నిన్నంతా కళ్ళజోడు లేక, ఏమీ చదవడం కుదరక, పొనీ టి.వీ. ఏనా చూద్దామనుకుంటే, అంతా గందరగోళంగా ఉండడంతో కట్టిపారేశాను.పోనీ ఏదైనా టపారాద్దామా అంటే, ఆ అక్షరాలు కనిపించి చావవూ. అసలు నా సరుకెదొ నేనే తెచ్చుకొక, ఆయనకి చెప్పడం ఏమిటీ, నా ఖర్మ కాపొతే! ఉత్తి పెట్టి కాస్తా తెచ్చారుట, దాంట్లో కళ్ళజోడు ఉందో లేదో చూసుకోవద్దూ? ఈవేళ ఆయన వ్రాసినటపా చదివితే తెలిసింది, అదంతా కావాలనే చేశారని, కంప్యూటరు దగ్గర తనే కూర్చోవచ్చని ప్లానన్నమాట! వీరి ఫోర్మన్ ఒకాయనుండేవారు, ఉద్యోగంచేసే రోజుల్లో, ఆయన ఇంట్లో, ఏదైనా తద్దినం లాటివి ఉన్నప్పుడు, ఈయనవి డెంచర్లు కాస్తా దాచేసేదిట, లేకపోతే ఏదొ ఒకటి తినేస్తారని. ఈయనకి పోనీ అలాటిదేమైనా చేద్దామన్నా, అసలు ఆ డెంచర్లే వాడరు! పైగా ఏమైనా అనడం తరవాయి, ఓ టపా రాసేస్తానూ అని ఓ బెదిరింపోటీ. అసలు ఈ కంప్యూటరు లో బ్లాగులు వ్రాయడం మొదలెట్టిన తరువాత, ఆయన వ్రాయని విషయం లేదు! ఏదైనా మాట్లాడాలంటే భయం వేస్తోంది. ఈయనది అదో టైపు. శీతాకాలంలొ ఫుల్లుగా ఫాన్ పెట్టి పడుక్కుంటారు. చలేస్తోందండీ, అంటే సర్క్యులేషన్ ఉండాలోయ్ అంటారు. ఎంత చలైనా సరే ఓ బనినోటి వేసుకునే ఉండడం. మీరందరూ వేసుకుంటారని నానా తిప్పలూ పడి, అన్నేసి స్వెట్టర్లల్లితే, ఒక్కటీ వేసుకోరేమండీ, అంటే వద్దంటారు. అసలు ఈయనదేమైనా సిక్స్ ప్యాక్కా ఏమిటీ, అందరికీ చూపించుకోడానికీ? ఏమిటో, ఎవరి పిచ్చి వాళ్ళకానందం!మొత్తానికి ఈమధ్యన ఏమనిపించిందో ఏమిటో, చలేస్తోందోయ్ అనగానే ఓ స్వెట్టరు,అదొకటే మిగిలింది ఇక్కడ, మిగిలినవన్నీ మా ఇంట్లో ఓ సూట్ కేసులో పెట్టి పైన పెట్టేశారు. ఎప్పుడో వెళ్ళినప్పుడు తీసి తెచ్చుకోవాలి. లేకపోతే ఆ ఇచ్చిన స్వెట్టరు గొడ్డుతోల్లా తయారుచేస్తారు, ప్రతీ రోజు వేసేసికుని. దాన్ని ఉతకలేక చావాలి మళ్ళీ. చెప్పానుగా, మా శ్రీవారు ఏదీ దాచుకోరు, ఏం జరిగినా, ఏం మాట్లాడినా ఓ టపా వ్రాయాల్సిందే. ఎందుకండీ ఇలా మన కాపరం కాస్తా బయట పెట్టేస్తున్నారూ అంటే, ఏం చేయనూ ఇంట్లో వాళ్ళెవరూ నా మాటలు వినడం లేదూ, పోనీ బయటివాళ్ళైనా వింటున్నార్లే అంటారు. ఈయన ఖబుర్లన్నీ వినడానికి ఎవరూ లేకపోతే, మా మనవడు చి.అగస్థ్య తో చెప్పుకుంటారు. ఇంతా చేస్తే వాడికి రేపు జనవరి ఏడో తారీక్కి, ఏడాది నిండుతుంది. ప్రస్తుతానికి వాడొక్కడే ఈయనకి faithful listener! రేపెప్పుడో వాడికి మాటా, నడకా వచ్చిందంటే అవుతుంది ఈయన పని! అసలిదేం అలవాటో, ఒక్కటీ దాచుకోరు.జరిగినదేమిటో, ఎవరో ఒకరికి చెప్పేదాకా, నిద్ర పట్టదు. అసలు దాపరికం లేదండి బాబూ!అలాగని అన్నీ చెప్పరండోయ్, మొన్నటికి మొన్న రోడ్డుమీద పడ్డ సంగతి, తను వ్రాసిన టపా చదివేసే ముందర, బావుండదని నాతో చెప్పారు. అయ్యో అయ్యో అంతలా పడితేనైనా చెప్పొద్దుటండీ, ఏ సున్నం బెల్లం పట్టేస్తానేమో అని భయం! పోనీ అలాగని మా అందరిగురించీ పట్టించుకోరా అందామంటే అదీ కాదూ, ఫోన్లోనైనా సరే మాటలో తేడా వచ్చిందంటే పట్టేస్తారు ఏమిటీ వంట్లో బాగో లేదా అంటూ! డాక్టరుదగ్గరకు వెళ్ళేదాకా వదలరు. ఆ మధ్య నాకు వంట్లో బాగోలేదని అనగానే ఎంత హడావిడీ, ఈ.సీ.జీలూ, బేరియం టెస్టులూ, సుగరూ మొత్తం ఇంజను ఓవర్ హాలింగు చేసినంత చేసేశారు.మరి ఆయనకెదైనా జరిగినప్పుడు నాతోనైనా చెప్పాలా లేదా? ఏమైనా అంటే, ఊరికే ఖంగారు పడిపోతావూ అంటారు. ఔనమ్మా, నాక్కాక ఇంకెవరికుంటుంది ఖంగారు? ఇంకో విషయం- మొత్తానికి మా ఫ్రెండ్స్ తో చిట్ మళ్ళీ చేరానోచ్!మా శ్రీవారు 'ఊరికే ఏవేవో ఊహించేసికుని, వాళ్ళందరితోనూ కచ్చి చెప్పేశావు.అందరికీ ఎవరో ఒకరు ఉండాలి,just for change of scene' అని!
అసలు మా పిల్లల్ని అనాలి, వాళ్ళకి నాన్నంటే ఎంతో ప్రేమా అభిమానమూనూ. అప్పుడెప్పుడో రాజమండ్రీ వెళ్ళినప్పుడు, ఈయన బర్త్ డే కి ఓ కంప్యూటరోటి కొనిపెట్టాడు మా అబ్బాయి,ఈయనేమో తెలుగు టైపింగు నేర్చేసికుని, ఇదిగో ఊరిమీద పడ్డారు. దానికి సాయం మీరందరూ కూడా ఉత్సాహపరిచేసరికి,ఇంక ఆయన్ని పట్టేవాళ్ళెవరూ? అవునులెండి, చేసికున్నవాళ్ళకి చేసికున్నంతా అని ఊరికే అన్నారా?పోనీ మా పిల్లలు, అమ్మ అంత శ్రమ పడిందీ, చదువుకునే రోజుల్లో, వాళ్ళతో కూర్చుని, పాఠాలు చదివించేదీ,కావలిసినవన్నీ వండి పెట్టేదీ అనెమన్నా గుర్తుంటుందా, అబ్బే, నాన్నే అసలు చాలా మంచివారూ, మేము అడిగినట్లుగా మాక్కావలసిన వారితో, పెళ్ళి జరిపించారూ లాటివే గుర్తు! వాళ్ళ దృష్టిలో అమ్మ ఎప్పుడూ హిట్లరే ! అది నీట్ గా ఉంచూ, ఇదిక్కడ పెట్టూ, అదక్కడ పెట్టొద్దూ అనే నా సాధింపులే గుర్తుంటాయి. వీళ్ళందరూ కలిసినప్పుడు ఇవే మాటలు. ఏదైనా తప్పు పని చేసేటప్పుడు మాత్రం నావైపు చూస్తారు, అమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో అని.
అస్సలు దాచుకోరండి బాబూ...
వీరిచే పోస్ట్ చేయబడింది
భమిడిపాటి సూర్యలక్ష్మి
on 23, డిసెంబర్ 2010, గురువారం
3 కామెంట్‌లు:
eppatilage baaga raasarandi. sixpack counter ayike keka.
keep going
మీరు రాసినది చదువుతుంటే మునిమాణిక్యం గారి కాంతం గుర్తుకొచ్చిందండీ. ఈ కింది లింకులో కింద భార్యా గుణవతీ అన్న విషయం చదవండి:
http://www.misimi-monthly.com/highlights_current_issue.html
@రవీ,
ధన్యవాదాలు.
@బొందలపాటి గారూ,
మునిమాణిక్యం వారి రచనలు వినడమే కానీ చదివింది మీరిచ్చిన లింకు ద్వారానే. మరీ కాంతం గారన్నట్లు, మా శ్రీవారు ఊళ్ళు పట్టుకుని మాత్రం తిరగరు! నేనేదో చాయ్ పెట్టుకుని త్రాగుదామనే లోపలే, ఎలా వాసన పసికడతారో, కొంపకి చేరుతారు. ఇంక మిగిలినవంటారా, కాంతం గారు చెప్పినవన్నీ డిటో !!
కామెంట్‌ను పోస్ట్ చేయండి