RSS

ఏదైనా selective గా గుర్తుంచుకోడంలో....

    అప్పుడెప్పుడో మా శ్రీవారు ఓ టపా వ్రాశారు.అదేమీ, పేద్ద గుర్తుంచుకోవలసినది కాదనుకోండి, ఏదో సందర్భం వచ్చింది కదా అని చెప్పాను. వారికి ఏమేమి మర్చిపోవాలో, ఏమేమి మర్చిపోతే గొడవొస్తుందో అన్నీ తెలుసు. పోనిద్దూ దీనితో ఏమిటీ లే అనేసికుని కాలక్షేపం చేసేస్తూంటారు. మా అమ్మమ్మగారు( అత్తగారు) ఉన్నప్పుడు చూసేనుగా వీళ్ళిద్దరి సంభాషణానూ, ఒకర్ని మించివారు ఇంకోరు.అవసరంలేనివి విననట్టు మొహం పెట్టేయడం. ఈరోజుల్లో సెల్ ఫోన్లలో చూస్తూంటాము- ఏదో కొద్దిగా ఇబ్బందికలిగించే మాట వినాల్సొచ్చినప్పుడు, హల్లో..హల్లో.. అని అరవడం, అక్కడికేదో కనెక్టివిటీ పోయినట్టు.. అలా అన్నమాట.

    నేనెప్పుడైనా నా బ్రేక్ ఫాస్టులో తినే ఓట్సూ, నానపెట్టిన పెసలూ తెమ్మని నాలుగురోజులముందునుంచీ మొత్తుకుంటున్నాసరే, ఆయనకి మాత్రం గుర్తుండదు. చివరకి ఎప్పుడో గుర్తురావడం ఆయన దయా, నా ప్రాప్తీ అని ఊరుకోడమూనూ. పేపర్ల రద్దీ ఎక్కువైపోతోందీ, తీసేయకూడదా అని అడిగితే తప్పు.ఓసారి ఇల్లుసద్దండీ అంటే చిరాకూ. నాకేమైనా పనిమనిషా ఏమిటీ, అన్నీ నేనే చేసుకోవాలి, చీపురు దగ్గరనుంచి, తడిగుడ్డదాకా. మొన్నెప్పుడో ట్యూబు లైటు పాడైపోతే కొత్తది తెచ్చివేయండీ అంటే, పైగూట్లో ఉన్నాయని, ఓ కుర్చీ వేసికుని దాన్ని తీసి, ఏదో పెడదామని ప్రయత్నిస్తే అది కుదురుతుందా, పట్టలేదు. పోనీ వాడెవడినో పిలిచి వేయించొచ్చుగా అలా కుదరదూ, ఈమాత్రం దానికి వాణ్ణెవణ్ణో పిలవడం ఎందుకూ అనడం. ఏదో వయస్సులో ఉన్నప్పుడు చేశామని జీవితాంతం చేయాలంటే కుదురుతుందా, మొత్తానికి నిన్న అబ్బాయి వచ్చినప్పుడు, తనని అడిగితే క్షణంలో చేసేశాడు. ఈ మూడురోజులూ అదేదో బల్బుట, వెలుగంటే ఉంది, కానీ నాకు వంట చేసేటప్పుడు కనిపించొద్దూ? ఏ పోపో వేసేటప్పుడు, ఒకదానికి బదులు ఇంకోటేదో వేస్తానేమో అని భయం! ఇలా వెళ్తోందండి కాపరం.

    నిన్న అదేదో పేపర్లో చూశారుట, తెలుగు పుస్తకాల లింకులు ఏవో చూశారుట. దాంట్లోని ఓ లింకు.స్త్రీల పాటలు అని ఒకటి చూశాను.చాలా బావుందిలెండి. చిన్నప్పుడు మన అమ్మమ్మలూ వాళ్ళూ పాడుకునే పాటలు చాలానే ఉన్నాయి. మా అమ్మకి ఇలాటివి పాడుకునే తీరిక ఉండేది కాదు, కారణం తను ఓ టీచరు. పిల్లలపాఠాలతోనే తీరికుండేది కాదు, ఇంకా పాటలుకూడానా? అదే పుస్తకంలో ఆడవారు చేసికునే వ్రతాలూ, నోములూ(37దాకా) గురించికూడా చాలానే ఉన్నాయి.అందులో ఆ నోముల కథలూ, ఉద్యాపనలూ చదవడం అంటే నాకెంతో ఇష్టం. ఆ కథలు బాగా ఉంటాయి.చిన్నప్పుడు మా అమ్మమ్మ అనేది- " దీనికి అలాటి పుస్తకాలు ఇవ్వకమ్మోయ్, ఏదో నోమంటుంది, దానికి ఉద్యాపన చేయకపోతే పాపం కూడానూ.." చివరకి నేను జీవితంలో చేసినవి శ్రావణ మంగళవారాలూ, పోలాలమావాశ్య పూజానూ. ఈ లింకులోవి చదివినతరువాత తెలిసింది, ఎందుకు ఆ పుస్తకాలు ముట్టుకోనిచ్చేవారు కాదో అని !

    మా మరదలు ( తమ్ముడి భార్య)కి ఎంత ఇష్టమో ఈ నోములుచేసికోడం అంటే, ఏదో ఒక నోము చేసేసికోడమూ, వేసంగి శలవలకు ఇటువైపు వచ్చినప్పుడు ఉద్యాపన చేసేసికోడమూనూ. అందుకే అంటారు దేనికైనా పెట్టిపుట్టాలీ అని !

    మాశ్రీవారి సంగతికదూ మొదలెట్టిందీ, చెప్పానుగా శ్రీ చాగంటివారి ప్రవచనాలు వినడం ఓ దినచర్య. శనాదివారాలు టివీలో లేవని, నెట్ లో పెట్టుకుని మరీ వింటారు. పోనీ ఆయన చెప్పేవన్నీ ఆచరిస్తారా అంటే అది లేదు. ఈవేళ "మా" టీవీ లో దాశరధీశతకం గురించి వివరిస్తూ,మగాళ్ళు స్నానం చేసిన తరువాత, ఎవరి తడితువ్వాలు వాళ్ళు పిండుకోకూడదుట.పని మనిషి చేస్తే ఐశ్వర్యం ఉంటుందీ, కానీ అనారోగ్యం ఉండదూ అనేందుకు అవకాశం లేదూ. భార్యచేస్తేనే ఇంటికి అదృష్టం ట తమంతట తాము చేస్తే, అరిష్టమూ, ఆయుక్షీణమూట.ఇంట్లో పనిమనిషి ఎలాగూ లేదు, మిగిలిందెవరూ? శ్రీ చాగంటి వారు అంటూంటారు.. " ఇది మాత్రం మీరు బాగా పట్టుకోవాలి.." అని. ఇలాటివి పట్టుకోడంలో మాత్రం మా శ్రీవారు.." సరిలేరు నీకెవ్వరూ.."అంటూ పాడదగ్గవారు...

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes