మార్గశిరమాసం మొదటి గురువారం ఈరోజు శ్రీనివాసుని దర్శనానికి బయలుదేరాము.ఇదివరకు ఈ గుడి గురించి రాసాను. ఇది మాకు చాలా ఇష్టమైన మందిరం. ఎలాంటి ఆటంకాలు లేకుండా (నిన్న టైర్లో హవా పోయిందిగా)తీసుకెళ్ళాడు. నిన్నటి కారే, అతనే డ్రైవరు.మేము దర్శనం చేసుకొని బయటకు రాబోతూంటే మాకొక వ్యక్తి కనిపించారు.అతన్ని ఎక్కడో చూసాను ఎక్కడా?ఆలోచిస్తే సర్ఫ్రరోష్ లో సలీం, బాలక్రిష్ణ నరసింహరాయుడు సినిమా, సూర్యవంశం యివన్ని గుర్తు వస్తున్నాయి. మావారు కాస్త దూరంలో వున్నారు. మా మరిది ని పిలిచి " నాగూ" ఇతను ఎవరంటావూ అని అడగ్గానే ప్రతి తెలుగు సినిమాలో విలన్ గా వేస్తాడే అతనేనూ అనడంతోటే అతన్ని పలకరించి షేక్ హేండు యిచ్చెసరికి పాపం హడిలిపోయాడనుకుంటాను. ఈ ఆంటీ ఏమిటీ? అని, మావాళ్ళు నమ్ముతారో లేదోనని చెప్పి ఓ చిన్నపుస్తకం తీసి ఆటోగ్రాఫ్ తీసేసుకున్నాను.చిన్నవాడేను, సినిమాల్లో పెద్ద వయసు విలన్ గా చూపిస్తారు. ఓ అడుగు ముందరకివేసి మా వారికి చెప్పాను ఆయన పరిచయం చేసుకొని మాట్లాడారు.అతను ఎవరో కాదు,బాలీవుడ్ నటుడు 'ముఖేష్ ఋషి'! ఆ తరువాత అక్కడే ప్రసాదం తీసుకొని బయట " క్యూ" చూసి హడిలిపోయాము. జనాలు నిలబడలేక కూర్చున్నారు. అంతమంది వున్నారు. మేము వెళ్ళినపుడు అంతా ఖాళీయేను, అంతా మా అదృష్టం. అమ్మవారి దగ్గర చాలాసేపు గడిపాము. ఆ తరువాత అక్కడనుండి " బనేశ్వర్" వెళ్ళాము. " బనేశ్వర్" నిజానికి " వనేశ్వర్" వనంలోవుంది ఈ శివుని గుడి. పెద్ద చెట్లు,లతలు రకరకాల పూవులు చాలా బాగుంది. గుడి లోపల గర్బగుడి చుట్టూ చిన్న చిన్న తాలాబ్ లా లాంటివి ఓ ఆరు వున్నాయి. అందులో ఒకదానిలో చేపలు, మరొకదానిలో తాబేళ్ళు, ఓకదానిలో మంచినీరు, వెనుక వైపు వున్నాదానిలో నీరు లేదనుకోండి. సహ్యాద్రి కొడలలో వున్న ప్రతి గుడి కి శివాజీ మహరాజు కి ఏదో ఒక లింకు వుంటుంది. లోపల శివదర్శనంచేసుకొని బయటకు వచ్చేసరికి అక్కడే పక్కనున్న హాలులో అప్పుడే పెళ్లి చేసుకున్నా దంపతులుని దేవుని చుట్టు ప్రదక్షిణానికి పంపారు. పెళ్ళికొడుకు పెళ్ళికూతురే చిన్నవాళ్ళు. వాళ్ళకి తోడు ఇంకా చిన్న పిల్లలు సాయం. ఎదో బొమ్మల పెళ్ళిలా అనిపించింది. ఇంకా యిప్పటికి బాల్యవివాహాలు జరుగుతూనే వున్నాయన్నమాట. మరీబాల్యం కాదనుకోండీ, 18 సంత్సరాలు పెళ్ళికూతురికి 20 సంవత్సరాలు పెళ్ళికొడిక్కిను, తెలుసుకున్నాములెండి.పసుపు రాసిన మొహలతో పసుపు బట్టలతో ఎంతో కళగా సిగ్గు సిగ్గుగా ఒకరి చేయి ఒకరు పట్టుకొని చూడముచ్చటగా వున్నారు. ఈ మద్య కాలంలో ఇంత చిన్న జంటను చూడలెదు. ఆ గుడి వెనుక అంతా అడవెనూ, కొంత పిక్నిక్ సాట్ లా చేసారు. పిల్లలకి ఆడుకునేందుకు , బాగా ఏర్పాటు చేసారు. అక్కడనుండి వాపసు "పూనే" వస్తూ వస్తూ కారులోంచే " దగుడు సేట్ వినాయకుడ్ని " చూపింఛి మహాలక్ష్మీ మందిర్ వెళ్ళి దర్శనం చెసుకొని మా మనవడు "క్రెచ్చి" నుండి వచ్చె సమయానికి ఇంటికి వచ్చేసాము. మా శిరీష ఆ రోజు ఉదయం 4 గంటల ఫ్లయిట్ లో " చెన్నె" వెళ్ళి రాత్రి 11 గంటలకు తిరిగి వచ్చేసింది. సో, అలాగా మార్గశిర గురువారం నాడు రెండు లక్ష్మీ గుడులు చూసుకునే భాగ్యం కలిగింది. ముంబైలో లో మహలక్ష్మి దేవాలయం చూశాము. మిగిలిన విశేషాలన్నీ మావారి టపాలో చదివే ఉంటారు.
మా బుల్లి బుల్లి ట్రిప్పులు
భీమాశంకరుడి దర్శనాభిషేకం...




మా యింటికి వచ్చిన బంధువలగురించి మా శ్రీవారు రాసిన టపా చదివారుకదా! సరే మొదటి రోజు భీమశంకర్ వెడదామని ప్లాన్ చేశాము. వీళ్ళ ట్రైన్ రావడం ఆలస్యమవడంవలన తెల్లవారి త్వరగా బయలుదేరదామనుకున్న వాళ్ళం ఆలస్యంగా బయలుదేరాము. కబుర్లు చెప్పుకుంటూ వెడుతున్న మాకు కొద్దిదూరం వెళ్ళేసరికి టైరు లో హవా తుస్. అది మార్చి మళ్ళీ బయలుదేరేసరికి నా కనిపించింది గుడి తలుపులు వేసేస్తారేమోనని. సరే!చూద్దాం ఆ శంకరుడు ఏం చేస్తాడో? కిందటిసారి వెళ్ళినపుడు అతి ప్రయత్నం మీద దర్శనం చేసుకున్నాము. చాలా రష్ గా వుంది.మేము నాలుగు ఫామీలీలు కలసి దర్శనం చేసుకొని అందరం తలో ఒక వంట చేసుకొని వనభొజానాలు కానిచ్చి తంబూలా ఆడుకొని సరదాగా గడిపి వెళ్ళాము. అ తరువాత చాలా మంది ఆంధ్రా నుండి వచ్చేవారు షిరిడి,నాసిక్,పూనె వచ్చి అష్టవినాయక్ దర్శనం,జ్యోతిర్లింగాలలో ఒకటైన భిమాశంకర్ చూసివెడుతునారని చెప్పి మేము వీళ్ళని తీసుకొని బయలుదేరాము.వాళ్ళు మామీదే వదిలేసారు ఎక్కడకి తీసుకువెళ్ళాలనేది. సరే! ఈ సారి ఎలా అవుతుందో దర్శనం , చూద్దాం. డ్రైవరు నెమ్మదస్తుడేనూ, బాగానే నడుపుతున్నాడు. కారు కూడా పరవాలేదూ, ఇండికా, ఎ.సి అదీ పెట్టాడు. ఘాట్ రోడ్డు మీద జాగర్తగానే తీసుకువెళ్ళాడు. చాలాదూరంలోనే ఆపేసి ఇక్కడనుండి నడిచివెళ్లాలన్నాడు. ఇదివరకటికి ఇప్పటికి ఆదాయం బాగుందనుకుంటాను. సిమెంటు దారి మెట్లు, అపక్క ఈపక్క చాలా కొట్లు కనిపించాయి.పనులు బాగానే జోరుగానే జరుగుతున్నాయి. అంతే కాకుండా డోలీలు కూడా వున్నాయి. మధ్యలో చెట్ల నీడలు, చల్లటి గాలులు,కోతుల కంపెనీతో హాయిగా మెట్లు దిగుతూ వెళ్ళిపోయాము. ( కొండ ఎక్కడం కాదిక్కడ,మెట్లు దిగాలిక్కాడ) గుడిలో ప్రవేశించి అక్కడే కూర్చున్న ఓ పూజారిగారిని అడిగాను అబిషేకాలు, ఏదయినా పూజ లాంటిదీ వుందా అని? చాలా ఆలస్యంఅయిపోయిందీ, ఏమీ వుండదని అనుకొంటూ,రుద్రాభిషేకానికి అంటుంటే ఆశ్చర్యంగా వుందా వుంటే యివ్వండీ,ఏమండీ, రుద్రాభిషేకానికి తీసుకోండీ, అంటూ అరిచినంతపని చేసాను. దర్శానానికే కాని ఏ పూజ కి అవకాశం వుండదులే అనుకొని మనసుకి సమాధానపరిచేసుకున్నాను అప్పటికేనూ, అలాంటిది ఆ అవకాశానికి మురిసిపోయి నేను చదివే లలితా సహస్రనామానికి ఫలితం దక్కిందనుకొని మురిసిపోయాను. లోపలికి తీసుకెళ్ళి రెండు పీటలు వేసి మమ్మల్ని కూర్చొమన్నారు, మా మరిది , భార్యా, ఓ పక్కన లోపలేకూర్చున్నారు. వారు చేసుకోలేదులెండి. ఇంకా ఎవరేనా వస్తారేమొ ననుకున్నాను అబ్బె ఎవరూ రాలేదు. మేమేను. అ రోజుకి మాదే ఆఖరి అభిషేకం. చాలా బాగా చేయించారు.రుద్రం, నమకం చమకం చాలా చక్కగా చదివారు. పంచామృతాలు అన్నీమంచిగా యిచ్చి చేయించారు.(ఒక్కోక్కసారి మరీపొదుపు పాటించేస్తారు కదా)అనుకోని అదృష్టం యిది.అక్కడున్న అందరు బ్రాహ్మలూ గొంతు కలిపి నమకం చమకం చదువుతుంటే ఆహ్ ! అద్బుతం. మనసారా తృప్తిగా ఆ శంకరుని సేవించుకొని వచ్చాము.ఇంక మా జయ (తోటికోడలు) ఎంత మురిసిపోయిందో చెప్పలేను.అక్కయ్యగారు మంచిగా ప్లాన్ చేసారండి అంటూ-- ఆ తరువాత బయట కాసేపు కూర్చొని ఫోటోలు తీసుకున్నాము. ఇంతలో గుడి తలుపులు మూసేస్తామన్నారని బయటకు వచ్చేసాము. మా కోసం అగినట్లుగా ఆగి మా చేత అభిషేకంచేయించుకున్న శివయ్యకి బై చెప్పి వచ్చేసాము.మా జయ కొంత షాపింగ్ చేసింది. కోతుల్ని తప్పించుకొంటూ , మెట్లు ఎక్కుతూ పైకి వచ్చి అక్కడె వున్న దుర్గ గుడి కి వెళ్ళి కారులొ వెనక్కి బయలుదేరాము. అపుడు ఆకలి తెలిసివచ్చింది.కొంత ఘాట్ రోడ్డు దాటిన తరువాత గుబురుగా వున్న చెట్ల దగ్గర ఆగి ఆ నీడలో మా కోడలు శిరిష (చాలామంది బ్లాగ్ మిత్రులకి పరిచయం అయింది కదా ఈ మధ్య.) అందరికీ తలో మేథీ పరోటాల పేకెట్, తలో పేకెట్ పెరుగు అన్నం, చక్కాగా పేక్ చేసి యిచ్చినదీ తినేసి తిరుగు ప్రయాణం మొదలుపెట్టి రాత్రి 8 గంటలకి ఇంటికి చేరుకున్నాము. ఇదండీ, మా మొదటి రోజు ట్రిప్పు.
పైన ఇచ్చిన ఫొటోల్లో, అమ్మవారిపైన అద్దంలో కనిపించేది భీమాశంకరుని ప్రతిబింబం.
'లక్ష్మీ పురాణం'- రెండవ భాగం


సరే! ఆ తరువాత పెద్దపూజారిగారింటికెళ్ళాము.ఆయన భార్య ఓ పెద్దావిడ. కనీసం ఓ 75 సంవత్సరాలుండవచ్చు.నాతో ఎలా పూజ చేస్తావు? మీకు అక్కడ సత్ సంగ్ లాంటివి వున్నాయా అని అడిగారు. మాములుగా రోజూ దీపంపెట్టి అష్టలక్ష్మీ స్తోత్రం,మండపాక ఎల్లారమ్మ దండకం చదుతాను. శుక్రవారం మాత్రం పాయసం లేకపోతే షీరా చేసి నైవేద్యం పెట్టి లలితా సహస్రనామం చదువుతాను.ఇంతలో ఆవిడ లోపలకెళ్ళి పసుపు కుంకుమ లతో విప్పేసిన చీర ఉండ చుట్టినట్ట్లుగా తెచ్చి, నా ఒడి పట్టమని చెప్పి దానిలో వేశారు. ఆ తరువాత భోజనాలు అవీ అయి హోటలుకి వెళ్ళి కవరు తీసి చూసిన మాకు ఎంతో ఆశ్చర్యమనిపించింది.రంగు ,అంచు , అదే పట్టు చీర కాదంటె తేడా తెలియాలికదా అన్నట్లుగా ఆకుపచ్చ రంగు అంచు. నేనిచ్చినది బాటిల్ గ్రీన్.ఆ రోజు అక్కడే నిద్ర చేసి ఆ మరునాడు రూమ్ ఖాళీ చేసేసి కింద లాబీ లో " దేశ్ పాండే" కోసం ఎదురు చూస్తూండ గానే అతను వచ్చి ఎలాగు ఇంత దూరం వచ్చారు కదా " గోవా" చూసివెడతారా? అంటే, లేదు,లేదు వెళ్ళిపోతాము. అనగానే సరే ఒక పని చేద్దాము.రత్నగిరి దగ్గర "పావస్" అని వుంది. అదేదో యోగి పేరు చెప్పారండి. గుర్తు రావటం లేదు. అక్కడికి వెళ్ళివద్దామన్నాడు.అంత ఇంట్రస్టు లేకపోయినా అతను ఆయనకి భక్తుడట. సరే బాగుండదని హారతి అయి నైవేధ్యం పెట్టెవరకూ కాకుండా దర్శనం చేసుకువచ్చేద్దామన్నాము.సరే అంటూ సామాను డిక్కిలో పెట్టి బయలుదేరాము.ఆ ప్రసాదం తీసుకొని వెళ్ళాలి ఆ మహనైవేద్యం కోసం జనాలూ యిక్కడకు వస్తారు, అది తీసుకునేందుకు పెట్టి పుట్టాలి. కావలన్నావారికి దొరకదు.ఆయన దయ ఉంటేనే మనకి ప్రాప్తం వుండేది అంటూ చెప్పాడు. ఇంతలో ఓ చిన్న సందులో యిటికల ట్రక్కు అడ్డంగా అటక్ అయిపోయింది దాన్ని తీసేందుకు క్రేన్ వచ్చి మాకు దారి దొరికి అక్కడకి వెళ్ళేసరికి సరిగా హారతి సమయానికి వెళ్ళాము.అతని ధర్మామా అని హారతీ, ప్రసాదం దక్కాయి.మాకు రాసి పెట్టి వుందనుకుంటాను. అందుకే దారిలో అవాంతరం. తిరిగి మమ్మల్ని బస్ స్టాండు తీసుకెడుతుండగా రోడ్డు మీదే పూనె బస్ దొరికింది. మళ్ళి డ్రెవర్ సీట్ వెనక ముగ్గురు కూర్చునే సీట్ లో ఇద్దరం కూర్చుని వచ్చాం.ఎక్కే జనాలందరూ మూడొ మనిషి ఉన్నట్లే భావించి వెనక్కి వెళ్లి కూర్చున్నారు.మొత్తానికి హాయిగా సంతృప్తిగా , ఆనందంగా స్వార్ గేట్ లో దిగామండి.ఇక్కడ ఎవరు వస్తారూ? మాకోసం కారు తీసుకొని, పైగా రాత్రి పదకొండు గంటలయింది. ఆటోవాడు ఎంత ఎక్కువ అడుగుతాడో అనుకొంటూ ఆటో కోసం చూస్తుంటే మా దగ్గరకి మామా ( పోలిసు) వచ్చి ఎక్కడకి వెళ్ళాలీ? రేంజిల్సు అనడం తోటే ఓ రిక్షాతన్ని పిలిచి యిందులో వెళ్ళండన్నాడు. సరే ! దొరకడమే ఓ పెద్ద అదృష్ట మనుకొని ఎక్కి జాగర్తగా ఇంటికి వచ్చేసాము.మీటరు మీద కంటె ఒక్క పైస ఎక్కువ తీసుకోలేదు.మిరాకిల్ కదా! మొత్తం ప్రయాణం అంతా మిరాకిల్ కదా ! ఇదండీ, మా కొల్హాపురీ యాత్ర విశేషాలు,మార్గశిరమాసంలో లక్ష్మీ పురాణం లాగా మా స్నేహితులు మళ్లీ మళ్ళీ చెప్పించుకుంటారు,ఇంకోటేమిటంటే ఆ ఫోను నెంబరు పలకటం లెదు. మేమెలా వెళ్ళామొ మాకు తెలీదు. అంకుల్ గారిల్లు అదీను, ప్రయత్నిస్తే దొరకొచ్చు కాని రాసి పెట్ట్టి వుంటే జీవితంలో మళ్ళి కలుస్తాం లేకుంటే ఆ లక్ష్మీ మహిమే అనుకుంటాము ..మేము మరీ ఎక్కువగా యాత్రలు చేయలేదనుకోండి. చేసినవి మాత్రం బాగా గుర్తుండిపోయాయి. అందులో కొన్ని దేవుని మహిమ లేక యాదృచ్చికమా! అని అనిపిస్తుంది. మార్గశిరమాసంకదా మా స్నేహితులు కొంతమంది మా కొల్హాపురి యాత్రానుభవం చెప్పమని అడుగుతూవుంటారు.ఇప్పటికి ఎన్నో సార్లు చెప్పాను. అయినా అడుగుతారు, నేను చెబుతూవుంటాను.చెప్పినపుడల్లా ఓ రకమైన అనుభూతి, ఆనందం, భక్తి పారవశ్యం --- కార్తీకపురాణం లా నేను చెప్పే లక్ష్మీ పురాణం విని ఆనందిస్తారు.(మా కొల్హాపురీ ప్రయాణ విశేషాలు) మాకు దేవుని వద్దకు వెళ్ళినపుడు కొన్ని కొన్ని మరపురాని సంగతులు జరుగుతూ వుంటాయి.వాటిలో యిదొకటి. పైన చూపించిన మొదటి ఫొటో( నీలం రంగు) అమ్మవారి శేష వస్త్రం. రెండోది మేము అమ్మవారికి సమర్పించుకున్నలాటి చీర.
ఇలాంటివి ఎక్కడ చూసానబ్బా , అనుకుంటుంటే గుర్తుకి వచ్చింది.పొద్దున్న గుడిలో మేము యిచ్చిన చీర అలంకరించినపుడు తీసేసిన చీర యిలాగే చుట్టలా చుట్టి ఒక గంపలోపడేశారు.అంబా తాయి శేషవస్త్రం అని చెప్పియిచ్చారు. నా నోటంట మాటే రాలేదు. కళ్ళు ఆనందభాష్పాలతో నిండిపోయి ఆ తల్లి తప్పితే మరేమి కనిపించలేదు.ఇంతలో ఆ పక్కవాళ్ళకి ఈ పక్కవాళ్ళకి వాళ్ళ కోడలు చెప్పినట్టున్నారు. వాళ్ళు వచ్చి " తుమ్ చి నసీబ్ కూప్ చాన్ హై" అని నా దగ్గర ఆశీర్వాదం తీసుకొని వెళ్ళారు. నిజానికి వాళ్ళు నా కంటె వయసు లో పెద్దవారేను.