RSS

ఏమైనా అనుకుంటారేమో అనే compromise !!

    అసలు ఈ టపాకి పెట్టే శీర్షికతోటే మొదలయింది- ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనండీ-అని !ఎందుకంటే ఈ మధ్యన మా శ్రీవారు అలాటిదే శీర్షిక పెట్టి వ్రాశారు.అయినా నాకు తెలియక అడుగుతానూ, శీర్షికలకి ఏమైనా కాపీరైట్లూ/ పేటెంట్లూ
ఉన్నాయా ఏమిటీ? ఎవరిష్టం వాళ్ళది.నాకు తోచింది నేను వ్రాసుకుంటాను.

    ఆడపిల్లలకి స్కూలురొజులనుండే ప్రారంభం అవుతుంది ఈ 'ఏమైనా అనుకుంటారేమో'అనే భావం.మనం ఏదైనా స్కూల్లో చేరుదామూ అని ఉత్సాహపడతామా,వాళ్ళంటారూ-అది Boys' School అక్కడొద్దూ,మగ పిల్లలు ఏడిపిస్తారూ,Girls' School లో బావుంటుందీ అని.మళ్ళీ అమ్మా నాన్నా ఏమైనా అనుకుంటారేమో అని చేరుతాము. పోనీ అక్కడైనా, మనకి కావలసినవి చేయకలుగుతామా అంటే అదీ లేదు, ఓ పిక్నిక్కు కి వెళ్ళడంకానీ, పోనీ ఏ NCC లోనో చేరడంకానీ లాటివి నిషిధ్ధం! నోరు విడిచి అడుగుదామంటే ఏమైనా అనుకుంటారేమో! ఆఖరికి ఏ కాంపోజిట్ట్ మాథ్స్ తీసికుందామనుకున్నా, ఇదే వరస. 'ఏం ఇంజనీరింగుల్లో చేరి ఊళ్ళేలా ఏమిటీ, శుభ్రంగా జనరల్ మాథ్స్ తీసికుని
ఆర్ట్స్ లో చేరూ'అంటారు.కాదంటే ఏమైనా అనుకుంటారేమో? ఈ రోజుల్లో అలా కాదనుకోండి, నా చిన్నప్పటి సంగతులు.

    పధ్ధెనిమిదేళ్ళొచ్చేసరికి,సంబంధాలు చూడ్డం మొదలెట్టేవారు, 'సంబంధం బావుందీ, కట్నం అదీ అంత అడగడంలేదూ, కుర్రాడు బాగానే ఉన్నాడూ'అని brainwash చేసేస్తారు. మళ్ళీ కాదంటే ఏం గొడవో,ఏమనుకుంటారో? అని ఒప్పేసుకోవాలి. ఇంక పెళ్ళైనదగ్గరనుండీ 'ఏమైనా అనుకుంటారేమో' దాన్నే ఇంగ్లీషులో compromise formula అంటారనుకుంటాను. జీవితం అంతా 'సరిపెట్టుకోవడం' తోటే వెళ్ళిపోతుంది! ఏదో women's lib అని కాదుకానీ, అసలు
ఈ సరిపెట్టుకోవడం లోంచి బయట పడలేము.అత్తారింటినుండి ప్రారంభం, అత్త మామల సంగతి సరేసరి, ఆడపడుచులూ, తోడికోడళ్ళూ ఒక్కళ్ళని కాదు అందరూ మన శత్రు పక్షంవారిలాగే కనిపిస్తారు!ఎంతమందినని సంతృప్తి పరచగలమూ,అందరినీ అన్ని సమయాల్లోనూ సంతృప్తి పరచడం అనేది next to impossible. పైగా పెళ్ళైన కొత్తలో, వీళ్ళనేమైనా అంటే కట్టుకున్నవాడు 'ఏమైనా అనుకుంటాడేమో' అనో భయం!పోనీ విడిగా ఉంటే ఈ గొడవలుండవూ అనుకుని, transfer కి ప్రయత్నించమంటే, ' ఏమిటమ్మోయ్ వేరింటి కాపరం పెట్టిందామనుకుంటున్నావేమిటీ'అని అత్తగారేమనుకుంటారో అని భయం!

   ఏ పిల్లల బారసాలకో మన పుట్టింటివారు, అత్తగారికి పెట్టిపోతలు సరీగ్గా చేయలేదనుకుంటారో అని, వాళ్ళకి పట్టుబట్టలూ, మనకి ఏదో ఓ వాయిలు చీరలాటిదేదో పెట్టేయడం. ఇంతా అయి పిల్లలు పెద్దవారయిన తరువాత ఇంకో రకం సద్దుబాట్లూ అదేనండీ వాళ్ళేమైనా అనుకుంటారేమో అని.వాళ్ళడిగినవి, అప్పో సప్పో చేసి సద్దుకోవడం.వాళ్ళు ఏ ప్రేమపెళ్ళిళ్ళైనా చేసికుంటే, కట్నం ఖర్చేమీ లేకపోయినా, అబ్బాయి/అమ్మాయి వైపువారు ఏమైనా అనుకుంటారేమో అని ఏవేవో
పెట్టడం. హాయిగా కట్నాలవాళ్ళకే హాయీ, ఏదో ఒకటి మాట్లాడేసికుని ఇంత పెట్టుబడి బట్టలకీ, ఇంత నగలకీ వగైరా సెటిల్ చేసేసికుంటారు ముందుగానే.

   పెళ్ళిళ్ళైన తరువాత అంతా కాంప్రమైజే.ఏం చేద్దామన్నా కోడలేమనుకుంటుందో, అల్లుడేమనుకుంటాడో అనే భయం! రోగం వస్తే చెప్తే ఏమనుకుంటారో,వాళ్ళెక్కడికైనా వెళ్తూంటే, రామంటే ఏమనుకుంటారో, మనవల్నీ, మనవరాళ్ళనీ అల్లరి చేస్తూంటే ఏమైనా అనాలన్నా భయమే! పిల్లలేమనుకుంటారో అని!

    చివరాఖరికి ప్రాణం పోతున్నా, ఇంట్లో పోతే అందరూ ఏమనుకుంటారో.... అనే భయం! ఇన్నిటిలోనూ ఏమీ అనుకోరులే అని అనుకునేవారు ఆ కట్టుకున్నవారొకరే !ఎలాగైనా పాపం భరిస్తారు.అందుకేగా భర్తన్నారు!

6 కామెంట్‌లు:

శరత్ కాలమ్ చెప్పారు...

అవునండీ, చాలామంది తమకోసం కాకుండా ఇతరులకోసం జీవిస్తుంటారు. నేనయితే మనకోసం ఎక్కువగా జీవిస్తూ ఇతరుల కోసం(ఇతరులు ఏమనుకుంటారో అని) తక్కువ జీవించాలంటాను.

కొత్త పాళీ చెప్పారు...

అవును, అలా అనుకునీ అనుకునీ కొన్నేళ్ళకి అది మజ్జాగతమై పోతుంది. వొదిలించుకోవాలన్నా వొదల్దు.
అవునూ సడన్‌గా ఏంటి మాస్టార్ని కాకాపడుతున్నారు క్లోజింగులో? పండగల సీజన్ వచ్చిందనా? :)

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

శరత్'కాలం' గారూ,

మీరు చెప్పింది బాగానే ఉంది కానీ ఇన్నేళ్ళనుండీ ఉన్న అలవాటు మార్చుకోవడం కూడా కష్టమే !

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

కొత్తపాళీ గారూ,

మరీ అలా అనేస్తే మా శ్రీవారు ఏమైనా అనుకుంటారేమోనండీ !!!

ఆ.సౌమ్య చెప్పారు...

మీరు నిజాలన్నిటినీ ఇలా బాహాటంగా రాసేస్తే మరి మేమేమనుకోవాలి?

శిశిర చెప్పారు...

బాగుందండి మీ టపా. బాగా చెప్పారు. ఈ విషయం మీదే యండమూరిది ఒక పుస్తకం కూడా ఉంది. "మీరు మంచి అమ్మాయి కాదు" ఆ పుస్తకం టైటిల్.

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes