మేము రాజమండ్రీ లో ఉండగా,మా శ్రీవారు బ్లాగులోకంలో ప్రవేశించినప్పుడు, మన జ్యోతి తో పరిచయం అయింది.అదికూడా,మావారి బ్లాగు రూపం మార్చే సందర్భం లో.అంతవరకూ ఏదో స్కూల్లో వ్రాసే కాంపోజిషన్లా ఉండేది ఆయన బ్లాగు రూపం! అలాగే ఉంటుంది కాబోసు అనుకున్నాను.నాకేం తెలుసూ? క్రమక్రమంగా అంతర్జాలంలోని మిగిలినవారివి, అందులో జ్యోతి గారి బ్లాగులు చూసిన తరువాత తెలిసింది- బ్లాగుని ఎంత అందంగా తయారు చేసికోవచ్చో-మావారికేమీ ఈ కంప్యూటర్లూ వ్యవహారం తెలియదూ, ఏం చేయడం? ఆవిడనే అడిగేస్తే పోలా అన్నారు.మరీ కొత్తవాళ్ళని అడిగితే బాగుండదేమో అన్నాను.మనమేం అప్పడుగుతున్నామా ఏమిటీ,మా బ్లాగుకి కొద్దిగా అలంకారాలు చేసి పెట్టమ్మా అని అడగ్గానే, చేసి పెట్టేశారు. 'లక్ష్మి గారిచేత కూడా ఓ బ్లాగు మొదలెట్టించకూడదా' అని అడగ్గానే,ఆ పని కూడా చేసేసి,దానికి డెకొరేషనూ వ్యవహారం తనే చేసి,'అబ్బో ఇలా ఉంటుందా బ్లాగాలంకారం' అనిపించేలా చేశారు. తరువాత్తరువాత, మాకూ కమ్యూనికేషనూ పెరిగింది. మధ్య మధ్యలో,ఏదో విషయం మీద టపాలు వ్రాయమని అడగడం ( వనభోజనాల టపా) వగైరా వగైరా..నా బ్లాగు గురించి తెలుగు పేపర్లో వచ్చినప్పుడు, మాకు ఫోను చేసి చెప్పడం.. ఆవిడకీ, మాకూ చుట్టరికం ఏమీలేదు.ఇప్పటిదాకా ఒకళ్ళనొకళ్ళు చూసుకోలేదు, అయినా సరే ఏదో ఆత్మబంధువులా దగ్గరయ్యారు. ప్రతీ పరిచయం కమర్షియల్ అవుతున్న ఈ రోజుల్లో,ఎటువంటి పరిచయం లేని వారికి, స్వలాభాపేక్ష లేకుండా, అడిగిన వెంటనే సహాయం చేయడంలోనే కనిపిస్తోంది, జ్యోతి అభిమానం, స్నేహ భావం. నేను కొత్తగా కంప్యూటరు నేర్చుకున్న రోజుల్లో, షడ్రుచులు అనే బ్లాగులోకి వెళ్ళి, కొత్త కొత్త వంటలు చూసేదాన్ని. ఆ తరువాత, ఈ బ్లాగు నిర్వహిస్తున్నది మన జ్యోతి అని తెలిసిన తరువాత చాలా సంతొషం అయింది. అలాగే, నన్ను 'పొద్దు' లో గడి నింపకూడదా అని మెయిల్ పంపారు. వీటికి సహాయంగా, చిన్నప్పుడెప్పుడో చదివిన గైడ్ లాగ, గడి స్లిప్పులు ఒకటీ! జ్యొతి కి ఇంత టైమెలా ఉంటుందా ,ఇన్ని బ్లాగులు నిర్వహించడానికీ, వీటికి సాయం న్యూస్ పేపర్లలో వ్యాసాలు వ్రాయడానికీ అని ఆశ్చర్యపడిపొతూంటాను.అన్నన్ని వెరైటీ టాపిక్కులమీద వ్రాయడానికి ఎంతో జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఒకటే సరిపోదు, వ్రాయడానికి ఓర్పూ, సహనం ఉండాలి.నాకు నెలకో టపా వ్రాయడానికే ప్రాణం మీదికి వస్తోంది.అంత ఓపిక ఎక్కడిదమ్మా? ఇలాగే తెలుగు బ్లాగర్లకీ ఇంకా ఎన్నెన్నో విషయాలమీద టపాలు వ్రాస్తూ,తనకి తెలిసిన సంగతులు అందరితో పంచుకుంటూ, వారి ఆనందాన్ని ఇంకా పెంచుతూ,ఆయురారోగ్యాలతో ఎన్నెన్నో ఇలాటి పుట్టిన రోజులు జరుపుకోవాలని, ఆ భగవంతుడిని ప్రార్ధిస్తూ, మన జ్యోతి కి జన్మదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంలో మాకు అత్యంత ఇష్టమైన ఈ పాట వినండి.
ज्योत से ज्योत जगाके चलो-జ్యోత్ సె జ్యోత్ జగాకె చలో...
వీరిచే పోస్ట్ చేయబడింది
భమిడిపాటి సూర్యలక్ష్మి
on 21, డిసెంబర్ 2010, మంగళవారం
1 కామెంట్‌లు:
లక్ష్మిగారు,,
మీ అభిమానానికి ధన్యవాదాలు. మరీ అంతగా చెప్పుకునే పనులేమీ చేయలేదులెండి..:)
కామెంట్‌ను పోస్ట్ చేయండి