RSS

అందుకే అంటారు దేనికైనా యోగం ఉండాలీ అని...

   క్రిందటి సారి ఓ టపా వ్రాశానుగా, నా 'సిరిసిరి మువ్వ' గురించి. అది కాస్తా సైలెంటైపోవడం తో కొంచం సుఖపడ్డాననుకోండి, అయినా మరీ అలాగే ఉంటే బావుండదు కూడానూ.మా అమ్మో, అమ్మాయో, చెల్లెళ్ళో ఫోన్లు చేస్తూంటారు. గత వారం పదిరోజులనుండీ,అన్నీ మిస్డ్ కాల్సే. మరీ ఊరంతా చెప్పుకోలేనుకదా, ఇలా నా ఫోను మౌనవ్రతం పాటిస్తోందీ అని, వాళ్ళందరూ లాండ్ లైనుకి చేయడం మొదలెట్టారు. అదేమో వినిపించి చావదూ.బి.ఎస్.ఎన్ ఎల్ వారి ఫోను మరీ!

   మా వారేమో గవర్నమెంటు పక్షి కదూ, ప్రస్తుతానికి కొత్త ఫోనోటి కొనడానికి agreed in principle ట!దానికి ఫండ్స్ ఎప్పుడు ఎలాట్ చేస్తారో, కొత్త ఫోను నాచేతికి ఎప్పుడొస్తుందో, అంతా పోలవరం ప్రాజెక్ట్ అంత గొడవా! పొనీ రేపు 28 వ తారీఖుకైనా కొనిపెట్టే యోగం ఉందేమో అనుకున్నా. మామూలుగా, మా శ్రీవారు, పెళ్ళిరోజుకి ఇంట్లో అందరికీ ఉపయోగించే వస్తువు కొనడం ఓ ఆనవాయితీ లెండి. దానికి పైగా నాకోసం అంటారు.

   పెళ్ళైన కొత్తలో ఓసారి, స్టీలుది అమాందస్తా కొని తెచ్చారు! ఏదో నేను వేసుకునేలా ఓ గాజో, గొలుసో కొంటారుకానీ, ఈ దిక్కుమాలిన అమాందస్తా ఏమిటండి బాబూ, పైగా నీకుపయోగంగా ఉంటుందోయ్ అంటూ సమర్ధింపోటీ!రుబ్బురోలు తేలెదు బతికించారు. మొన్నెప్పుడో ఒక యాడ్ చూశాను. భార్య బట్టలుతుకుతూంటే నడుం నొప్పండీ అని ఏదుస్తోంది, పోనీ ఓ వాషింగ్ మెషీనైనా కొనిపెడతాడేమో భర్తా అని, అప్పుడు ఆ మహానుభావుడు, 'అర్రే అలాగా, అయితే 'మిరాకుల్' ఆయిల్ తెస్తా మసాజ్ చేసికో'అంటాడు.అదృష్టం ఏమంటే మా శ్రీవారు ఆ యాడ్ చూడలెదు!అయినా యాడ్లే ఉండాలా ఏమిటీ, ఆ బుర్రనిండా పుంఖానుపుంఖాలుగా ఎన్నెన్నో ఐడియాలు, ఎలాగైనా కోనసీమవారూ మరి!పెళ్ళిరొజుకి రుబ్బురోళ్ళూ, కల్వాలూ, అమాందస్తాలూ ఇచ్చేటంతటి మోస్ట్ రొమాంటిక్ కారెక్టరు మా శ్రీవారు!!

   నా ఫోను నోరు పడిపోయిందని చెప్పానుగా, నిన్న ఏదో పుస్తకం తీస్తూంటే అదికాస్తా కింద పడింది. పోనీ పూర్తిగా విరిగిపొయినా పీడా వదిలేది. అయినా దానికి ఇంకా ఆయుద్దాయం ఉంటే, అదెందుకు విరుగుతుందీ.మా శ్రీవారు ఇంట్లో లేకపోయుండకపోతే, నేనే దాన్ని కిటికీలోంచి విసిరేసేదాన్ని. అంత అదృష్టమా!'అయ్యో కిందపడిపోయిందే' అనుకుంటూ, దాని భాగాలన్నీ అసెంబుల్ చేశారు. మొత్తం అదీ ఇదీ చేసి మొత్తానికి దాని సౌండు తెప్పించేశారండోయ్!అయినా ఆ మాయదారి ఫోను ఇంత ద్రోహం చేస్తుందనుకోలెదు. ఏదో సౌండు పోయిందీ, ఇప్పటికో ఇంకో పుష్కరానికో కొత్త ఫోనొస్తుందిలే అనుకున్నదంతా ఫ్లాప్ షో అయింది.అమ్మయ్య కొత్త ఫొను కొనఖ్ఖర్లేదూ అని ఆ మొహంలో ఎంత సంతోషమో!
అందుకే అంటారు దేనికైనా యోగం ఉండాలీ
అని!

5 కామెంట్‌లు:

aavakaaya చెప్పారు...

"అమాందస్తా" ఆహా ఎన్ని సంవత్సరాలయ్యిందండీ ఈ పేరు విని.

ఈ సారి మీ పెళ్ళి రోజుకి రుబ్బు రోలో, పొత్రమో కాకుండా వెరైటీ గా గ్రైండర్ కొనమని చెప్తాను లెండి ఫణి బాబు గారికి :).. మీకూ ఉపయోగం,ఇంట్లో అందరికీ కూడా(గ్రైండర్ గారెలు సూపర్ కదూ). సరదాగా అన్నానండీ.

అజ్ఞాత చెప్పారు...

amandasta ante enti andi?

ravi చెప్పారు...

maa konaseema vaallaki prema apyayata ekkuvandi babu. kaakapote bayatapette tappatiki aa prema kaasta amandasta no rubburolo ayipotundi. lopala matram ravvala necklaseo leka vaddanamo vuntundi

జ్యోతి చెప్పారు...

ఈ మగవాళ్లు ఇంతేనండి. మీ ఫోన్ ఓసారి చేజారినట్టుగా వేడి సాంబార్లో పడేయండి. పీడా పోతుంది.కొత్త ఫోన్ వస్తుంది. :))

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

@ఆవకాయ గారూ,
ధన్యవాదాలు.

@అజ్ఞాతా,

అమాందస్తా అంటే ఓ దేశవాళీ grinder లాటిది. దాన్ని తిరగేసి కుంకుడుకాయలు కొట్టుకోడానికి వీలుగా ఉండేది !

@రవీ,

మా నాయనే !!!

@జ్యోతీ,

ఇంకెప్పుడో అలాటిదేదో చేస్తేనే కానీ కొత్తదొచ్చేటట్లు లేదు !!

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes