సంక్రాంతి అంటే ఎంత హడావిడో కదూ ! ఇప్పుడంటే గూగులమ్మని అడిగితే చాలు లెఖ్ఖలేనన్ని ముగ్గులు దొరికేస్తాయి. కానీ ఆరోజుల్లోనో , ఎవరైనా ఏ యాత్రలకైనా వెళ్ళినప్పుడు ముగ్గుల పుస్తకాలు తెప్పించుకోవడమో, లేకపోతే ఏ పక్కింటి పిన్నిగారో ఏ వారపత్రికైనా తెప్పిస్తూంటే అందులోని ముగ్గులు తీసికోవడమో.,అమ్మమ్మలు,అమ్మక్కయ్యల ముగ్గుల ఖజానా నుండి పెద్ద పెద్ద ముగ్గులు తీసుకోవడం, ఎన్నెన్ని చుక్కలు , ఎంత పెద్దముగ్గులోనూ, కొన్ని ముగ్గులు ఎక్కడ మొదలుపెడితే పూర్తి అయేది కూడా మళ్ళీ మొదటి చుక్క దగ్గరేను. పైగా మొదటి ఆట సినిమా వదిలిన తరువాత మొదలుపెట్టేవారు.వారికి అనుగుణంగా వెలుతురు కనిపించేందుకు లాంతరు పట్టుకొవడం పిల్లల డ్యూటి.ఇప్పుడూ అంతంత ముగ్గులు పెట్టే ఓపిక లేదూ, సమయం లేదూ,ముఖ్యంగా స్థలమూ లేదు. అయినా ముగ్గులు అన్నది ఆడపిల్ల్లల స్వంతం.ఎలాగో చిన్న జాగా అయినా ముగ్గు పెట్టుకోను మురిసిపోని చిన్నది వుంటుందంటారా? మా అమ్మమ్మగారు చెప్పెవారు జనకమహరాజు గారి పుత్రిక సీతాదేవి కూడా పెట్టేవారుట.
ఆవు పేడ తెచ్చి అయినిళ్ళు అలికి
గోవు పేడ తెచ్చి గోపురాలలికి
ముత్యాల వాకిట్లో ముగ్గులేయించి
రత్నాల వాకిట్లో రంగులేయించి---- అంటూ పాటలో నూ, మరోక పాట చెప్పేవారూ--
ఇల్లు చూడూ -- ఇల్లందము చూడూ-- ఇంటిలోని ఇల్లాలిని చూడూ--
ముగ్గు చూడూ-- ముగ్గందము చూడూ -- ముగ్గులో వున్న మురిపము చూడూ--
రంగు చూడూ-- రంగందము చూడూ-- రంగులోని రమ్యతను చూడూ-- అంటూ భలే తమాషా గా చెప్పెవారు.
ఆ వాతావరణం లో పెరిగిన నాకు పాత పుస్తకంలో తీసిన ముగ్గులు , అల్లిక డిజైనులు , వంటలు తీసి జాగ్రత్త చేయడం అలవాటయింది.ఇదివరకు తీసినవి ఎవరికో ఇచ్చేసాను. ఈ మధ్య ప్రెస్ అకాడమి వారి పాత పత్రికలు చదువుతుంటే కొన్ని కనిపించాయి. అవి మీతో పంచుకుందామనే ఉద్దేశ్యంతోనూ, ఆ పంపినవారు మీవాళ్ళే ఎవరయినా అవవచ్చును కదా!
ముగ్గు చూడు.. ముగ్గందం చూడు..
వీరిచే పోస్ట్ చేయబడింది
భమిడిపాటి సూర్యలక్ష్మి
on 13, జనవరి 2014, సోమవారం
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి