RSS

వచ్చీరాని మాట వరాల మూట.. వచ్చీరాని మాటలు ఊరీ ఊరని ఊరగాయ రుచి..

    ఈవేళ అంతా బిజీ బిజీ.. మా శ్రీవారి చుట్టాలొకరు ముంబై నుంచి ఫోను చేసి, ఈవేళ, మా ఇంటికి వస్తామన్నారు. చుట్టరికం ఏమిటంటే, మా శ్రీవారి, పెదనాన్నగారి, మనవరాలు, అంటే మాకు మేనకోడలన్నమాట! ఆవిడ తన అన్నగారి ( మా శ్రీవారి మేనల్లుడు) కూతురిని, ఇక్కడ భారతీ విద్యా భవన్ లో పై చదువులకి చేర్పించే సందర్భం లో, వదినగారినీ, మేనకోడలునీ తీసికొచ్చారు. ఏమిటో అంతా కన్ఫ్యూజింగు గా ఉంది కదూ! నాకూ అంతేలెండి. అప్పుడప్పుడు ఫోన్లలో పలకరింపులే కానీ, ఎప్పుడైనా వీళ్ళ చుట్టాలని కలిసిందే లేదు. కానీ అదేమిటో ఈ మధ్యన మా శ్రీవారి చుట్టాల పిల్లలు, ఉద్యోగ రీత్యానో, చదువు నిమిత్తమో పూణె వస్తున్నారు. పూణె అనేటప్పటికి ఈయన గుర్తొచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా, గత సంవత్సరంలోనూ, మా వారి చుట్టాలు చాలామందే వచ్చారు. ఇదీ బాగానే ఉందిలెండి, కనీసం ఇన్నేళ్ళకి చుట్టాల పరిచయం అవుతోంది.

    అలా వచ్చినవారిలో ఈవేళ వచ్చినవాళ్ళన్నమాట.ఈయన దారిన ఈయన బయటకెళ్ళిపోతే, మళ్ళీ నాకు కష్టం అవుతుందని, బయటకు వెళ్ళొద్దన్నాను ఈవేళ్టికి. అదృష్టం బాగుండి ఒప్పుకున్నారు. ఆ వచ్చేవాళ్ళు భోజనానికే వస్తారో, లేదా ఊరికే చూసేసి కబుర్లు చెప్పి వెళ్ళిపోతారో, ఎంత సేపుంటారో అన్నీ సందేహాలే. "నీకు ప్రతీ దానికీ అనుమానాలే... అనుమానం ముందు పుట్టి తరువాత నువ్వు పుట్టుంటావు..", అని ప్రతీసారీ చివాట్లుతింటూంటాను!ఏమిటో కొంతమంది జాతకాలు అలాగే ఉంటాయేమో! అయినా... అనుమానం అంటారు కానీ, విషయమేదో తెలుసుకోవద్దూ.. భోజనానికైతే ఒకలాగా, టిఫినీ కే అయితే ఇంకోలాగా సిధ్ధంగా ఉండొద్దూ, లేకపోతే రేపు మనవాళ్ళందరిలోనూ ఫణి పెళ్ళాం ఇలాగా అని యాగీ చేసేయరూ? ఇలాటివన్నీ ఈ మొగాళ్ళకి అర్ధం అవదూ, చెప్తే అర్ధం చేసికోరూ, ఏమిటో వెళ్ళిపోతున్నాయి జీవితాలు...

    ఆ వచ్చేవారి పిల్లతో ఫోనులో మాట్టాడుతూ, మొత్తానికి మూడింటికి, ఈయన కిందకు వెళ్ళి, వాళ్ళని పట్టుకుని ఇంటికి తీసికొచ్చారు. ఒకళ్ళ మొహం ఇంకోరికి తెలియదూ, అయినా ఎలా గుర్తుపడతారో ఆ భగవంతుడికే తెలియాలి. ఎప్పుడైనా, ఒకళ్ళనుకుని ఇంకోళ్ళని తెచ్చేస్తారేమో అని నాకు ఎప్పుడూ భయమే! ( మళ్ళీ చివాట్లు....).

   ఆ మాటా ఈమాటా చెప్పుకుంటూంటే చివరకు తేలిందేమిటంటే ఆ మేనకోడలు మా ఊరి మాస్టారి కోడలే అని ! టిఫిన్లూ, పెద్దవాళ్ళయినందుకు, కాళ్ళకి దండాలు పెట్టించుకుని ఓ గంటన్నర కబుర్లు చెప్పుకున్నాము. మా అతిథ్యం నచ్చిందా పునర్దర్శనం లేదా అంతే....వాళ్ళని పంపేసి, పైకి వచ్చి, మెయిల్ చెక్ చేసికుంటే, మా చిన్ననాటి స్నేహితురాలి దగ్గరనుంచి మెయిలూ..

    తన రోజులు బాగుండక, మొన్నెప్పుడో మా వారికి ఓ మెయిల్ పంపింది, ఇంక చూసుకోవాలి, దొరక్క దొరక ఓ శిష్యురాలు దొరికింది కదా అని, తనని హడలు కొట్టేస్తూ, "తెలుగులో వ్రాస్తే కానీ నేను జవాబివ్వనూ.." అంటూ, తెలుగులో ఎలా టైపు చేయాలో అన్నీ, వివరంగా వ్రాశారు. ఇద్దరు పిల్లల తల్లీ, ఒక మనవరాలికీ, ఓ మనవడికీ నానమ్మ అయిన తను పాపం, ఈ వయస్సులో ఇదేమి గొడవరా బాబూ అని అనుకోకుండా, మొత్తానికి ఛాలెంజి ఒప్పుకుంది.

   వచ్చీరాని మాటలతో ( మరి మొదటిసారి కంప్యూటరులో తెలుగులో టైపు చేయాలంటే మరి అలాగే ఉంటుందిగా!), ఓ కవితే వ్రాసి పంపించేసింది...

   కవితలు వ్రాయాలన్నా, కథలు వ్రాయాలన్నా ఉండాలి మనసు..కావాలి ప్రేరణ..

   చూడగలిగిన మనస్సుంటే ప్రపంచమే ఒక పాఠశాల.. ప్రకృతియే ఒక గురువు

   అనుభవాలే పాఠాలు..అందరి కష్టం నీదనుకుంటే ఆ బాధ ఇస్తుంది ప్రేరణ..

   అందరి సుఖమూ కోరుకుంటే ఆ ఆనందం పరిపూర్ణం...

   అదే దేవుని దయకు మూలం....

    వచ్చీరాని మాట వరహాలమూట ! వచ్చీరాని మాటలు ఊరీ ఊరని ఊరగాయ రుచి లా... అన్నట్టుగా, వైద్యవృత్తిలో రాణించినట్టుగా, ఇందులో కూడా రాణించాలని కోరుకుంటున్నాను....చిన్నప్పటినుంచీ, తనకు కవితలు వ్రాయడం అలవాటు ఉందనుకోండి, కానీ, కాగితం మీద పెన్నుతో వ్రాయడానికే సీమిత్.. కానీ ఈ నవీనయుగంలో పుస్తకాలూ పెన్నులూ ఎవరిక్కావాలి? అంతా అంతర్జాలమే గా...

మరో యశోద....

     కృష్ణ! కృష్ణా! పేరులోనే ఎంత మధురం, కన్నయ్య! కమనీయమైన నామం, కన్నాయ్యా, కిట్టయ్యా! తలచుకుంటేనే భక్తి సరే, సరి. కన్నతల్లులకి కడుపులో పేగు తెంచుకొని పుట్టిన కన్నబిడ్డ పసిరూపం కళ్ళముందు కనిపిస్తుంది. ప్రతి తల్లికి తన బిడ్డ ఓ చిన్ని కృష్ణయ్యె. తను ఓ యశొదే. ఈ భావం అందరికి వుంటుందనే నా భావం. కృష్ణా లాలీ గోకులకృష్ణా లాలీ తామరసనయనా సత్యా కృష్ణా లాలీ-- కృష్ణాలాలీ నందుని కృష్ణా లాలీ-- యశోదమ్మ నోములపంట కృష్ణ లాలీ-- పాడుతూ లాల పోసి అంగరక్ష పెట్టి అద్దాల తొట్టిలో పడుకోబెట్టి పవళింప చేసే ప్రతి తల్లి తనని ఓ యశొదగా, తన బిడ్డని చిన్ని కిట్టయ్య గా భావిస్తూవుంటుంది .కొంచెం పెద్దయిన బిడ్డని కాళ్ళ మిద కూర్చొబెట్టుకొని " తారంగం! తారంగం ! తాండవ కృష్ణ తారంగం" అంటూ చిన్ని కృష్ణుని పాటలు,పద్యాలతో అలరారిస్తుంది.ఆ బాలుడు కూడా ముద్దుగా, మురిపెంగా , అల్లరి ఆటలతో , ఆటల అల్లరితో కృష్ణ లీలలు వింటూ పెరుగుతాడు.అంతేకాదు వాడికి చిని కృష్ణుడి వేషం వేసి " తలలో పూవులు, మెడలో పూసలు" అంటూ పద్యాలతో చదువులో పెడుతుంది. అలా చదువులో ముందుకు సాగుతూ ముద్దుల బాల కృష్ణుడు కాలేజికి వచ్చేసరికి గోపికా కృష్ణుడుగా ఎదుగుతాడు.తల్లి ఆలనా పాలనలో దారి తప్పకుండా ఉద్యోగస్తుడవుతాడు.దేవుడు కృష్ణుడు ఎన్నివివాహాలు చేసుకున్నా వెర్రితల్లి యశొద దగ్గరలేకపోయింది, పాపం. కాని" యశోద" గా భావించే ఈ తల్లి మాత్రం తనకి వున్నంతలో అంగరంగ వైభవంగా కొడుక్కి పెళ్ళి చేస్తుంది.

     " మీరజాల గలడా, నా ఆనతీ" అంటూ ఓ "సత్య" కొడుకు జీవితంలో ప్రవేసిస్తుంది. ఆ కొడుకు కూడా " మీరజాలడు". కాని కొద్ది రోజులకి ఆ " సత్య" కి తన వివాహ శుభలేఖ లోని " జానక్యాః కమలామలాంజలి పుటేయః..." శ్లోకం గుర్తుకు తెచ్చుకొని తను " సత్యధారణ" పక్కన పెట్టి సీతగా భావించుకొని, తన భర్త ని కృష్ణుని నుండి శ్రీరామునిగా మార్చుకుంటుంది. "ఒక్క భార్య, ఒక్క మాట" పంధాలో తన మాటే, అతని మాటగా, తన నోరే అతని నోరుగా, తన కళ్ళే అతని కళ్లుగా, తన చెవులే అతని చెవులుగా, అంతా ఒక్కటే! మనుషులు వేరు కాని మనసు ఒకటే!అంతలా మార్చేసుకుంటుంది. త్వమేహం!

     అతను కృష్ణ మాయలొ నుండి బయటపడి రాముని ధారణ లో పడగానే,తల్లితండ్రులు మీద అనురాగం పెరుగుతుంది. వారి అలన పాలనలో శ్రద్ద పెరుగుతుంది.ఆ తల్లి, నా బిడ్డ కృష్ణుడే కాదూ, రాముడు కూడానూ, అనుకొని మురిసిపోతుంది. ఎక్కడో "ట్రాక్" తప్పుతోందే అని " సత్య సీత" ఆలోచనలో పడుతుంది. ఇంతలో పంట పండుతుంది." సత్య సీత" "యశోదగా" మారుతుంది.తన ఒడిలోని చిన్ని కృష్ణుడ్ని చూసుకొని మురిసిపోతూ "జో! జో! లాలీ" అని పాడుతూ, రాముని పాత్రలో ఒదిగిపోతున్న భర్తకి తండ్రి బాధ్యత గుర్తు చేస్తుంది. " అన్నింటి కంటె, అందరికంటె బిడ్డ భవిష్యత్తు ముఖ్యమని ముందు దారి చూపెడుతుంది.అంతే! మేమిద్దరం మాకొ బిడ్డ. ఇదే మా ఫ్యామిలీ. అనుకుంటారు. కొద్ది కాలానికి ముద్దు కృష్ణుడు బాల కృష్ణుడుగా, గోపికా కృష్ణుడుగా మారుతాడు.చదువు పూర్తయి ఉద్యోగస్తుడవుతాడు. " మరో సత్య" ఆగమనం. చరిత్ర పునారావృతం. అర్దంకాని అయోమయ స్థితిలో

    " హరే రామా! హరే!కృష్ణ! కృష్ణ! కృష్ణ! హరే!హరే!.."అని తల పట్టుకుంటే, పెద్ద యశోద పరిస్థితి అర్దం చేసుకొని పార్టీ మార్చేసిన రాజకీయవాదిలా హరి హరులకు బేధం లేదంటూ " ఏమి సేతురా! లింగా! ఏమి సేతురా!అని పాడుకుంటుంది.ఆమె అడుగుజాడల్లో మరో యశొద, మరో సత్య, మరో యశొద... అది అంతే!

    అన్నట్టు కిందటి సారి టపా లో రాసిన పాట అంటే నాకు చాలా యిష్టం. మీరు కూడా వినండి! చాలా బాగుంటుంది.

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes