జాతకాలూ, రాశిఫలాలమీద నమ్మకం ఉందా లేదా అన్నది కాదు ప్రశ్న.వాటిని కొంతమంది నమ్ముతారు,కొంతమంది సో కాల్డ్ హేతువాదులు, రేషనలిస్టు అని ఓ పేద్ద ఇంగ్లీషు పేరు పెట్టుకొని కొట్టిపారేస్తారు.ఎవరిష్టం వారిదీ.మేము ప్రతీ రోజూ టి.వీ. ల్లో వచ్చే శుభలగ్నం, కాలచక్రం, రాశిఫలాలు, etc etc... మాత్రం తప్పకుండా చూస్తూంటాము. ఆరోజు/వారం బాగా ఉంటే ఆనందిస్తాం, లేకపోతే వారు చెప్పే జాగ్రత్తలు తీసికోవడం. జాగ్రత్త తీసికోవడం వలన మనకి వచ్చే నష్టం ఏమీ లేదుగా. మరీ, వాటిగురించే ఆలోచిస్తూ,ఏదో మిన్ను విరిగి మీదపడుతుందని టెన్షన్ తెచ్చేసికుంటే కష్టం. జరిగేదేదో జరక్క మానదు అనేదే మా ఇద్దరి ప్రిన్సిపుల్.
ఇప్పుడు చెప్పొచ్చేదేమిటంటే, మే నెల మొదట్లో నా జాతకం ఎలా ఉందో నెట్ లోనూ, పత్రికల్లోనూ, టి.వీ. లోనూ ముందుగా తెలిసేసికున్నాను--
1. ఆకశ్మిక ప్రయాణాలు-- మా అమ్మ పిలిస్తే,గ్రామకుంకం నోము నోచుకోడానికి తణుకు వెళ్ళానా లేదా....
2. వాహనయోగం-- వాళ్ళేదో, బెంజి, బి.ఎం.డబ్ల్యూ అనేమీ చెప్పలేదు, కేసినేని స్లీపర్, వియ్యాలారి కారులోనూ, ఆటోలూ ప్రయాణం చేశానా లేదా...
3.విందులూ,వినోదాలూ... తణుకులో పుట్టింట్లో అమ్మ దగ్గరా, తిరిగి వచ్చిన తరువాత, రిసెప్షన్లూ, గృహప్రవేశమూ, పిల్లల పెళ్ళిరోజులూ....
4. ఖర్చులెక్కువ....... మరి ఈ పైన చెప్పినవన్నీ ఊరికే వచ్చాయా ఏమిటీ?
5. వస్త్రలాభం......... పుట్టింట్లో ప్రతీవారి దగ్గరనుండీ ఓ చీరా, బ్లౌజు పీసూ....
6.దైవ దర్శనాలు .... మండపాక ఎల్లారమ్మ దర్శనం.
7 సోదరీ సహోదరులతో కలయిక.. అబ్బ పదేళ్ళ తరువాత అందరు చెల్లెళ్ళూ, అమ్మ తో కలయిక.
8.వెలితి....... తమ్ముణ్ణి కలుసుకోలేదనే వెలితి.
9.జీవిత భాగస్వామి తో ఎడబాటు.. నా తణుకు ట్రిప్పు 10 రోజులూ, మా శ్రీవారి బాపట్ల ట్రిప్పు ధర్మమా అని పదిహెనురోజులు విడిగా ఉన్నామా లేదా..
10.కొనుగోళ్ళు, కమనీయ దృశ్యాలు.. మా కోడలు తనకి కావలిసినవి కొనుక్కుంటుంటే,సాయం వెళ్ళి విండో షాపింగు....
11. గృహం లో మార్పులూ చేర్పులూ... మా బాత్రూం తలుపు జాం అయిపోతే, వడ్రంగాణ్ణి పిలిచి, రిపేరీ చేయించడం,కిచెన్ డ్రైన్ లోంచి, నీళ్ళు చోక్ అయిపోతే ప్లంబర్ చేత రిపేర్ చేయించడం.
12. కర్తవ్యాలు పూర్తిచేయడం.. ఊరగాయలు పెట్టడం, కొడుక్కీ కూతురికీ సీసాల్లో పెట్టి ఇవ్వడం. మామిడికాయ ఒరుగులు బోనస్సోటీ..
13.అలంకార ప్రాప్తి.... అమ్మాయినుంచీ, కోడలునుంచీ yardly పౌడరూ, ఎలోవేరా జెల్లూ, ఓలే క్రీమ్మూ,క్లిప్పులూ, ఫాన్సీ గాజులూ( ప్రయాణం కోసం),etc etc...
14. స్వల్ప అనారోగ్య సూచనలు... నడుం నొప్పీ, కాలు నొప్పీ.
15.పాత మిత్రుల కలయిక.. రిసెప్షన్ల లో కలసిన పాత స్నేహితులు.
ఆతావేతా తేలిందేమిటంటే, మూడు పువ్వులూ, ఆరుకాయల్లా, మూడు పెళ్ళిళ్ళూ ఆరు రిసెప్షన్లూ, డైటింగు నిల్లూ, బ్యాంక్ ఎకౌంటుకి చిల్లూ, గైనేమిటయ్యా అంటే రెండు కిలోల బరువూనూ..మిశ్రమ ఫలితాలేమిటయ్యా అంటే. మనం ఇచ్చిన ముడుపులూ, తిరిగి తెచ్చిన, రిటర్న్ గిఫ్టులూ, అధిక ప్రయాసా, అందరినీ కలిసిన సంతోషమూనూ....
రాశిఫలాలు
వీరిచే పోస్ట్ చేయబడింది
భమిడిపాటి సూర్యలక్ష్మి
on 4, జూన్ 2011, శనివారం
5 కామెంట్‌లు:
రాసి ఫలాలను నమ్మినా నమ్మక పోయినా సరదాగా ఎలా చెప్పుకోవాలో బలే చెప్పారు
రవితేజా,
ధన్యవాదాలు.
ఒక విధంగా పాపం ఫణి బాబు గారు అదృష్ట వంతులే. బంగారు నగల లాభం, కొత్త పట్టుచీరలు కట్టుకుంటారు అనే రాశి ఫలాలు వెతకాలి మీరు. నన్ను పంపించమంటా రేమిటి రాశి ఫలాలు. :))
ఒక విధంగా పాపం ఫణి బాబు గారు అదృష్ట వంతులే. బంగారు నగల లాభం, కొత్త పట్టుచీరలు కట్టుకుంటారు అనే రాశి ఫలాలు వెతకాలి మీరు. నన్ను పంపించమంటా రేమిటి రాశి ఫలాలు. :))
సుబ్రహ్మణ్యం గారూ,
లాభం లేదండి బాబూ! సెలెక్టివ్ గా నమ్ముతారు, ఎలాగైనా కోనసీమ వారాయె !!
కామెంట్‌ను పోస్ట్ చేయండి