అదేమిటో,ముక్కు కుట్టించుకోవడం అంటే చాలా భయం నాకు. ఎప్పుడో ఒకసారి, మేము పూనాలో శ్రీమతి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గారి కచేరీకి వెళ్ళాము. ఆవిడని చూస్తూ, ఆవిడ పాట వింటూంటే, ప్రపంచం లో ఇంకెమీ అఖ్ఖర్లేదనిపిస్తుంది. నాకు కర్ణాటక సంగీతంలో అంత అభిరుచి ఏమీ లేకపోయినా, మాశ్రీవారికి ఉన్న అభిరుచి ధర్మమా అని, పూనా ( ప్రస్తుత పూణె) లో ఆరోజుల్లో జరిగే, ప్రతీ సంగీత కచెరీకీ వెళ్ళేదాన్ని.వెళ్ళగా, వెళ్ళగా నాకూ కర్ణాటక సంగీతం అంటే అభిమానం వచ్చేసింది. కానీ, ఈ కొత్తగా తెచ్చుకున్న అభిమానం, నాకు 'కష్టాలు' తెస్తుందనుకోలేదు! ఆ తరువాత ఎప్పుడో, 1980 లో అనుకుంటా, ఒకసారి, శ్రీమతి సుబ్బులక్ష్మి గారి కచేరీకి వెళ్ళినప్పుడు, మా శ్రీవారు,'చూశావా అమ్మ (అంటే ఎమ్.ఎస్)గారి ముక్కు మీది పుడక ఎంతలా మెరుస్తూందో, అసలు ఆవిడ మొహానికే అందం వచ్చేసింది, స్త్రీ అంటే అలాగ ఉండాలీ, వగైరా వగైరా అనడం మొదలెట్టారు. ఓరినాయనో, ఈ లెక్చరు ఎక్కడికి తీసికెళ్తుందో అని భయ పడిపోయాను. తీరా అనుకున్నంతా అవనె అయింది, 'ఏమిటోయ్, ముక్కు కుట్టించుకోకూడదూ నువ్వుకూడా, ఓ మంచి ముక్కు పుడక కొంటానూ, నీ మొహం కూడా వెలిగిపోతుందీ..'అన్నారు. మొత్తానికి లక్ష్మీ రోడ్డుకెళ్ళి, ముక్కు కుట్టించేసికున్నాను.అక్కడ ముక్కు కుట్టి ఓ బంగారంతీగ చుట్టారు. మా అమ్మగార్కి " అష్టవర్షే భవత్ కన్యే" లా కాకపోయినా ఎనిమిదో తరగతి చదువుతున్నపుడే పెళ్ళి ఐపోయి అత్తవారిటింకి వెళ్ళినపుడు ఎవరో అన్నారుట,పెద్ద అవధానుల గారి అమ్మాయీ, ముక్కు కుట్టకుండానే ఎలా పెళ్ళి చేశారబ్బా? అంతే అభిమానం పొడుచుకొచ్చి ఎప్పుడో కుట్టించుకున్నా ముక్కు పూడుకుపోయిన చోట రాత్రికి రాత్రి సూది దారంతో తనకి తనే పొడుచుకుందట. తెల్లవారిన తరువాత మా తాతగారు ఇన్ఫెక్షన్ అవకుండా ఇంజెక్షన్ యిప్పించారట. ఆవిడ కూతుర్ని నేను కనీసం అవకాశం వచ్చినపుడు కుట్టించుకోబోతే ఎలాగా? నా పెళ్ళికే కుట్టిద్దామనుకున్నారు,మా మావ గారు కల్పించుకొని పెళ్ళికి సమయం ఆట్టే లేదు, అలాటివేమీ పెట్టుకొకండన్నారు.భామా కలాపంలొ కూడా దీనిమీద ప్రస్తావన వుంది. మగని ప్రేమకి ముక్కుపుడక ఓ గుర్తు. నువ్వు కూడా కుట్టించుకొని రాజాని ఇంప్రెస్ చేసేయ్. అంటే, అయ్యబాబోయ్! అనేసింది. ఆ తరువాత కుట్టించుకుందో లేదో తెలీదు. అలాగా ఎర్రరాయితో మొదలుపెట్టి మెల్లిగా స్క్రూది చిన్నది పెట్టుకొని, సమయం వచ్చినప్పుడల్లాగా ఎప్పుడు మాటా మాటా వచ్చినా సరసంగానో విరసంగానో మొత్తానికి అక్కడేకే వచ్చేది. మీ కోసం నేను ముక్కుకూడా కుట్టించుకున్నాను. అయినా నేనంటే అస్సలు ప్రేమే లేదూ, అంటూ ముక్కు ఎగపీల్చేసేదాన్ని.సంపెంగలాంటి ముక్కు కాకపోయినా మీ కోసం నేనంత త్యాగం చేసాను అనే ఫీలింగు కలిగించేలా చేశాననేవారు!.అసలేంటంటే వజ్రపు ముక్కు పుడక చేయిస్తానన్నారుకదా, ముక్కు కుట్టించుకుంటే , అది అడగలేను. మా ఆర్ధిక పరిస్తితులు తెలుసు కదా!అలా అదో టైమ్ పాస్. మేము వరంగావ్ లో వున్నపుడు ఆంధ్రా వెళ్ళి వస్తున్నపుడు,ఓ చక్కని చిన్న వజ్రంతో బంగారంతో దిట్టంగా వున్న ముద్దు గొలిపె ముక్కెర తెచ్చి యిచ్చారు.చాలా బాగుంది కదా ముచ్చటగా పెట్టుకుందామని ప్రయత్నిస్తే పట్టదే, దాని గొట్టం యింతలావున వుంది.ఎలా? పెట్టుకోకపోతే తెచ్చిన తరువాత కూడా ఎందుకు పెట్టుకోలేదంటారు?చెబుదామంటే అభిమానం.మొత్తనికి శీల తిప్పేసి పెట్టేసుకున్నాను.అది చర్మంలోకి దూరిపోయిందో ఏమో తెలీదు, అసలు అటు ఇటు తిరిగేదేకాదూ,కొన్నాళ్ళు నొప్పి పెట్టి నొప్పి తగ్గింది కాని అది కదిలేదేకాదూ. తీసే ప్రశ్నే లేదు, ఆపరేషను సమయంలో కూడా అదిరాదు,ప్రయత్నించకండీ, మా వారి ప్రేమంత గొప్పదది అని చెబుతుండెదాన్ని.
తీగతో చుట్టించుకున్న వారానికే మా నాన్నగారిదగ్గరనుండి ఉత్తరం, మా చెల్లెలు పెళ్ళని, అయ్యబాబోయ్! ఈ తీగతో ఏలాగా వెళ్ళడం అనుకొని ఎర్రరాయితో నక్షత్రాకారంలోవున్న తీగ ముక్కుపుడక కొనుక్కోని తీగ కట్ చేయించి అది బలవంతంగా పెట్టుకొని పెళ్ళికివెళ్ళివచ్చేసరికి ఇంత లావున ముక్కు ఎర్రబడిన మొహంతో, విపరీతమైన నొప్పితో చాలా బాధ పడిపోయాను. మళ్ళీ ఖడ్కీ బజారు వెళ్ళి దాన్ని బలవంతంగా తీయించుకొని మందులు క్రీములు వాడి తగ్గిన తరువాత ముక్కు రంధ్రం పూడుకుపోకుండా పొగాకు కాడ, నిమ్మముల్లు పెట్టుకుంటూ కొయ్యకండ రాకుండా కాపాడుకుంటూ వచ్చాను. మా స్నేహితురాలు లీల, ఎందుకండీ, యిన్ని తిప్పలు? చిన్నప్పుడైతే పరవాలేదు కానీ,' आ भैल मुझॅ मार्'లాగ ఇప్పుడెందుకు కుట్టించుకున్నారూ అని అడిగితే అసలు సంగతి అప్పుడు చెప్పాను. అయన అడిగారని కాదూ, అసలు నాకు కూడా చాలా చాలా యిష్టమని, తనకోసమంటూ చేయించుకొని బోలెడంతా ప్రేమ, వగైరా లాంటివి చాలా పొందవచ్చని, నోటికి చక్కెర ఎంత తీపో, ముక్కుకి ముక్కెర అంత అందమని, అలాటి ముక్కెరని భర్త దగ్గర పొందడం , అందులోను విన్నావుగా వజ్రపుముక్కుపుడక చేయిస్తానంటున్నారుకదా !
ఇప్పటికి అది అంతేనూ, మాశ్రీవారి ప్రేమ, ముచ్చట, ముక్కెర అన్ని గట్టివేను....( అలాగేఅనుకోవాలి కదా) ఇదండీ సంగతి
నేనూ-నా ముక్కుపుడకా..
వీరిచే పోస్ట్ చేయబడింది
భమిడిపాటి సూర్యలక్ష్మి
on 5, జనవరి 2011, బుధవారం
4 కామెంట్‌లు:
eppatilage baaga raasarandi.
బాగా రాసారండి......
రవి,సంతోష్ రాయ్ గారూ ధన్యవాదాలండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి