RSS

జరుగుబాటు...

   చాలామందికి ఇళ్ళల్లో మనం చేసేది ప్రతీ రోజూ తిని తిని, ప్రతీదానికీ వంకలు పెట్టడం ప్రారంభిస్తారు. మా శ్రీవారిని ఎప్పుడైనా కూరలయిపోయాయీ అంటే, మార్కెట్ కి ఇలా వెళ్ళి అలా వచ్చేస్తూంటారు. ప్రతీ అయిదు నిముషాలకీ బస్సూ, చిటుక్కున బస్సెక్కేసి, కూరలు కొనేసి, లటుక్కున వచ్చేస్తూంటారు. అక్కడికేమైనా కూరలూ అవీ ఏమైనా వెదకాలా ఏమిటీ? దొండకాయ, బెండకాయ,పొట్లకాయ, వంకాయ, అయితే గియితే అప్పుడప్పుడు ఆక్కూరలూ. ఎప్పుడు చూసినా చుక్కకూరోటి తెచ్చి నా మొహాన్న పడేస్తారు. సరదాగా ఎప్పుడైనా పాలక్ ( పాలకూర) తీసుకురాకపోయారా అంటే, నాకు ఆ పేరు నచ్చదూ అంటారు. పేరునచ్చకుండా ఉంటుందా ఎక్కడైనా, చిత్రం!

   ఏదో అప్పుడప్పుడు పాలక్ పనీర్ లాటిదెప్పుడైనా చేద్దామని తీసుకురమ్మంటే, పనీర్ అంటే, పెళ్ళిళ్ళల్లో, ఓ వెండి బుడ్డిలాటిదాంట్లో వేసి చల్లుతారూ, అదనుకున్నారుట. వేషాలు, వినేవాళ్ళుంటే కావలిసినన్ని చెప్తారు. ప్రతీ రోజూ స్నానం చేసి పూజ చేసికునేసరికల్లా బ్రేక్ ఫాస్టు రెడీగా ఉండాలి. పోనీ అప్పుడప్పుడు, నాతోపాటు, పుల్కాల్లాటివి తినొచ్చుగా అంటే, అబ్బే అది కుదరదు. ప్రతీ రోజూ ఇడ్లీయో,దోశో కావాలి, మళ్ళీ దాంట్లొకి ఏ ఆవకాయో, మాగాయో వేసికుంటే నాకు శ్రమైనా తగ్గుతుందనుకుంటే, మళ్ళీ దాంట్లోకో పచ్చడీ.

   వారం లోనూ రెండు రోజులు, నవ్య, అగస్థ్య ల దగ్గరే కదా ఉండేది. అక్కడ ఆ వంటావిడ చేసినవి, నోరెత్తకుండా తింటారు మళ్ళీ. నాదగ్గరే సూకరాలన్నీనూ! ఇక్కడ ఇంట్లో ఫ్రిజ్ లో ఏమేం కూరలున్నాయో మర్చిపోయి, మళ్ళీ అవే కూరలు తెస్తూంటారు. దానితో ఒక్కోసారి ఓ కిలో దొండకాయలు, ఓ కిలో బెండకాయలూ చేరుతాయి. ఆ మాయదారి దొండకాయలు వారం వెళ్ళేటప్పటికల్లా, నా వయస్సుకొచ్చేసి, పండిపోతాయి. మళ్ళీ మా శ్రీవారికి పదునోటీ, మరీ పండిపోయిన దొండకాయలు, నమలడం కష్టం అవుతోందీ అంటూ. సగానికి సగం అవతల పారేయడమే. పోనీ బెండకాయలెక్కువగా ఉన్నాయి కదా సరదాగా ,వాటిని మధ్యలో తరిగి, మసాళా దట్టించి, మైక్రోవేవ్ లో పెట్టి చేస్తే, ఎంత బావుంటుందీ. అబ్బే అలాటివి మా శ్రీవారికెందుకు నచ్చుతాయీ? అక్కడికేదో ఆయనమీద అసలు దృష్టి పెట్టకుండా వంటలు వండుతూన్నట్లు పోజెట్టేసి, ఆ ముక్కల్లో మసాళా విడిగా తీసికుని, కలుపుకోడం! ఆ దిక్కుమాలిన బెండకాయలు, పైగా ఒక్కోటీ చూపుడువేలంత పొడుగున, నాకు మిగులుతాయి! పోనీ ఒక్కొప్పుడు వేయిద్దామని,రుచిగా ఉంటాయని వాటిలో పల్లీలు (వేరుశనగ గింజలు) వేస్తే, శుభ్రంగా అవన్నీ ఏరేసి, నాకు మిగులుస్తారు. ఏమైనా అంటే, ఆ వేరుశనగ గింజలు నమల్లేనూ, గొంతుకలో అడ్డడతాయీ అనో వంకా! ఆ డెంచర్సేవో పెట్టేసికోక, ఎందుకొచ్చిన గొడవ చెప్పండీ, నన్ను హైరాణ పెట్టాలని కాపోతే?

   ఏదో వేవిళ్ళకోరికలాగ, అప్పుడప్పుడు ఈయనకి బచ్చలికూర దొరుకుతూంటుంది. దానితో పాటు ఓ కిలో కంద కూడా తెచ్చి నా మొహాన్న పడేస్తారు.అందులో ఒక్కోప్పుడు, ఆ కంద ముక్కలు గట్టిగా ఉన్నా సరే, ఆవురావురుమని లాగించేస్తారు.అప్పడాలు నూనెలో వేయించాలిట. మైక్రో వేవ్ లో కాలిస్తే నచ్చదు, మావారికి!

   ఇంట్లోనే ఈ సూకరాలన్నీనూ. మొన్న , ఆయనగారి "రామాయణం" సుఖాంతమైన సందర్భంలో, అమ్మాయీ,అల్లుడూ పిల్లలతో బయటకు వెళ్ళాము. మా అల్లుడు, ఎప్పుడు తీసికెళ్ళినా, పంజాబీ డిషెస్ ఉన్న చోటకే తీసికెళ్తూంటాడు. పాపం ఆర్డరు చేసేముందర అడుగుతాడు కూడానూ. ఈయనేమో ముంగిలా కూర్చుని " మీ ఇష్టం.." అంటారు. మరి ఇంట్లో ఆ "విశాల హృదయం" ఏమైనట్లూ? అదేదో డిష్ లో మటరూ ( బఠానీ గింజలు), ఉల్లిపాయ ముక్కలూ వేసి తెచ్చాడు. పాపం గట్టిగా ఉండి తినలేరేమో అని, నేనూ, అమ్మాయీ
ఆయనతో అన్నాము-" చూసుకు తినండీ, గట్టిగా ఉంటాయేమో.." అని. ఓ నాలుగు గింజలు నోట్లో వేసికుని, రుచి మరిగారేమో, నోట్లో వెసికుందామని చూస్తే ఏముందీ, ప్లేట్ ఖాళీ! నేనూ మా అమ్మాయీ మొహం తేలేశాము! పైగా పక్క ప్లేటులో ఉంచిన పాపడ్ , ఈయన తినలేరుగా అని పక్కనే ఉంచితే అవీ ఖతం ! అవేమీ వేయించినవి కావు, మామూలుగా కాల్చినవే ! ఇంట్లో మాత్రం నూనెలో వేయించాలిట. చేసేవాళ్ళుంటే సరీ !

   ఇదిగో దీన్నే జరుగుబాటంటారు. ఏవేవో తిని, ఓ గ్లాసుడు మిల్క్ షేక్కూ, ఓ గ్లాసుడు మజ్జిగా తాగి, అవీ ఇవీ తిని, రాత్రి పదకొండింటికి ఇంట్లో దింపారు. అప్పుడప్పుడు ఇలా బయట తిళ్ళు తింటే మాత్రం ఓ సదుపాయం ఉంది. మర్నాడు శుభ్రంగా పొట్ట ఖాళీ అవుతుంది. బయటివాటిల్లో ఏం వేస్తారో ఏమో...

2 కామెంట్‌లు:

Niru చెప్పారు...

బెండకాయ ఇన్ microwave రెసిపి ఎదో కాస్త చెబుదురు..పొన్లెండి,పాపం బాబాయిగారు..

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

బెండకాయలు 200 గ్రాములు
కొద్దిగా పచ్చికొబ్బరి కోరు
సన్నగా తరిగిన కొత్తిమీర 3 చంచాలు
ధనియా,జీర పొడి 2 చంచాలు
పంచదార 2 చంచాలు
కారం 1 చంచా
చిటికెడు ఇంగువ
నూనె 1 చంచా
తగిన ఉప్పు

బెండకాయల్ని చీలికలుగా కోసుకోవాలి (పూర్తిగా కాదు. మధ్యలో కి మసాలా కూరుకునేందుకు వీలుగా)
మసాలా అంతా కలుపుకొని కాయల్లో స్టఫ్ చేయాలి.
మైక్రో గ్లాసు గిన్నెలో మసాలా కూరిన కాయల్ని పేర్చి చంచా నూనె వేసి 1చంచా నీళ్లు జల్లి హై లో 4 లేక 5 నిమిషాలు వుంచాలి.
( బెండ కాయల్ని మనకి కావలసిన సైజులో కట్ చేసుకోవచ్చును.చివరలు తెగకుండా చూసుకోవాలి.)

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes