RSS

ఏం చెప్పమంటారు......

   ఏమిటో ఎన్నో చెబుతారు. ఎన్నో రాస్తారు. కాని అమలులోకి వచ్చేసరికి అసలు రంగు బయట పడుతుంది. మా శ్రీవారు టపా రాసి నాతో మాట మాత్రమేనా అనకుండా పోస్టు చేసారూ, అంటే అందులో నా మీదే ఖచ్చితంగా రాస్తారని తెలిసిపోయింది. ఏమిటో ఆ తరువాత అయినా నేను చదువుతాను కదా! పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగినట్లుగా !అసలు నిజానికి మా కొచ్చే పెన్షను లో పొదుపుగా , పొందికగా , చిన్న యిల్లు, అవసరానికి మాత్రమే సరిపోయే సామాను,ఒద్దికగా వుండాలనే తాపత్రయంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము, అందులోదే ఈ ఇడ్లీ పిండి కూడాను. మా స్వంత ఫ్లాటు కి రోజూ వెడతారు.అదే బిల్డింగు లో కింద రిలెయెన్సు ఫ్రెష్ వుంది. మా కంటి ఎదురుగా మేము తాగే నీళ్ల తో నే చక్కగా పిండి చేసి యిస్తాడు.( అంటే వాడు వాడేవి అవే నీళ్ళన్నమాట.) మా కోడలు ఎయిర్ టైట్ డబ్బాలు యిచ్చింది. ఒక్క మనిషె బ్రేక్ ఫాస్టు కి యింట్లో చేసుకునేదేమిటి? అని కలసి తీసుకున్న నిర్ణయమే యిది. ( ఆరోగ్యరీత్యా కూడా మంచిదే కదా ,పొద్దునే నెయ్యి, నూనె లతో చేసేవాటికంటే). అన్ని మరచిపోయి యిలా బ్లాగు ల్లో రాసుకుంటారాంటా? అదే నన్నడిగితే చేసిపెడతాను,అంతేకాని పబ్లిగా రాసుకుంటే ఓ నాలుగు కామెంట్లు వస్తాయి కాని కడుపు నిండదుగా, ఏమంటారు?

    మినుము ఆరోగ్యానికి చాలా మంచిదంటారు.అందులోను ఆవిరి మీద ఉడుకుతాయి కనుక చాలా మంచిది. ఇదివరకు వాసినిపోలు అని వేసేవారు. దాని రూపాంతరమే యిప్పటి యిడ్లీలు.అరటి ఆకులో వేడి వేడి యిడ్లీల తో కొబ్బరి పచ్చడి , కారంపొడి వెసుకొని , కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని తిన్నతరువాత ఆలోచించండి, నేను యిడ్లీలే ఎందుకు చేస్తానో, కాదంటారా, మా యింటికి రండి, చేసి పెడతాను. మా ఫ్రెండ్సు కొంతమంది పరోఠా లు చేసుకుంటారు,అన్ని రకాల కూరలతోనూ, కేరట్సు, కాలిఫ్లవర్, కేబెజి,ఆనపకాయ, పాలక్, మెంతికూర, వగైరా... కొద్దిగా పెరుగు తో తీసుకొని,పండ్లరసం తీసికొంటే బాగుంటుందని అంటారు, కొంతమంది బ్రెడ్ తొ టోస్టు, శాండ్విచ్ లు, ఏదో ఒకటి, కాని మా యింట్లో మా అమ్మాయి, కోడలు అన్ని పనులు చేసుకొని పిల్లలను స్కూలికి పంపి ఆదరా బాదరా, ఆఫీసులకి పరిగెడతారు,వాళ్ళకి మాత్రం,తినేందుకు సమయం సరిపోదు.చిన్న వయసు కనుక ప్రస్తుతానికి ఏమీ తెలీదు,ఆ తరువాత ... మీలోను యిలా బ్రేక్ ఫాస్టు స్కిప్ చేసేవాళ్లున్నారు కదూ, అలా చేయకండి,మరచిపోకుండా, తీసుకోండి. నేనయితే మా వాళ్ళని సంటుతూనే వుంటాను, వాళ్ళకి చిరాకు వచ్చినా సరే !

    ఇదివరకు మాకు పూనాలో ఉప్పుడు రవ్వ దొరికేదికాదు, ఆంధ్రా వెళ్ళినపుడు తెచ్చుకునేవాళ్ళం.పైగా వస్తూ స్నేహితులకి కూడా తెఛ్చెవాళ్ళం.అదొక బరువు, ఆ తరువాత ఉప్పుడుబియ్యం తెచ్చికొని మిక్సి లో రవ్వ చేసుకొనేవాళ్ళం.యిప్పుడంటే హాయిగా యిడ్లి రవ్వ దొరకుతోంది . ఇంతకీ ఈ సొద ఎందుకంటే మా శ్రీవారి టపా చూసి ఇన్ని కబుర్లు చెబుతోందీ, ఇడ్లి పిండి కూడా చేయడం రాదనుకుంటారెమొనని నా అనుమానం. సరే! నిజంగా చెబుతున్నాను. టైపు చేస్తూంటే ఫొను. మా వారి దగ్గరనుండి, యిప్పుడే బయలుదేరుతున్నాను, ఏమన్నా కావాలా ? ఇడ్లీ పిండి తేనా అంటూ----
ఏం, చెప్పమంటారు?

5 కామెంట్‌లు:

ఆవకాయ చెప్పారు...

:)బావుంది మీ ఇడ్లీల భాగోతం. ఇంతకీ ఒక్క మనిషికి బ్రేక్ఫాస్టు అన్నారు. మీరు తినరా ఏమిటి?

శిశిర చెప్పారు...

భలే ఉంటాయండి మీ ఇద్దరి సరదా వాదనలు.

అజ్ఞాత చెప్పారు...

ఒట్టి ఇడ్లీ తినకూడదండీ. అందులోకి వేరుశెనగపప్పు చట్నీ, ఉల్లి-బంగాళాదుంపల సాంబార్ చేసుకు తినాలి. అల్లం పచ్చడి కూడా వుంటే ఇంకో రెండు ఇడ్లీలు తిన్నా ఇట్టే జీర్ణమవుతాయి. ఎర్రగా కాగిన వడ సాంబారులో ముంచి తింటుంటేనండీ ... ఓహ్

bhavani చెప్పారు...

బావుందండి అత్తయ్యగారు!

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

@ ఆవకాయ,

వేసే నాలుగు ఇడ్లీలలోనూ, నాకేం మిగులిస్తారూ? నా ఓట్సూ,దానిమ్మ గింజలూ,మొలకల పెసలూనూ. పళ్ళులేకపోవడంతో వాటికి మాత్రం పోటీకి రారు !!

@శిశిరా,
వినేవాళ్ళకీ, చదివేవాళ్ళకీ బాగానే ఉంటాయి !!!

@అజ్ఞాతా(సౌమ్యా),

ఇలాటి సలహాలు కూడానా తల్లీ !!!!

@భవానీ,

థాంక్స్.

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes