RSS

దసరా.



      మొన్న దసరా పండగల లో , మా  స్నేహితురాళ్ళు పాడ్యమి రోజున అమ్మవారిని ప్రతిష్టించి ( ఇక్కడ ఘటస్థాపన్ అంటారు ), ప్రతీరోజూ ఎవరో ఒకరి ఇంట్లో సౌందర్య లహరి, శ్రీలలితాసహస్రనామాలూ చదువుకుని, ఆ తరువాత హిందీ, మరాఠీ భజనలు చేసి గడిపాము. ఇక్కడ రోజంతా ఉపవాసం ఉంటారు. ఇంట్లో అమ్మవారి పూజ చేసికుని, నైవేద్యం పెట్టి, మావారికి వంట వండేసి, దగ్గరలో ఉన్న నా స్నేహితురాలితో , ఎక్కడ పూజ జరుగుతూంటే అక్కడకి వెళ్ళి, రావడంతో దసరా చాలా బాగా గడిచింది.
    సౌందర్యలహరి మా స్నేహితురాలు ( మన తెలుగు వారే) పుస్తకం చూడకుండా, రాగయుక్తంగా 100 శ్లోకాలూ చెప్పడంలో దిట్ట. నా పనల్లా, ఆవిడప్రక్కనే కూర్చుని, ఆవిడ తో “ సహకార గానం “ చేయడం మాత్రమే.
   ఇంక లలితాసహస్రనామాలంటారా, ఏదో “ అమ్మ “ దయవలన నాకూ కంఠస్థం వచ్చేశాయనుకోండి. ఇక్కడివాళ్ళకు పైరెండింటిమీదా అంత పట్టుండకపోవడంతో, మా స్నేహితురాలికి, పెద్దపీట వేయడం, ఆవిడతోపాటే నాక్కూడా “తోడ పెళ్ళికూతురి” హొదా ఇచ్చి పక్కనే ఓ పీటవేయడం. 
    మా ఇద్దరి స్తోత్రాలూ పూర్తయే సరికి, మిగిలినవారందరూ మెల్లిగా పూజ చేసే ఇంటికి రావడం మొదలెట్టడం. అప్పటినుండీ, హిందీ, మరాఠీ భాషల్లో  అమ్మవారికి సంబంధించిన “ భజన” లు పాడడం మొదలు. ఇంక ఆ భజనలు పాడుతూంటే, ముత్తైదువులు వారి వారి వయసులతో సంబంధం లేకుండా, డ్యాన్సులు చేయడం.  అక్కడకి వచ్చే వారు 60 ఏళ్లకి పైబడ్డవారే, అయినా సరే అంత ఓపిక ఎలా వస్తుందో ఆశ్చర్యంగా ఉంటుంది.నాకు  ఆ భజనలు నోటికి రాకపోవడంతో , చప్పట్లు కొట్టడానికే పరిమితం అయిపోయాననుకోకండేం.రానివాళ్ళచేత కూడా పాడించగలిగే శక్తి ఆ అమ్మది ! ఆ భజనలతోఅక్కడి వాతావరణమే మారిపోయేది. అక్కడ ఉన్న మూడు నాలుగు గంటలూ “ అమ్మ “ ధ్యాసే, అమ్మ నామ స్మరణే.  అక్కడ ఉన్న చాలామందికి ఏదో ఒక  ఆరోగ్య సమస్య- సుగరు, బీపీ, కాళ్ళనొప్పులూ, మరోటీ- ఉన్నవారే. ఆ మూడునాలుగ్గంటలూ అవన్నీ మర్చిపోయి డ్యాన్సులూ, పాటలూ, భజనలూ. అమ్మ ని చూసేటప్పటికి అసలు అవన్నీ గుర్తుకురావేమో.

      ఈ కార్యక్రమం పూర్తయిన తరువాత, హారతీ , ప్రసాదాలు. మొత్తానికి దసరా తొమ్మిది రోజులూ అమ్మ నామస్మరణతో ఆనందంగా గడిచిపోయింది.

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes