ఇదివరకటి రోజుల్లో మనవైపు ఊర్లన్నీ దగ్గర దగ్గరగా ఉండడంవలన పుట్టింటికీ, అత్తారింటికీ బస్సులో ఓ రెండు గంటలు కూర్చుంటే వెళ్ళిపోగలిగేవారం. రెండు చోట్లా చుట్టాలకేమీ కొదవుండేది కాదు.ఈ ఊరినుంచి ఆ ఊరికీ, ఆ ఊరునుంచి ఈ ఊరికీ ఏమైనా సరుకులు తీసికెళ్ళడానికి, తరచూ ప్రయాణాలు చేసేవారు బలైపోయేవారు. ఎప్పుడైనా అత్తారింటికి వెళ్తున్నామని తెలిస్తే, మా ఊళ్ళో ఉండే మా పెద్దత్తగారికి ఎక్కళ్ళేనీ సరుకులన్నీ గుర్తొచ్చేవి. "అప్పుడెప్పుడో మీ అత్తగారు పాపం, నోటికి హితవుగా ఉంటుందీ, నిమ్మకాయ ఊరగాయుంటే పంపించూ అందే. కిందటిసారొచ్చినప్పుడు తన తువ్వాలోటి మర్చిపోయింది, ఓ సీసాలో ఊరగాయపెట్టి, ఆ తువ్వాలుకి చుట్టబెట్టిస్తానూ, వచ్చి తీసికెళ్ళడం మర్చిపోకే.." అనేవారు.పైగా కోడలు వరసోటి కదా, మనింటికి తెచ్చి ఇవ్వడం నామోషీ, వాళ్ళింటికే వెళ్ళి, ఆ సరుకులేవో తీసికోడం,అత్తారింట్లో ఇవ్వడం. అక్కడితో అయిపోతే గొడవే లేదు, తిరిగొచ్చేటప్పుడు మళ్ళీ పెద్దత్తగారు అభిమానంతో అడిగిన వస్తువులు, అసలత్తగారు ఇవ్వగా ఈ ఊళ్ళోఉండే పెద్దత్తగారికీ..డబ్బుల్లేని "కొరియర్" సర్వీసన్నమాట.అసలు వీటినుండి బయటపడతామా లేదా జీవితమంతా వీళ్ళ సరుకులు బట్వాడా చేస్తూనే బతకాలా అనిపించేది.
చాలామందికి అనుభవంలోకి వచ్చేఉండాలి, కాలక్రమేణా ఈ ఉచిత బట్వాడా వృత్తి ఖండాంతరాలు కూడా పాకింది. ఎక్కడో అమెరికాలో ఉండే, పక్కింటి పిన్నిగారి కూతురో కోడలో "నీళ్ళోసుకుందని" తెలియడం తరవాయి, ఈ విషయం తెలిసిన ఈ పిన్నిగారు నాలుగు నెలల ముందునుంచీ, ఎక్కళ్ళేని ప్రేమా అభిమానం ఒలికించేసి, రోజు విడిచి రోజు వీళ్ళింటికి( ఎవరి కూతురో/కోడలో నీళ్ళోసుకున్నావిడ) వెళ్ళడం, " పిల్లెలా ఉందండీ, వేవిళ్ళూ అవీ లేవుకదా.." అంటూ, "ఫోన్లలో క్షేమసమాచారాలు తెలిసికుంటున్నారా, అసలే తొల్చూరు కూడానూ.." అంటూ అక్కడకా పిల్లంటే ఎంతో ప్రేమా అభిమానమూ అన్నట్టు ప్రతీరోజూ అటెండెన్సు వేయించుకుంటుంది. ఆ పిల్లమీద అభిమానమూ కాదూ, సింగినాదమూ కాదు, ఈవిడెల్లాగూ మూడు నాలుగు నెలల్లో అమెరికా వెళ్తుంది, అక్కడ అమెరికాలో ఉండే తన కూతురికీ, మనవడూ, మనవరాలుకీ, ఏమైనా ఊరగాయలూ, అవీ ఖర్చులేకుండా పంపించొచ్చనీ.
Systematic గా పావులు కదుపుతూంటుంది ఈ నాలుగు నెలలూనూ," అన్నయ్యగారికి నచ్చుతుందేమో అని, ఓ నాలుక్కాయలు మెంతావకాయ పెట్టాను.." అని ఒకసారీ, "ఈవేళ మీ అన్నయ్యగారు మార్కెట్ లో దొరికిందని బచ్చలి కూర తెచ్చారు, కందా బచ్చలీ చేశానూ, మీ వాడికి కాస్త నేతి చుక్క దిట్టంగా పట్టించి కలిపిపెట్టు, మళ్ళీ వదులుతాడేమో చూడు.." అని ఇంకోసారీ.. ఇలా ఈ నాలుగునెలలూ ఓ "దగ్గరతనం" "చనువూ" లాటివి ఏర్పరిచేసికుంటుంది. పాపం ఈ పిన్నిగారికి ( ఎవరి కూతురు/కోడలో నీళ్ళోసుకున్నావిడ) ఏమీ అర్ధం అవదు. "పాపం ఆ పక్కింటి పిన్నిగారికి మనం అంటే ఎంత ప్రేమా అభిమానమో చూశారా.."
అని కొడుకుతోనూ, భర్తతోనూ చెప్తూంటుంది.ప్రతీరోజూ సమాచారం తెలిసికుంటూంటుంది పాస్పోర్టు వ్యవహారం ఎక్కడిదాకా వచ్చిందో, వీసా ఎక్కడిదాకా వచ్చిందో లాటి విషయాలు.పైగా ఏదైనా అవసరం ఉంటే చెప్పండీ లాటి ఆశ్వాసన్ లు కూడా, ధారాళంగా ఇస్తూంటుంది.
అసలు విషయం అంతా వీళ్ళు అమెరికా వెళ్ళే సమయానికి ఓ నాలుగురోజులుముందు, వీళ్ళు సామాన్లు సద్దుకుంటుండగా తెలుస్తుంది. కొంగుచాటున ఏ ఊరగాయో తెచ్చి, " ఏమిటీ హడావిడీ ప్రయాణం దగ్గరకొచ్చేసిందేవిటీ, ఏవనుకోనంటే ఓ చిన్న సహాయం చేయాలి వదినా, మా పిల్లదానికి ఇష్టమని కొద్దిగా ఊరగాయా, కందిపొడీ అవీ చేశానూ, శ్రమనుకోకుండా ఆ బుల్లి పాకెట్టు కూడా మీ బట్టల్లో సద్దేసి, ఎలాగోలాగ తీసికెళ్ళారంటే, వాళ్ళే వచ్చి తీసికుంటారు..". తప్పుతుందా, నాలుగునెల్లబట్టి అవీ ఇవీ ఇచ్చి మేపిందే, అనే ఓ గిల్టీ ఫీలింగోటొచ్చి, మొహమ్మాటానికి "సరేనమ్మా దానికేముందీ, మేమేమైనా మొయ్యాలా ఏమిటీ.." అని ఒప్పేసికుని తన కూతురికి తీసికెళ్ళే సమాన్లలో కొన్నిటిని "త్యాగం" చేసేసి, నాలుగునెలల ఋణాన్నీ తీర్చుకుంటుంది. పై అనుభవాలు కొన్ని అనుభవించినవీ, కొన్ని విన్నవీ దృష్ట్యా ఎప్పుడైనా ఏ ఊరైనా వెళ్దామని అనుకున్నా ఎవరికీ చెప్పుకోకూడదూ అని ఓ దృఢ నిశ్చయానికొచ్చేశాము. ఇప్పుడు ఇంకోరకం "హింస"
ఎప్పుడైనా ఏ ఉరైనా చూడ్డానికి వెళ్ళేముందర, ఎవరితోనూ చెప్పకూడదని, ఒక ఫీలింగుండేది ఇదివరకటి రొజుల్లో, కారణం మరేమీ లేదూ, మనం ఎవరికైతే చెప్పామో, వారు అప్పటికే ఆ ఊరు వెళ్ళొచ్చేరనుకోండి, దొరికాము కదా అని, ఫలానాది చూడండీ, ఫలానాది చూడండే.. అని ఊదరకొట్టేస్తారు. పైగా ఎక్కడికో వెళ్తున్నామని ఊరంతా టముకు వేస్తే, చివరకి అసలు ఆ ప్రయాణమే చేయలేమేమో అని ఓ వెర్రినమ్మకం... అయినా జన్మానికో శివరాత్రన్నట్టు అయిదారేళ్లకి, మా శ్రీవారికి మూడ్ వచ్చి ఇల్లు కదలడమే పెద్ద విశేషం, ఈమాత్రం దానికి ఊరంతా చెప్పుకోడమోటా? అందుకే , పిల్లలతో తప్పించి ఇంకెవరికీ చెప్పలేదు. పాపం మా శ్రీవారుమాత్రం ఉండబట్టుకోలేక తన టపాలో వ్రాసేసికున్నారు. తన టపాలు ఎవరైనా మిస్సయిపోతారేమో అని పాపం తనకో అపోహ ! హాయిగ్గా ఉంటారులెండి మీవాళ్ళందరూ అంటే బాధపడిపోతారు...
వెళ్ళేముందరే కాదు, వెళ్ళొచ్చిన తరువాత కూడా, ఎవరికీ చెప్పుకోకూడదని ఇప్పుడు తెలిసింది ! నేనెవరితో అయితే చెప్పానో, వారి వారి రియాక్షన్ లు చూసి/విని ఇటుపైన అసలు ఎక్కడికీ వెళ్ళేకూడదూ, అధవా వెళ్ళినా ఎవరికీ చెప్పుకోకూడదూ అనే వైరాగ్యం వచ్చేసింది. సరదాగా ఉంటుందని సిమ్లా వెళ్ళినట్టు చెప్పడమేమిటి కులూ, మనాలీ వెళ్ళేరా అనేవారొకరూ. హరిద్వార్ లో హారతి చూసేమంటే,అయ్యో.. ఋషీకేష్ లో చూడలేదా అనేవారింకోరూ. కేదార్నాథ్ కూడా వెళ్ళొచ్చేయవలసిందీ అని ఓ ఉచిత సలహా ఇచ్చేవారొకరూ. మేము వెళ్ళిందా రెండురోజులు సిమ్లాలోనూ, రెండురోజులు హరిద్వార్ లోనూ గడపడానికి, వీలున్నన్ని చూడ్డానికీనూ
ఇవన్నీ ఒకెత్తూ, కొందరైతే "మీకేమిటిలెండి, పిల్లలున్నారుగా వాళ్లు పంపించుంటారు..". మా వాడైతే ఫ్లైట్ లో తీసికెళ్ళి చూపించాడు అనేవాళ్ళొకరు.హరిద్వార్ లో ఏ ఆశ్రమంలో ఉన్నారూ, ఎవరైనా ట్రావెల్స్ వాళ్ళతో కానీ వెళ్ళారా ఏమిటీ అనేవాళ్ళు కొంతమందీ.
ఇంకొరైతే, "ఈమధ్యన మా ఫ్రెండొకావిడ యాత్ర్లకెళ్ళిందీ, నాకు తెలిసేటప్పటికే టిక్కెట్లయిపోయాయిట, ఈసారి మీరెళ్తూంటే చెప్పండే, నేనూ వస్తానూ.." అనీ, ఓరినాయనోయ్ ప్రయాణాలైనా మానుకోవాలి, లేదా చడీచప్పుడూ లేకుండా వెళ్ళైనా రావాలి బాబూ.మా శ్రీవారన్నారు హాయిగా ఓ placard ఒకటి పెట్టేసి దానిమీద వ్రాసేయ్... 1. మేము హరిద్వార్, ఋషీకేష్ లకు మాత్రమే వెళ్ళాము. టైముకుదరక మిగిలినవాటికి వెళ్ళలేదూ...
2. సిమ్లా దాకానే అనుకున్నామూ.. అసలే పిడచకట్టుకుపోయే చలి కూడానూ, దీనికే మాకు ప్రాణం మీదకొచ్చేసిందీ...
3. మా ప్రయాణాలు ఎవరూ sponsor చేయలేదూ... మా డబ్బులతోనే వెళ్ళామూ...
4.మాకు రైళ్ళలోనే వెళ్ళడం హాయీ.. ప్లేన్లూ అవీ ఎక్కమూ...
5. టూర్లవాళ్ళతోనూ, ట్రావెల్స్ వాళ్ళతోనూ వెళ్ళలేదూ...వెళ్ళే ఉద్దేశ్యంకూడా ప్రస్తుతానికైతే లేదూ....
ఇంకా సందేహాలేమైనా ఉంటే అడగండీ, మీరెలా వెళ్ళారో, ఎప్పుడు వెళ్ళారో, ఎవరితో వెళ్ళారో, ఎవరు పంపించగా వెళ్ళారో ఇత్యాది విశేషాల మీద మాకు ఆసక్తి లేదూ...
The day after...
వీరిచే పోస్ట్ చేయబడింది
భమిడిపాటి సూర్యలక్ష్మి
on 11, మార్చి 2013, సోమవారం
3 కామెంట్‌లు:
:))))
ఋషీ,
అలశ్యంగా జవిబిస్తున్నందుకు sorry. ధన్యవాదాలు.
సార్ నేను దైవకృప వల్ల గంగను కాశీలొ హృషీకేష్ లో హరిద్వార్ లో సందర్శించాను నాకు మాత్రము హరిద్వార్ లొ కనపడిన గంగమ్మంత అందంగా అనందంగా ఇంకెక్కడా కనిపించలేదు అందుకే నాకెప్పుడు గంగమ్మ అనగానే హరిద్వార్ బలే గుర్తుకొస్తుంది- అందమైన చల్లని-గంగ నన్ను భయపెట్టని గంగను అక్కడే దర్శించా నేను--
కామెంట్‌ను పోస్ట్ చేయండి