ఇదివరకటి రోజుల్లో, పేకాటా,త్రాగుడు, నల్లమందూ వ్యసనాలనేవారు. అవి అలాగే ఉన్నాయి, కానీ ఈ ఆధునిక కాలం లో వాటికి మరోటి జత కలిసింది. అదేమిటో కనిపెట్టేశారనుకుంటాను. అదేనండి బ్లాగింగు !ఇదెక్కడి వ్యసనం అండి బాబూ? ఇదివరకైతే ఏ విషయం విన్నా, ఏ పేపరులోనో చదివినా, దాన్ని ఇంకోళ్ళకి చెప్పేదాకా ఊరుకునేవారు కాదు. వాటికి ముందుగా బలైపోయారెవరయ్యా అంటే, ఇంట్లో పెళ్ళాం పిల్లలు! ఏదో ఉద్యోగాల్లో ఉండేవారు కాబట్టి, ఆఫీసుల్లో అందరూ కాకపోయినా, వీళ్ళ కింద పనిచేసేవారు చచ్చినట్లు వినేవారు.క్రమక్రమంగా, వినేవాళ్ళు తక్కువైపోయారు. ఉద్యోగం అయిపోయి రిటైరైపోయిన తరువాత, వీళ్ళ కబుర్లెవరు వింటారూ? ఏదొ అదృష్టం కొద్దీ, ఏ మనవడో, మనవరాలో ఉన్నారా వాళ్ళ పనైపోయినట్లే!ఆ మనవడికి ఎంత వయస్సుంటుందండీ, మహా అయితే ఏడాదిపైన ఓ నెలో రెండు నెలలో. వాణ్ణి బయటకు షికారు తీసికెళ్ళినట్లు తీసికెళ్ళడమూ, వాడితో తను విన్నవీ, కన్నవీ చెప్పుకోవడమూనూ.వాడేమైనా ఆరుస్తాడా తీరుస్తాడా? అయినా సరే, మన కడుపుబ్బరం తగ్గుతుంది కదా.ఏదో వాడికి మాటా, నడకా వచ్చేదాకానే ఈ సంబడం.ఆ రెండూ వచ్చేయంటే, మిగిలిన ఒక్క శ్రోతా పార్టీ మార్చేస్తాడు. ఏదో ఇంట్లో పిల్లలుండడం తో, కంప్యూటరేదో నేర్చుకోడం,పైగా ఎవరికీ రాదన్నట్లు తెలుగులో వ్రాయడమోటి కూడా నేర్చేసికుంటే, ఇంక మనల్ని పట్టేవాళ్ళెవరూ? ఇన్నాళ్ళూ 'నష్ట' పోయిన టైమంతా ఇంక రోజుకో టపా వ్రాసేసికుంటే, అడిగేవాడెవడూ?రాత్రిళ్ళు వ్రాయడం, ఆ వ్రాసినప్పటినుండీ, హారం లో వచ్చిందా, కూడలిలో వచ్చిందా, ఈ మధ్యన సమూహం, సంకలినీ, వీటికి తోడయ్యాయి, అని చూసుకోడం. మళ్ళీ తెల్లారేటప్పటికి, ఎంతమంది వ్యాఖ్యలు పెట్టారూ, ఎన్ని హిట్స్ వచ్చాయీ అనే రంధి ! ఓ మాట లేదు, ఓ మంతిలెదు ఇరవైనాలుగ్గంటలూ ఇదే గొడవ. ఎవరైనా ఇంటికి వచ్చారా అయిపోయారే! ఆ మాటా ఈమాటా చెప్పి,మాటల్లో ముగ్గులోకి లాగేయడం 'నాకు బ్లాగులు వ్రాయడం హాబీ అండీ' అంటూ!అదేదో మనకి రాదూ, పోన్లే చూద్దాం, ఎంతైనా కాఫీ ఇచ్చారుకదా అని, పాపం వాళ్ళూ బుట్టలో పడిపోతారు. ఒకటా రెండా, అయిదు వందల పై మాటే.అందులో సగం చూడ్డానికైనా ఓ గంటో రెండు గంటలో పడుతుందిగా.మొత్తం మూడు గంటలు. మర్నాడు మళ్ళీ ఓ టపా వ్రాసుకోడం, మా ఇంటికి ఎవరైనా వస్తే కనీసం మూడు గంటలైనా గడుపుతారూ అని. కానీ, వాళ్ళని ఆపడానికి వెనక్కాల జరిగిన కథంతా చెప్పరుగా!ఏమిటో వెళ్ళిపోతూంది జీవితం!
కొత్త వ్యసనం
వీరిచే పోస్ట్ చేయబడింది
భమిడిపాటి సూర్యలక్ష్మి
on 18, మార్చి 2011, శుక్రవారం
4 కామెంట్లు:
entandi suddenga babi gaarini adesukunnaru?
naaku ee vyasanam pattukudi..retire ayyanu..paigaa పిల్లలంతా అమెరికా!!ఇంకేమి చెయ్యను చెప్పండి.. ఆడు కునేందుకు ఆడిపిచ్చేందుకు
ఎవరు లేరు దగ్గర..వ్యసనమైన బానే వుంది అనిపిస్తోంది...
బాగుంది ఈ వ్యసనం. నేను కూడా ఈ మధ్యే బ్లాగ్ మొదలు పెట్టానండి. కొత్త పిచ్చోడు పోద్దేరగడులా ఉంది నా పని....పెద్దవారు మికే కాదండీ...మా పరిస్తితి కూడా అదే
రవీ,
ఎంతకాలం ఓపికపట్టనూ?
లక్ష్మిరాఘవ గారూ,
మరీ బయటి ప్రపంచాన్ని పట్టించుకోకుండా ఉండనంత కాలం, ఫరవాలేదు లెండి. నేనూ ఇప్పటికి ఓ వందదాకా వ్రాశాను !
ప్రవీణా,
ఊరికే సరదాగా వ్రాశానంతే ! ఏదో ఒక కాలక్షేపం ఉండాలికదా !
కామెంట్‌ను పోస్ట్ చేయండి