'మా'టి.వీ. లో ప్రతీరోజూ ఉదయం 8.30 నుండి ప్రసారం అయే 'అర్ధనారీశ్వర స్తోత్రం/తత్వం' మీద శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి, అద్భుతమైన వ్యాఖ్యానాలు అందరూ వింటూన్నారనే అనుకుంటాను. ఎవరైనా ఇప్పటివరకూ చూడకపోతే, ఒక్కసారి చూడండి.దంపతుల అన్యోన్యత అంటే ఏమిటో అర్ధం అవుతుంది.ఆయన చెప్పే ప్రవచనాలు వింటూంటే, ఎప్పుడో చిన్నతనం లో జరిగినవెన్నో జ్ఞాపకం వస్తాయి.ఆరోజుల్లో అమ్మ అలాగే ఎందుకుచేసేదో,అప్పుడు తెలిసేదికాదు.ఇప్పుడు శ్రీ చాగంటి వారు చెప్పే ప్రవచనాలవలన, వాటిలో అంతరార్ధం తెలుస్తోంది. ఈవేళ్టి కార్యక్రమం లో, భార్య భోజనం వడ్డించినప్పుడు నాన్నగారికే ముందుగా వడ్డించేదో, మా అమ్మమ్మ తాతయ్య తిన్న ఆకులోనే ఎందుకు తినేవారో తెలుస్తోంది. ఆ రోజులే వేరు. నా చిన్నతనంలో మా యింట్లో సాయంత్రం భోజనాలకి అందరం కలసే తినేవాళ్ళం. పగలయితే కుదిరేదికాదు. పిల్లలు ఎలిమెంటరీ స్కూల్, అమ్మ ఎలిమెంటరి స్కూల్ టీచరు. నాన్నగారు హైస్కూల్ టీచరు. నేను పెద్దదాన్ని కనక పొద్దునే 9 గంటలకి నాన్న గారికి అన్నంపెట్టే పని నాకప్పగించేది. రోజూ చేసేపనయినా సరే! రోజూ-- ఎలా పెట్టాలో చెప్పి వెళ్ళేది.అయినా ఓ రోజు మంచినీళ్లు మరచిపోయి, ఇంకో రోజు పచ్చడి మరచిపోయి చివాట్లు తినేదాన్ని.మా నాన్నగారు ఏమీ అనేవారు కాదు కాని మా అమ్మ మాత్రం శలవు రోజుల్లో సాయంత్రం భోజానాల సమయంలో మాకు నేర్పేది. అన్నాలకి ముందు మాచెల్లి కంచాలు పెట్టడం, మంచినీళ్ళు పెట్టడం , ఆ తరువాత మా అమ్మ ఆన్నం వడ్డీంచేది. అప్పుడే లోకాభిరామాయాణం,ఏవో కబుర్లు బాగానే వుండేవి కాని హోమ్ వర్కు, పరీక్షలు, మార్కులు విషయాలు మాత్రం నచ్చేదికాదు. భగవంతుడా! ఈ ప్రసంగం రాకుండా చూడూ తండ్రీ! అనుకునేవాళ్ళం,అన్నాలు తినడం అయిన తరువాత ఎంగిలి కంచాలు తీయడం, నీళ్లగ్లాసులు కడగడం నా పని. వంటిల్లు కడుక్కోవడం పొయ్యి శుభ్రపరచుకోవడం,ముగ్గు వేసుకోవడం అమ్మ పని. ఆ తరువాత నేను కొంచెం పెద్దదాన్ని అయిన తరువాత అమ్మ పని నేను నాపని మా చెల్లెలు,అలా అంచలంచలుగా మారుతూ వచ్చింది.అలాంటి వాతావరణంలో పెరిగిన నాకు పెళ్ళయిన తరువాత కూడా మా యింట్లోఅలాగే వుండేది. శలవు రోజుల్లో, సాయంత్రాలు,మాత్రమే కుదిరేది. అన్నం తిన్న తరువాత ఎవరి కంచాలు వాళ్ళు వాష్ బేసిన్ లో వేయడమనే అలవాటు చేసాను.ఆదివారాలు స్పెషలుగా పదార్ధాలు చేసుకొని అందరం కిందకూర్చుని అరటి ఆకులలో తినేవాళ్ళం. ఆ రోజులు ఎంత ఆనందంగా వుండేదో చెప్పలేను. ఇక యిప్పుడంటరా అదీ చెప్పలేకపోతున్నాము.ఎవరికి సమయమే వుండటం లేదు, ఆదివారాలు ఆలస్యంగా లేవడాలు,పనులు ఆలస్యం, అందరిదీ తలో రకం బ్రేక్ ఫాస్టు తో మొదలవుతుంది, అదీ 10 గంటలకో 11 గంటలకో,ఇంక అందరూ కలిసి భోజనం చేసే అవకాశం ఎక్కడా?పోనీ ముందుగా నిశ్చయించుకుని కూర్చుందామా అంటే, అంతట్లోకే ఇంటికి ఎవరో రావడం, ఆదరా బాదరాగా ఏదో అయిందనిపించేయడం.ఇదివరకటి రోజుల్లో అంటే, పిల్లలు మన చేతుల్లో ఉన్నంతకాలం, ఏదో నెలకొసారైనా వీలు పడేది. తరువాత్తరువాత, ఇంట్లొకి చిన్న పిల్లలు రావడంతో, ఆ బాబునో, పాపనో చూడ్డానికి ఎవరో ఒకరు భోజనం అందరికంటే ముందుగానో, చివరలోనో చేయవలసిన పరిస్థితీ ! పోనీ ఇదివరకటి రోజుల్లోలాగ పనసపొట్టు కూరా, కందా బచ్చలి కూరలా అంటే అవీ లేవూ!ఎక్కడ చూసినా నూనెక్కువయిందీ, ఫిగరు మైంటైన్ చేయడం,కాలొరీలూ ధర్మమా అని, సలాడ్లూ,రైతాలూ ఇవీ !పోనీ వాటినైనా ఓ టేబుల్ చుట్టూరా కూర్చుని తింటారా అంటే అదీ లేదు. టి.వీ. లో కార్యక్రమాలు మిస్ అవకూడదని డ్రాయింగు రూం లో సోఫాలమీద చతికిలబడి తినడం. చేసిన పదార్ధాలన్నీ టేబుల్ మీద పెట్టేయడం, ఎవరిక్కావలిసినవి వాళ్ళే తీసికోడం, దీనితో వడ్డించడమనే కాన్సెప్టు కొండెక్కేసింది. ఇంక మిగిలిందేమిటయ్యా అంటే, ప్రవచనాలు విని, చిన్నప్పటి జ్ఞాపకాలు నెమరువేసికుని ఆనందించడమే !
మిగిలినవి జ్ఞాపకాలే
వీరిచే పోస్ట్ చేయబడింది
భమిడిపాటి సూర్యలక్ష్మి
on 21, మార్చి 2011, సోమవారం
2 కామెంట్‌లు:
చాగంటివారి ఈ ప్రవచనాలు వినకుండానే...మీ జ్ఞాపకాలు వింటూ మా జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాను. కాలం మారిపోయింది...తోంది...ఏం చేస్తాం...వయసుమీద పడుతున్నకొద్దీ...మిగిలేవి జ్ఞాపకాలే.
సుధా,
కానీ కాలంతోపాటు మనమూ పరిగెత్తవలసివస్తోంది !
కామెంట్‌ను పోస్ట్ చేయండి