RSS

అస్సలు దాచుకోరండి బాబూ...

   నిన్నంతా కళ్ళజోడు లేక, ఏమీ చదవడం కుదరక, పొనీ టి.వీ. ఏనా చూద్దామనుకుంటే, అంతా గందరగోళంగా ఉండడంతో కట్టిపారేశాను.పోనీ ఏదైనా టపారాద్దామా అంటే, ఆ అక్షరాలు కనిపించి చావవూ. అసలు నా సరుకెదొ నేనే తెచ్చుకొక, ఆయనకి చెప్పడం ఏమిటీ, నా ఖర్మ కాపొతే! ఉత్తి పెట్టి కాస్తా తెచ్చారుట, దాంట్లో కళ్ళజోడు ఉందో లేదో చూసుకోవద్దూ? ఈవేళ ఆయన వ్రాసినటపా చదివితే తెలిసింది, అదంతా కావాలనే చేశారని, కంప్యూటరు దగ్గర తనే కూర్చోవచ్చని ప్లానన్నమాట!

    వీరి ఫోర్మన్ ఒకాయనుండేవారు, ఉద్యోగంచేసే రోజుల్లో, ఆయన ఇంట్లో, ఏదైనా తద్దినం లాటివి ఉన్నప్పుడు, ఈయనవి డెంచర్లు కాస్తా దాచేసేదిట, లేకపోతే ఏదొ ఒకటి తినేస్తారని. ఈయనకి పోనీ అలాటిదేమైనా చేద్దామన్నా, అసలు ఆ డెంచర్లే వాడరు! పైగా ఏమైనా అనడం తరవాయి, ఓ టపా రాసేస్తానూ అని ఓ బెదిరింపోటీ. అసలు ఈ కంప్యూటరు లో బ్లాగులు వ్రాయడం మొదలెట్టిన తరువాత, ఆయన వ్రాయని విషయం లేదు! ఏదైనా మాట్లాడాలంటే భయం వేస్తోంది.
అసలు మా పిల్లల్ని అనాలి, వాళ్ళకి నాన్నంటే ఎంతో ప్రేమా అభిమానమూనూ. అప్పుడెప్పుడో రాజమండ్రీ వెళ్ళినప్పుడు, ఈయన బర్త్ డే కి ఓ కంప్యూటరోటి కొనిపెట్టాడు మా అబ్బాయి,ఈయనేమో తెలుగు టైపింగు నేర్చేసికుని, ఇదిగో ఊరిమీద పడ్డారు. దానికి సాయం మీరందరూ కూడా ఉత్సాహపరిచేసరికి,ఇంక ఆయన్ని పట్టేవాళ్ళెవరూ? అవునులెండి, చేసికున్నవాళ్ళకి చేసికున్నంతా అని ఊరికే అన్నారా?పోనీ మా పిల్లలు, అమ్మ అంత శ్రమ పడిందీ, చదువుకునే రోజుల్లో, వాళ్ళతో కూర్చుని, పాఠాలు చదివించేదీ,కావలిసినవన్నీ వండి పెట్టేదీ అనెమన్నా గుర్తుంటుందా, అబ్బే, నాన్నే అసలు చాలా మంచివారూ, మేము అడిగినట్లుగా మాక్కావలసిన వారితో, పెళ్ళి జరిపించారూ లాటివే గుర్తు! వాళ్ళ దృష్టిలో అమ్మ ఎప్పుడూ హిట్లరే ! అది నీట్ గా ఉంచూ, ఇదిక్కడ పెట్టూ, అదక్కడ పెట్టొద్దూ అనే నా సాధింపులే గుర్తుంటాయి. వీళ్ళందరూ కలిసినప్పుడు ఇవే మాటలు. ఏదైనా తప్పు పని చేసేటప్పుడు మాత్రం నావైపు చూస్తారు, అమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో అని.

   ఈయనది అదో టైపు. శీతాకాలంలొ ఫుల్లుగా ఫాన్ పెట్టి పడుక్కుంటారు. చలేస్తోందండీ, అంటే సర్క్యులేషన్ ఉండాలోయ్ అంటారు. ఎంత చలైనా సరే ఓ బనినోటి వేసుకునే ఉండడం. మీరందరూ వేసుకుంటారని నానా తిప్పలూ పడి, అన్నేసి స్వెట్టర్లల్లితే, ఒక్కటీ వేసుకోరేమండీ, అంటే వద్దంటారు. అసలు ఈయనదేమైనా సిక్స్ ప్యాక్కా ఏమిటీ, అందరికీ చూపించుకోడానికీ? ఏమిటో, ఎవరి పిచ్చి వాళ్ళకానందం!మొత్తానికి ఈమధ్యన ఏమనిపించిందో ఏమిటో, చలేస్తోందోయ్ అనగానే ఓ స్వెట్టరు,అదొకటే మిగిలింది ఇక్కడ, మిగిలినవన్నీ మా ఇంట్లో ఓ సూట్ కేసులో పెట్టి పైన పెట్టేశారు. ఎప్పుడో వెళ్ళినప్పుడు తీసి తెచ్చుకోవాలి. లేకపోతే ఆ ఇచ్చిన స్వెట్టరు గొడ్డుతోల్లా తయారుచేస్తారు, ప్రతీ రోజు వేసేసికుని. దాన్ని ఉతకలేక చావాలి మళ్ళీ.

   చెప్పానుగా, మా శ్రీవారు ఏదీ దాచుకోరు, ఏం జరిగినా, ఏం మాట్లాడినా ఓ టపా వ్రాయాల్సిందే. ఎందుకండీ ఇలా మన కాపరం కాస్తా బయట పెట్టేస్తున్నారూ అంటే, ఏం చేయనూ ఇంట్లో వాళ్ళెవరూ నా మాటలు వినడం లేదూ, పోనీ బయటివాళ్ళైనా వింటున్నార్లే అంటారు. ఈయన ఖబుర్లన్నీ వినడానికి ఎవరూ లేకపోతే, మా మనవడు చి.అగస్థ్య తో చెప్పుకుంటారు. ఇంతా చేస్తే వాడికి రేపు జనవరి ఏడో తారీక్కి, ఏడాది నిండుతుంది. ప్రస్తుతానికి వాడొక్కడే ఈయనకి faithful listener! రేపెప్పుడో వాడికి మాటా, నడకా వచ్చిందంటే అవుతుంది ఈయన పని! అసలిదేం అలవాటో, ఒక్కటీ దాచుకోరు.జరిగినదేమిటో, ఎవరో ఒకరికి చెప్పేదాకా, నిద్ర పట్టదు. అసలు దాపరికం లేదండి బాబూ!అలాగని అన్నీ చెప్పరండోయ్, మొన్నటికి మొన్న రోడ్డుమీద పడ్డ సంగతి, తను వ్రాసిన టపా చదివేసే ముందర, బావుండదని నాతో చెప్పారు. అయ్యో అయ్యో అంతలా పడితేనైనా చెప్పొద్దుటండీ, ఏ సున్నం బెల్లం పట్టేస్తానేమో అని భయం! పోనీ అలాగని మా అందరిగురించీ పట్టించుకోరా అందామంటే అదీ కాదూ, ఫోన్లోనైనా సరే మాటలో తేడా వచ్చిందంటే పట్టేస్తారు ఏమిటీ వంట్లో బాగో లేదా అంటూ! డాక్టరుదగ్గరకు వెళ్ళేదాకా వదలరు.

   ఆ మధ్య నాకు వంట్లో బాగోలేదని అనగానే ఎంత హడావిడీ, ఈ.సీ.జీలూ, బేరియం టెస్టులూ, సుగరూ మొత్తం ఇంజను ఓవర్ హాలింగు చేసినంత చేసేశారు.మరి ఆయనకెదైనా జరిగినప్పుడు నాతోనైనా చెప్పాలా లేదా? ఏమైనా అంటే, ఊరికే ఖంగారు పడిపోతావూ అంటారు. ఔనమ్మా, నాక్కాక ఇంకెవరికుంటుంది ఖంగారు?

   ఇంకో విషయం- మొత్తానికి మా ఫ్రెండ్స్ తో చిట్ మళ్ళీ చేరానోచ్!మా శ్రీవారు 'ఊరికే ఏవేవో ఊహించేసికుని, వాళ్ళందరితోనూ కచ్చి చెప్పేశావు.అందరికీ ఎవరో ఒకరు ఉండాలి,just for change of scene' అని!

ज्योत से ज्योत जगाके चलो-జ్యోత్ సె జ్యోత్ జగాకె చలో...

    మేము రాజమండ్రీ లో ఉండగా,మా శ్రీవారు బ్లాగులోకంలో ప్రవేశించినప్పుడు, మన జ్యోతి తో పరిచయం అయింది.అదికూడా,మావారి బ్లాగు రూపం మార్చే సందర్భం లో.అంతవరకూ ఏదో స్కూల్లో వ్రాసే కాంపోజిషన్లా ఉండేది ఆయన బ్లాగు రూపం! అలాగే ఉంటుంది కాబోసు అనుకున్నాను.నాకేం తెలుసూ? క్రమక్రమంగా అంతర్జాలంలోని మిగిలినవారివి, అందులో జ్యోతి గారి బ్లాగులు చూసిన తరువాత తెలిసింది- బ్లాగుని ఎంత అందంగా తయారు చేసికోవచ్చో-మావారికేమీ ఈ కంప్యూటర్లూ వ్యవహారం తెలియదూ, ఏం చేయడం? ఆవిడనే అడిగేస్తే పోలా అన్నారు.మరీ కొత్తవాళ్ళని అడిగితే బాగుండదేమో అన్నాను.మనమేం అప్పడుగుతున్నామా ఏమిటీ,మా బ్లాగుకి కొద్దిగా అలంకారాలు చేసి పెట్టమ్మా అని అడగ్గానే, చేసి పెట్టేశారు.

   'లక్ష్మి గారిచేత కూడా ఓ బ్లాగు మొదలెట్టించకూడదా' అని అడగ్గానే,ఆ పని కూడా చేసేసి,దానికి డెకొరేషనూ వ్యవహారం తనే చేసి,'అబ్బో ఇలా ఉంటుందా బ్లాగాలంకారం' అనిపించేలా చేశారు. తరువాత్తరువాత, మాకూ కమ్యూనికేషనూ పెరిగింది. మధ్య మధ్యలో,ఏదో విషయం మీద టపాలు వ్రాయమని అడగడం ( వనభోజనాల టపా) వగైరా వగైరా..నా బ్లాగు గురించి తెలుగు పేపర్లో వచ్చినప్పుడు, మాకు ఫోను చేసి చెప్పడం..

    ఆవిడకీ, మాకూ చుట్టరికం ఏమీలేదు.ఇప్పటిదాకా ఒకళ్ళనొకళ్ళు చూసుకోలేదు, అయినా సరే ఏదో ఆత్మబంధువులా దగ్గరయ్యారు. ప్రతీ పరిచయం కమర్షియల్ అవుతున్న ఈ రోజుల్లో,ఎటువంటి పరిచయం లేని వారికి, స్వలాభాపేక్ష లేకుండా, అడిగిన వెంటనే సహాయం చేయడంలోనే కనిపిస్తోంది, జ్యోతి అభిమానం, స్నేహ భావం.

    నేను కొత్తగా కంప్యూటరు నేర్చుకున్న రోజుల్లో, షడ్రుచులు అనే బ్లాగులోకి వెళ్ళి, కొత్త కొత్త వంటలు చూసేదాన్ని. ఆ తరువాత, ఈ బ్లాగు నిర్వహిస్తున్నది మన జ్యోతి అని తెలిసిన తరువాత చాలా సంతొషం అయింది. అలాగే, నన్ను 'పొద్దు' లో గడి నింపకూడదా అని మెయిల్ పంపారు. వీటికి సహాయంగా, చిన్నప్పుడెప్పుడో చదివిన గైడ్ లాగ, గడి స్లిప్పులు ఒకటీ!

    జ్యొతి కి ఇంత టైమెలా ఉంటుందా ,ఇన్ని బ్లాగులు నిర్వహించడానికీ, వీటికి సాయం న్యూస్ పేపర్లలో వ్యాసాలు వ్రాయడానికీ అని ఆశ్చర్యపడిపొతూంటాను.అన్నన్ని వెరైటీ టాపిక్కులమీద వ్రాయడానికి ఎంతో జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఒకటే సరిపోదు, వ్రాయడానికి ఓర్పూ, సహనం ఉండాలి.నాకు నెలకో టపా వ్రాయడానికే ప్రాణం మీదికి వస్తోంది.అంత ఓపిక ఎక్కడిదమ్మా?

    ఇలాగే తెలుగు బ్లాగర్లకీ ఇంకా ఎన్నెన్నో విషయాలమీద టపాలు వ్రాస్తూ,తనకి తెలిసిన సంగతులు అందరితో పంచుకుంటూ, వారి ఆనందాన్ని ఇంకా పెంచుతూ,ఆయురారోగ్యాలతో ఎన్నెన్నో ఇలాటి పుట్టిన రోజులు జరుపుకోవాలని, ఆ భగవంతుడిని ప్రార్ధిస్తూ, మన జ్యోతి కి జన్మదిన శుభాకాంక్షలు.

    ఈ సందర్భంలో మాకు అత్యంత ఇష్టమైన ఈ పాట వినండి.

మా బుల్లి బుల్లి ట్రిప్పులు








   మార్గశిరమాసం మొదటి గురువారం ఈరోజు శ్రీనివాసుని దర్శనానికి బయలుదేరాము.ఇదివరకు ఈ గుడి గురించి రాసాను. ఇది మాకు చాలా ఇష్టమైన మందిరం. ఎలాంటి ఆటంకాలు లేకుండా (నిన్న టైర్లో హవా పోయిందిగా)తీసుకెళ్ళాడు. నిన్నటి కారే, అతనే డ్రైవరు.మేము దర్శనం చేసుకొని బయటకు రాబోతూంటే మాకొక వ్యక్తి కనిపించారు.అతన్ని ఎక్కడో చూసాను ఎక్కడా?ఆలోచిస్తే సర్ఫ్రరోష్ లో సలీం, బాలక్రిష్ణ నరసింహరాయుడు సినిమా, సూర్యవంశం యివన్ని గుర్తు వస్తున్నాయి. మావారు కాస్త దూరంలో వున్నారు. మా మరిది ని పిలిచి " నాగూ" ఇతను ఎవరంటావూ అని అడగ్గానే ప్రతి తెలుగు సినిమాలో విలన్ గా వేస్తాడే అతనేనూ అనడంతోటే అతన్ని పలకరించి షేక్ హేండు యిచ్చెసరికి పాపం హడిలిపోయాడనుకుంటాను. ఈ ఆంటీ ఏమిటీ? అని, మావాళ్ళు నమ్ముతారో లేదోనని చెప్పి ఓ చిన్నపుస్తకం తీసి ఆటోగ్రాఫ్ తీసేసుకున్నాను.చిన్నవాడేను, సినిమాల్లో పెద్ద వయసు విలన్ గా చూపిస్తారు. ఓ అడుగు ముందరకివేసి మా వారికి చెప్పాను ఆయన పరిచయం చేసుకొని మాట్లాడారు.అతను ఎవరో కాదు,బాలీవుడ్ నటుడు 'ముఖేష్ ఋషి'! ఆ తరువాత అక్కడే ప్రసాదం తీసుకొని బయట " క్యూ" చూసి హడిలిపోయాము. జనాలు నిలబడలేక కూర్చున్నారు. అంతమంది వున్నారు. మేము వెళ్ళినపుడు అంతా ఖాళీయేను, అంతా మా అదృష్టం. అమ్మవారి దగ్గర చాలాసేపు గడిపాము. ఆ తరువాత అక్కడనుండి " బనేశ్వర్" వెళ్ళాము.

   " బనేశ్వర్" నిజానికి " వనేశ్వర్" వనంలోవుంది ఈ శివుని గుడి. పెద్ద చెట్లు,లతలు రకరకాల పూవులు చాలా బాగుంది. గుడి లోపల గర్బగుడి చుట్టూ చిన్న చిన్న తాలాబ్ లా లాంటివి ఓ ఆరు వున్నాయి. అందులో ఒకదానిలో చేపలు, మరొకదానిలో తాబేళ్ళు, ఓకదానిలో మంచినీరు, వెనుక వైపు వున్నాదానిలో నీరు లేదనుకోండి. సహ్యాద్రి కొడలలో వున్న ప్రతి గుడి కి శివాజీ మహరాజు కి ఏదో ఒక లింకు వుంటుంది. లోపల శివదర్శనంచేసుకొని బయటకు వచ్చేసరికి అక్కడే పక్కనున్న హాలులో అప్పుడే పెళ్లి చేసుకున్నా దంపతులుని దేవుని చుట్టు ప్రదక్షిణానికి పంపారు. పెళ్ళికొడుకు పెళ్ళికూతురే చిన్నవాళ్ళు. వాళ్ళకి తోడు ఇంకా చిన్న పిల్లలు సాయం. ఎదో బొమ్మల పెళ్ళిలా అనిపించింది. ఇంకా యిప్పటికి బాల్యవివాహాలు జరుగుతూనే వున్నాయన్నమాట. మరీబాల్యం కాదనుకోండీ, 18 సంత్సరాలు పెళ్ళికూతురికి 20 సంవత్సరాలు పెళ్ళికొడిక్కిను, తెలుసుకున్నాములెండి.పసుపు రాసిన మొహలతో పసుపు బట్టలతో ఎంతో కళగా సిగ్గు సిగ్గుగా ఒకరి చేయి ఒకరు పట్టుకొని చూడముచ్చటగా వున్నారు. ఈ మద్య కాలంలో ఇంత చిన్న జంటను చూడలెదు. ఆ గుడి వెనుక అంతా అడవెనూ, కొంత పిక్నిక్ సాట్ లా చేసారు. పిల్లలకి ఆడుకునేందుకు , బాగా ఏర్పాటు చేసారు.

   అక్కడనుండి వాపసు "పూనే" వస్తూ వస్తూ కారులోంచే " దగుడు సేట్ వినాయకుడ్ని " చూపింఛి మహాలక్ష్మీ మందిర్ వెళ్ళి దర్శనం చెసుకొని మా మనవడు "క్రెచ్చి" నుండి వచ్చె సమయానికి ఇంటికి వచ్చేసాము. మా శిరీష ఆ రోజు ఉదయం 4 గంటల ఫ్లయిట్ లో " చెన్నె" వెళ్ళి రాత్రి 11 గంటలకు తిరిగి వచ్చేసింది. సో, అలాగా మార్గశిర గురువారం నాడు రెండు లక్ష్మీ గుడులు చూసుకునే భాగ్యం కలిగింది.

   ముంబైలో లో మహలక్ష్మి దేవాలయం చూశాము. మిగిలిన విశేషాలన్నీ మావారి టపాలో చదివే ఉంటారు.

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes