మేము 1998 లో వరంగాం నుండి పూణె వచ్చినప్పటినుండీ, కాలక్షేపం కోసం, కొంతమంది స్నేహితులతో కలిసి, ప్రతీ నెలా ఓ పార్టీ చేసికునేవాళ్ళం.భర్తలందరికీ ఒకళ్ళతో ఒకళ్ళకి పరిచయాలెలాగూ ఉంటాయి. కానీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు కూడా ఏదో ఒక కాలక్షేపం, ప్రతీనెలా కలిసి కబుర్లు చెప్పుకునే ఆవకాశం కూడా ఉండాలి కదా.ప్రతీ వారూ ఓ వెయ్యి రుపాయలు వేసికుని, ఓ చిట్టీ తీసి, ఎవరి పేరు వస్తే, వాళ్ళింట్లో పార్టీ చేసికోవడం అన్న మాట. ఓ పదిహేను మందిదాకా ఉండే వాళ్ళం.అప్పుడు అందరి భర్తలూ సర్వీసులోనే ఉండేవారు కాబట్టీ, పైగా ప్రతీ వారి సంగతీ, గ్రూప్ లో ఉన్న ప్రతీ వారికీ తెలుసును కాబట్టీ, అంత పెద్ద సమస్యలుండేవి కావు. 'పుట్టింటి వాళ్ళ సంగతి మేనత్త దగ్గరా...' అన్నట్లుగా ఉండేది.ఇంకో విషయం ఏమిటంటే, దాదాపు అందరి పిల్లలూ, చదువుకుంటూండడమో, లేక పెళ్ళిళ్ళకి రెడీ అయిన కూతుళ్ళ తల్లులో ఉండేవారు! ఈ విషయంలో నేను అదృష్టవంతురాలినే. అప్పటికే నేను 'అమ్మమ్మ' స్థాయికి వచ్చేశాను! ఏదో ప్రతీ నెలా ఒకసారి అందరూ కలుసుకునే వాళ్ళం.మా శ్రీవారు కూడా,ఈ విషయంలో కలుగచేసికునేవారు కాదు. ఎవరి స్నేహాలు వాళ్ళవే.అలాగని పూసుకుని, మా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడాలూ వగైరా ఉండేవి కావు. ఈ విషయంలో నేనూ ఏమీ అనేదాన్ని కాదు.Peaceful coexistence అన్నమాట !ఎవరిష్టం వాళ్ళది!ప్రతీ నెలా డబ్బులివ్వడం,పేరు ( చిట్) వచ్చినప్పుడు, పార్టీకి కావలిసినవన్నీ ఎరేంజ్ చేయించడం ! కానీ రోజులన్నీ ఒకేలాగ ఉండవుగా! మనుష్యుల్లోనూ మార్పులు వస్తూంటాయి,పిల్లలు పెద్దాళ్ళయ్యారు,కొంతమంది పిల్లల పెళ్ళిళ్ళు చేశారు,ఉద్యోగాల్లోకి వచ్చారు, కొత్త కోడళ్ళొచ్చారు, ఇళ్ళు కట్టుకున్నారు ( అంతకు పూర్వం ఫాక్టరీ క్వార్టర్లే గా మరి!),కొంతమందైతే, పిల్లల పురుళ్ళకి విదేశాలకెళ్ళొచ్చారు. అడక్కండి ప్రతీవారి హావభావాల్లోనూ మార్పు కొట్టొచ్చినట్లు కనిపించడం మొదలెట్టింది.భర్తలు రిటైర్ అయ్యారు.మా శ్రీవారి సంగతి తెలుసుగా, ఓ స్కూటరుకానీ, కారుగానీ లేకుండానే మొత్తం ఉద్యోగ కాలం అంతా లాగించేశారు. ఇప్పుడైతే బస్సులధర్మమా అని ఆయన పాట్లేవో ఆయనే పడతారు. నా విషయానికొస్తే మాత్రం, నేను కష్ట పడకూడదని ' రాముడు మంచి బాలుడు' లాగ,ఎంతదూరమైనా సరే ఆటోలోనే వెళ్ళమంటారు.కొడుకూ, కూతురూ ఇక్కడే ఉన్నా, అందరికీ కలిపి మూడు నాలుగు కార్లున్నా సరే, వాళ్ళని ఎప్పుడూ తీసికెళ్ళమని అడగనీయరు. ఆయన అడగనీయరనడం దేనికిలెండి, అసలు నాకే ఆలోచన రాదు.హాయిగా ఎలాటి శ్రమా పడకుండా చూసుకునే భర్తుండగా, పిల్లల్ని దేవిరించడం దేనికీ అనే మనస్థత్వం మాది. దేంట్లో కలిసినా లేకపోయినా ఇందులో మాత్రం మా ఇద్దరిదీ ఒకే మాట.అలాగని పిల్లలతో ఒక్క మాట అంటే చాలు, వాళ్ళు ఎక్కడికి ఎంతదూరం అయినా తీసికెళ్ళడానికి ఎప్పుడూ రెడీయే!పైగా అస్తమానూ అంటూంటారు,' అప్పుడప్పుడు మాక్కూడా ఛాన్సిస్తూఉండండీ' అంటూ! అందరూ రిటైరయినవాళ్ళ భార్యలే ఏ ఇద్దరో ముగ్గురో తప్ప.చెప్పానుగా మా సభ్యుల మనస్థత్వాల్లో వచ్చిన మార్పులు ఒక్కొక్కప్పుడు బయట పడిపోయేవి.ఉదాహరణకి, మేము,మా అమ్మమ్మగారు(అంటే అత్తగారు) స్వర్గస్థులైన తరువాత, అప్పటికే మా మనవరాలికి, మాటా, నడకా వచ్చినతరువాతే, ఏదో మావారు నలభై ఏళ్ళపైబడే, మన ప్రాంతం నుండి వచ్చేశారూ, మళ్ళీ మనవారందరితోనూ, సంబంధ బాంధవ్యాలు ఓసారి తాజా చేసికుందామనే ఉద్దేశ్యంతోనే, రాజమండ్రీ కాపురం పెట్టాము.ఆ తరువాత,మనవడు వస్తూండడం చేత, ఓ మూడు నాలుగేళ్ళు ఉందామనుకున్నవాళ్ళం కాస్తా, ఏణ్ణర్ధానికే, పూణె తిరిగివచ్చేశాము.సామాన్లు ఎక్కువయుండడం వల్లనైతేనేం, పిల్లల్ని వాళ్ళదారిని వాళ్ళని ఉండనిద్దామనే ఉద్దేశ్యంతోనైతేనేం, ఓ ఫ్లాట్ అద్దెకు తీసికుని ( ఇద్దరు పిల్లలకీ దగ్గరలోనే) ఉంటున్నాము. విడిగా ఉంటున్నామనే కానీ,మనవడికి ఆరో నెల వచ్చేదాకా,అక్కడే ఉన్నాము.వాడిని డే కేర్ సెంటరుకి పంపించడం ప్రారంభించిన తరువాతే, మేము విడిగా ఉండే ఫ్లాట్ కి మారాము. వచ్చేమనే కానీ, ఇప్పటికీ, అబ్బాయీ, కోడలూ ఎప్పుడు రమ్మన్నా, అక్కడికే వెళ్ళి వస్తూంటాము.మేము ఏదో మనస్పర్ధలు వచ్చి విడిగా ఉండడంలేదు.అప్పటికీ మా అమ్మాయికి కోపం వస్తూనే ఉంటుంది-'మీరు ఎప్పుడూ అక్కడే ఉంటారూ, అప్పుడప్పుడు మా ఇంట్లో కూడా గడుపుతూండండీ' అంటూ.ఏం చేస్తాం చెప్పండి, అక్కడ మనవడికి మా అవసరం ఎక్కువుంటూంటుంది. ఎప్పుడో నెలకో, రెణ్ణెల్లకో అందరం కలిసి ఎక్కడికో అక్కడికి వెళ్తూనే ఉంటాం. వారాంతంలో ఓ రోజు కొడుకూ, కోడలూ ఇంకోరోజు కూతురూ, అల్లుడూ వస్తూంటారు. హాయిగా ఎవరిదారిన వారుంటున్నాము.సర్వేజనా సుఖినోభవంతూ! ఈ విషయాలన్నీ ఊళ్ళోవాళ్ళందరికీ చెప్పుకోవాలనేం రూలు లేదుగా!అయినా సరే, మా మెంబర్లలో చాలామందికి ఇదే హాట్ టాపిక్కైపోయింది.అలా అని ఎందుకంటున్నానంటే, ఈ మధ్యన ఓ రెండు మూడు నెలలనుండి, వాళ్ళ ప్రవర్తనలో ఏదో తేడా కనిపిస్తోంది.ఊళ్ళో స్వంత ఫ్లాట్ పెట్టుకుని, మేమే అద్దె ఫ్లాట్ లో ఉంటున్నామూ, ఏవో ఫామిలీలో తేడాలొచ్చాయీ,మనతో చెప్పడం లేదూ అని! అక్కడికీ రిటైరయిన తరువాత కూడా, కాంటాక్ట్స్ ఉంచుకోవాలనే కదా, అసలు ఈ నెలవారీ మీటింగులూ అవీనూ.అందులో ఇద్దరమే తెలుగువాళ్ళం.మిగిలినవాళ్ళందరూ యూ.పీ. వాళ్ళే. అయినా ఇదివరకెప్పుడూ తేడాలొచ్చేవి కావు. కొత్త సంవత్సరంలో నెలవారీ రెండువేలు చేద్దామన్నారు. అప్పటికీ మా పిల్లలూ, శ్రీవారూ అంటూనే ఉన్నారు, 'నీకేదో కాలక్షేపం అవుతోందీ, నెలకోసారి పాత మిత్రుల్ని కలుసుకుంటున్నావూ, కంటిన్యూ...' అని. నాకే ఏమీ తోచడం లేదు ఏం చేయాలో.ఊరికే వాళ్ళేదో అనుకుంటున్నారూ, వీళ్ళేదో అనుకుంటున్నారూ అని మధన పడుతూ,దాంట్లో కంటిన్యూ చేయకపోతేనేం, హాయిగా బ్లాగులోకంలో టపాలు వ్రాసుకుంటూ,ఎక్కడెక్కడి స్నేహితుల్ని సంపాదించడంలోనే ఆనందం ఉందేమో? మా శ్రీవారిని చూడండి, ఓ ఏణ్ణర్ధంలో ఎంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నారో? ఆయన పనే హాయి. ఏదో తన దారిన తను బ్లాగులు వ్రాసుకుంటూ కాలక్షేపం చేస్తారు. ఎవరైనా పలకరిస్తే మాట్లాడతారు. లేదా వాళ్ళెవరో పలకరించడంలేదూ అని ఊరికే బాధ పడిపోరు.ఎలాగైనా మహబాగే అనేది ఆయన పాలసీ! నాకే ఈ తాపత్రయాలన్నీ! ఏం చేయమంటారు మీరే చెప్పండి !!
మీరే చెప్పండి...
వీరిచే పోస్ట్ చేయబడింది
భమిడిపాటి సూర్యలక్ష్మి
on 14, నవంబర్ 2010, ఆదివారం
3 కామెంట్‌లు:
ఎవరు ఏమి అనుకున్న మీరు చేసింది చాల మంచి పని అండీ. అలా ఉంటేనే ప్రేమలు,అభిమానాలు కలకాలం నిలుస్తాయి.
Suryalakshmi gaaru..
Please ee comment post cheyyakandi.
Miru enti inta bela avvatam enti? Mimmalni inta badha pette vatiki duram ga undandi. kani nijamayina manushulatho matram contacts complete ga cut chesukokandi.. online vi online ee.. monnemadhya oka vishyam vinnanu (vishwa yogi Vishwam gari nundi), manishiki financial wealth, social wealth, spiritual wealth, inkoti chepparu gurthu ledu. manaki edanna share chesukovataniki manaki antu kondaru undali. naku cheppadam sariga ravatam ledu, kani family ee kaaka bayata friends kuda undali.. miku comfortable ga undevallathone undandi, mimmalni badha pette varitho kaadu. Please do not take me wrong. nenu mikanna chinnadanni edanna tappu ga cheppi unte tappaka manninchandi.
మీ బ్లాగు చదివినప్పుడు నాకు ఎప్పుడూ కూడా మీరు చాలా happy-go-lucky గా అనిపిస్తారు...అలాగే ఉండండి. ఎవరో ఎదో అనుకుంటున్నారని బాధపడేకన్నా, మీకు, బాబాయిగారికి ఇంతటి నవీన భావాలు ఉన్నందుకు ఆనందించండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి