శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం సినిమాలో చూసాము. ఓ ఆవు, ప్రతీ రోజూ ఠంచనుగా, మందనుంచి తప్పించుకుని, స్వామికి పాలివ్వడానికి ఒకే టైముకి వెళ్ళేదని. మరీ అలాగని కాదు కానీ, ఈ మధ్యన మా శ్రీవారు, ప్రతీ రోజూ ప్రొద్దుటే ఈ మధ్యన మరీ పనేమీ లేక, నెట్ లో పెట్టే కంది శంకరయ్యగారి పజిలూ, తురపుముక్క మురళీ మోహన్ గారి పజిలూ, చూడడం మొదలెట్టాను. ఒకాయనేమో ప్రతీ రోజూ పొద్దుట ఆరున్నరయేసరికి పెట్టేస్తున్నారు. అదేదో చూసి సరదాగా సాల్వ్ చేద్దామని, మొదలెట్టాను.ప్రతీ రోజూ అదో వ్యసనంలా తయారయింది.నాకు తెలిసినవేవో ముందర వ్రాసేసికుని, నాకు మరీ అంత తెలియనివి, ఉన్నారుకదా అని మా శ్రీవారిని అడుగుతూంటాను. ఏవేవో వ్రాస్తూంటారుకదా, ఆ మాత్రం తెలియదా అని. పాపం ఆయనకున్న వీక్ నెస్స్ ఏమిటంటే,తనకు ఏ మాత్రం పరిచయం లేని సబ్జెక్ట్ లో ఎవరైనా ఏమైనా అడిగితే పాపం టెన్షనొచ్చెస్తూంటుంది. అప్పటికీ, నేనెక్కడడుగుతానో అని భయ పడుతూ, షేవింగు చేసికుంటూనో, స్నానం చేస్తూనో, పూజ చేసికుంటూనో గడిపేస్తూంటారు! అలాగని నన్ను తప్పించుకునెక్కడికి వెళ్తారూ, మేమున్నదేం భవనమా ఏమిటీ, సింగిల్ బెడ్రూం, హాల్,కిచెన్! అక్కడ మా ఇంట్లో (స్వంత) అయితే, మా అగస్త్యని ఎత్తుకుంటూనో, నవ్యతో మాట్లాడుతూనో తప్పించేసికునేవారు.ఇకాడ, ( కొత్త బంగారులోకం లో డయలాగ్గు గుర్తుచేసికోండి!) పాపం అలాటి పప్పులేం ఉడకడం లేదు. అలా వచ్చీ, ఇలా వచ్చీ ఏదో ఒకటి అడగడం మానట్లేదూ, ఆయన విసుక్కోడం మానడం లేదూ! అలాగని ఆయనకేమీ తెలియదనడానికి వీల్లేదు.పుస్తకాలు చదువుతారు, ఎప్పుడు చూసినా నెట్ మీదే ఉంటారు. అదడిగిందీ, మనం చెప్పకూడదూ అంతే ! ఎప్పుడైనా నేను వ్రాసినవి అన్నీ కరెక్టవుతే శంకరయ్యగారూ, మురళీ కృష్ణ గారూ
స్నానం, పానం, బ్రేక్ ఫాస్టూ పూర్తిచేసికుని, ఇంట్లోంచి బయటకు వెళ్ళి, మళ్ళీ భోజనానికే, 12.30 కి వస్తున్నారు. మరీ అలాగని ఈయనేమీ, నాకు తెలియకుండా ఉద్యోగమేమీ వెలిగించడం లేదు, ఎప్పుడైనా మిస్టరీ షాపింగులున్నా, చెప్తారు, ఇంకీయనెక్కడికి వెళ్తున్నట్టూ?
చెప్తూంటారు కదా. అదీ విషయం! నేనెక్కడ బాగుపడిపోతానో అని దుగ్ధ!!అందుకనే పన్లన్నీ పూర్తిచేసికుని, బయటకెళ్ళిపోతే అసలు గొడవే ఉండదుగా, నా తిప్పలెవో నేనే పడతాను.బయటకెళ్ళి మళ్ళీ ఫోన్లోటి, 'నీ పజిలు పంపించడం అయిపోయిందా' అంటూ.అప్పుడుకానీ కొంపకి చేరరు. ఇదండీ విషయం !! ఇన్ని తిప్పలు పెట్టినా ఎప్పటికో అప్పటికి हाँगॅ कामियाब एक दिन् అనుకుంటూంటాను!!
నా తిప్పలెవరితో చెప్పుకోనూ?
మాశ్రీవారూ- Sixth Sense
మామూలుగా నాకు ఊరికే బయటకు వెళ్ళి తిరగడం అంత ఇష్టమూ ఉండదు. పోనీ అలాగని అస్తమానూ, కొంపా గోడూ అంటూ ఇంట్లోనే కూర్చుని అదీ ఇదీ సవిరిస్తూ కూడా కూర్చోలేం కదా. ఆ ఇంటికి ఎంతచేస్తేనేం, ఎవరికైనా పడుతుందా,పాడా ? ఎవరికి కావలసినది వాళ్ళకి వండి పడేస్తే చాలు,ఇంటిది ఏమైతేనేం, ఏ గంగలో దూకుతేనేం.ఇలా అప్పుడప్పుడు అనుకుని, ఎప్పుడో పున్నానికీ, అమాసకీ ఏ కిందనున్నవాళ్ళింటికో వెళ్ళేదాన్ని.ఈయన కి పొద్దున్నే డబ్బా ఇచ్చేసి, అబ్బాయికి భోజనం పెట్టేసి,వాడు కాలేజీకి వెళ్ళిన తరువాత,ఓసారి మా కిందిక్వార్టరు లోకి వెళ్ళాను.ఆ వెళ్ళిన అరగంటలోనూ, ఈయన ఓ పదిసార్లు ఫోను చేసేశారు(ట), అయ్యనకేం, హాయిగా టేబిలు మీద ఎదురుగా ఉంటుంది. ఎప్పుడు పనిలేకపోతే అప్పుడో ఫోనూ! పోనీ ఫోను రింగవుతూందీ, ఎవరూ ఆన్సరు చేయడంలేదని, వదిలేయొచ్చుగా, అబ్బే, అలా వదిల్తే భమిడిపాటివారెలా అవుతారు! టెలిఫోన్ ఎక్స్చేంజ్ కి ఫోన్ను చేసేయడమూ, ఫోను ఊరికే రింగవుతూందీ, ఎవరూ ఎత్తడంలేదూ, పాడైపోయిందేమో చూడండీ అని ఓ complaint ఇవ్వడం.వాళ్ళంతా ఈయనకి బాగా పరిచయం లెండి, దీపావళి కి బక్షీసూ అవీ దండిగా ఇస్తూంటారులెండి, అంతే వాళ్ళవాడెవడో రావడం,ఇంతట్లో నేను ఇంటికే వచ్చేసీదాన్ని,' మేడం,మీరు ఇంట్లో లేరా, ఫోను ఎవరూ తీయడంలేదూ,ఏమైనా పాడయ్యిందేమో చూడూ అని సార్ complaint ఇచ్చారు'అని ఓ పలకరింపూ. చచ్చే సిగ్గేసేది-- ఏదో ఏడాదికోసారి బయటకు వెళ్తే, ఈయనిదేమిటీ,అలా చేస్తారూ, ఖర్మ ఈ టెలిఫోనువాడేం యాగీ చేస్తాడో, సారు ఆఫీసుకెళ్ళగానే మేడంగారు ఊరిమీదకు వెళ్తారూ అని-. ఏమిటో ఒక్కదాంట్లో స్వతంత్రం లేదమ్మా అనుకునేదాన్ని! ఇంక సాయంత్రం ఆయన ఇంటికిరాగానే పలకరింపోటీ,'ఏమోయ్ బయటకేమైనా వెళ్ళావా, మధ్యాన్నం ఫోను చేస్తే ఎత్తలేదూ' అంటూ. మనం చేసిన నిర్వాకం ( అదే ఎక్స్చేంజ్ కి complaint వగైరా) గురించేమీ మాట్లాడరు. ఆ రోజు చెప్పేశాను,అప్పుడప్పుడు, ఏ కిందవాళ్ళింటికో వెళ్తూంటాను, అలాటప్పుడు ఊరికే వస్తోందికదా అని ఫోన్లు చేసేసి, ఊరంతా టముకేయఖ్ఖర్లేదు అని. ఇంక ఆయన సాయంత్రం ఇంకా ఇంటికి రాలేదు కదా, ఈలోపులో కొంచెం చాయ్ పెట్టుకు తాగుదామూ అనుకున్నంతసేపు పట్టదు, ఆ చాయ్ వాసన ఎలా తగులుతుందో అమ్మా, ఠక్ మని డోర్ బెల్లు మ్రోగుతుంది.తీసి చూస్తే, మా శ్రీవారు! ఆఖరికి రిటైరయినతరువాతకూడా, ఈయన ఎప్పుడైనా బయటకు వెళ్ళి రావడం ఆలస్యం అయిందనుకోండి, టీ కి నీళ్ళు పడేసి, డికాక్షనుచేసి, పాలు పోసేలోపులో ఈయన ప్రత్యక్షం! 'సువర్ణసుందరి' సినిమాలో, నాగేశ్వర్రావు ఫ్లూటు వాయిస్తే, అంజలీదేవి ప్రత్యక్షమైనట్లుగా!పాపం వెళ్ళేముందర చెప్తూంటారు, ఫలానా టైముకి వచ్చేస్తానూ అని, ఆయన చెప్పే టైముకి చాయ్ పెట్టేసుకుని రెడీగా ఉండొచ్చు.time sense మాత్రం చాలా ఉంది. రోజంతా ఏవేవో చూస్తూ, టపాలు వ్రాసుకుంటూ, ఆ కంప్యూటరు ముందే సెటిలవుతూంటారు. మధ్యాన్నం భోజనం చేసి టి.వీ ల్లో ఏదో చూస్తూ, అక్కడే హాల్లో సోఫామీదే ఓ కునుకు తీస్తూంటారు. అర్ధరాత్రి దాటే దాకా పుస్తకాలూ,కంప్యూటరూ అంటూ కూర్చుంటే, నిద్దర్రాదూ? ఆ సంగతి వదిలేయండి, నేను కూడా వంటిల్లు సద్దుకుని, ఓ పుస్తకం చేతిలో పట్టుకునేసరికల్లా, కళ్ళుమూసుకుపోతాయి, సరే అని మధ్యలో మెళుకువొచ్చి చూస్తే, ఆయనుండరు, ఏమయ్యారా అని చూస్తే, సోఫామీదాయనా,చేతిలో రిమోటూ.టి.వీ.దారిన టి.వీ. ఇలా ఉంటుంది మావారి వరస. అదేదో పరీక్షలకెళ్తున్నట్లు అంత నిద్రాపుకుని మరీ చూడ్డం ఎందుకో! ఏదో నిద్రపోతున్నారు కదా అని, పోనీ బ్లాగ్గుల్లో,మనవాళ్ళందరూ ఎలా ఉన్నారో చూద్దామని, కంప్యూటర్ ఆన్ చెయ్యడం చాలు, ఈయన ప్రత్యక్షం పక్కనే! ' మధ్యాన్నం ఓ టపా రాశానూ, ఎవరైనా చదివేరా' అంటూ. నేను కంప్యూటర్ ఓపెన్ చేశానని ఎలా పసికడతారో, అలాగే చాయ్ పెట్టానని ఎలా కనిబెడతారో, అలాగే ఎప్పుడోసారి బయటకు వెళ్ళాననీ,ఎలా తెలుస్తుందో, ఈయనకెమైనా 'sixth sense' ఉందేమో అని నాకనుమానం !
అయోమయం, అధ్వాన్నం !!
మా అబ్బాయి , Seth Godin , ISB హైదరాబాదు లో ఏదో లెక్చరు ఇస్తున్నారంటే, అక్కడికి వెళ్ళాడు. కోడలూ,పిల్లలూ ఒక్కళ్ళూ ఉంటారని, మేము మా ఇంటికి వెళ్ళాము.మా మనవడు అగస్థ్య తొ బాగా కాలక్షేపం అయింది. నవ్య స్కూలుకి వెళ్ళిపోయింది. మా కోడలైతే ఇంటినుండే పనిచేసికుంది. ఆయన సంగతి తెలుసుగా, కాలు కొంచెం బాగుపడింది, ఇంక ఇంట్లో ఎక్కడుంటారూ? మళ్ళీ మిస్టరీ షాపింగు కోసం, షాపర్స్ స్టాప్ కి వెళ్ళి,అగస్థ్యకి ఓ చొక్కా తెచ్చారు.క్రిందటి నాలుగునెలలూ వాడికి, పుట్టినరోజు 7 వ తారీకున, ఏదొవిధంగా, మిస్టరీ షాపింగు అసైన్ మెంటు రావడం, వాడికి ఏదో చొక్కాయో. జుబ్బాయో తేవడం.జేబులోది పడకుండా ఇదీ బాగానే ఉందనిపించింది. ఈవేళ మా అబ్బాయి హైదరాబాదు నుండి తిరిగి వచ్చాడు. మధ్యాన్నం లంచ్ చేసేసి, తిరిగి మేముండే ఎపార్ట్ మెంటుకి వెళ్ళిపోదామూ, అనుకుని, రిలయన్స్ లోకి వెళ్ళి కూరలూ, ఏవో ఇంట్లోకి కావలిసిన సామాన్లూ తెచ్చి, మా అబ్బాయితో చెప్పి ఇంటికి బయలుదేరాము. ఆయనేం కొన్నారో తెలియదు.ఓ నాలుగు సంచీలు భుజాన్నేసికుని ఆటో లో వచ్చాము.మా అబ్బాయి కారులో దింపుతానూ అంటే ఈయనే వద్దన్నారు. కారణం అప్పుడు నాకేం తెలుసూ? సంగతేమంటే అప్పుడెప్పుడో ఓసారి ఆయనతో మాటల్లో అన్నాను- ఐస్ క్రీం డబ్బా ఒకటి ఇంట్లో పెట్టండీ అని. అదెప్పుడూ వేసంకాలంలో, ఆయనకి ఇప్పటికి గుర్తొచ్చి, రిలయెన్స్ లో Baskin Robins దొరుకుతోందని, పెళ్ళాంమీద ప్రేమ పుట్టుకొచ్చేసి, పాపం ఓ డబ్బా కొన్నారు. పోనీ దాన్ని ఫ్రీజర్ లో పెట్టొచ్చుగా, అబ్బే అలాటివేవీ గుర్తుండవు! వర్షాలు పడుతూంటే, ఐస్ క్రీంలేమిటీ అని, కొడుకేమన్నా అంటాడేమో అని,' ఊరికే నీకు శ్రమెందుకురా, మేము ఆటోలో వెళ్ళిపోతాములే' అన్నారుట,ఇదన్నమాట అసలు సంగతి. ఇంటికొచ్చి, నేను ఇల్లూ అదీ తుడుస్తూంటే, ఆయన సంచీలు ఖాళీ చేసి, కూరలూ అవీ సద్దుదామనుకున్నారు. పాపం అప్పుడప్పుడు నాకు హెల్ప్ చేస్తూంటారు లెండి! ఏమిటో ఒక్కొక్క పొట్లం, కూరా తీయడం, దాన్ని ఓ గుడ్డతో తుడవడం, వామ్మోయ్ ఇంత శ్రధ్ధెక్కడినుంచొచ్చిందిరా దేముడోయ్ అనుకుంటూంటే, అసలు సంగతి తెలిసింది- పాపం ఆయన ఎంతో ప్రేమతో తీసికున్న ఐస్ క్రీం కాస్తా Liquid Robin అయిపోయిందని.అదేమిటండీ నాతో చెప్పనైనా లేదూ
లేకపోతే ఫ్రీజర్ లో పెట్టమైనా కానీ చెప్పేదాన్ని,అన్నాను. అంతా అయోమయం అధ్వాన్నమూనూ ! నేను చచ్చేట్లా తుడిచిన ఫ్లోర్ అంతా ఏమిటో జిగురుగా ఉందేమిటీ అనుకుంటే, ఇదండి ఆయన చేసిన ఘనకార్యం! మళ్ళీ ఫ్రిజ్ లో పెట్టిన కూరలు తీసి, ఓమాటు కడుక్కుని పెట్టాల్సొచ్చింది!
పన్లు చెయ్యరు, ఏదో బుధ్ధి పుట్టి చేస్తే ఇదీ నిర్వాకం !!