RSS

మీరేమంటారు ???

   మేము ఇదివరకు హైద్రాబాదు పెళ్లికి వెళ్లినపుడు నెక్లెసు, గాజులు పెట్టుకుంటుంటే ఓ గాజు మిస్సింగ్. పెట్టెలో మొత్తం వెదికాను , ఊ హూ! కనిపించలేదు. కింద నేల మీద పడిందేమొనని చూ శాను.. దొరకలేదు. అలాగే పెళ్ళికి వెళ్లి , అదేరోజు రాత్రి తిరుగు ప్రయాణానికి బయలుదేరే ముందు మళ్ళీ అన్ని వెదికి నిరాశతో, ఎలా ఈయనతో చెప్పాలీ? అని బాధ పడుతూ,మరొకసారి వెదుకుతూ, ( ఈయనతో వెంటనే చెప్పలేదులెండి, చెబితే ఆయన మూడ్ బాగుండక ,పెళ్లిలో చాలా రోజుల తరువాత కనిపించిన బంధువులను చూసిన ఆనందం, సంతోషం వుండవు కదా,అందుకని) దేవుడ్ని తలచుకుంటూ, రోజూ దేవుడికి దీపం పెట్టి పూజ చేస్తానే ప్రతి శుక్రవారం లలితా సహస్రనామం చదువుతానే తెలిసీ ఎవరికీ హాని చేయలేదే? అనుకుంటూ తిరిగి వచ్చేస్తూ తిరిగి చూసేసరికి మంచం మీద దీపం వెలుతురులో మెరుస్తూ కనిపించింది.ఎంతో సంతోషంతో అమ్మా! నీవు వున్నావు తల్లీ! అనవసరంగా శంకించాను, నన్ను మన్నించు తల్లీ! అనుకుంటూ , అప్పుడూ అందరికి గాజు కనిపించలేదని , ఇప్పుడు కనిపించిందని నేను రోజంతా పడ్డ టెన్షన్ గురించి చెప్పి ఆనందంతో ఏడ్చేసాను." అమ్మ" అనుగ్ర్హహం నా అదృష్టం బాగుందనుకున్నాను. అందరూ అదే అన్నారు.
" మాశ్రీవారు, మా పిల్లలు" మాత్రం " వస్తువు పోయిందన్న కంగారులో ,వెదికి వుంటావు, కనిపించలేదు,ఎనీవే, కనిపించిందికదా!గుడ్! అన్నారు.

   నాకు మాత్రం అది మొదటి " వార్నీంగ్ ," చేతావనీ" అని ఇప్పుడనిపిస్తోది. ఎందుకంటే----

   మళ్ళీ హైద్రాబాదు పెళ్ళికని బయలుదేరేముందు మనకున్నవేవో వేసుకోవాలి కదా,మరి!,మళ్లి గాజులు, నెక్లెసు తీద్దామని చూసేసరికి నెక్లెసు మాయం. ఇక్కడె ! మా ఇంట్లోనె! ఇప్పుడు ఇద్దరం కలిసి మొత్తం ఇల్లంతా వెదికాం," ఇంట్లోను, దాపోడి ఇంట్లోను" రెండుసార్లు, మూడుసార్లు,అబ్బే! ఎక్కాడా, కనిపించదే? దానితో పాటు పెట్టిన మిగిలినవి వున్నాయి, కాని అది మాత్రం కనిపించలేదు. తాళాలు వేసినవి వేసినట్లే వున్నాయి.ఏమయిందో , ఎల్లా మాయమయిందో తెలీదు." అమ్మ" అనుగ్ర్హహం అంతమయిపోయిందా? నా అదృష్టం బాగుండ లేదంటారా? అప్పనంగా వచ్చిన వస్తువు కాదే, ఒక్కొక్క గ్రాము కొని ,జీతం సొమ్మూ జాగర్త చేసి మరీ కొన్న వస్తువేనూ,ఎంత లేదన్నా ఇప్పుడు ఏభై వేల రూపాయలు విలువైన వస్తువు. బయట ఎక్కడొ పారేసుకోలేదూ? పెట్టుకొని బయటకు వెళ్ళినపుడు పోలేదూ?ఇంట్లో , జాగర్తగా పెట్టవలసిన చోటే పెట్టాను.మరి కనిపించ లేదంటే ఏమనుకోను.

   " మాశ్రీవారు, మాపిల్లలు" ఎక్కడొ పెట్టి ఎక్కడొ వెతుకుతున్నావు, సరిగ్గా చూడూ, ఇంట్లోపెట్టినది ఎక్కడికి పోతుందీ? అన్ని వుండి అదొక్కటే ఎలా మిస్సవుతుంది" అంటున్నారు. దొరకుతుందో, లేదో, కాలమే చెప్పాలి.

   నాకు మాత్రం పోయిన వస్తువు దొరికినపుడు ఎంత సంతోషమనిపించిందో , వస్తువు దొరకనపుడు కలిగిన దుఃఖం, రెండింటిని సమానంగా తీసుకోవాలనే' సందేశాన్ని' " అమ్మ " పంపినదా, అనిపిస్తోంది. మీరేమంటారు?
భవిష్యత్తు లో సంతోషం- విషాదం, సుఖం - దుఃఖం , రెండింటిని సమానంగా తీసుకొమ్మని " అమ్మ" ఆదేశమా? లేక సందేశమా ?

మా "లతాయాతకము"

"మేలుకొలుపులు" మిగిలిన భాగాలు మేము కొత్తగా ప్రారంభించిన " "లతాయాతకము""(http://lakshmiphanibabu.blogspot.com/2011/12/blog-post.html) లో వ్రాస్తున్నాము.

ముళ్ళపూడి వారి "మేలుకొలుపులు"














    ఒక మంచి కధ, ఓ మంచి విశ్లేషకుని విశ్లేషణ,

మధురమైన పాట, మనకే స్వంతం కాకుండా మరొకరితో పంచుకుంటే పెరిగే నిధి.
మాకు నచ్చినవి మీతో పంచుకోవాలనే చిరు ప్రయత్నమే .


    ధనుర్మాస సందర్బంగా మేము త్రిమూర్తి స్వరూపులు ( బాపు, రమణ, ఆర్.కె. లక్ష్మణ్) గా భావించే శ్రీ బాపు రమణల " మేలుపలుకుల మేలుకొలుపులు" మా బ్లాగులో వ్రాసి మమ్ము మేము పునీతులవుదామనే ఆశ. పదిసార్లు చదివేదానికన్నా ఓ సారి రాస్తే బాగా అర్ధమవుతుంటారు. అలాగే శ్రీ బాపుగారు " మిధునం" కధని ఆయన తన దస్తూరిలో రాసిచ్చి ,"ఓసారి రాస్తే బాగా అర్ధమవుతుంది. అందుకనే రాశాను" అన్నారట. మేము ఓ పది సార్లు చదివేకంటె రాసి అర్ధం చేసుకునే ప్రయత్నం.


   నల్లాని సామినీ పెళ్ళాడ మనసైతే
తెల్లారుజామునే చలిమునక వెయ్యాలి
కన్నెమనసూ విప్పి కాత్యాయనికి చెప్పి
మార్గశిరనోమునూ మనసార తలపెట్టి
నందగోవుని పట్టి బృందావనపు జెట్టి
బాలసింగము నడిగి పూలు పాలు పళ్ళు
కొబ్బరీ బూరాలు తప్పెట్లు తాళాలు
తెచ్చుకోవాలమ్మా తెల్లారిపోకుండా
కన్నెపిల్లా మేలుకో కన్నయ్యనూ లేపగా
సిరినోము - హరిపూజ - గిరిపుత్రివరము
గోకులం కన్నెలకు కల్యాణకరము
లోకులం దరికిదే సౌభాగ్యప్రదము
పల్లెపిల్లా మేలుకో
రే-పల్లె పిల్లా మేలుకో



( మేలుకొలుపులు మొదటిది. " శ్రీ బాపు రమణ లకు నమస్కృల తో )

ఏదో ఇంటిపట్టునుండాలి కానీ....

    ఏమిటో ఈమధ్యన టపాలు వ్రాయడానికే తీరికుండడం లేదు. ఇదివరకు మా శ్రీవారు ఉద్యోగం లో ఉన్నప్పుడే హాయిగా ఉండేది. ఏదో ప్రొద్దుటే ఎనిమిందింటికి " డబ్బా" ఇచ్చేస్తే ఓ గొడవొదిలేది. దాంట్లో ఓ రెండు చపాతీలూ, ఓ కూరా ఇంకోదాంట్లో పెరుగూ అన్నం తో సరిపోయేది. ఈ రిటైరయిన తరువాత అసలు తీరికుంటేనా? అబ్బాయి వాళ్ళూ ఉన్న మా ఇంటికి వెళ్తే, అక్కడ మా నవ్యా, అగస్థ్యా అసలు వదలరు. ఏ శనివారం ప్రొద్దుటే వెళ్తే, మళ్ళీ ఆదివారం రాత్రికే తిరిగి రావడం. మా సామ్రాజ్యానికి వచ్చేసిన తరువాత, ఈయనతో పడలేక, ప్రాణం పోతోందంటే నమ్మండి. తనకి కావలిసిన కూరలేవో తెచ్చుకుంటారు, అదేదో తీసుకురాలేకపోయారా అంటే, నాకు ఆ కూర పేరు నచ్చలేదూ అంటారు. ఇదేం చిత్రమమ్మా, ఎక్కడైనా పేర్లబట్టి తెచ్చుకుంటారా కూరలూ, ఇన్నాళ్ళూ ఏదో రుచి,జిహ్వ ని బట్టీ తెచ్చుకుంటారనుకునేదాన్ని, లోకజ్ఞానం లేనిదాన్నీ ఏం చేస్తాను? మళ్ళీ ఆ తెచ్చిన వాటిని తనకు నచ్చేటట్లే చెయ్యాలి. ఎందులోనో "నువ్వుపిండి" వేస్తే బావుండేదోయ్ అంటూ. ఆ నువ్వులేవో తెచ్చి నా మొహాన్న పడేయాలనే ఇంగితజ్ఞానం ఉండొద్దూ? అలాటివి గుర్తుండవు, కానీ కోరికలు మాత్రం కోకొల్లలు!

    ఈ గొడవలన్నీ పడ లేక, నాకొచ్చిందేదో చేస్తానూ, ఇష్టముంటే తినండీ, లేకపోతే ఓ వంట మనిషిని పెట్టుకుని, కావలిసినవన్నీ చేయించుకోండి అనేటంత కోపం వచ్చేస్తూంటుంది. అయినా అలా అంటామా ఏమిటీ? ఏదో ఆయన విసిగించినప్పుడల్లా ఓసారి అనుకోడం. అప్పుడెప్పుడో, తను చేసే మిస్టరీ షాపింగు వాళ్ళు, ఈయన్నేదో హోటల్ కి వెళ్ళమన్నారుట, పోనీ ఇంట్లో ఇంకో ప్రాణోటుందీ, దాన్ని కూడా తీసికెళ్తే బావుండునూ అని ఆలోచన వస్తుందా, అబ్బే, వాడెవడో వెళ్ళమన్నాడుట, ఈయనేమో తెయ్యిమంటూ ఎగరేసికుంటూ వెళ్ళిపోడమే! ఇలాటివాటికి మనం గుర్తురాము. ఏం చేస్తాం? మనుగుడుపుల పెళ్ళికొడుకులా తయారయి ఇంటికి టాక్సీ తెప్పించుకుని మరీ వెళ్ళారు! ఎక్కడైనా విన్నారా అసలు ఈ విచిత్రం? ఊళ్ళో పిల్లల్నీ, భార్యనీ పెట్టుకుని హోటల్లో ఉంటారా ఎక్కడైనా? అంతా కలికాలమండి బాబూ కలికాలం! పైగా అక్కడికేదో నేనంటే భయమన్నట్టు, ప్రతీ అరగంటకీ , నేను ఫోను చేసినట్టో, లేక తనే ఫోను చేసినట్టో ఓ టపా కూడా వ్రాసుకున్నారు.కావలిసొస్తే నా ఫోను చూసుకోండి, అక్కడ ఏమేం రాచకార్యాలు వెలగబెట్టారో నాకేం తెలుసూ నేను మాత్రం, హాయిగా ఉన్నాను ఆ ఇరవై నాలుగ్గంటలూనూ. నెలకోసారైనా ఇలాటివుంటే ఎంత బావుండునూ అనిపించింది!

   ఇంక అక్కడనుంచి వచ్చేసిన తరువాత చూడాలి. ఇంకా ఆ హొటల్ "హాంగోవర్" లోనే ఉన్నట్టున్నారు, ఇది ఇల్లు మాస్టారూ అని గుర్తుచేయాల్సొచ్చింది! ఏమిటో పాపం నన్ను ఒక్కర్తినీ వదిలేసి వెళ్ళానని గిల్టీ ఫీల్ అయ్యారేమో, ఇంతలో అప్పుడెప్పుడో వర్షం లో వెళ్ళామే ఆ హోటల్ కే మళ్ళీ వెళ్ళమని ఫోనొచ్చిందిట. అమ్మయ్య ఇదీ బావుందీ అనుకున్నారు. జేబులో డబ్బు ఖర్చు చేయఖ్ఖర్లేదూ, భార్య దగ్గర ఇమేజ్ పెంచేసికోవచ్చూ, ఇంతకంటె మంచి అవకాశం ఎలా వస్తుందీ?

    మొత్తానికి ఓ ఆటో చేయించుకుని వెళ్ళాము. కిందటిసారి అనుభవం తో తెలిసిందిగా, ఏమేం ఆర్డరు చేస్తే ఎంతంత ఇస్తారో, అయినా మనం తినే తిండికి, ఈ స్టార్ హొటళ్ళు కూడా ఎందుకూ? ఏదో సరదా పడ్డారు కదా అని వెళ్ళడం కానీ, ఆ తిళ్ళు మనకేమైనా ఎక్కుతాయా ఏమిటీ? ముందుగా అదేదో appetizers ట. మెనూ లో చూసి పోనీ అవేవో క్యాప్సికం రోల్సో, ఆనియన్ రోల్సో, కొత్తగా ఉన్నాయీ పోనీ, తెప్పిద్దామా అంటే వినరే, ఇదివరకోసారి తిన్నాం కాబట్టి అవే తెప్పిద్దామూ అంటారు. ఈ పెద్దాళ్ళిక్కడ దెబ్బలాడుకుంటున్నారూ అని చుట్టుపక్కల వాళ్ళనుకోకుండా, సరే మీఇష్ట ప్రకారమే కానీయండి అన్నాను.అసలు వచ్చిన గొడవంతా ఈయనకి పళ్ళు లేకపోవడం! ఆ పన్నీరు అనేదేదో మెత్తగా, ఆరారగా తినేయొచ్చూ అని అపోహ! మొత్తానికి అవేవో పన్నీర్ పకోడా తెప్పించాము. అసలు అవి తినేటప్పటికే కడుపు నిండిపోయింది! ఇంకా, అదేదో మెయిన్ కోర్సుట, వాటిని కూడా తెప్పించాలి. ఓ పరోఠా, వెజ్ పులావోటీ తెప్పిద్దామన్నాను. తక్కువైపోతాయేమో నోయ్ అంటూ పోనీ రెండేసి తెప్పిద్దామా అన్నారు. కావలిసొస్తే తెచ్చిన రెండూ మీరే తిందురుగాని, ఒక్కోటి చాలు అని, ఆర్డరిచ్చాము. తీరా వాడు తెచ్చినవి చూసేటప్పటికి హడలి పోయాము. ఆ పరోఠా నాలుగు ముక్కలు చేసి ఓ ప్లేటులో పెట్టాడు, ఆ పులావేదో, ఓ గిన్నెనిండా, నలుగురికి సరిపోయేలా తెచ్చాడు. వాడు తెచ్చాడు కదా అని అంతా ఎక్కడ తినగలమూ, అసలే మనవి పిట్ట కడుపులూ. తిన్నదంత తిని, మిగిలినది ప్యాక్ చేయించి తెప్పించాము.
అప్పుడే ఎక్కడయిందీ, అవేవో బెవరేజీ, డెజర్టూ కూడా తెప్పించుకోవాలిట. నాకంత ఓపికలేదమ్మా అనుకుని ఓ లస్సీ తెప్పించుకుని తాగాను. ఆయనేమో కుల్ఫీ!

    హాయిగా ఇంట్లో కూర్చుని, ఏ దొండకాయ వేపుడో, చారో పెట్టుకుని తినేయక ఎందుకొచ్చిన తిరుగుళ్ళు చెప్పండి? ఈ వయస్సులో హరాయించుకోగలమా? ఏమిటో వెళ్ళిపోతోంది....

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes