' ఇంటి గుట్టు లంకకు చేటు " అని పెద్దలంటే, ఇప్పటివారు, ' ఇంటి ' గుట్టు ఫేస్ బుక్కు లో పెట్టి రట్టు చేయకే ' అంటున్నారు. ' ఆ ' ఇంటి కాకి ఈ ఇంటి మీద వాలకూడదు' అని ఇదివరకువారంటే, ఇప్పుడు, ' ఆ ఇంటి పావురం ఈ ఇంటిమీద వాల కూడదు ' అంటున్నారు ( కాకులెక్కడున్నాయి, అన్నీ పావురాలె గా) ' ' పొరుగు ఇంటి మీనాక్షమ్మను చూశారా ' , ' పొరుగు ఇంటి పుల్లకూర రుచి ' కి బదులుగా, ' పొరుగు ఇంటి మీనా ని చూశారా, తను పెట్టిన పోస్టుకి, ఇన్ని లైక్కులూ, ఇన్ని కామెంట్లూ వచ్చాయిట, అంతేకాదు, ఇంతమంది షేర్ చేసుకున్నారట' -- ఇదీ పరిస్థితి. ( భాష మారినా భావం మారిందంటారా?) ' అందరిమీదా కేకలు వేసే పులిలాటి ఆఫీసరు, ' ఇంటిలో పిల్లి'. మరో ఇంటిలో పెత్తనం అంతా ఆవిడదే. ఆవిడే ఆ 'ఇంటి ' యజమానురాలు. ' ఇంటి ' ఆయన వంట ' ఇంటి ' కుందేలు అని అప్పటి మాటైతే, ఇప్పుడు ' ఇంటి ' కి ఇద్దరు, సమాన బాధ్యతలతో సమాన హక్కులతో, జంట గా జత గా ఉంటున్నారు. ' కొంతమంది ' ఇంటి ' కంటే గుడి పదిలమన్నట్టుగా, శలవు రోజున 'ఇంటి' కంటే మాల్స్ లో గడిపే ప్రబుధ్ధులు ఉన్నారు. ' ' ఇల్లు' కట్టి చూడు, పిల్ల పెళ్ళి చేసి చూడు అని వారంటే, క్యాంపస్ ఉద్యోగం రావడమేమిటీ, లోను తీసికుని ' ఇల్లు' కట్టేస్తున్నారు ( అదే లెండి ఫ్లాట్ ). దానికి ఎడ్వాన్సు కట్టే డబ్బు, రిటైరయిన తండ్రికొచ్చే సొమ్ము బాపతు, లోన్ తీసికున్నందుకుకాను, ఓనర్ షిప్ మాత్రం కొడుకు పేరు. ' ' ఇల్లు' కట్టగానే సరిపోతుందా, ముందున్నది ముసళ్ళపండగ అన్నట్టు, వాయిదాలు ( EMI) కట్టడం. ' ఇంటి' వాడయ్యాడు కదా , స్వీట్ హోం.. 'ఇంటి ' కి ఇల్లాలు కావాలి కదా, వివాహం హ్యాపీ మ్యారేజ్. రిటైరయిన తల్లితండ్రులతో కలిసి ఉండేసరికి ' ఇల్లు ' చిన్నదవడంతో, ' ఇల్లు' ఇరకాటం ఆలి మర్కటం. పడక ' ఇంటి' ముచ్చట్ల బదులు ' ఇంటింటి' రామాయణం ( घर घर की कहानी..) ' తిన్న ' ఇంటి' కే వాసాలు లెక్క పెట్టేవారనేవారు. ఇప్పుడు వాసాలెక్కడ, స్లాబ్ కదా. సిటీ లో అద్దెకిచ్చామా, స్లాబ్ చూస్తూ, ఖాళీ చేయకుండా ' స్లాప్ ( slap) ' ఇచ్చే మహానుభావులెందరో. ' ' ఇంటి ' లో wi-fi పెట్టి, password జాగ్రత్తగా పెట్టుకోకపోతే, ' ఇంటి ' దొంగని ఈశ్వరుడైనా పట్టలేన్డన్నట్టుగా అయిపోతుంది. ' ఇంటి ' కి వచ్చినవారికి మంచినీళ్ళతో wi-fi password కూడా ఇచ్చేశామనుకోండి, అంతకు మించి అతిథి సత్కారం మరోటి లేదు. ( అతిథి దేవో భవ ).
' అమ్మాయిని పెద్ద ' ఇంటి ' లో ఇవ్వాలని, పేద ' ఇంటి ' అమ్మాయిని, తెచ్చుకోవాలని ఇదివరకు అనుకుంటే, అమ్మాయి కానీ, అబ్బాయికానీ స్వంత ఫ్లాట్ ఉందా, ప్రేమ పేరుతో పెళ్ళిళ్ళు చేసుకునే యువతీయువకులు చాలామందే ఉన్నారు.
' మీ ' ఇల్లు' చిదంబరమా, లేక మధుర ( మీనాక్షి) మేనా, అని గడుసుగా అడుగుతారు. ' మా ' ఇంటి ' సభ్యులు నలుగురు, నలుగురూ బ్లాగర్లే, నాలుగు FB Account లూ, నాలుగు Saving Account లూ. Like లతో., Comments లతో Happy గా ఉన్నామని ఓ ఇల్లాలు చెబితే, ' అమ్మ నీ 'ఇల్లు' బంగారం గానూ ' అనుకున్నాను..
' మా 'ఇంటి ' లో Quiz సమాధానాలు Messenger లో పంపుతున్నాను కనక సరిపోయింది, లేకపోతే వంట ' ఇంటి' లో పోపులపెట్టి లాగ, దేవుడి గూటిలో వత్తుల పెట్టిలా అయిపోయుండేది నా Tab. ' Homemaker అనండి, Housewife అనండి, ' ఇంటి' కి దీపం మాత్రం ఇల్లాలే. ' ఇంటి' ని స్వర్గం చేసినా, ' ఇంటి' ని నరకం చేసినా ' ఇంటి' ఇల్లాలి చేతిలో మాత్రమే ఉంది.
' అయినా పొరుగు ' ఇంటి ' సంగతులు నాకెందుకూ? నా ' ఇంటి ' సంగతులు నేను చూసుకోకా... కథ కంచికీ మనం ' ఇంటి' కీ....
5 కామెంట్లు:
మీ ఇల్లు బంగారంగానూ...బాగా చెప్పారండీ...
యింతి జెప్పెను నిచటన యింటి కథలు
బంతి పూబంతు లుయనగ బ్లాగ రులుగ
వింత గొలుపుచు పడతులు వివిధ ములుగ
యింత అంతయు లేకను యిలన గలరు !
శ్రీలలిత గారూ, జిలేబి గారు,
ధన్యవాదాలు.
నేను ఫేస్ బుక్ లో బాబాయ్ గారి పోస్ట్ లు చదివి మెసెంజర్ లో స్నేహం చేసి మీ పోస్ట్ లు చదువుతున్నాను చాలా బాగా రాస్తున్నారు పిన్ని గారు..
మీవి మీ శ్రీవారివి బ్లాగులను PDF లు కొన్నైనా మెయిల్ చేయగలరా
శాస్త్రి కొంపెల్ల
విశాఖపట్టణం
కామెంట్‌ను పోస్ట్ చేయండి