RSS

ముగ్గురు పిల్లలతో...

    మా అబ్బాయీ,కోడలూ ముంబై ఏదో పనిమీద వెళ్ళవలసివచ్చేసరికి, నవ్య,అగస్థ్య లను నేను చూస్తానూ అన్నాను.ఏదో, మా శ్రీవారుకూడా సహాయం చేస్తారనే సదుద్దేశ్యంతో. ఏదో నా తిప్పలేవో నేనే పడిఉంటే గొడవుండేదేకాదు.పైగా, 'పిల్లల్ని ఈ వర్షంలో తిసికెళ్ళడం కష్టం. నేను,ఈవాళ్టికి బయటకు ఎక్కడా తిరగడానికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటానులే' అని ఓ ఎష్యూరెన్స్
కూడా ఇచ్చేశారు. పోనీ మనిషికి మనిషుంటే తోడూ అనుకొని బాగానే ఉందీ అనుకున్నాను.

   నిన్న నవ్య పుట్టినరోజుకి చేసినవే, మిగిలినవి బ్రేక్ ఫాస్ట్ గా పెట్టేసి, పేద్ద వంటా అదీలేదుకదా, పిల్లాడిని చూసుకోవచ్చనుకున్నాను.మా కోడలు వెళ్ళేముందరే, అగస్థ్యకి ఏదైనా అవసరం వస్తే
వేయవలసిన మందులూ అవీ, చెప్పి నీట్ గా ఓ కాగితంమీద వ్రాసేసి ఇచ్చింది.ఏమీ అవసరం లేకపోయేయనుకోండి.

    ఈ మొగాళ్ళున్నారే, చిన్న పిల్లలు ఆడుతూ పాడుతూంటే చూస్తారుకానీ, ఏడిస్తే ఊరుకోపెట్టడం మాత్రం చెయ్యలేరని తెలిసిపోయింది. స్నానం చేసి, పూజ చేసికుందామని, ఈయనని కొంచెం పిల్లాడిని చూస్తూండమని చెప్పాను. మంచం మీద పొడుక్కోపెట్టినా పాకుతూ మంచం చివరకు వచ్చేస్తాడని, ఈయనని చూడమన్నాను.అసలు పిల్లల్ని చూడ్డం వస్తేకదా,మా పిల్లలటైములోనూ, ప్రొద్దుటే 7.00 గంటలకి ఫాక్టరీకి వెళ్ళిపోతే, తిరిగి సాయంత్రానికే రావడం.రోజంతా పిల్లలతో ఏమేమి తిప్పలు పడ్డానో ఈయనకేం తెలుసూ? పిల్లలు క్రమశిక్షణగా పెరగడం అంతా ఈయన ఘనతే అనుకుంటూంటారు.

   మా అగస్థ్యకి వాళ్ళ అమ్మ ఇంట్లోనూ, డే కేర్ లో ఆయాలూ ఎత్తుకోవడం అలవాటుచేసేశారు. క్రింద పడుక్కోబెడితే చాలు భోరుమని ఏడుపూ.ఒళ్ళో సేఠ్ లా కూర్చోవడం.పోనీ ఒక్కసారి ఎత్తుకోండీ అంటే, ఓ నిమిషం ఎత్తుకుని, మంచంమీద పడుక్కోపెట్టేస్తారు. వాడేమో ఏడుపూ.ఏమైనా అంటే విసుగూ.పోనీ వాడికి పట్టడానికి పాలైనా కలుపుతారా అంటే,అదీ లేదూ. న్యాపీ తడిసిపొతే మార్చడం కూడా రాదు.

    పోనీ నవ్యతోనైనా సరీగ్గా ఉంటారేమో అనుకుంటే అదీ లేదు.చిన్నపిల్ల,కొంచెం ఏక్టివ్ గా ఉంటుంది. అమ్మా నాన్నా లేకపోతే తనే ఇంటి పెద్దా అనుకుంటుంది.ఇల్లంతా కలియబెట్టేస్తూంటుంది. ఈయనకేమో చిరాకు. అలా కాదండీ, పిల్లల్ని అది చేయకూ,ఇది చేయకూ అంటే వినరూ ఈ రోజుల్లో, మాటల్లో పెట్టి వాళ్ళ దృష్టి మార్చాలీ అంటే, మూతి ముడుచుక్కూర్చుంటారు!
దీనితో ఈ వేళంతా ముగ్గురు పిల్లల్ని చూడ్డం అయింది మొత్తానికి.

చుట్టరికాల revival--part 2

    చుట్టరికాల రివైవల్ ప్రస్థానంలో హైదరాబాదు వెళ్ళాము. ట్రైనులో మా శ్రీవారు అలవాటు ప్రకారం ఓ కుర్రజంటతో పరిచయం చేసికున్నారు.ముందుగా వారి పాప( ఏణ్ణర్ధం వయస్సు) తో కబుర్లు మొదలెట్టారు. నాకు ఎప్పుడూ ఈయనతో గొడవే. ఊరికే అందరితోనూ పరిచయం చేసికుంటారూ, వాళ్ళకి నచ్చుతుందో లేదో అని అంటూంటాను. పూణే స్టేషన్ లో తెలుగు పుస్తకాలు కొన్నారు, కానీ చదువుకోడానికి మాత్రం తీయరు, అదేదో రేషను కొట్లో ఇచ్చినట్లుగా, ఒక్క పుస్తకమే ఇచ్చి, దాన్నే చదువుతూండమంటారు!ఎంతసేపని చదువుతామూ? అయినా సరే అన్ని పుస్తకాలు కొంటారా, కావలిసిందేదో చదువుకోవచ్చుగా అంటే, ఠాఠ్, అన్నీ బయట పెట్టేస్తే, ప్రతీవాడూ అడుగుతాడూ, మన ప్రయాణం పూర్తయేసరికి పుస్తకం రూపు మారిపోతుందీ అంటారు. మరీ గొడవచేస్తే, పుస్తకాలు కొనడం మానేస్తారేమో అని భయం! ఆయన ట్రైన్లో పరిచయం అయిన వారితో ఖబుర్లు చెప్పుకుంటూంటే, నా దారిన నేను ఏమీ పట్టనట్లు పుస్తకం ( ఆయన రేషన్ లో ఇచ్చినది!) చదువుకుంటూ కూర్చున్నాను.

    ఆయన కబుర్లు పూర్తవడం, నేను పుస్తకం చదవడం పూర్తి చేయడం ఒకేసారి జరగడంతో, ఇంకో దిక్కులేక, వారితో కబుర్లు మొదలెట్టాను. వారితో గడిపిన సమయం చాలా బాగా జరిగింది. దాని గురించి మావారు ఓ బ్లాగ్గు కూడా వ్రాశారు.

    ఇప్పుడు అర్ధం అయింది, ఆయన కనిపించిన ప్రతీ వారితో ఎందుకు పరిచయం చేసికుంటారో. ఈ పరిచయమే అవకపోతే మంచి స్నేహితులని మిస్ అయిపోయుండేదాన్ని కదా! ఈ మాట మావారితో అన్నానా ఇంక కాలరెత్తేసికుంటారు! 'చూశావా అస్తమానూ సణుక్కుంటూంటావు,అందరితోనూ పరిచయాలు వద్దండి బాబూ అని, ఇప్పుడు చెప్పు నేను చేసేది తప్పూ అని!'. ఏం చేస్తాం అన్నిరోజులూ మనవి కావుకదా! ఒకటి మాత్రం ఒప్పుకోవాలి, పెళ్ళిలో శ్రీ అవధాన్లు గారి గురించి చెప్పగానే, మా 'ఇమేజ్' మాత్రం పెరిగిపోయింది.

    ఇంక పెళ్ళి సంగతికొస్తే, అక్కడ ఉన్నవాళ్ళందరూ మా అత్తగారివైపు వాళ్ళే. తెలుసుగా నా పరిస్థితి ఎలా ఉండిఉంటుందో? మరీ ఇదివరకటిలా కాదనుకోండి, ఎంతైనా నేనూ ఓ అమ్మమ్మ/నాన్నమ్మ స్టేజికి వచ్చానుగా!నాకూ ఓ 'స్టేటస్' ఇచ్చేశారు! మనవరాళ్ళూ, మనవలిగురించే కబుర్లు చెప్పుకుంటే అసలు గొడవే ఉండదు!పాతరోజుల్లో అయితే ఇలా పెళ్ళిళ్ళకెళ్ళినప్పుడు, అత్తగారివైపు చుట్టాలందరికీ అడుగులకి మడుగులొత్తవలసివచ్చేది. హాయిగా ఇన్నేళ్ళ తరువాత అయితే ఓ సౌలభ్యం కూడా ఉంది. ఎవరైనా కనిపించినా గుర్తుచేసికోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఓ పోజు పెట్టామనుకోండి, అవతలి వాళ్ళు 'డిఫెన్సివ్ మోడ్' లోకి వెళ్ళిపోతారు! మరీ కుదరలెదనుకోండి, ఎవరో పిలిచినట్లుగా ' ఆ వస్తున్నా' అంటూ వీళ్లని తప్పించుకోవచ్చు ! ఇంత హడావిడిలోనూ, మా మామగారి వైపు చుట్టం ఒకాయన కలిశారు. ఆయన, మావారి పెదనాన్నగారి కొడుకు. ఆయనా, మా'తోటికోడలూ' అప్పటికీ అననే అన్నారు-' ఇక్కడిదాకా వచ్చి ఓసారి మా ఇంటికి రాకుండా వెళ్తున్నారే' అని.అబ్బే ఈ వేళ సాయంత్రం వెళ్ళిపోతున్నామూ, ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా వస్తామూ,అని ఓ స్టాండర్డ్ డయలాగ్గు చెప్పేశారు!
అందరితోనూ కబుర్లు చెప్పి. లంచ్ పూర్తి చేసికుని, సిఖ్ విలేజ్ నుంచి, ఎస్సార్ నగర్ దాకా ఓ ఆటో మాట్లాడుకుని, మా చెల్లెల్ని కలుసుకోవడానికి వెళ్ళాము. నేను వస్తున్నానని, మా అమ్మ తణుకునుండి వచ్చింది. వాళ్ళతో ఓ రెండు గంటలు గడిపి, మా వియ్యాలారింటికి కాచిగూడా తిరిగి వచ్చేశాము.రాత్రికి మళ్ళీ పూణే ఎక్స్ ప్రెస్ ( అదే మేము ప్రొద్దుట వచ్చిన ట్రైనే) లో ఎక్కి తిరిగి వచ్చాము. తిరుగు ప్రయాణం గురించి కూడా ఆయన ఓ బ్లాగ్గు వ్రాశారు.

    అక్కడితో వ్యవహారం పూర్తయిందనుకుంటున్నారేమో, మా అత్తగారి,అక్కయ్యగారి, కొడుకు కి, కూతురూ వాళ్ళూ పూణే లో ఓ ఫ్లాట్ కొనుక్కున్నారు. మేము వెళ్ళిన పెళ్ళి ముహూర్తమూ, వీళ్ళ గృహప్రవేశ ముహూర్తమూ ఒకేసారి అవడం వలన మేము వెళ్ళలెకపోయాము. తిరిగి రాగానే వాళ్ళని కలుసుకోవడానికి వెళ్ళి, వాళ్ళందరినీ భోజనానికి పిలిచారు. ఆయనా,మా 'తోటికోడలూ', వాళ్ళమ్మాయీ, అల్లుడూ, ఇద్దరుపిల్లలూ అందరూ కలిసి వచ్చారు, భోజనానికి. దీనితో మొత్తానికి మా అత్తారివైపు అందరికీ,అతిథి సత్కారం పూర్తైనట్లే !! ఆ వచ్చిన వారి కొడుకు ఒడుగుట కాకినాడలో. అదే ముహూర్తానికి మా మనవడికి అన్నప్రాశన హైదరాబాద్ లో, లేకపోతే ఆ ఛాన్సు వదిలేవారు కాదు !!

ఇదండీ సంగతి !!!

చుట్టరికాల revival

    గత 40 ఏళ్ళలోనూ బాగా దగ్గర వారి వివాహాలకు గానీ, ఇంట్లో శుభ కార్యాలకి గానీ ఏవేవో కారణాల వల్ల వెళ్ళలేకపోయాము.మా శ్రీవారు రిటైరు అయినప్పటినుండీ ఓ కొత్త వ్యవహారం మొదలెట్టారు.చుట్టాలందరితోనూ సంబంధాలు పునరుధ్ధరించడం. వాళ్ళు దగ్గరవారైనా సరే, దూరంవారైనా సరే,వారింట్లో శుభకార్యానికి వెళ్ళడం. ఆయనతో పాటే మరి నేను కూడా వెళ్ళాలిగా!
దానికి ఓ పేరుకూడా పెట్టుకున్నారు--' చుట్టరికోధ్ధరణ అభియాన్' అని!( Operation revival of relationships)

    ఈ సందర్భంలోనే మా అత్తగారి పెద్దక్కయ్య గారి పెద్దకూతురి, పెద్దకూతురు కొడుకు వివాహానికి మేము భాగ్యనగరానికి ఈ వేళ వెళ్తున్నాము! ఇక్కడితో అవలేదు, ఈ నెల మూడో వారంలో
మా వారి అత్తగారి పెద్దమేనమామగారి పెద్దకూతురి,కూతురు కొడుకు పెళ్ళికి మళ్ళీ రాజధానీ నగరానికి వెళ్తున్నాము. ఇంతే కాదండోయ్ రాజమండ్రీ లో ఉండగా, మా వారి చిన్నవదినగారి
పెదనాన్నగారి కూతురింటికి
వెళ్ళి వారిచ్చిన అతిథిసత్కారాలు స్వీకరించి,తరువాత మా చిన్నబావగారి అమ్మాయితో కలిసి,మా వారి చిన్నవదిన చిన్నపెదనాన్నగారి కొడుకింటికెళ్ళి అక్కడ కూడా
పసుపు కుంకాలూ, చీరా తీసికుని వచ్చాను!

    ' ఏమీ తోచనమ్మ తోటికోడలి పుట్టింటికి వెళ్ళింది' అని పూర్వకాలపు సామెత. కానీ ఇంకో రెండడుగులు ముందుకు వేసి, మా చినబావగారి కూతురితో కలిసి తన పినమావగారి ఇంటికి కూడా వెళ్ళొచ్చాము! ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ఎప్పుడు ఎక్కడ పిలిచినా, మావారు ముందరే టిక్కెట్టు రిజర్వు చేసేస్తారు! ఎక్కడో చెప్తే చాలు, డేట్ అటూ ఇటూ అయినా ఫర్వాలేదు, మేము రెడీ, చుట్టాలూ బి రెడీ!

గమనిక : ఇది స్నేహితులకి కూడా వర్తిస్తుంది !
!

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes