క్రిందటి సారి ఓ టపా వ్రాశానుగా, నా 'సిరిసిరి మువ్వ' గురించి. అది కాస్తా సైలెంటైపోవడం తో కొంచం సుఖపడ్డాననుకోండి, అయినా మరీ అలాగే ఉంటే బావుండదు కూడానూ.మా అమ్మో, అమ్మాయో, చెల్లెళ్ళో ఫోన్లు చేస్తూంటారు. గత వారం పదిరోజులనుండీ,అన్నీ మిస్డ్ కాల్సే. మరీ ఊరంతా చెప్పుకోలేనుకదా, ఇలా నా ఫోను మౌనవ్రతం పాటిస్తోందీ అని, వాళ్ళందరూ లాండ్ లైనుకి చేయడం మొదలెట్టారు. అదేమో వినిపించి చావదూ.బి.ఎస్.ఎన్ ఎల్ వారి ఫోను మరీ! మా వారేమో గవర్నమెంటు పక్షి కదూ, ప్రస్తుతానికి కొత్త ఫోనోటి కొనడానికి agreed in principle ట!దానికి ఫండ్స్ ఎప్పుడు ఎలాట్ చేస్తారో, కొత్త ఫోను నాచేతికి ఎప్పుడొస్తుందో, అంతా పోలవరం ప్రాజెక్ట్ అంత గొడవా! పొనీ రేపు 28 వ తారీఖుకైనా కొనిపెట్టే యోగం ఉందేమో అనుకున్నా. మామూలుగా, మా శ్రీవారు, పెళ్ళిరోజుకి ఇంట్లో అందరికీ ఉపయోగించే వస్తువు కొనడం ఓ ఆనవాయితీ లెండి. దానికి పైగా నాకోసం అంటారు. పెళ్ళైన కొత్తలో ఓసారి, స్టీలుది అమాందస్తా కొని తెచ్చారు! ఏదో నేను వేసుకునేలా ఓ గాజో, గొలుసో కొంటారుకానీ, ఈ దిక్కుమాలిన అమాందస్తా ఏమిటండి బాబూ, పైగా నీకుపయోగంగా ఉంటుందోయ్ అంటూ సమర్ధింపోటీ!రుబ్బురోలు తేలెదు బతికించారు. మొన్నెప్పుడో ఒక యాడ్ చూశాను. భార్య బట్టలుతుకుతూంటే నడుం నొప్పండీ అని ఏదుస్తోంది, పోనీ ఓ వాషింగ్ మెషీనైనా కొనిపెడతాడేమో భర్తా అని, అప్పుడు ఆ మహానుభావుడు, 'అర్రే అలాగా, అయితే 'మిరాకుల్' ఆయిల్ తెస్తా మసాజ్ చేసికో'అంటాడు.అదృష్టం ఏమంటే మా శ్రీవారు ఆ యాడ్ చూడలెదు!అయినా యాడ్లే ఉండాలా ఏమిటీ, ఆ బుర్రనిండా పుంఖానుపుంఖాలుగా ఎన్నెన్నో ఐడియాలు, ఎలాగైనా కోనసీమవారూ మరి!పెళ్ళిరొజుకి రుబ్బురోళ్ళూ, కల్వాలూ, అమాందస్తాలూ ఇచ్చేటంతటి మోస్ట్ రొమాంటిక్ కారెక్టరు మా శ్రీవారు!! నా ఫోను నోరు పడిపోయిందని చెప్పానుగా, నిన్న ఏదో పుస్తకం తీస్తూంటే అదికాస్తా కింద పడింది. పోనీ పూర్తిగా విరిగిపొయినా పీడా వదిలేది. అయినా దానికి ఇంకా ఆయుద్దాయం ఉంటే, అదెందుకు విరుగుతుందీ.మా శ్రీవారు ఇంట్లో లేకపోయుండకపోతే, నేనే దాన్ని కిటికీలోంచి విసిరేసేదాన్ని. అంత అదృష్టమా!'అయ్యో కిందపడిపోయిందే' అనుకుంటూ, దాని భాగాలన్నీ అసెంబుల్ చేశారు. మొత్తం అదీ ఇదీ చేసి మొత్తానికి దాని సౌండు తెప్పించేశారండోయ్!అయినా ఆ మాయదారి ఫోను ఇంత ద్రోహం చేస్తుందనుకోలెదు. ఏదో సౌండు పోయిందీ, ఇప్పటికో ఇంకో పుష్కరానికో కొత్త ఫోనొస్తుందిలే అనుకున్నదంతా ఫ్లాప్ షో అయింది.అమ్మయ్య కొత్త ఫొను కొనఖ్ఖర్లేదూ అని ఆ మొహంలో ఎంత సంతోషమో!
అందుకే అంటారు దేనికైనా యోగం ఉండాలీ అని!
అందుకే అంటారు దేనికైనా యోగం ఉండాలీ అని...
' సిరిసిరి మువ్వ'
ఈ నెలంతా మా మనవడు చి.అగస్థ్య తోనే గడిపాను. వాడి పుట్టినరోజూ, ఆ తరువాత మా మనవరాలు చి.తాన్యా పుట్టినరోజూ, ఆ మధ్యలో మా డాక్టరు స్నేహితులు వారి కూతురితో రావడం, ఈ వారంలో మా అబ్బాయికి స్కూల్లో ఇంగ్లీషు చెప్పిన మాస్టారు భార్య, డాక్టరీ చదువుతున్న కూతురితో రావడం, రెండు రొజులక్రితం మా అల్లుడు చి.విశాల్ పుట్టినరోజూ, అన్నీ పూర్తిచేసికుని మేముండే ఇంటికి చేరాము. ఓ నెలరోజులపాటు, ఇల్లు తాళంపెట్టుంచేస్తే ఎలా ఉంటుందో తెలుసుగా! మధ్యమధ్యలో మావారు వచ్చినా, ఏదో తన టపాలు వ్రాసుకోవడంలో బిజీగా ఉంటారుకానీ, ఇంట్లో పనులేం ఉన్నాయి చేయడానికీ అంటారు! చెయ్యాలని ఉండాలేకానీ, పన్లే ఉండవా మరీ చిత్రం కానీ,ఓ చీపురేస్తే, మరీ అంతగా దుమ్ముకొట్టుకుపోదుగా,పొనీ బూజులాటివేమైనా ఉంటే ఒకసారి,దులిపేస్తే సరిపోతుంది. అబ్బే అలాటివెక్కడ తడుతాయీ? మర్చిపోయానండోయ్, ఈ మధ్యలో అక్కడితో అవలేదుగా, ఇంకో రోజు మా తాన్యాకి స్కూల్లో ప్రోగ్రాం ఉండడం, దానికి ఆదిత్యని తీసికెళ్ళకపోవడం తొ, మావారు వాడితో గడపడానికి వెళ్ళారు.ఏమిటో ఈ గొడవంతా ఏమిటీ, మీరేం చేసుకుంటే మాకెందుకూ అంటారా, అదే మరి ఈవేళ 'మా' టి.వీ. లో 'జయప్రదం' కార్యక్రమం లో శ్రి విశ్వనాథ్ గారితో పరిచయ కార్యక్రమం బావుంది. అందులో 'సిరిసిరిమువ్వ' గురించి చెప్తూంటే, నా దగ్గర ఉన్న ఓ 'సిరిసిరిమువ్వ' గుర్తొచ్చింది! అదేమీ పేద్ద విషయం కాదనుకోండి,పోలికలు మాత్రం చాలా ఉన్నాయి.ఆ సినిమాలో జయప్రద లాగే, పాపం దీనిక్కూడా సౌండు లేదు!మరేం లేదు, నా సెల్ ఫోను!అదేం ఖర్మమో,మా అగస్థ్య ఒకరోజూ దానితో ఆడుకుంటూ,సరదాపుట్టి విసిరేశాడు!అమ్మవారు,ఖండాలుగా అష్టాదశ స్థానాల్లో పడ్డారుట, మరీ అంతకాదుకానీ, మూడు ముక్కలుగా పడింది నా ఫోను.మా కోడలు,దొరికినన్ని భాగాలు తీసి, ఏదో ఎసెంబుల్ చేసింది. ఏమిటో,అప్పటినుంచీ నా బుచ్చి ఫోను మ్రోగడం మానేసింది.పెర్మనెంటు vibration mode లో సెటిల్ అయిపోయింది! అదృష్టం బాగుండి చూసుకున్నానా సరే, లేకపోతే అంతే సంగతులు!మాశ్రీవారు బయటకు వెళ్ళినప్పుడు, ఎక్కడున్నారో, ఎప్పుడు ఇంటికి వస్తారో ఫోను చేస్తూంటారు. అదేమీ నామీద ప్రేమనుకోకండి, ఆయనొచ్చేటప్పటికి కుక్కరు పెట్టేయమనీ! ఈ మధ్యన, నా సిరిసిరిమువ్వ ధర్మమా అని, ఆయన ఫోను చేసినా రింగు వినిపించడం మానేసి సుఖ పడ్డాను! ఇంక ఆయన ఇంటికొచ్చి, అన్నిసార్లు ఫోను చేసినా తియ్యలేదే,బయటకేమైనా వెళ్ళావా అనడం. నేనెక్కడికి వెళ్తానూ వేషాలు కాపోతే? ఆ దిక్కుమాలిన ఫోను మోగదూ, అది ఎప్పుడు మోగుతుందో చూస్తూ కూర్చోడానికి, నాకేమీ ఇంకో పని లేదా ఏమిటీ?అదండి నా సిరిసిరిమువ్వ విషయం!ఎప్పుడో తీరికున్నప్పుడు, కొత్త ఫోనోటి కొనిపెడితే, ఆయనకే ఉపయోగం. లేకపోతే నాకేం?
మా మనవడు చి.ఆదిత్య స్కూల్లో Grandparents day జరిగితే, దానికోదానికి వెళ్ళాము. ఒకరోజు చి.నవ్య కి స్కూల్లో ఏదో ప్రోగ్రాం ఉంటే, అక్కడికి చి.అగస్థ్య ని తీసికెళ్ళడానికి వీలులెకపోతే, నాతోనే ఉన్నాడు. మావారేమో, ఏదో మిస్టరీ షాపింగుకి వెళ్ళారు,ఇంక ఆరోజంతా అగస్థ్యతోనే ఉన్నాను.ఆ సాయంత్రానికి ఇంటికి వచ్చినా, మర్నాడు ఆదివారం, మా అబ్బాయి బయటకు వెళ్ళాడని, మా శ్రీవారు, మా ఇంటికి వెళ్ళి అక్కడే కోడలుకి తోడు గా ఉండి, అబ్బాయి వచ్చిన తరువాత వచ్చారు.
ఒకేఊళ్ళో కూతురూ కొడుకూ ఉండి వాళ్ళకు ఇద్దరేసి పిల్లలూ,ఉంటే అర్ధం అవుతుంది.మేమేదో ఘనకార్యం చేసేశామని కాదూ, వంట్లో ఏదో కొద్దిగా ఓపికుంది కాబట్టి, వాళ్ళడిగినప్పుడల్లా వెళ్ళడం, పిల్లలతో కాలక్షేపం చెయ్యడం. దానికీ అదృష్టం ఉండాలిగా మరి.మా అగస్థ్యేమో నన్ను వదలడు, ఇంకా ఎంత, మొన్ననే ఏడాది నిండింది.ఒక్కొక్కప్పుడు వాడితో సమానంగా ఆడడం కొంచం కష్టమే అనుకోండి.ఇదివరకు మా పై ఇద్దరి మనవరాళ్ళనీ, మనవణ్ణీ అవసరాలు వచ్చినప్పుడు చూళ్ళేదూ? ఇదీ అలాగే. రేపు పెద్దయిన తరువాత వాళ్ళకి గుర్తే ఉందదు!వాళ్ళేమిటీ, పిల్లలకి మాత్రం గుర్తుంటుందా? అక్కడికి వాళ్ళే, తమ పిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచుకుంటూంటామనుకుంటారు కానీ, ప్రతీ తల్లీ తన పిల్లల్ని అలాగే పెంచుతుంది. ఎవరి తాహతుని బట్టి వారు పెంచుతారు. ఇప్పుడు పిల్లో పిల్లాడో పుట్టినప్పటినుండీ, ఫుటోలూ, వీడియో లూ కావలిసినన్ని documentary evidence లూ మరి. రేపు పెద్దైన తరువాత, ఆ తల్లితండ్రులూ, పిల్లలూ చూసుకుని మురిసిపోవడానికి, మా రోజుల్లో ఏమున్నాయి?
ఏం మగాళ్ళండి బాబూ...
మొన్న మా స్నేహితురాలు తన చిట్ పార్టీ చతుర్ శృంగీ కొండ మీద యిచ్చింది. సరే ఎలాగు మేము వెడదామనుకుంటున్నాము కదా అని మా వారితో కలసి ఉదయమే 10 గంటలకల్లా బయలుదేరి వెళ్ళి చీర, పసుపు, కుంకుమ యిచ్చి దర్శనం చేసుకొని నేను అక్కడే వుండి లలితా సహస్రం, లలితా చాలీసా చదువుకుంటూ కూర్చున్నాను. మా శ్రివారు బాపు గారిచ్చిన బొమ్మ ఫ్రేమ్ కట్టించినది కలెక్టు చేసుకొందుకు వెళ్ళి పోయారు.పార్టీ మెంబర్సు వచ్చేది 12 గంటలు దాటిన తరువాత. ఈ లోపులో నేను చదువుకునేవి పూర్తి చేసికుని కాస్త అటూ యిటూ తిరుగుతూ గణేష్ మందిర్ పక్కన సిమెంట్ సోఫా మీద కూర్చున్న నాకు పక్కనే వున్న యిద్దరు మరాఠి స్త్రీల సంభాషణ , వినిపించిన దాన్ని బట్టి , వారి స్నేహితురాలికి మళ్ళి మనుమరాలని దానితో ఆమె నిరాశ పడిందని చెప్పుకుంటూ, అబ్బాయిలకి ఏ మాత్రం అమ్మాయి తీసిపోదని, అబ్బాయిలదిఏముందీ? అమ్మ ఆంచల్ నుండి బీవి కి ఆంచల్ లకి అంతేను, అంటూ ఏవో చెప్పుకుంటూ సేద తీరి కిందకి వెళ్ళిపోయారు.నేను పైకి దర్శనానికి వెళ్ళె భక్తుల్ని చూస్తూ కూర్చున్నాను. అందులో శ్రద్ధ గా వెళ్ళె అబ్బాయిల్ని చూసి( వాళ్ళ మాటల ప్రభావమొ ఏమిటో) నాకనిపించింది, నిజమే కదా వీళ్ళకో అదృష్టం, వీళ్ళకని జాతకం అల్లాంటివి ఏమీ వుండవు కదా!ముందర తల్లి కడుపు చలవ, ఆమె అదృష్టం, మంచితల్లిగా, వీరమాత ( జీజాబాయి), ఆదర్శతల్లిగా వుండే యోగం వుంటే అల్లాంటి పుత్రుడే పుడతాడు. ఆ తర్వాత భార్య తాళి గట్టిగా వుంటే ఆయురారోగ్యాలతో, వీరపత్నిగా, ఆష్టేశ్వర్యాలతో అనుభవించే నసీబ్ వుంటే అవి అన్నీ సమకూర్చకలిగిన మొగుడు గా వుంటాడు. గాడు సారీ! మగాడుగా అతనికి ఏముందండీ? అతనికంటూ ఓ నసీబ్ , ఓ జాతకం ఏమీ లేవే, మరి ఎందుకు విర్రవీగుతాడో తెలీదు. మాతృభూమి, మాతృదేశం, మాతృసంస్కృతి ,మాతృభాష, వీటిని మించినది ఏముందండీ,యివి గౌరవిస్తే మగవానికిఎక్కడయినా నీరాజనాలే కదా!చదువు కావాలంటే సరస్వతిని, శక్తి కావాలంటే దుర్గని, డబ్బులు కావాలంటే లక్ష్మి కి పూజలు చేస్తాడే, కనేందుకు అమ్మాయి అక్కరలేదు, ముసలితనంలోవున్న తల్లి ని మరచిపోతాడే, భార్య మక్కువలో పడి, ఏం, మగాడండీ? తల్లి నిజం. తండ్రి నమ్మకం అన్నారొకరు.తల్లే తొలి గురువు.తొలి మాట " అమ్మా" చిన్న దెబ్బ తగిలితే నోట వచ్చేది "ఆమ్మా".ప్రంపంచంలో చెడ్డ సంతానం వుంటుంది కానిచెడ్డ తల్లి వుండదంటారు. అమ్మాయి పెరిగి తల్లికి స్నేహితురాలవుతుంది, కాని అబ్బాయి తండ్రికి స్నేహితుడవుతాడంటారా? ఏమో, స్త్రీని స్త్రీ గౌరవించడం తెలుసుకోవాలి, చిన్నప్పటినుండి మగవాడికి తెలియబరచాలి. ఈ రోజు అమ్మాయే రేపటి అమ్మ. ఇంకో మగవానికి జన్మ యిచ్చే తల్లి.తన జీవితాన్ని యిచ్చి శక్తిమంతుడ్ని చేసే నారి. భార్యగా, తల్లిగా, చెల్లిగా, అక్కగా, బిడ్డగా,ఆత్మీయత పంచి యివ్వకలిగే కల్పవృక్షం. నా ఉద్దేశ్యంలో ఆడది మగవాడు లేకుండా జీవించగలదుకానీ మగవాడు ఆడది లేకుండా ఆనాధ అయిపోతాడు. ప్రొద్దుటే మావారు బయటకి వెళ్ళడంతో, కంప్యూటరు ఫ్రీగా ఉందని, ఆయన్ తిరిగివచ్చే లోపల ఈ టపా వ్రాశాను.ఇది చదివి,మా శ్రీవారు ఛుప్ అయిపోయారు.ఏమిటీ కోపంగా ఉన్నావా, లేక నిన్నటి 'జయప్రదం'లో కమల్ హాసన్ చెప్పినట్లు, కోపం వస్తేనే కానీ, క్రియేటివిటీ ఉండదనా అన్నారు! ఏం మగాళ్ళండి బాబూ !