మీకెందుకొచ్చిన గొడవండి బాబూ, తీరికూర్చుని మీ అభిప్రాయాలన్నీ అందరిమీదా రుద్దుతారూ, ఎంతమందికి కోపాలొచ్చాయో ఏమిటో, ఇకపైన మీ టపాలకేసి కన్నెత్తికూడా చూడ్డం మానేస్తారు కూడానూ. షిరిడీ శాయిమీదా, సీతమ్మ వాకిట్లో.. మీదా అంతే, ప్రపంచం అంతా "నీరాంజనాలు" పట్టే సినిమాల్లో, మీకెక్కడో ఏదో కనిపిస్తుంది, ఇంక పేట్రేగిపోవడం.అసలు మిమ్మల్నెవరడిగారూ, సినిమా బావుందా లేదా అనీ? వయస్సుతో పాటు చాదస్తం కూడా ఎక్కువైపోతోంది, ఎవరెలాపోతే మీకెందుకూ అసలూ? ఆ సినిమా ఇక్కడకి రాలేదూ, డీవీడీ కూడా దొరకలేదూ ఓ గొడవొదిలిందనుకున్నంతసేపు పట్టలేదు, వరూధిని గారు, ఆవిడా ఊరికే కూర్చోకుండా, తన దారిన తను సినిమా చూడొచ్చుగా మళ్ళీ టపాల్లో ఆ లింకేదో పెట్టడం, మనం చూడ్డం. పోనీ చూసేసి ఊరుకుంటారా అంటే అదీ లేదు.ఇంకోళ్ళెవరో మలయాళంలో ఇదే కథని తీశారుట, దాని లింకేమో మనం పెట్టడం, ఎందుకొచ్చిన హైరాణ స్వామీ హాయిగా కూర్చోక?
సరే ఒప్పుకున్నాం, మీరు 1998 లోనే మిథునం చదివేసి శ్రీరమణ గారికి ఉత్తరం వ్రాసేశారు. పైగా అదేదో సరిపోనట్టు,ఆ కథని xerox తీయించి మరీ, తెలిసున్నవారందరిచేతా చదివించారు. పోనీ దానివలన మీకేమైనా ఒరిగిందా అంటే మీరేమన్నారూ అప్పుడూ, "తెలుగు భాషొచ్చిన ప్రతీవాడూ చదవ్వలసిన కథోయ్ ఇదీ" అన్నారు, బావుంది.పైగా రెండేళ్ళకి మీ ఆరాధ్యదైవం శ్రీ బాపూగారి దస్తూరీతిలకంతో, మళ్ళీమళ్ళీ ఈ కథ చదవడం, అదేసంవత్సరం మీ దేముడు శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి అభిప్రాయం మిథునం మీద మళ్ళీ శ్రీబాపూగారి దస్తూరీతిలకమే--
"అలాగే భార్యాభర్తలు కూడా- ఓపిక పోయి, కోరికలు తీరి శృంగారావసరాలు లేని వయసులో ఒకరినొకరు ప్రేమించుకోడమే అత్యుత్తమ శృంగారం.వారి చుట్టూ పెరిగి అల్లుకునే అనురాగమనురాగలత శోభాయమానమైనది.లోకోత్తర సౌరభాలతో వెల్లివిరిసేది. పెనుగాలి వీచినా చెదరని ప్రదీప కళిక. అటువంటి దీపాన్ని మనకి చూపించే గొప్ప కథ- శ్రీరమణ గారి 'మిథునం'. ఆ కథలో ఆలుమగలు పండు ముసిలివాళ్ళు.పసిపిల్లల చురుకుతనం, పడుచువాళ్ళ శక్తిచైతన్యాలూ పెద్దల వాత్సల్యవివేకాలూ అక్షరమైన స్నేహం కలబోసిన వాళ్ళు-ఒకరినొకరు వెక్కిరిస్తూ తిట్టుకుంటూ దెప్పుతూ గిల్లుతూ( కె.పి.ఎస్ కాదు) అల్లరి పెడుతూ నవ్వుతూ నవ్విస్తూ పున్నమినాటి సముద్ర కెరటాల్లా ఎగిసిపడి లేస్తూ బతుకే నిత్యకల్యాణ మండపంగా ఇల సాటి లేని జంటలా ఉంటారు.
ఇక వేళ అయిందనిపించిన వేళ తను లేని ఒంటరి తనాన్ని భర్త భరించలేడని తలిచి-
భర్త వడిలో సుమంగళి గా వెళ్ళిపోవాలనే ఇల్లాలి కోరికను చంపుకుని-
తన వడిలో తలవుంచి ఆయనే ముందుగా హాయిగా వెళ్ళిపోవాలని
కోరుకున్న ఉత్తమ యిల్లాలు ఆవిడ.
జీవికి జాగ్రత,నిద్ర,స్వప్నం, అదీ దాటాక తురీయమైన ఆనందం- ఇలా నాలుగు అవస్థలుంటాయంటారు.
అలాగే రసరాజమైన శృంగార పథయాత్రికులకు- కోరిక, ప్రయత్నం, ప్రతిఫలం తరవాత తురీయమైన ప్రేమసామ్రాజ్యసిధ్ధిని ఈ కథ ఆవిష్కరించింది".
పాపం వెర్రి మనిషండీ మా శ్రీవారు, మిథునం కథ 1998 లో చదవడం తరవాయి, శ్రీరమణ గారికి ఉత్తరం వ్రాసేయడమేమిటి, ఆయన దగ్గరనుంచి వచ్చిన జవాబు పటం కట్టించేసి అడిగినవాడికీ, అడగనివాడికీ చూపించేసికోడం, ఇదేదో సరిపోదన్నట్టు సరీగ్గా పదేళ్ళకి
భాగ్యనగరంలో శ్రీరమణ గారిని కలిసి, ఆయనతో మూడు నాలుగుగంటలు గడిపేదాకా తృప్తి పడలేదు.అదీ ఆకథంటే ఆయనకున్న అభిమానం.ఆ కథలో చదివిన తరువాత ఎప్పుడో స్వర్గస్థులైన తన అమ్మమ్మ గారిని ఊహించుకునేవారు.మా అమ్మమ్మా, తాతయ్య బతికుంటే ఇలాగే ఉండేవారేమో కదూ అంటూ రాత్రీపగలూ ఒకటే గొడవ.
అక్కడితో ఆగకుండా, ప్రముఖ తెలుగురచయితల మిథునాభిప్రాయలన్నీ చదివి, ఇంకా ప్రభావితులైపోయారు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా అప్పదాసుగారూ, బుచ్చిలక్ష్మిగారే.
ఇంత ప్రభావితులవడం మరీ ఎక్కువేమో అని ఈ పదిహేనేళ్ళలోనూ ఆయనతో అంటూండేదానిని. అప్పుడెప్పుడో విన్నారు మిథునం సినిమాగా తీస్తున్నారూ అని. తీరా ఈ ఊళ్ళో రాకపోయేటప్పటికి తుస్సుమన్నారు.ఏదో నెట్ లో వచ్చిందని ముందర చెప్పిందికూడా నేనే
పోనీ ఇద్దరమూ కలిసి చూద్దామనైనా లేకుండా, టీవీ లో శ్రీ చాగంటి వారి ప్రవచనం కూడా మానుకుని, ఒక్కరూ చూసేశారు. పోన్లెద్దూ తరువాత చూద్దాములే అనేసికుని, సినిమా ఎలా ఉందండీ అన్నాను.అడగడం పాపం," అదేమిటోయ్ అప్పదాసుగారు, బుచ్చిలక్ష్మి గారూ మరీ ఇలా ఉంటారా? కథలో ఉన్న ఒక్కటీ సరీగ్గా చూపించనేలేదూ,అప్పదాసుగారు జామపండు నమిలి బుచ్చిలక్ష్మిగారి నోట్లో ఆ గుజ్జు ఎలా పెడతారో చూసి ఆనందిద్దామనుకుంటే అసలా సీనే లేదూ, పోనీ ఆ తోటైనా శ్రీరమణ గారు కథలో వర్ణించినట్టుగా కాకుండా, అదేదో హైబ్రిడ్డు ఎరువులేసినట్టుగా ఉందీ.. ఏమిటో సినిమాలు తీద్దామని ఉబలాటమే కానీ, తీరువుగా తీద్దమనెందుకనిపించదో మనవాళ్ళకి"
కోనసీమవారైనా లౌక్యాలు వంటబట్టలేదు పాపం. ప్రపంచం అంతా పొగుడుతున్న మిథునం సినిమా మాత్రమే ఈయనకి నచ్చలేదూ,సరే, ఊరంతా చెప్పుకోడం దేనికీ? బహుశా ఎన్నెన్నో expectations పెట్టుకున్నారేమో...
12 కామెంట్లు:
మీ నిష్టూరం లోనూ, మీవారి పట్ల మీకున్న ప్రేమాభిమానాలు వ్యక్తమవుతూనే వున్నాయి సుమా ! అయన నిక్కచ్చితనాన్ని మాత్రం మెచ్చుకుతీరాలి.
చెల్లెమ్మా! బావగారు మనసులో మాట చెప్పేరు తప్పేముందీ! లోకో భిన్న రుచి కదా! రాజుని చూసిన కళ్ళ మొగుణ్ణి చూస్తే ఎలా? నువ్వూ బావగారిని ఏమనకుతల్లీ :) బావగారి పట్ల నీ అభిమానం నాకు తెలీనిది కాదనుకో!!!
:) బావుందండి మీ నిష్టూరం. మిధునం కథైనా, చిత్రం అయినా రెండింటిలో ఏదో ఒకటే నచ్చుతుంది రెండు నచ్చేవాళ్ళు సహృదయులు అండీ!
ఇన్నేళ్ళుగా జీర్ణించుకున్న కథ ఏదోలా తేరా మీద రూపమిస్తే మనసు బాధ పడదు మరి.
అట్లా చెప్పండి !
ఆయ్, మిథునం బాలేదంటారా ఫణిబాబు గారు?
హన్నా ఎంత ధైర్యం ?
జిలేబి.
అప్పదాసుగా బాలు చాలా బాగున్నాడండీ, అసలు బాలు కనిపించలేదు. సినిమా బాగుంది, నేను కధ అయితే చదవలేదు ఇంకాస్త వంటకాల ఊరింపు ఉంటుందేమో ఒకసారి చదవాలని అయితే ఉంది. బాపుగారి చేతివ్రాత ఒక్క పేజిని మించి చదవలేకపోయాను, కొని చదవాల్సిందే.
@,అప్పదాసుగారు జామపండు నమిలి బుచ్చిలక్ష్మిగారి నోట్లో ఆ గుజ్జు ఎలా పెడతారో చూసి ఆనందిద్దామనుకుంటే అసలా సీనే లేదూ,
చదవడానికి బాగుండేవి అన్నీ చూడ్డానికి బాగోవు, కొన్ని ఎబ్బెట్టుగా కూడా ఉంటాయి :)
మిథునం-2
శ్రీ రమణ గారి మిథునంలో బుచ్చి లక్ష్మిగారికి పళ్ళు లేవండి,
కాబట్టి అప్పలదాసుగారి కాకిఎంగిలి ని రసించుకొని జామ కాయ తిన్నారు.
నటీ మణి లక్ష్మి గారిని పళ్ళు లేకుండా నటించమంటే , చాలా కష్టం మరి.
ఫణి గారికి సినిమా ఎందుకు నచ్చ లేదో ఇప్పుడు బాగా అర్థం అయ్యింది.
మీరు మీ ఆయన ని ఎలా చూసుకుంటారో ఎంత బాగా చూసుకుంటారో,
నాకు కళ్ళకు కనిపించింది. అందుకే మిథునం -2 అని ఎప్పుడో వ్యాఖ్యానించాను .
మీ ఇద్దరికీ నా శుభాభినందనాలు !

సాహితీ, అన్నయ్యగారూ,జిలేబీ, మౌళీ,చవేరా గారూ, వనజా వనమాలి గారూ,
ఏదో నాకుతోచిందేదో వ్రాశాను. మా శ్రీవారు పెట్టిన పోస్టుకి ఎవరికైనా కోపాలు వచ్చేయేమో, ఆ అపోహలేవో తొలగించాలనే ఉద్దేశ్యంతో, వారికి అసలు "మిథునం" మూలకథ గురించి ఉన్న అభిమానం తెలియచేయడానికి మాత్రమే. స్పందించిన అందరికీ ధన్యవాదాలు...
అక్కయ్యా!
నాకెందుకో ఆ సినిమా చూడకముందే నచ్చలేదు. మరి బాబుగారికి చూశాక కూడా నచ్చుతుందా?! అదంతే. కానీ అసలైన "మిథునం" మీరు అని, బాపు-రమణలు ప్రస్థావించిన "అర్థనారీశ్వర" తత్వం అదేననీ, నిరూపించారు! హేట్సాఫ్!
మే 10; 11 లోపు మా నరసాపురం వైపు వచ్చే వీలేమైనా ఉందా? విశేషం చెపుతాను--వేరే ఈ మెయిల్లో.
కృష్ణశాస్త్రి గారూ,
ధన్యవాదాలు.మీరు చెప్పిన తేదీలలో వచ్చే అవకాశం లేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి