RSS

ఇదండి సంగతి...

   ఏమిటో చూస్తూ చూస్తూ మూడేళ్ళు గడిచిపోయాయి, ఈ టపాలు వ్రాయడం ప్రారంభించి. మేము రాజమండ్రి లో ఉంటున్నప్పుడు, మా శ్రీవారు ఏదో సుఖపడిపోతున్నారూ, ప్రపంచం లోని ఎక్కడెక్కడివారూ ఆయన బ్లాగుల్లోకి వచ్చేసి, ఆయన వ్రాసే బాతాఖానీ కబుర్లు చదివేస్తున్నారే, ఆమాత్రం నేను వ్రాయలేనా అనుకుని, ఆయన్ని బతిమాలి, బామాలి, దెబ్బలాడి, మొత్తానికి నేర్చుకుని, వ్రాయడం మొదలెట్టాను. ఒకానొక స్టేజ్ లో " నాకు నేర్పకపోతే, మీకు పనసపొట్టు కూర ఆవ పెట్టి చెయ్యనంతే..." అనేదాకా బెదిరిస్తే, చేయకేంచేస్తారు పాపం!ఆయన చూడకుండా, ఓసారి మంగళసూత్రాలు కళ్ళకద్దేసికుని, పాపం ఆయనకి పనసపొట్టు కూరా, కందా బచ్చలి కూరా పెట్టకుండా నేనుండగలనా, ఏమిటో ఈమాత్రం బెదిరింపుకూడా తప్పేనా ఏమిటీ?

    అయినా ఆయన వ్రాసినన్ని నేనెక్కడ వ్రాయగలనూ, ముక్కుతూ మూలుగుతూ ఏదో మొత్తానికి ఓ నూట నలభై దాకా లాక్కొచ్చాను. అయినా ఆయనలాగ నాకేమైనా రిటైర్మెంటా పాడా, ప్రతీ రోజూ ప్రొద్దుటే బ్రెక్ ఫాస్టూ, మధ్యాన్నం పన్నెండున్నరకల్లా ఓ కూరా, పప్పూ, పచ్చడి తో భోజనం, పైగా వీటిల్లో ఏమైనా లోటు చేస్తానేమో అని ప్రతీ రోజూ శ్రీ చాగంటి వారి ప్రవచనాలు వినిపించడం ఓటీ, "పతియే ప్రత్య్క్షక్ష దైవం.." అన్న సూక్తి మర్చిపోతానేమో అని! వీటికి సాయం మా అగస్థ్య, నవ్య, తాన్యా, ఆదిత్యల తో కాలక్షేపం, ఇన్ని పనులతో ఇంక ప్రతీ రోజూ టపాలు పెట్టడం కొద్దిగా కష్టమే కదూ.

   ఏదో నాకుతోచిందేదో వ్రాసేసి సేవ్ చేసి, అవేవో రంగులూ అవీ పెట్టి ఓసారి చూసేసి పోస్ట్ చేసేయండీ అని నాదారిన నేను ఏ ఈవెనింగ్ వాక్కుకో వెళ్ళడం. మరి ఎంత కూర చేసినా, దాంట్లోకి "పోపు" పెట్టకపోతే, రుచుండొద్దూ? అదండి నా బ్లాగు ప్రస్థానం.. ఏదో వ్రాసేసి, అసలు మన టపాలు ఎవరైనా చదువుతారా ఏమిటీ అనుకోడం, పోనీ చదివినా వ్యాఖ్యలు పెడతారా, ఎవరైనా వ్యాఖ్యలు పెట్టిన రోజు పొంగిపోవడం, లేని రోజు " అయ్యో.." అనుకోడం.. కలిమిలేములూ, కష్టసుఖాలూ అనుకుంటూ హమ్మ్ చేసికోడం అలా వెళ్ళిపోతోంది. ప్రతీరోజూ వ్రాసేవారి సంగతి వేరూ, ఏదో వారానికీ, పక్షానికీ వ్రాసే నాలాటి వారి టపాలు ఒక్కొక్కప్పుడు కూడలి లోనూ, హారం లోనూ కొన్ని గంటలపాటుండి మాయమైపోతూంటాయి. అదిగో అలాటప్పుడే, మా శ్రీవారు తన టపాల్లో లింకులు పెట్టి, తన " అభిమానుల" చేత బలవంతంగా చదివిస్తూంటారు. అయినా ఇంకోళ్ళ మెహర్బానీతో బతకడం దేనికంట?

   అసలు ఎవరైనా తమ పని స్వయంగా చేసికోవాలికానీ, ఇంకోళ్ళమీద ఆధార పడకూడదంటాను.ఫొటోలు పెట్టడాలూ, ఇంకా ఏవేవో చేయడాలకీ మా శ్రీవారికి నా బ్లాగే ఓ testing ground లా వాడేసికుంటూంటారు ! తన బ్లాగులో అలాటివి చెసికుంటే ఆయన " ఇమేజ్" తగ్గిపోదూ మరి ! ఒక విషయం నిజమే, నాకు వ్యాఖ్యలు పెట్టినవారికి జవాబివ్వడం వచ్చుకానీ, ఇంకో గొడవేమీ తెలియదు. తను ( మా శ్రీవారు) ఏవేవో చేస్తూంటారు కదా, ఆమాత్రం సరీగ్గా చూడొద్దూ, నా బ్లాగుల్లో ఏమైనా వ్యాఖ్యలు spam లోకి వెళ్ళిపోయాయేమో అనీ, ఈ spam అన్నది ఒకటుంటుందని ఈమధ్యనే తెలిసిందిలెండి. ఈవేళ్టికి , నా బ్లాగుకి కూడా మూడేళ్ళు నిండుతాయీ, అనుకుని ఈ సంవత్సరపు చిఠ్ఠా వర్జా చూసుకునేసరికి, తేలిందేమిటీ అంటే, నా నిర్లక్ష్యం అనండి, చేతకానితనం అనండి, ఇంకొకరి మీద ( భర్త అయినా సరే!) ఆధార పడడం అనండి మొత్తానికి ఓ తొమ్మిది వ్యాఖ్యలు ఆ spam లో దాక్కున్నాయని తెలిసింది. అయ్యో.. అయ్యో... ఎంత పని జరిగిపోయిందీ.. వ్యాఖ్యలు పెట్టకపోతే పెట్టలేదో అని గోలా, తీరా పెట్టిన వారినేమో అసలు పట్టించేకోకపోవడం. అసలు నాకు పుట్టగతులుంటాయా?

   నా టపాలు చదివి ప్రోత్సాహపరచడానికి వ్యాఖ్యలు పెడుతున్న అందరికీ ధన్యవాదాలు... ఇంకా కొత్తవారు కూడా నా టపాలు చదువుతారని ఆశిస్తూ... ఇదండి సంగతి....

స్టీలు సామాన్ల "యావ"...

   ఏమిటో కొన్నిటిని గురించి ఆలోచించినప్పుడు, ఏమిటో అంత సిల్లీగా ఎలా ఉండేవాళ్ళమో అనిపిస్తూంటుంది. పైగా ఈ రొజుల్లో వస్తున్న వస్తువులని చూసినప్పుడు మరీనూ. అయినా సరే, ఆనాటి పరిస్థితులతో చూసుకుంటే, రైటేనేమో అనిపిస్తుంది. పెళ్ళైన కొత్తలో, మా ఆడపడుచు పెళ్ళికి వెళ్ళినప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు, ఆవిడన్నారూ, కావలిసినవేవో తీసికెళ్ళవే అన్నారు. అప్పటికి మా కొత్తకాపరం లో ఇడ్లీ స్టాండ్ లేదు కదా అని, ఓ అల్యూమినియం స్టాండూ, ఓ జర్మన్ సిల్వర్ పాత్రా తీసికున్నాను. అత్తారింట్లో ఓ శుభ్రమైన ఇత్తడి ఇడ్లీ పాత్ర ఉండేది. అది తీసికెళ్తానన్నా, అవిడ కాదనేవారు కాదు. అయినా, తెల్లగా ఉందికదా అని ఆ మాయదారి అల్యుమినం ఇడ్లీ పాత్ర తీసికున్నాను.

   అదేమిటో, ఆ రోజుల్లో స్టీలు సామాన్ల హవాయే ఎక్కడ చూసినా. వేసవి కాలం శలవల్లో, పుట్టింటికీ, అత్తారింటికీ వెళ్ళగానే ముందుగా స్టీల్ సామాన్ల కొట్టులోకి వెళ్ళిపోడమే! అదేమిటో ఇల్లంతా స్టీలు సామాన్లతో నింపేయాలని ఓ యావ ! మొట్టమొదట కొన్నదేమిటో తెలుసా- నాలుగ్గిన్నెల క్యారీరు! ఇద్దరు పెద్దాళ్ళూ, ఏణ్ణర్ధం ఉన్న పిల్లా ఉన్న ఇంట్లోకి అసలు అంత పెద్ద కారీరెందుకూ అనే ఆలోచన కూడా రాలేదు ! ఎవరింట్లోనూ లేనిదేదో మనింట్లో ఉండాలి. మనవైపు హొటళ్ళలో డబల్ కారీర్ అని ఇచ్చేవాడు, అంతుంటుందన్నమాట !అమలాపురం లో తీసికోడం, దారిలో తణుకు లో దిగినప్పుడు దాన్నిండా అమ్మ ఇచ్చిన ఊరగాయలు తీసికోడమూనూ. దాన్ని ఏ సంచీలోనైనా సద్దుదామంటే, పట్టదే. ఏదో మా శ్రీవారి చిరాకులూ పరాకులూ భరించి మొత్తానికి తీసికెళ్ళేవాళ్ళం. పైగా ఎప్పుడైనా మళ్ళీ మనవైపు వెళ్ళినప్పుడు, మా చెల్లెళ్ళు పోనీ తింటారులే అనుకుని, బేసిన్ లడ్డూలూ, అవి చేసికుని నాలుగు డబ్బాల్లోనూ పెట్టుకుని తీసికెళ్ళడమూ, తీరా చెల్లెళ్ళు ఆ డబ్బా తెరిచి," అదేమిటి అక్కా, చలిమిడీ, చిమ్మిలీ తెచ్చావేమిటీ, బేసిన్ లడ్డూలన్నావు?" అనడమూ. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఆంత శ్రమపడీ చేసిన బేసిన్ లడ్డూలు, ఎండలకి కరిగిపోయి, పాకం రూపుకొచ్చేసేవి! మా నాన్నగారు, పాపం అమ్మాయి బాధపడిపోతుంది అనుకుని, " ఏమి పరవాలేదు, కొంచం గట్టిపడ్డ తరువాత ఉండ చుట్టుకుంటే సరీ.." అని సద్దిచెప్పేవారు!

   ఇంట్లోకి డైనింగ్ టేబులోటి కొన్నారు ( ఇప్పటికీ ఉందండోయ్!), ఇంటికి ఎవరైనా భోజనానికి వస్తే, కూరా, పప్పూ వగైరాలు టేబిల్ మీదే పెట్టుకోవాలని మనసూ !! దానికోసం ఓ నాలుగ్గిన్నెల గుత్తీ !! వాటిని పూర్తిగా నింపితే పదిమంది దాకా సునాయాసంగా భోజనం చేయొచ్చు, అంత ఉంటుందది !! ఇళ్ళల్లోకి అంతంత గుత్తులు ఎందుకు చెప్పండి? అక్కడితో పూర్తయిందా, మా శ్రీవారికి భోజనం పంపడానికి మళ్ళీ ఇంకో మూడు గిన్నెల క్యారీరూ. ఫాక్టరికి టిఫిన్ తీసికెళ్ళే కుర్రాడు, అవసరార్ధం ఆ క్యారీరుని తాకట్టు పెట్టేశాడు. ఇంకో మూడు గిన్నెల క్యారీరు కొనాల్సొచ్చింది. అలాగే ఇంకోసారి రెండు గిన్నెల క్యారీరూ. ఇంట్లో ఆస్థిపాస్థులున్నా లేకపోయినా, ఎక్కడ చూసినా కారీర్లే ! ఇంత హడావిడిలోనూ ప్రయాణాల్లో మంచినీళ్ళకోసం ఓ స్టీలు మరచెంబోటండోయ్...

   ఇవన్నీ కాకుండా, బట్టలకి స్టీలు సామాన్లిచ్చే మనిషి దగ్గర, ఇంట్లో పాత చీరలూ అవీ ఇవ్వడం, ఓసారి నాలుగు డబ్బాల సెట్టూ, ఇంకోసారి ఇంకో గిన్నెల సెట్టూ. ఎప్పుడూ ఆ మనిషితో గొడవే. ఇంకొంచం బట్టలిమ్మనేది! ఒక్కోసారి శ్రీవారి పాంట్లూ షర్టులూ సద్దవలసివచ్చేది. ఓసారి చూసుకున్నారు, ఏదో తేడా వస్తోందీ అని, అంతే, నాకు " పాతగా" కనిపించే బట్టలన్నిటికీ తిరిగి ప్రాణం పొసేసి, ఇస్త్రీ చేసెసికుని దాచేసుకునేవారు ! ఏమిటో అర్ధం చేసికోరూ, హాయిగా స్టీలు సామాన్లు కొనుక్కోక, ఆ పాత బట్టలనే పట్టుకుని వేళ్ళాడేవాళ్ళని ఏం చేస్తాం లెండి!! మా చుట్టుపక్కలున్న తెలుగువాళ్ళు కూడా, " మీకైతే బట్టలకి మంచిగా ఇస్తుందండీ.." అని వాళ్ళ బట్టలుకూడా మా ఇంట్లోనే ఉంచేవారు !

   మంచినీళ్ళకి డ్రమ్మూ,టేబిలు మీద పెట్టుకోడానికి జగ్గులూ, అత్తగారి మడినీళ్లకి ఓ చిన్న బిందె, ఒకటేమిటీ అంతా "వస్తుభ్రాంతి" ! ఇంకోటేమిటంటే, ఏదో ఫలానా వస్తువు తీసికుంటే బావుంటుందీ, అని అనడం ఏమిటి, పక్కింటావిడ బజారుకెళ్ళి తెచ్చేసికోడం, హాత్తెరీ మన కంటే ముందర వాళ్ళింట్లోకి వచ్చేసిందీ అని తెచ్చేసికోడం, పైగా వాళ్ళింట్లో దానికంటే పెద్దది! ఆ పోటీ ప్రస్థానం లో పాతిక ఇడ్లీల స్టాండూ, దానికోసం ఓ స్టీలు కళాయీ. వీటికి సాయం ఏ స్టీలు కొట్టువాడో "నెలకి పదిరూపాయల" స్కీము పెట్టాడని తెలిస్తే చాలు, దాంట్లో చేరిపోడమూ, మనవైపు వెళ్ళినప్పుడు చవకలో వచ్చెస్తున్నాయీ అని, ఏది పడితే అదే కొనేయడం. ఇంట్లో ఎంత స్టీలు సామానుంటే అంత ఫాషనూ, స్టేటస్సూనూ !! మా చుట్టం ఒకావిడ ఎంతదాకా వచ్చిందంటే, " మా ఆయన రిటైరయినప్పుడు వచ్చే డబ్బులతో స్టీలు సామాన్లు కొనేయాలీ.." అనే వరకూ !!

    ఆ రోజుల్లో పెళ్ళిళ్లనండి, లేక ఇంకోటేదో ఫంక్షననండి, ఒట్టి చేతులతో కాకుండా, ఏదో ఈ స్టీలు కప్పో, గ్లాసో, ప్లేటో ఇచ్చేవారు. పైగా ఒకళ్ళు కప్పూ, ఇంకోళ్ళు ప్లేటూ, వీటికి వంతులోటీ! ఆ రెండో ఆవిడ రాకపోతే ఆ సెట్టు పూర్తయేది కాదు. మనం కొన్న వస్తువులమీద పేరు వేయించుకోడం, వాటితో ఓ ఫుటో తీయించుకోడమూ ముఖ్యం !! రైళ్ళల్లో భోజనానికి అదేదో "గదులు" ఉన్న ప్లేటు చూడ్డం, అంతే వెళ్ళి తెచ్చేసికోడం.

   ఏమిటో ఇప్పుడు అనుకుంటే సిల్లీగా కనిపించొచ్చు కానీ, ఈరోజుల్లో " బఫే" ల్లో ఇస్తున్న ఆ "గదుల" కంచాలు మా ఇంట్లో నలభై ఏళ్ళ క్రితమే కొనుక్కున్నామోచ్ ! స్టీలు సామాన్ల మీద మోజు లేని, మన తెలుగువారెవరైనా ఉంటారా అసలూ... మా మరిది నలభై ఏళ్ళ క్రితం పూణే వస్తూ తెచ్చికున్న స్టీలు సబ్బు పెట్టి, ఇక్కడ మర్చిపోయాడు. ఇన్నేళ్ళనుండీ మా శ్రీవారు తిరిగి ఇవ్వనూ లేదూ, తను అడగడం మానా లేదూ...

నేను కూడా ఉప్పాడ చీర కొనుక్కున్నానోచ్...

   " ఏనుగొచ్చింది, ఏనుగు, ఉప్పాడొచ్చింది ఏనుగు, ఉప్పు నీళ్ళు తాగింది ఏనుగు" ఇది వరకటి మాట. ఇప్పుడు " చీరలమ్మా చీరలు ఊప్పాడొప్పాడా చీరలు" ఇప్పటి మాట.
మేము ఆంధ్రా వెళ్ళినపుడు ఎవరి నోట విన్న ఉప్పాడ చీరల గురించేను, అందులోను ఓ యువ హీరో పెళ్లికి పెళ్లికొడుకు తల్లి కాబోయే కోడలికి, ఊప్పాడ చిరలు ప్రత్యేకింఛి నేయించినవి స్వయంగా వచ్చి తీసుకువెళ్ళారట. అప్పటినుండి మరీ ప్రచారంలోకి వచ్చాయట.

   మేము అన్నవరం వెళ్ళి కళ్యాణం చేయించుకొని పిఠాపురం వెళ్ళి వద్దామనే ప్లాన్ వేసుకున్నాం. ఇంక మా మరదలు జయ గుడి సాయంత్రం కాని తెరవరు కదా! ఎండ సమయంలో ఉప్పాడ వెళ్ళి వచ్చేద్దామండి , అక్కయ్య గారూ అంటూ ఆ చీరల విశిష్టత , వాళ్ళ అక్క వాళ్ళు ఇక్కడికే వచ్చి తీసుకన్నారని, అసలు ఆ చీర లేకపోతే ఉనికే లేదన్నట్లుగానూ, ఊరించి , ఊదరగొట్టేసి ఉప్పాడ ప్రోగ్రాం పెట్టేసింది. దానికి మా మరిది కూడ సై అనేసరికి మా వారికి ఒ.కె. అనక తప్పలెదు.అలా ఉప్పాడ లో అడుగు పెట్టామండి..

   అక్కడ ఇంటింటికి ఓ బోర్డు. ఇక్కడ ఉప్పాడ జాందాని చీరలు దొరకునని. రోడ్డుకి అటు ఇటూ ఎటు చూసిన ఇవే బోర్డులేనూ, సొసైటి కూడా వుందట కాని సాయంత్రం కాని తెరవరట.అందుకని ఓ ఇంటి లోకే వెళ్ళాము.పల్లె వాతావరణంలొ ఇంటి ముందు ముగ్గు, కూరల తీగలు, పూల మొక్కలుతో కంటికి ఆహ్లదంగా చక్కగా వుంది. రండి, రండి మమ్మల్ని ఎదర గదిలో కూర్చోబెట్టి మాకు చీరలు చూపించడం మొదలు పెట్టాడు. అబ్బాయి మహ హుషారుగా వున్నాడు.మా మరిది జయ చీరల సెలక్షను లో బిజీ అయిపోయారు. .ఏం! చీరలండీ బాబూ! ఒకదాన్ని మించి ఒకటీ,సిల్కు కాటన్, అన్నీ కూడా కంటికి యింపుగా సొంపుగా చాలా బాగున్నాయి. ముందు చీరల సొగసులు కి మురిసిపోయి ధరలు చూసి కూతురిచ్చిన ఆండ్రాయిడ్ తీసుకొని చీరలకి, పెరట్లో ముగ్గులికి, వాళ్ళ పాపకి, ఆఖరికి వాళ్ళ కుక్క పిల్లకి ఫొటో లు తీయడం మొదలుపెట్టి,ఇక్కడే దో చూడకూడనిది వినకూడనిది వున్నట్లుగా పెరట్లో మొక్కలికి ఫోటో తీయడానికి వెళ్ళిపోయారు. అక్కడికి మా జయ చెబుతూనేవుంది, ఇక్కడ తక్కువ ధరకే యిస్తారని,వెయ్యి రూపాయల నుండి ఏభై వేల రూపాయల వరకూ వున్నవి చూపించారు.ఈయన వాలకం చూసి మంచి రంగులతో చూడ చక్కగా వున్న చీరలు దోచేసిన నా చంచల మనసుని అదుపులో పెట్టుకొని రెండొ అతనితో కబుర్లు మొదలుపెట్టాను.

   కొట్టు యజమాని చెప్పిన సారాంశం ఏమిటంటే, ఈ చీరలు ఎప్పటినుండో, మగ్గాల మీద పిఠాపురం జమీందార్లకి ప్రత్యేకించి నేసేవారనీ, తేలికగా మెత్తగా ఉండే నేత చీరలూ, చక్కని రంగులతో, జరీతో తయారుచేసిన పట్టు చీరలూ-- వీటినే "జందానీ " చీరలంటారనీ, ఇదే పేరుతో "పేటెంటు" కూడా తీసికున్నారనీ చెప్పాడు.ముందుగా డిజైను వేసి,ముడి సరుకు ఇచ్చి, మగ్గాలమీద నేయిస్తారుట. ఒక్కో డిజైనుకీ రెండు, మహ అయితే మూడు చీరలు మాత్రమే. చీరకి ఉపయోగించే దారం, జరీ కూడా చూపించాడు. నేను ఓ పేద్ద పోజు పెట్టేసి, ఓ పుస్తకం తీసికుని దాంట్లో నోట్ చేసికోడం మొదలెట్టాను.మా వారేమో టక టకా ఫొటోలు తీసేయడం,ఆ కొట్టువాళ్ళైతే మహ ఇంప్రెస్ అయిపోయారు మా హడావిడి చూసి !!

   ఈ లోపులో మా మరిదీ, మరదలూ కొన్ని చీరలు సెలెక్ట్ చేసికుని, పక్కకు పెట్టారు. ఇంక మా మరదలైతే " అక్కయ్య గారూ, మీరు కూడా ఒకటి సెలెక్ట్ చేసికోండి, ఇంత దూరం వచ్చి,పైగా పెళ్ళయి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భం లో తీపి గుర్తుగా ఉంటుందీ వగైరా..వగైరా...." అని మొదలెట్టింది. ఇవన్నీ విని,మా శ్రీవారైతే తనకేమీ పట్టనట్టుగా, ఏదో పనున్నట్టుగా ఆ ఇంటి పెరట్లోకి వెళ్ళి, ఫొటోలు తీసికోడం లో బిజీ అయిపోయారు. నాకూ అనిపించింది ఔను కదూ అని. అప్పటికీ మరదలూ మరిదీ బట్టలు పెట్టారు. తణుకులో అమ్మ ఓ చీర ( ఉప్పాడ దే), హైదరాబాద్ లో మా వియ్యాలారు ఓ చీర పెట్టారు. మళ్ళీ ఇంకో చీర అంటే, ఆయన గయ్యి మంటారేమో, దుకాణం ఏమైనా పెడతావా అంటారేమో అని భయం, పైగా మా " అన్యోన్య దాంపత్య" ఇమేజ్ కి భంగం రాదూ మరి, అయినా ధైర్యం చేసేసి, పెరట్లో బిజీగా ఉన్న ఆయన దగ్గరకి వెళ్ళి మెల్లిగా మొదలెట్టాను." పోనీ మీరు కూడా ఒకటి తీసికోకూడదూ, మళ్ళీ ఇంత దూరం వస్తామా ఏమిటీ, మీకు నచ్చిందేదో తీసికోండి. ..: అక్కడికేదో ఈ నలభై సంవత్సరాలూ నాకు నచ్చింది తీసికున్నట్టు!! ఒక్కసారంటే ఒక్కసారైనా, నన్ను సెలెక్ట్ చేసికోనివ్వ లేదు. ఆ ముహూర్తం ఎప్పుడొస్తుందో ఏమో... ఏ మూడ్ లో ఉన్నారో ఏమో, మొత్తానికి తనూ ఓ చీర సెలెక్ట్ చేశారు. ఖరీదు తరువాత తెలిసింది నాలుగు వేలుట. అయిదున్నరదీ, నాలుక్కిచ్చాడు. అదండీ మా ఉప్పాడ ట్రిప్పు.

   అదేం చిత్రమో మేమిద్దరం కలిసి, 2004 లో దక్షిణ దేశ యాత్రకి వెళ్ళి వచ్చిన ప్రదేశాలన్నీ, సునామీ లో కొట్టుకుపోయాయి. ఈసారి ఉప్పాడ వెళ్ళామో లేదో, మొన్నెప్పుడో వచ్చిన భూకంపాల ధర్మమా అని, మేము వెళ్ళిన ఉప్పాడ లో కూడా సముద్రం అలలు, చాలా హడావిడి చేశాయిట. ఏమిటో పాద మహిమ !!

Sandwich జనరేషన్....

   ఈమధ్య ఆంధ్రా వెళ్ళి రావడంతో చుట్టాలు స్నేహితులుని కలవడం జరిగింది. కష్టం, సుఖం , మంచి చెడ్డ అన్ని మాట్లాడుకున్న తరువాత నాలో కలిగిన ఆలోచనాస్రవంతి అనుకోండీ భావావేశం అనుకున్నా సరే , అర్దం చేసుకునే ప్రయత్నం చేయండి.

    కొత్తనీరు వస్తుంది, పాతనీరు కొట్టుకుపోతుంది. ఎల్.సి.డి. టి. వి. లు వచ్చి పాత "సోని" రంగుల టి.వి. లు కొట్టుకుపోయాయి.నలుపు తెలుపు ఫొటొల ఆల్బమ్స్ అటకెక్కాయి,పిల్లల చిన్నప్పటి కలరు ఫొటొలు కింద గూళ్ళల్లో సర్దుకున్నాయి.వ్యాసపీఠాలమీద పెట్టి చూడవసినంత పెద్ద సైజులో ఆల్బమ్స్ వచ్చాయి.మొబైల్ ఫొటొలు, డిజిటల్ ఫొటొలు వచ్చాయి.జీవం వుట్టి పడే బ్లాక్ అండ్ వైట్ ఫొటొలు ,ఆ జ్ఞాపకాలు అందుబాటు లో లేకుండా ఇప్పటి ఫోటొలు చూసి ఏ బ్యూటీషన్ దగ్గర మేకప్ చేయించుకున్నదీ, ఎవరు ఏపట్టుచీర కట్టారు?అరే! మళ్ళీ అదే రిపీట్ చేసారే? ఇదీ తంతు---

   అడ్మినిస్ట్రేషను మారింది.పాతపని వాళ్ళ జాగాలొ కొత్త పని వాళ్ళు వచ్చారు..నడిమింటి వాలు కుర్చీ వసారా లాంటి బాల్కనీలో చేరింది.ఇంటి యజమాని పడక మాస్టర్ బెడ్ రూమ్ నుండి గెస్టు రూమ్ కి మారింది.అభిమాన రచయితల , రచయిత్రుల పుస్తకాలు పెద్ద అల్మారులో ఏటవాలుగా ఎప్పుడు ఏది కావాలంటే అది తీసుకునే వీలుగా, విశాలంగా వుండేవి, కుదురుగా కింద అరనుండి పై అరకు అంటుకునేలా కుదుమట్టంగా చీమ దూరే సందు లేకుండా పొరబాటున బ్రహ్మ కూడా ఒక్క పుస్తకం తీయలేని విధంగా సర్దుకుంటే గొంతు నొక్కేసినట్లుగా వుండదూ?--

   ఎంతో మక్కువ తో అల్లిన స్వెట్టర్లు, ఎంబ్రాయిడరీ చేసిన దుప్పట్లు, కుషన్ కవర్లు దాన ధర్మాలకి అదేనండి అనాధాశ్రమాలకి వెళ్ళిపోయి, అత్తగారిచ్చిన ఇత్తడి సామాను అటకెక్కిన ఆల్బమ్స్ కి జత చేరిపోతే, ఆటయినా , డ్రాయింగైనా, పైంటింగైనా, ఏదయినా ఒకటి పూర్తి చెసి మరోకటి మొదలుపెట్టాలమ్మా అంతే,కాని అదోసారి ఇదోసారి చేస్తే అన్ని అసంపూర్తిగానే వుంటాయమ్మా, ఆ పనయిన తరువాత అవన్ని మళ్ళి వాటి జాగాలో పెట్టేసుకోవాలమ్మా,అనిచెప్పే పెద్దావిడకి, " అలా చెబితే పిల్లల్లో ఆసక్తి, క్రియేటివిటీ తగ్గిపోతాయి, మీరు చెప్పే మాటలు, పాటలు, కధలు అన్ని పాతచింతకాయ లాంటివి , " ఆపిల్ల తల్లి మాటలు వినేసరికి ఇంకో రెండుబ్లడ్ ప్రెషర్ మాత్రలు వేసుకునే పరిస్థితి.---

   కందకి ,కాందాకి ( ఉల్లిపాయ) తేడా తెలియని పిల్లలకి పప్పు , కూర వేసి పెరుగు వేసి ఇంటి భోజనానికి దూరం చేసి, పిజ్జాలు , బర్గర్లు, కురుకురెలు, ఫాస్టు ఫుడ్ లు అలవాటు చేసి , అడిగినవన్ని యిచ్చి, " లేదు, కాదు, వద్దు" అనే పదాలకి అర్దంకూడా తెలియకుండాపెంచితే రేపు జీవితంలో ఆటూ, పోటూ తట్టుకొని, ఎలా బతుకుతారు? ఇంకొకరితో షేరు చేసుకోవడమన్నదే తెలియటం లేదు, చిన్నప్పుడు చిన్నవి, పెద్దయిన తరువాత పెద్దవీ అన్నీ అడిగినవీ యివ్వగలమా? ---

   మరొకటి,కొత్తగా ఇంట్లోకొచ్చినామెకు ఇంట్లో సరుకులన్ని పాత గానే కనిపిస్తాయి.పాత మంచాలు, పాతఫ్రిజ్, పాత ఓవెన్, పాత వాషింగ్ మెషీన్, అని కొత్త పాటమొదలవుతుంది.ఈ పాత వస్తువులే కొత్తాలో కొనేందుకు , వచ్చిపోయే బంధువులతో, పిల్లలకు లోటు లేకుండా పంచవర్ష ప్రణాళికల బడ్జెట్ తో పొదుపు చేసి కొనుక్కునేసరికి తాతలు దిగిరాలేదు కాని వీళ్ళు మాత్రం తాత లయిపోయిన, వారి అవస్థ ఎవరికి అర్ధం అవుతుంది?అంత శ్రమ పడి కొనుక్కున వస్తువులు చలనం వచ్చి మారి పోతూంటే చేసేదేమీ లేక చేతులు ముడుచుకు కూర్చొని ఎంత ఉక్కిరి బిక్కిరయిపోతున్నారో ---

   మారిన కాలంలో మారని తరం మనుష్యులు మనుమలు , మనవరాండ్ర మైకంలో పడి వారికి, వారి తల్లితండ్రులకి మధ్యలో నలిగి సతమతమయే శాండివిచ్ జనరేషను మాయలోబడి, " మేమూ మారామనే" నటిస్తారు. మరువలేకపోతే మసకబారిన కళ్ళకు " కళ్ళద్దాలు" తుడిచి పెట్టుకుంటారు.అయినా లాభం లేకపోతే పవరు పెరిగిందని సర్దుకుంటారు. ---

   " కొత్త నీటి వరదకి దారిచ్చి ,పాతనీరు పక్క నుండైనా ముందుకి సాగిపోవాలి ". తప్పదు. లేకుంటే " పాచి " పేరుకుపోయే ప్రమాదముంటుంది.---- ఎవరి పెన్షన్లమీద వారు బ్రతుకుతున్నవారి పరిస్థితే ఇలా ఉంటే, ఆర్ధికంగా పిల్లలమీదే ఆధార పడ్డవారి జీవితాల గురించి ఊహించడానికే భయం గా ఉంది.

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes