ఇంతదూరం వచ్చి, మా ఎల్లారమ్మతల్లి దర్శనం చేసికోకుండా ఎలా ఉంటాను? రెండో రోజు ఆ కార్యక్రమం పెట్టుకున్నాను. నన్ను బయటకి రావద్దని, మా చెల్లెలు, తనే రానూపోనూ,ఓ ఆటో మాట్లాడేసింది. నన్నూ, నా వేషాన్నీ చూస్తే డబ్బులు ఎక్కువ అడుగుతారనీట,అదేం చిత్రమమ్మా? నిజమేకాబోసనిపించింది, మేము రాజమండ్రీలో ఉన్నప్పుడు కూడా, నేనెప్పుడైనా, ఆటో మాట్లాడితే మామూలుగా తీసికునేదానికంటే ఎక్కువే అడిగేవారు!అదేదో 'సంతూర్'యాడ్ అనుకోకండి, ఏదో ఉన్నదేదో చెప్పాను!మా శ్రీవారు చెప్పేశారు, ప్రతీదానికీ, నువ్వు ముందరకి రాకూ అని!ఇలాటివి వింటూంటే బావుంటుంది కదూ ! అక్కడ పూజచేయించుకుని,మా టెండర్ లీవ్స్ గురించి ప్రార్ధించేసికుని, తిరిగివచ్చేశాము. ప్రతీ ఏడాదీ ఫిబ్రవరి 28 న పూజ చేయించి, ప్రసాదం పంపమని డబ్బు కట్టాము రెండేళ్ళ క్రితం. మాకు ఆ ప్రసాదం వచ్చిన సూచనలేమీ కనిపించకపోవడంతో, అక్కడ అడిగితే, లెడ్జరు చెక్ చేసి, పంపుతున్నట్లు చెప్పారు. పూజచేయించడంవరకూ మన బాధ్యత, తరువాతి పాపం పుణ్యం వాళ్ళకే చెందుతుంది. అక్కడ ఎండలు చూసి హడలెత్తిపోయాను. మర్నాడేమో, 'గ్రామకుంకం నోము' చేసికుని, అయిదు వీధుల్లో,గడపదాటకుండా, గడప వదలకుండా, పసుపూకుంకాలు పంచిపెట్టుకోవాలిట! అసలు ఈ ఎండలో వెళ్ళకలనో లేక ఏ స్కార్ఫూ,కూలింగ్ గ్లాసులు పెట్టుకుని వెళ్ళాలేమో అని భయపడిపోయాను! పైగా పూజ చేసికుని, పసుపుకుంకాలు పంచిబెట్టేదాకా ఏక్ దం సైలెన్స్! ఎవరితోనూ మాట్లాడకూడదు. అందుకే ఆ ముందురోజే మా శ్రీవారికి చెప్పేశాను ఫోన్లూ వగైరా చేయొద్దని.పుజయింతరువాత నేనే చేస్తానని.సుఖపడ్డారు ఓ కాల్ డబ్బులు మిగిలాయి! ఓ సైకిలు రిక్షాలో మా ముగ్గురివీ ( నాదీ, నా చెల్లెలుదీ,మరదలుదీ) పసుపూ కుంకాల క్యాన్లూ,అరటిపళ్ళ గెలలూ వేసికుని ఊరేగింపుగా బయలుదేరాము కాలనీ లోకి! మా గురించి చెప్పడానికి మా ఇంకో చెల్లెలూ, మా తమ్ముడికూతురూ ముందర వెళ్ళడం.ప్రతీ ఇంటికి వెళ్ళి తలుపుకొట్టి, 'మూడు పళ్ళేలు ఇవ్వండీ' అని అడగడం, ఆ ఇంటివాళ్ళు తెచ్చిన పళ్ళాల్లో, మేము ముగ్గురం ఒకరితరువాత ఒకళ్ళు,గడప దాటకుండా, రెండరిటిపళ్ళూ, దక్షిణా, గరిటెతో తీసి పసుపూ కుంకం పెట్టడం, ఇంకో గడపకెళ్ళడం. ఓ మాటలేదు, మంతిలేదు.ఏమిటో ఈ వ్రతాలూ నోములూనూ! మెము రాజమండ్రీలోనే ఉండేటట్టయితే, మా అమ్మా, చెల్లెళ్ళూ నాచేత ప్రపంచంలో ఉన్న వ్రతాలూ నోములూ చేయించేసేవారు.మరి అక్కడినుండి వచ్చేయడం దురదృష్టం అనుకోనా, లేక ఘటన లేదనుకోనా? అవకాశం వచ్చిందీ, చేసికున్నాను. మిగిలినవన్నీ ఆ 'అమ్మ' కే వదిలేశాను. ఆ పసుపుకుంకాలు ఇవ్వడం బలేగా ఉంది. మావాళ్ళు వెళ్ళడం, కొన్ని చోట్ల, మగాళ్ళే తలుపు తీసి,గడపకి బొట్టుపెట్టేసి వెళ్ళండమ్మా అనడం. అబ్బా అలా ఎలా వీలౌతుందీ?ఆవిడకు రావడానికి వీలవకపొతే, ఇంటాయనైనా పళ్ళెం పుచ్చుకు రావల్సిందే. మా చెల్లెలా వదిలేది? అకస్మాత్తుగా వెళ్ళి మూడు పళ్ళేలు ఇవ్వండీ అంటే, వాళ్ళిళ్ళల్లో ఉండొద్దూ? కొందరు టిఫిన్ ప్లేట్లూ, కొందరు పులిహారకలుపుకునే పళ్ళాలూ! ఎవరికి వీలయినవి వాళ్ళు తెచ్చారు. మొత్తానికి ఆ కార్యక్రమం పూర్తిచేసికుని ఇంటికి చేరాము. అమ్మయ్యా మొత్తానికి నేనూ చేసికున్నాను జీవితంలో రెండో నోము!మొదటిది శ్రావణ మంగళగౌరీ నోమూ, ఇదిగో ఇప్పుడు ఈ గ్రామకుంకం నోమూ. మర్నాడు శుక్రవారం, మా మరదలు 'సంపద శుక్రవారం నోము' చేసికుంది. ఆరోజు అయిదుగురు ముత్తైదువలకి,విందు చేసి, ఓ వెండి కుంకం భరిణ, ఓ చీరా బ్లౌజు పీసూ పెట్టుకోవాలిట.నేనూ, మా ఇద్దరు చెల్లెళ్ళూ( ఇంకో చెల్లెలు రాలేకపోయింది), వాళ్ళ అమ్మగారూ,పెద్దమ్మగారూ, మొత్తం అయిదుగురూ విందు భోజనం చేశాము. ఓ వంటావిణ్ణి కుదిర్చి, షడ్రసోపెతంగా విందు చేసింది. అయ్యో మా శ్రీవారు రాలేకపోయారే, ఎంతలా ఎంజాయ్ చేసేవారో అనుకున్నాను! మా మరదలు వయస్సులో చిన్నదైనా, ఎన్నో రకాల నోములు శ్రధ్ధగా చేసికోవడం చూసి ముచ్చటేసింది.మర్నాడు శనివారం మళ్ళీ కేసినేని ట్రావెల్స్ లో ఎక్కి ఆదివారం ప్రొద్దుటే హైదరాబాద్ చేరి, ఆరోజంతా, మా చెల్లెలుతో గడిపి, మళ్ళీ కెసినేని ట్రావెల్స్ లో పూణె క్షేమంగా చేరాను. మళ్ళీ ఇల్లూ, శ్రీవారూ, పిల్లలూ, ఎక్కడ తిరిగినా ఏం చేసినా అన్ని రోజులు వీళ్ళందరినీ మిస్సయి, తిరిగి వాళ్ళందరినీ చూడ్డంలోఉండే ఆనందం వేరూ !
దేనికైనా 'దంతసిరి' అనేదుండాలిలెండి!
నేనూ చేసికున్నాను ఇన్నాళ్ళకి ఓ నోము...
వీరిచే పోస్ట్ చేయబడింది
భమిడిపాటి సూర్యలక్ష్మి
on 9, మే 2011, సోమవారం
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి