మొత్తానికి ఈ ఏడాది ఊరగాయ( పెద్ద ఏమీ ఎక్కువేం కాదూ, ఆవకాయా, మాగాయా)ల ప్రకరణం పూర్తయింది.అమ్మాయికొక బాటిలూ, అబ్బాయికో బాటిలూ,మాకో బాటిలూ, ఏదో ఈ ఏడాదెళ్ళిపోతుంది. మధ్యలో అయిపోయినా, మదర్స్ డైరీ, ప్రియా ఎలాగూ ఉన్నాయి. అదేమిటో, ప్రతీ రోజూ ఊరగాయ లేకపోతే ముద్ద దిగదు మా శ్రీవారికి.పప్పులోకి ఏ రోజైనా వేసికోడానికి ఓ రోజు చుక్క కూరా, ఓ రోజు టమాటాలూ, ఏదీ లేకపోయినప్పుడు, మామిడికాయ ఒరుగులూ . మా పిల్లలకి కూడా ఈ ఒరుగులు వంట పట్టాయి లెండి.మా అబ్బాయి వాళ్ళింటికి వెళ్ళినప్పుడు, వాళ్ళ కుక్కు ఆ పప్పులో బీరకాయలో, పాలకూరో వేస్తూంటుంది, మా శ్రీవారికి అది తినడానికి చిరాకూ. మొన్న శనివారం నవ్యని వాళ్ళ అమ్మమ్మ,తాత గార్లవద్ద దిగబెట్టడానికి, అబ్బాయీ,కోడలూ, అగస్థ్యా కారులో హైదరాబాద్ వెళ్ళి వచ్చారు. వాళ్ళు తిరిగి వచ్చేదాకా టెన్షనే, కారులో వెళ్ళారూ, పిల్లలు అంతంతసేపు కారులో ఎలా కూర్చున్నారో అని. ఏమిటో చెబితే వినే రోజులా, హాయిగా కొద్దిరోజులు ముందుగా ప్లాన్ చేసేసికుని రైల్లో వెళ్ళి రావచ్చుకదా.అలాటివి మనం చెప్పకూడదూ, వాళ్ళు వినకూడదూ. రేపెప్పుడో వీళ్ళ పిల్లలూ పెద్దాళ్ళయిన తరువాత తెలుస్తాయి, ఎంత టెన్షన్ గా ఉంటుందో? అదే జీవిత చక్రం అంటే, మనం మాత్రం మన పెద్దాళ్ళు చెప్పినప్పుడు విన్నామా ఏమిటీ? అందుకే అంటారు 'తనదాకా వస్తేనే కానీ...' అని. బ్లాగులు వ్రాస్తూంటాడే శ్రీనివాసు , అతని తల్లితండ్రులు వచ్చారు ఈ మధ్యన, మమ్మల్ని కలవాలని ఉందంటే, ఎలాగూ మా స్వంత ఫ్లాట్ చూసినట్లుంటుందని, అక్కడికే తీసికుని రమ్మన్నాము. ఏం లేదూ, వాళ్ళు మా తణుకు వాళ్ళు, ఇదో కారణం లెండి, మేము నలుగురం కలసి, ఒక్కసారైనా మా శ్రీవారిని ( తూ.గో.జి) ఏడిపించొచ్చూ అని! మరీ శ్రీనివాసు తండ్రిగారు మొహమ్మాటస్థులూ, పోన్లెండి పెద్దవారు, మరీ నలుగురం కలిసి ఆయనని కష్టపెట్టడం భావ్యం కాదూ అనేసరికి పోన్లే అని వదిలేశాము!ఆయన చాలా కాలం తణుకు లో పనిచేశారుట, మా నాన్నగారిని చూసిన గుర్తుందీ, అయినా ఓసారి ఫొటో చూపించండీ, అన్నారు కదా, మా నాన్నగారి ఫొటో, తొందరగా దొరకలేదని, మా అమ్మాయి పెళ్ళి ఆల్బం తెచ్చాను. వాళ్ళది ఎలాగు తీశానుకదా అని మా అబ్బాయి పెళ్ళి ఆల్బం కూడా చూపించాను. వాళ్ళు చూస్తున్నంతసేపూ, మా శ్రీవారూ, శ్రీనివాసూ ఒకటే నవ్వూ. ఏం లేదులెండి, మా శ్రీవారు అప్పుడెప్పుడో ఓ టపా పెట్టారు, ఎవరింటికైనా వెళ్ళినప్పుడు పడే ఆల్బం బాధల గురించి. అందుకే అంటాను, అందరూ మనంత మంచివాళ్ళు కాదూ, ఛాన్సొస్తే వదలరూ అని. చూశారా ఏదో ఒంటరివారైపోయారని, మన ప.గో.జి వారు ఆయన్ని ఏడిపించకుండా వదిలామని విశ్వాసమైనా లేకుండా, ఏదో ఆ వచ్చినవారు, అభిమానంతో పిల్లల ఆల్బమ్ములు చూస్తూంటే నవ్వులూ వేళాకోళాలూనూ.ఏం చేసినా బాగుపడరు. ఈవేళ ప్రొద్దుటే, మా అమ్మాయికివ్వడానికి మాగాయా,మామిడి ఒరుగులూ ఇచ్చి పంపించాను.ఎప్పుడో కానీ, మా అమ్మాయి దగ్గరకు ఆయనొక్కరే వెళ్తూంటారు,బస్సులో వెళ్ళొచ్చని. మళ్ళీ నన్నైతే ఆటోలో తీసికెళ్ళాలని.ఎక్కువ పనేమీ లేదుకదా, ఒకసారి ఫ్లోరింగూ, మిగిలినవీ అన్నీ శుభ్రపరుద్దామని, కిరసనాయిల్లో ఓ గుడ్డ ముంచి, క్లీనింగు మొదలెట్టాను. ఇల్లంతా ఆ కిరసనాయిలు వాసనే. బయటకి కూడా వస్తోందిట. ఆవిడెవరో, ఏమనుకుందో ఏమో, ఏ బ్రైడ్ బర్నింగో ఏదో జరుగుతోందనుకుందో ఏమిటో ఖర్మ, వచ్చేసి ఇంట్లోంచి కిరసనాయిలు వాసనేస్తుందేమిటీ అంటూ పంచనామా మొదలెట్టింది. ఏం లేదు తల్లీ ఏదో ఇల్లంతా క్లీనింగు చేసికుంటున్నానూ అని, కిరసనాయిలు గుడ్డ చూపించాను! అప్పుడనిపించింది, ఇరుగుపొరుగు వాళ్ళకి ఈమాత్రం awareness ఉండుంటే, ఎన్నెన్ని బలవంతపు చావులు తప్పేవో కదా అని!
ఏమిటో తోచడం లేదు...
వీరిచే పోస్ట్ చేయబడింది
భమిడిపాటి సూర్యలక్ష్మి
on 31, మే 2011, మంగళవారం
4 కామెంట్లు:
చూసారా చూసారా కష్టపడి మీరు అంతా క్లీన్ చేస్తే ఆయనే కష్టపడ్డట్టు టపా వ్రాసుకున్నారు. పని తక్కువ, అడ్వెర్టైజ్మెంట్ ఎక్కువా ఆయనకి. ఒక తడి గుడ్డ చేతిలో పట్టుకొని అందరికీ కనిపించేటట్టు నుంచున్నారు ఆయన. దీన్ని సహించరాదు. మీరు ఇంకో టపా వేసెయ్యండి.
బాగుందండి... ఈ మామిడికాయ ఒరుగులు ఎలా చెయ్యాలో, ఎలా వాడాలో కాస్త చెప్దురూ. రైతు బజారుకెళ్ళినప్పుడల్లా ఆ మామిడి కాయలూ, వాటిని పచ్చడికోసం కొట్టించుకునేవాళ్ళనూ చూసి కుళ్ళు వస్తుంది నాకు. పోనీ నేనే చెయ్యి చేసుకుందామా అని తృష్ణ గారి బ్లాగులో చూసిన మెంతిబద్దలు పెడితే...హ్మ్మ్....!!!
పోనీలేండి.. ఆయన ఒక్కరే అయిపోయారు పాపం అని నేనే వదిలేయమన్నాను. కయ్యానికి సమవుజ్జీ కావాలంటారుకదా మరి!, అందుకే. :-)
ఈ బ్లాగుకు కామెంటిద్దామని ఎప్పటినుండో అనుకుంటున్నా.. బ్లాగ్ స్పాట్ మా ఆఫీసులో బ్లాక్ చేసారు. ఇంటి దగ్గరనుండి ఇవ్వటానికి ఇప్పుడు ఖాలీదొరికింది.
@సుబ్రహ్మణ్యంగారూ,
ఏదో వయస్సులో పెద్దవారు కదా అని, వదిలేస్తూంటే,ఈపబ్లిసిటీలూ వగైరా ఎక్కువైపోయాయండి ఈమధ్యన !
@రూత్,
మరీ వర్షాలొచ్చేశాయి. మామిడికాయ ముక్కలు ఎలా ఎండబెడతారూ? మామిడికాయలు తరిగి ముక్కలు చేసికుని, ముందుగా ఉప్పులో వేయాలి. ఓ రోజుంచిన తరువాత, ఊట దిగుతుంది. ఆ ఉప్పులో వేసిన ముక్కల్ని, ఊటంతా పిండేసి,
ఓ చాటలోనో, లేక ప్లాస్టిక్ కాగితంలోనో, శుభ్రంగా, ఎండ తగిలేటట్టుగా పెట్టేసికుని, ఓ రెండు మూడు రోజులుంచిన తరువాత, ఒకేవైపుకి కాకుండా, రెండువైపులా ఎండేటట్లు చూసుకోవాలి. ఓ రెండు మూడు రోజులకి, శుభ్రంగా ఒరుగుల్లా గ తయారవుతాయి. వాటిని ఓ సీసాలో పెట్టుకుని, మామిడి కాయల సీజను పూర్తయిన తరువాత కూడా, ఏ పప్పులోకో వేసికోడానికి ఉపయోగిస్తాయి. ఏడాదంతా ఉంటాయి.అ మిగిలిన ఊటని ఏ మాగాయిలోకో కలిపేసికోడమే !
@శ్రీనివాసూ,
నిజమే కదూ! మీ ఇంటిదగ్గరైతే సుధనీ, మీ బావమరిదినీ చూసుకుని, మరీ పేట్రేగిపోయారు !!
కామెంట్‌ను పోస్ట్ చేయండి