన్ని పోలేదు !! ఏమిటో జీవితం అంతా ప్రశ్నలే ......

గుర్తింపు సప్తాహం...

   మా శ్రీవారికి ఇంట్లో ఓ భార్య అనే ప్రాణి ఉందని అసలు గుర్తింపే ఉండదు. ఎప్పుడో దశకానికో, పుష్కరానికో గుర్తొస్తూంటాను. రాజమండ్రీ లో ఉన్న ఏణ్ణర్ధం ఫరవా లేదు, ఇంకో గతి లేక నన్నే నమ్ముకుని ఉండిపోయారు పాపం! ఊళ్ళోవాళ్ళెవరూ తిండి పెట్టరు. ముద్ద దిగాలంటే భార్యే గతి కదా! పూణె తిరిగొచ్చేసిన తరువాత అసలు లెఖ్ఖే చేయడం మానేశారు. కూతురూ, కొడుకూ ఇక్కడే ఉన్నారుగా, ఎవరో ఒకరు తిండి పెడతారులే అని ధైర్యం. లేకపోతే ఏమిటండీ, ప్రొద్దుటే బ్రేక్ ఫాస్ట్ తినేసి, మల్లాది వారిదీ, చాగంటి వారిదీ ప్రవచనాలు వినేసి, బయటకు ఏదో పేద్ద పనున్నట్లు పారిపోవడం. ఆ ప్రవచనాలు ప్రతీ రోజూ వింటున్నారు కదా, అందులో చెప్పే ఒక్క విషయమైనా వంటబట్టిందా, అబ్బే. అలాటివేవీ గుర్తుండవు.తిరిగి ఒంటిగంటా అయేసరికి,భోజనానికి తయారు. ఈ లోపులో ఇంట్లో ఒకర్తుందనే ధ్యాసే ఉండదు. పోనీ ఇంటికొచ్చిన తరువాతైనా ఏమైనా ఉధ్ధరిస్తారా అంటే అదీ లేదూ, ఎప్పుడు చూసినా బ్లాగులూ గొడవానూ. పైగా ఈ మధ్య ఇంకోటి మొదలెట్టారు. చదివేవాళ్ళని బెదిరించడం. మరీ ఎక్కువైపోతున్నాయేమో, పోనీ వ్రాయడం మానేయమంటారా అంటూ, ఎవడికిట ఉధ్ధరింపూ, అందరూ సుఖ పడతారు. దానికి సాయం, అందరూ వ్యాఖ్యలోటి -- " అయ్యో బాబాయి గారూ, మానేయకండి ..." అంటూ. ఔను వాళ్ళదేం పోయిందీ, భరించేది నేనూ. ఇంక ఆ వ్యాఖ్యలు మావారికి ఓ టానిక్కులా పనిచేసి, ఇంకా పేట్రేగిపోతున్నారు. ఏమిటో ఏదో వ్రాయాలని ఏదేదో వ్రాసేస్తున్నాను.

    ఈ మధ్య సడెన్ గా మా శ్రీవారికి, ఇంట్లో తనే కాకుండా ఇంకోళ్ళు కూడా ఉన్నట్టు గుర్తొచ్చేసింది. ఆయన ఏవో మిస్టరీ షాపింగులూ అవీ చేస్తూంటారు గా, క్రితం వారం లో నా పేరున రెండూ, ఆయన పేరున నాలుగూ వచ్చాయి. అందులో షాపర్స్ స్టాప్ వాళ్ళదానికి, ఏదో ఒక బట్ట తీసికుని, దానికి ఆల్టరేషన్ కూడా చేయించాలన్నారు. అవకాశం వచ్చిందీ, అందరికీ చెప్పుకోడానికీ గొప్పగా ఉంటుందీ, అనుకుని, నన్నూ తీసికెళ్ళారు. ఓ ఔట్ లెట్ లో పైన వేసికునే కుర్తా, రెండో ఔట్ లెట్ లో కిందవేసికునే సల్వారూ కొనేసి, వాటిని ఆల్టర్ చేయించేసి, పని పూర్తిచేసేశారు.

    ఎప్పటినుండో అడుగుతున్నాను, కళ్ళజోడు మార్పించండి మహప్రభో అని, వింటేనా? ఈ మధ్యన, కళ్ళజోళ్ళ షాప్ కూడా ఒక ఆడిట్ చేయవలిసొచ్చింది ( లారెన్స్ మేయో). అమ్మయ్య ఓ గొడవొదిలిందిరా బాబూ అనుకుని, నన్ను అక్కడకి కూడా తీసికెళ్ళి కొత్త కళ్ళ జోడు కూడా కొనేశారు. నా అదృష్టం కొద్దీ ఇవేవో కలిసొచ్చాయి కానీ, ఈయన కా అంత
పెద్ద మనసూ? దసరాల్లో మొన్న సప్తమి నాడు, తిథుల ప్రకారం నా పుట్టిన రోజులెండి. పైగా ఈ తీసికున్నవాటినన్నిటికీ ఓ గిఫ్ట్ ప్యాకింగు చేసేసి, చేతులో పెట్టేశారు. అదేదో అమ్మవారికి అలంకారాల్లా నాకూ, ఓ జత బట్టలూ, కళ్ళకి కొత్త జోడూ అమిరేయి!
అక్కడితో ఎక్కడయిందీ, ఈవేళ ప్రొద్దుటే లేచి, " ఈవేళ సినిమాకి వెళ్దామోయ్" అన్నారు. చెప్పేనుగా అప్పుడప్పుడు మా శ్రీవారికి వేవిళ్ళ కోరికల్లాటివి వస్తూంటాయి. ఎప్పుడో రెండేళ్ళ క్రితం, రాజమండ్రీ లో చూసిన " ఆకాశమంత" తరువాత మళ్ళీ థియేటరుకి ఎక్కడ వెళ్ళామూ? సరే ఆయన మాటెందుకు కాదనాలీ,ఎప్పుడో కానీ అడగనే అడగరు, కాదంటే మళ్ళీ సినిమా చూడకుండానే వెళ్ళిపోతే అమ్మోయ్ ! సినిమా ఏమిటీ -- " దూకుడు"-- దూకుళ్ళూ అవీ చూసే వయస్సా ఇదీ? ఏమిటో లేడికి లేచిందే పరుగూ.

    అదండి మా శ్రీవారి " గుర్తింపు సప్తాహం". మళ్ళీ ఎప్పుడో ఏమిటో....

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes