మా యింటికి వచ్చిన బంధువలగురించి మా శ్రీవారు రాసిన టపా చదివారుకదా! సరే మొదటి రోజు భీమశంకర్ వెడదామని ప్లాన్ చేశాము. వీళ్ళ ట్రైన్ రావడం ఆలస్యమవడంవలన తెల్లవారి త్వరగా బయలుదేరదామనుకున్న వాళ్ళం ఆలస్యంగా బయలుదేరాము. కబుర్లు చెప్పుకుంటూ వెడుతున్న మాకు కొద్దిదూరం వెళ్ళేసరికి టైరు లో హవా తుస్. అది మార్చి మళ్ళీ బయలుదేరేసరికి నా కనిపించింది గుడి తలుపులు వేసేస్తారేమోనని. సరే!చూద్దాం ఆ శంకరుడు ఏం చేస్తాడో? కిందటిసారి వెళ్ళినపుడు అతి ప్రయత్నం మీద దర్శనం చేసుకున్నాము. చాలా రష్ గా వుంది.మేము నాలుగు ఫామీలీలు కలసి దర్శనం చేసుకొని అందరం తలో ఒక వంట చేసుకొని వనభొజానాలు కానిచ్చి తంబూలా ఆడుకొని సరదాగా గడిపి వెళ్ళాము. అ తరువాత చాలా మంది ఆంధ్రా నుండి వచ్చేవారు షిరిడి,నాసిక్,పూనె వచ్చి అష్టవినాయక్ దర్శనం,జ్యోతిర్లింగాలలో ఒకటైన భిమాశంకర్ చూసివెడుతునారని చెప్పి మేము వీళ్ళని తీసుకొని బయలుదేరాము.వాళ్ళు మామీదే వదిలేసారు ఎక్కడకి తీసుకువెళ్ళాలనేది. సరే! ఈ సారి ఎలా అవుతుందో దర్శనం , చూద్దాం. డ్రైవరు నెమ్మదస్తుడేనూ, బాగానే నడుపుతున్నాడు. కారు కూడా పరవాలేదూ, ఇండికా, ఎ.సి అదీ పెట్టాడు. ఘాట్ రోడ్డు మీద జాగర్తగానే తీసుకువెళ్ళాడు. చాలాదూరంలోనే ఆపేసి ఇక్కడనుండి నడిచివెళ్లాలన్నాడు. ఇదివరకటికి ఇప్పటికి ఆదాయం బాగుందనుకుంటాను. సిమెంటు దారి మెట్లు, అపక్క ఈపక్క చాలా కొట్లు కనిపించాయి.పనులు బాగానే జోరుగానే జరుగుతున్నాయి. అంతే కాకుండా డోలీలు కూడా వున్నాయి. మధ్యలో చెట్ల నీడలు, చల్లటి గాలులు,కోతుల కంపెనీతో హాయిగా మెట్లు దిగుతూ వెళ్ళిపోయాము. ( కొండ ఎక్కడం కాదిక్కడ,మెట్లు దిగాలిక్కాడ) గుడిలో ప్రవేశించి అక్కడే కూర్చున్న ఓ పూజారిగారిని అడిగాను అబిషేకాలు, ఏదయినా పూజ లాంటిదీ వుందా అని? చాలా ఆలస్యంఅయిపోయిందీ, ఏమీ వుండదని అనుకొంటూ,రుద్రాభిషేకానికి అంటుంటే ఆశ్చర్యంగా వుందా వుంటే యివ్వండీ,ఏమండీ, రుద్రాభిషేకానికి తీసుకోండీ, అంటూ అరిచినంతపని చేసాను. దర్శానానికే కాని ఏ పూజ కి అవకాశం వుండదులే అనుకొని మనసుకి సమాధానపరిచేసుకున్నాను అప్పటికేనూ, అలాంటిది ఆ అవకాశానికి మురిసిపోయి నేను చదివే లలితా సహస్రనామానికి ఫలితం దక్కిందనుకొని మురిసిపోయాను. లోపలికి తీసుకెళ్ళి రెండు పీటలు వేసి మమ్మల్ని కూర్చొమన్నారు, మా మరిది , భార్యా, ఓ పక్కన లోపలేకూర్చున్నారు. వారు చేసుకోలేదులెండి. ఇంకా ఎవరేనా వస్తారేమొ ననుకున్నాను అబ్బె ఎవరూ రాలేదు. మేమేను. అ రోజుకి మాదే ఆఖరి అభిషేకం. చాలా బాగా చేయించారు.రుద్రం, నమకం చమకం చాలా చక్కగా చదివారు. పంచామృతాలు అన్నీమంచిగా యిచ్చి చేయించారు.(ఒక్కోక్కసారి మరీపొదుపు పాటించేస్తారు కదా)అనుకోని అదృష్టం యిది.అక్కడున్న అందరు బ్రాహ్మలూ గొంతు కలిపి నమకం చమకం చదువుతుంటే ఆహ్ ! అద్బుతం. మనసారా తృప్తిగా ఆ శంకరుని సేవించుకొని వచ్చాము.ఇంక మా జయ (తోటికోడలు) ఎంత మురిసిపోయిందో చెప్పలేను.అక్కయ్యగారు మంచిగా ప్లాన్ చేసారండి అంటూ-- ఆ తరువాత బయట కాసేపు కూర్చొని ఫోటోలు తీసుకున్నాము. ఇంతలో గుడి తలుపులు మూసేస్తామన్నారని బయటకు వచ్చేసాము. మా కోసం అగినట్లుగా ఆగి మా చేత అభిషేకంచేయించుకున్న శివయ్యకి బై చెప్పి వచ్చేసాము.మా జయ కొంత షాపింగ్ చేసింది. కోతుల్ని తప్పించుకొంటూ , మెట్లు ఎక్కుతూ పైకి వచ్చి అక్కడె వున్న దుర్గ గుడి కి వెళ్ళి కారులొ వెనక్కి బయలుదేరాము. అపుడు ఆకలి తెలిసివచ్చింది.కొంత ఘాట్ రోడ్డు దాటిన తరువాత గుబురుగా వున్న చెట్ల దగ్గర ఆగి ఆ నీడలో మా కోడలు శిరిష (చాలామంది బ్లాగ్ మిత్రులకి పరిచయం అయింది కదా ఈ మధ్య.) అందరికీ తలో మేథీ పరోటాల పేకెట్, తలో పేకెట్ పెరుగు అన్నం, చక్కాగా పేక్ చేసి యిచ్చినదీ తినేసి తిరుగు ప్రయాణం మొదలుపెట్టి రాత్రి 8 గంటలకి ఇంటికి చేరుకున్నాము. ఇదండీ, మా మొదటి రోజు ట్రిప్పు.
పైన ఇచ్చిన ఫొటోల్లో, అమ్మవారిపైన అద్దంలో కనిపించేది భీమాశంకరుని ప్రతిబింబం.
భీమాశంకరుడి దర్శనాభిషేకం...
వీరిచే పోస్ట్ చేయబడింది
భమిడిపాటి సూర్యలక్ష్మి
on 17, డిసెంబర్ 2010, శుక్రవారం
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి