RSS

కాకమ్మ కథలు...

   ఉష్..కాకి....."కాకెత్తుకుపోయింది చూడు..నా చేతులోవుందా, లేదుకదూ.. అంటూ, మారాం చేసే పసిపాపని మాయమాటలతొ మరపించి, ఇవ్వకూడదన్నదాన్ని దాచేస్తాం! అవునా! ఉత్తపుణ్యానికి కాకిని దొంగ చేసేస్తాం..

   చెట్టుమీదుండే కాకి, కిందవుండే పామునుండి రక్షించేందుకని రాణి గారి హారాన్ని పుట్టలో పడేసి, రాజభటులద్వారా పుట్టని తవ్వించి, పాముని చంపించిన కథ చెప్పి,కాకిని తెలివైన "హీరో" చేసేస్తాము. కోకిలకి కూ..కూ.. అంటూ పాడడమే కాని,గుడ్డు పొదగడం రాదని, కాకి గూట్లో పెట్టి, కాకి పొదిగిన తరువాత, కోకిల ఆ పిల్లలని తరిమేస్తాయని అంటాము కానీ,కాకి తెలివితక్కువదంటామా?

   రామాయణం లో కాకిపై బ్రహ్మాస్త్రం సంధించి, చివరకు రాముడే ఒక కన్ను తన అస్త్రానికి బలి తీసికుని, అప్పటినుండీ, కాకికి ఒకే కన్ను ఉండేలా చేశాడంటారు.దాన్ని ఆసరా చేసికునే, అది ఏ పక్కకి చూస్తుందో తెలియకుండా, దృష్టి తిప్పేస్తుంది. నేతిగిన్నెలు, చంచాలు లాటివి చక్కగా ముక్కుతో పట్టుకుతీసుకుపోతూంటాయి. ఊరకాకులు, బొంతకాకులు,నీటికాకులు అలా ఎన్నిరకాల కాకులున్నా, "తెల్లకాకి" లేకపోయినా,అందరిదీ ఒక్కమాటగా ఉండి,ఏ ఒక్కరిదో లేకపోయినా, వారిని "తెల్ల కాకి" చేసేస్తాం.

   మనం కాకి ని ఎంతగా ఉపయోగించుకుంటున్నామో చూడండి...--

   " కాకి ముక్కుకు దొండపండు"

   " కాకితో కబురు పెడితే వచ్చేవాళ్ళం కదా, మీరు పని కట్టుకు రావాలా"

   "ఏమిటో? గంగలో మునిగితే మాత్రం కాకి రంగు మారుతుందా?"

   " కాకిలా కలకాలం బతికేబదులు, హంసలా ఆరునెలలు బతికితే చాలుకదా"-- అంటాము.

   గోముఖుడి కథ తెలుసుకదా...

   " కలకాలం బ్రతకాలని బ్రహ్మని, శివుడినీ కాకుండా యమధర్మరాజు కోసం తపస్సు చేసి, ఆయన ప్రత్యక్షం అయిన తరువాత, అందరికీ ఒక్కసారే కనిపిస్తావు కదా, అలాగే నాకూనూ, ఇంక నాకు కనుపించకని, తెలివిగా కోరుకుంటాడు. ఆయన సమవర్తి కదా, సరే అని వరమిచ్చి,వెళ్ళిపోతాడు.తరాలు తరాలు గడిచినా, విన్నవే విని, చేసినవే చేసి, " చావు" రాక విసిగిపోతాడు. చివరకి మాండవ మునికి అతిథి సత్కారాలు చేసి, తన బాధ చెప్పుకోగా, ఆయన చిరునవ్వుతో, " చావు లేకుండా ఉండాలనుకునేవారికి, నీ జీవితం ఒక సమాధానం" అని చెప్పి, " ఈ రూపంలో మృత్యువు నీదగ్గరకి రాదు, నిన్ను ఓ పక్షి రూపంలోకి మారుస్తాను, ఎంత తిన్నా, ఎలా తిన్నా, లేచినదగ్గరనుంచి తింటూ, ముసలితనం లేకుండా,' కావు.. కావు..' అని అరుస్తూ, మృత్యువుని పిలుస్తూ ఉండు. ఎప్పటికో యమధర్మరాజు అనుగ్రహిస్తాడు.." అంతే గోముఖుడు కాకి రూపం లోకి మారిపోగా,ఈసడించిన బంధువులు అయ్యో..అయ్యో..అని ఏడవగా, ఆ బంధువుల్ని చూసుకుని మురిసిపోయి, ఆబ్దీకాల్లో సమర్పించే పిండాలని తింటూ, పితృ ధర్మం సరీగ్గా నిర్వర్తించకపోతే ముట్టకుండా,వారి తప్పిదం తెలుసుకుని, దండం పెట్టుకున్న తరువాత ముట్టుకోవడమనే మహత్కార్యం చేసి, మానవులకి పితృధర్మపాలనకి తోడ్పాటు చేసింది మళ్ళీ ఈ కాకే కదా..

   " మరీచి కొడుకైన కశ్యపుని సంతానంలో కాకి ఒకటని అంటారు. కాశిరాజు కూతురు కళావతి పవిత్ర. కాని భర్త ( మధుర రాజు) దాశార్హుడు పాపి. ఆమె తన భర్తని "గర్గ మహర్షి" దగ్గరకి తీసుకువెళ్ళి పరిష్కారం కోరగా , ఆయన ఒక పవిత్ర కొలనులో స్నానమాడమని చెప్పగా , రాజు కొలనులో స్నానం చేయగా అతని పాపాలన్నీ కాకుల రూపం లో ఎగిరిపోయాయంటారు. అందువల్ల కాకులు పాపానికి ప్రతీకులంటారు. ఏమిటో మరి.

   " కాకిపిల్ల కాకికి ముద్దే అన్నా, రాబోయే చుట్టాలకు సంకేతంగా మన గుమ్మంలో అదేపనిగా అరిచి తెలియబరచేది కాకేను. కోపం వస్తే " ముక్కలు ముక్కలుగా కోసి కాకులకు, గద్దలకు వేస్తానన్న", " కాకి పిల్లకు ఏం తెలుసు ఉండేలు దెబ్బ" అంటే పెద్ద కాకికి తెలుసన్నమాటే కదా!. మా మనవడికి కాకి కధ చెబితే తిరిగి నాకు వాడికి తెలిసిన భాషల్లో తిరిగి చెబుతాడు. " నానమ్మా, నానమ్మా, " " క్రో" కి దాహం వేసింది." పానీ కావాలి. ఎక్కడా లేవు. " ఇదర్ దేఖా, ఉదర్ దేఖా, ఒక " ట్రీ" కింద " పాట్" వుంది. "పానీ" కింద వున్నాయి.కింద పక్కన చిన్న " పత్తర్" వున్నాయి. అవి "పాట్" లో వేసింది. "పత్తర్ నీచె గయా! పానీ ఊ..ఉ...ఉప్పర్ ఆయా! , ఔర్ పానీ పీ లియా! హవా మే ఉడ్ గయా" హై నా ,ఇప్పుడు నువ్వు చెప్పు. మళ్ళీ మొదలు----

   ఇదిగో వాడివల్ల ఈ కాకి కధలు.చిన్నతనం గుర్తులు.

   " కాకి ముచ్చు బంగారం" సిగరెట్ పెట్టెలో పేపరు. వాటి కోసం కిళ్ళి షాపుల చుట్టూ తిరగడం పెద్దవాళ్ళ్తో తో చివాట్లు. "కనుమ నాడు రేగి పండు నెత్తిన పెట్టుకొని స్నానంచేస్తూ కళ్ళు మూసుకొని , కాకిని తలచుకొని నలుపు రంగు నువ్వు తీసుకొని నన్ను తెల్లగా చేయమని శ్రద్దగా ప్రార్ధన చేస్తూ బతిమాలుకొవడం, అన్నింటికంటే నెలనెలాదూరంగా కూర్చునే అమ్మని అలా ఎందుకని అడిగితే కాకి ముట్టుకుందని చెప్పింది. ఓ సారి ఆడుకుంటూంటే కాకి తగిలింది. అంతే, మా మావయ్యకి చెప్పి చాపయివ్వు, చెంబు యివ్వు.నేను కూర్చోవాలి. అని భోరున ఏడుపు. ( మా అమ్మ గారు ఉద్యోగం వల్ల నన్ను చూసెందుకు మా పిన్ని ఓ వారం మామావయ్యకి ఓ వారం డ్యూటి ) నా గొడవ భరించలేక మా మావయ్య, అరె! ఇప్పుడే ",ఓకాకి నాతో చెప్పివెళ్ళింది. చిన్నపాప కదా! బట్టలు మార్చుకొని లోపలకు వచ్చేయొచ్చు",నే చెప్పినట్ట్లు చేయకపోతే నీ నలుపు రంగు తను తీసుకోదట అని చెప్పి ఊరుకోబెట్టడం ఎప్పటి గుర్తుతోనూ---

   ఇప్పుడేమో మాసొసైటీ లో వాళ్ళు రంగు వేసుకోని నాతలచూసి "దాదీ" అనరుకాని " దీదీ" అనలేక మధ్యస్తంగా " కాకీ " ( మరాఠీలో పిన్ని) అని పిలుస్తారు. " కనుమ నాడు కాకైనా కదలదు అంటారు. కాకి గాలి తగిలితే తొందరలో చావు వస్తుందని కొంతమంది అంటూటారు.అది తెలీదు కాని మా అత్తగారు పోయినపుడు ఆయన విధి చేసేందుకు నదీ తీరం వెళ్ళేవారు.ఆ పది రోజులు మడిగా ఓ చిన్న పిడచటెరస్ మీద కాకి కోసం పెట్టమనేవారు.ఆ తరువాత మార్నింగ్ వాక్ కి టెరస్ మీదకి వెడితే నన్ను తగులుతూ ఒకటి రెండు సార్లు నాతలమీద ఎగరటం చూసి కొన్నాళ్ళు వాకింగి కి స్వస్తి చెప్పేసాను.

   "ఎద్దు పుండు కాకి కి ముద్దు". దాని మనుగడ దానిది.

   'ఓ చెట్టుమీద కాకి కిందపడి చచ్చిపోయిందో " కావు కావు" మంటూ ఎన్నో కాకులు వఛ్ఛేస్తాయి.అదే ఓ మనిషి రోడ్డు మీద చనిపోయేడనుకోండి, చూసినవాళ్ళు తమకి పట్టనట్టు పక్కకి వెళ్ళిపోతారు.

   " లోకులు పలు కాకులంటారు.కాని కాకులు కాకులే మరి.

   " ఏమిటీ కాకమ్మ కధలంటారా? కధ కంచికీ....!

   "కాకీ కాకీ కడవల కాకీ, కాకీ నాకు కడియాలిస్తే ,కడియం తెచ్చి అమ్మకు యిస్తే ,అమ్మనాకు అటుకులు పెడితే,అటుకులు తెచ్చి పంతులు కిస్తే ,పంతులుగారు పాఠం చెబితే, మామ ముందూ పాఠం చదివితే, మామ నాకు పిల్లానిచ్చె, పిల్లపేరు మల్లెమొగ్గ, నా పేరు జమిందారు.

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes