RSS

నేనూ-నా ముక్కుపుడకా..

   అదేమిటో,ముక్కు కుట్టించుకోవడం అంటే చాలా భయం నాకు. ఎప్పుడో ఒకసారి, మేము పూనాలో శ్రీమతి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గారి కచేరీకి వెళ్ళాము. ఆవిడని చూస్తూ, ఆవిడ పాట వింటూంటే, ప్రపంచం లో ఇంకెమీ అఖ్ఖర్లేదనిపిస్తుంది. నాకు కర్ణాటక సంగీతంలో అంత అభిరుచి ఏమీ లేకపోయినా, మాశ్రీవారికి ఉన్న అభిరుచి ధర్మమా అని, పూనా ( ప్రస్తుత పూణె) లో ఆరోజుల్లో జరిగే, ప్రతీ సంగీత కచెరీకీ వెళ్ళేదాన్ని.వెళ్ళగా, వెళ్ళగా నాకూ కర్ణాటక సంగీతం అంటే అభిమానం వచ్చేసింది. కానీ, ఈ కొత్తగా తెచ్చుకున్న అభిమానం, నాకు 'కష్టాలు' తెస్తుందనుకోలేదు!

    ఆ తరువాత ఎప్పుడో, 1980 లో అనుకుంటా, ఒకసారి, శ్రీమతి సుబ్బులక్ష్మి గారి కచేరీకి వెళ్ళినప్పుడు, మా శ్రీవారు,'చూశావా అమ్మ (అంటే ఎమ్.ఎస్)గారి ముక్కు మీది పుడక ఎంతలా మెరుస్తూందో, అసలు ఆవిడ మొహానికే అందం వచ్చేసింది, స్త్రీ అంటే అలాగ ఉండాలీ, వగైరా వగైరా అనడం మొదలెట్టారు. ఓరినాయనో, ఈ లెక్చరు ఎక్కడికి తీసికెళ్తుందో అని భయ పడిపోయాను. తీరా అనుకున్నంతా అవనె అయింది, 'ఏమిటోయ్, ముక్కు కుట్టించుకోకూడదూ నువ్వుకూడా, ఓ మంచి ముక్కు పుడక కొంటానూ, నీ మొహం కూడా వెలిగిపోతుందీ..'అన్నారు.

   మొత్తానికి లక్ష్మీ రోడ్డుకెళ్ళి, ముక్కు కుట్టించేసికున్నాను.అక్కడ ముక్కు కుట్టి ఓ బంగారంతీగ చుట్టారు.
తీగతో చుట్టించుకున్న వారానికే మా నాన్నగారిదగ్గరనుండి ఉత్తరం, మా చెల్లెలు పెళ్ళని, అయ్యబాబోయ్! ఈ తీగతో ఏలాగా వెళ్ళడం అనుకొని ఎర్రరాయితో నక్షత్రాకారంలోవున్న తీగ ముక్కుపుడక కొనుక్కోని తీగ కట్ చేయించి అది బలవంతంగా పెట్టుకొని పెళ్ళికివెళ్ళివచ్చేసరికి ఇంత లావున ముక్కు ఎర్రబడిన మొహంతో, విపరీతమైన నొప్పితో చాలా బాధ పడిపోయాను. మళ్ళీ ఖడ్కీ బజారు వెళ్ళి దాన్ని బలవంతంగా తీయించుకొని మందులు క్రీములు వాడి తగ్గిన తరువాత ముక్కు రంధ్రం పూడుకుపోకుండా పొగాకు కాడ, నిమ్మముల్లు పెట్టుకుంటూ కొయ్యకండ రాకుండా కాపాడుకుంటూ వచ్చాను. మా స్నేహితురాలు లీల, ఎందుకండీ, యిన్ని తిప్పలు? చిన్నప్పుడైతే పరవాలేదు కానీ,' आ भैल मुझॅ मार्'లాగ ఇప్పుడెందుకు కుట్టించుకున్నారూ అని అడిగితే అసలు సంగతి అప్పుడు చెప్పాను. అయన అడిగారని కాదూ, అసలు నాకు కూడా చాలా చాలా యిష్టమని, తనకోసమంటూ చేయించుకొని బోలెడంతా ప్రేమ, వగైరా లాంటివి చాలా పొందవచ్చని, నోటికి చక్కెర ఎంత తీపో, ముక్కుకి ముక్కెర అంత అందమని, అలాటి ముక్కెరని భర్త దగ్గర పొందడం , అందులోను విన్నావుగా వజ్రపుముక్కుపుడక చేయిస్తానంటున్నారుకదా !

    మా అమ్మగార్కి " అష్టవర్షే భవత్ కన్యే" లా కాకపోయినా ఎనిమిదో తరగతి చదువుతున్నపుడే పెళ్ళి ఐపోయి అత్తవారిటింకి వెళ్ళినపుడు ఎవరో అన్నారుట,పెద్ద అవధానుల గారి అమ్మాయీ, ముక్కు కుట్టకుండానే ఎలా పెళ్ళి చేశారబ్బా? అంతే అభిమానం పొడుచుకొచ్చి ఎప్పుడో కుట్టించుకున్నా ముక్కు పూడుకుపోయిన చోట రాత్రికి రాత్రి సూది దారంతో తనకి తనే పొడుచుకుందట. తెల్లవారిన తరువాత మా తాతగారు ఇన్ఫెక్షన్ అవకుండా ఇంజెక్షన్ యిప్పించారట. ఆవిడ కూతుర్ని నేను కనీసం అవకాశం వచ్చినపుడు కుట్టించుకోబోతే ఎలాగా? నా పెళ్ళికే కుట్టిద్దామనుకున్నారు,మా మావ గారు కల్పించుకొని పెళ్ళికి సమయం ఆట్టే లేదు, అలాటివేమీ పెట్టుకొకండన్నారు.భామా కలాపంలొ కూడా దీనిమీద ప్రస్తావన వుంది. మగని ప్రేమకి ముక్కుపుడక ఓ గుర్తు. నువ్వు కూడా కుట్టించుకొని రాజాని ఇంప్రెస్ చేసేయ్. అంటే, అయ్యబాబోయ్! అనేసింది. ఆ తరువాత కుట్టించుకుందో లేదో తెలీదు.

   అలాగా ఎర్రరాయితో మొదలుపెట్టి మెల్లిగా స్క్రూది చిన్నది పెట్టుకొని, సమయం వచ్చినప్పుడల్లాగా ఎప్పుడు మాటా మాటా వచ్చినా సరసంగానో విరసంగానో మొత్తానికి అక్కడేకే వచ్చేది. మీ కోసం నేను ముక్కుకూడా కుట్టించుకున్నాను. అయినా నేనంటే అస్సలు ప్రేమే లేదూ, అంటూ ముక్కు ఎగపీల్చేసేదాన్ని.సంపెంగలాంటి ముక్కు కాకపోయినా మీ కోసం నేనంత త్యాగం చేసాను అనే ఫీలింగు కలిగించేలా చేశాననేవారు!.అసలేంటంటే వజ్రపు ముక్కు పుడక చేయిస్తానన్నారుకదా, ముక్కు కుట్టించుకుంటే , అది అడగలేను. మా ఆర్ధిక పరిస్తితులు తెలుసు కదా!అలా అదో టైమ్ పాస్.

   మేము వరంగావ్ లో వున్నపుడు ఆంధ్రా వెళ్ళి వస్తున్నపుడు,ఓ చక్కని చిన్న వజ్రంతో బంగారంతో దిట్టంగా వున్న ముద్దు గొలిపె ముక్కెర తెచ్చి యిచ్చారు.చాలా బాగుంది కదా ముచ్చటగా పెట్టుకుందామని ప్రయత్నిస్తే పట్టదే, దాని గొట్టం యింతలావున వుంది.ఎలా? పెట్టుకోకపోతే తెచ్చిన తరువాత కూడా ఎందుకు పెట్టుకోలేదంటారు?చెబుదామంటే అభిమానం.మొత్తనికి శీల తిప్పేసి పెట్టేసుకున్నాను.అది చర్మంలోకి దూరిపోయిందో ఏమో తెలీదు, అసలు అటు ఇటు తిరిగేదేకాదూ,కొన్నాళ్ళు నొప్పి పెట్టి నొప్పి తగ్గింది కాని అది కదిలేదేకాదూ. తీసే ప్రశ్నే లేదు, ఆపరేషను సమయంలో కూడా అదిరాదు,ప్రయత్నించకండీ, మా వారి ప్రేమంత గొప్పదది అని చెబుతుండెదాన్ని.
ఇప్పటికి అది అంతేనూ, మాశ్రీవారి ప్రేమ, ముచ్చట, ముక్కెర అన్ని గట్టివేను....( అలాగేఅనుకోవాలి కదా) ఇదండీ సంగతి
!

అస్సలు దాచుకోరండి బాబూ...

   నిన్నంతా కళ్ళజోడు లేక, ఏమీ చదవడం కుదరక, పొనీ టి.వీ. ఏనా చూద్దామనుకుంటే, అంతా గందరగోళంగా ఉండడంతో కట్టిపారేశాను.పోనీ ఏదైనా టపారాద్దామా అంటే, ఆ అక్షరాలు కనిపించి చావవూ. అసలు నా సరుకెదొ నేనే తెచ్చుకొక, ఆయనకి చెప్పడం ఏమిటీ, నా ఖర్మ కాపొతే! ఉత్తి పెట్టి కాస్తా తెచ్చారుట, దాంట్లో కళ్ళజోడు ఉందో లేదో చూసుకోవద్దూ? ఈవేళ ఆయన వ్రాసినటపా చదివితే తెలిసింది, అదంతా కావాలనే చేశారని, కంప్యూటరు దగ్గర తనే కూర్చోవచ్చని ప్లానన్నమాట!

    వీరి ఫోర్మన్ ఒకాయనుండేవారు, ఉద్యోగంచేసే రోజుల్లో, ఆయన ఇంట్లో, ఏదైనా తద్దినం లాటివి ఉన్నప్పుడు, ఈయనవి డెంచర్లు కాస్తా దాచేసేదిట, లేకపోతే ఏదొ ఒకటి తినేస్తారని. ఈయనకి పోనీ అలాటిదేమైనా చేద్దామన్నా, అసలు ఆ డెంచర్లే వాడరు! పైగా ఏమైనా అనడం తరవాయి, ఓ టపా రాసేస్తానూ అని ఓ బెదిరింపోటీ. అసలు ఈ కంప్యూటరు లో బ్లాగులు వ్రాయడం మొదలెట్టిన తరువాత, ఆయన వ్రాయని విషయం లేదు! ఏదైనా మాట్లాడాలంటే భయం వేస్తోంది.
అసలు మా పిల్లల్ని అనాలి, వాళ్ళకి నాన్నంటే ఎంతో ప్రేమా అభిమానమూనూ. అప్పుడెప్పుడో రాజమండ్రీ వెళ్ళినప్పుడు, ఈయన బర్త్ డే కి ఓ కంప్యూటరోటి కొనిపెట్టాడు మా అబ్బాయి,ఈయనేమో తెలుగు టైపింగు నేర్చేసికుని, ఇదిగో ఊరిమీద పడ్డారు. దానికి సాయం మీరందరూ కూడా ఉత్సాహపరిచేసరికి,ఇంక ఆయన్ని పట్టేవాళ్ళెవరూ? అవునులెండి, చేసికున్నవాళ్ళకి చేసికున్నంతా అని ఊరికే అన్నారా?పోనీ మా పిల్లలు, అమ్మ అంత శ్రమ పడిందీ, చదువుకునే రోజుల్లో, వాళ్ళతో కూర్చుని, పాఠాలు చదివించేదీ,కావలిసినవన్నీ వండి పెట్టేదీ అనెమన్నా గుర్తుంటుందా, అబ్బే, నాన్నే అసలు చాలా మంచివారూ, మేము అడిగినట్లుగా మాక్కావలసిన వారితో, పెళ్ళి జరిపించారూ లాటివే గుర్తు! వాళ్ళ దృష్టిలో అమ్మ ఎప్పుడూ హిట్లరే ! అది నీట్ గా ఉంచూ, ఇదిక్కడ పెట్టూ, అదక్కడ పెట్టొద్దూ అనే నా సాధింపులే గుర్తుంటాయి. వీళ్ళందరూ కలిసినప్పుడు ఇవే మాటలు. ఏదైనా తప్పు పని చేసేటప్పుడు మాత్రం నావైపు చూస్తారు, అమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో అని.

   ఈయనది అదో టైపు. శీతాకాలంలొ ఫుల్లుగా ఫాన్ పెట్టి పడుక్కుంటారు. చలేస్తోందండీ, అంటే సర్క్యులేషన్ ఉండాలోయ్ అంటారు. ఎంత చలైనా సరే ఓ బనినోటి వేసుకునే ఉండడం. మీరందరూ వేసుకుంటారని నానా తిప్పలూ పడి, అన్నేసి స్వెట్టర్లల్లితే, ఒక్కటీ వేసుకోరేమండీ, అంటే వద్దంటారు. అసలు ఈయనదేమైనా సిక్స్ ప్యాక్కా ఏమిటీ, అందరికీ చూపించుకోడానికీ? ఏమిటో, ఎవరి పిచ్చి వాళ్ళకానందం!మొత్తానికి ఈమధ్యన ఏమనిపించిందో ఏమిటో, చలేస్తోందోయ్ అనగానే ఓ స్వెట్టరు,అదొకటే మిగిలింది ఇక్కడ, మిగిలినవన్నీ మా ఇంట్లో ఓ సూట్ కేసులో పెట్టి పైన పెట్టేశారు. ఎప్పుడో వెళ్ళినప్పుడు తీసి తెచ్చుకోవాలి. లేకపోతే ఆ ఇచ్చిన స్వెట్టరు గొడ్డుతోల్లా తయారుచేస్తారు, ప్రతీ రోజు వేసేసికుని. దాన్ని ఉతకలేక చావాలి మళ్ళీ.

   చెప్పానుగా, మా శ్రీవారు ఏదీ దాచుకోరు, ఏం జరిగినా, ఏం మాట్లాడినా ఓ టపా వ్రాయాల్సిందే. ఎందుకండీ ఇలా మన కాపరం కాస్తా బయట పెట్టేస్తున్నారూ అంటే, ఏం చేయనూ ఇంట్లో వాళ్ళెవరూ నా మాటలు వినడం లేదూ, పోనీ బయటివాళ్ళైనా వింటున్నార్లే అంటారు. ఈయన ఖబుర్లన్నీ వినడానికి ఎవరూ లేకపోతే, మా మనవడు చి.అగస్థ్య తో చెప్పుకుంటారు. ఇంతా చేస్తే వాడికి రేపు జనవరి ఏడో తారీక్కి, ఏడాది నిండుతుంది. ప్రస్తుతానికి వాడొక్కడే ఈయనకి faithful listener! రేపెప్పుడో వాడికి మాటా, నడకా వచ్చిందంటే అవుతుంది ఈయన పని! అసలిదేం అలవాటో, ఒక్కటీ దాచుకోరు.జరిగినదేమిటో, ఎవరో ఒకరికి చెప్పేదాకా, నిద్ర పట్టదు. అసలు దాపరికం లేదండి బాబూ!అలాగని అన్నీ చెప్పరండోయ్, మొన్నటికి మొన్న రోడ్డుమీద పడ్డ సంగతి, తను వ్రాసిన టపా చదివేసే ముందర, బావుండదని నాతో చెప్పారు. అయ్యో అయ్యో అంతలా పడితేనైనా చెప్పొద్దుటండీ, ఏ సున్నం బెల్లం పట్టేస్తానేమో అని భయం! పోనీ అలాగని మా అందరిగురించీ పట్టించుకోరా అందామంటే అదీ కాదూ, ఫోన్లోనైనా సరే మాటలో తేడా వచ్చిందంటే పట్టేస్తారు ఏమిటీ వంట్లో బాగో లేదా అంటూ! డాక్టరుదగ్గరకు వెళ్ళేదాకా వదలరు.

   ఆ మధ్య నాకు వంట్లో బాగోలేదని అనగానే ఎంత హడావిడీ, ఈ.సీ.జీలూ, బేరియం టెస్టులూ, సుగరూ మొత్తం ఇంజను ఓవర్ హాలింగు చేసినంత చేసేశారు.మరి ఆయనకెదైనా జరిగినప్పుడు నాతోనైనా చెప్పాలా లేదా? ఏమైనా అంటే, ఊరికే ఖంగారు పడిపోతావూ అంటారు. ఔనమ్మా, నాక్కాక ఇంకెవరికుంటుంది ఖంగారు?

   ఇంకో విషయం- మొత్తానికి మా ఫ్రెండ్స్ తో చిట్ మళ్ళీ చేరానోచ్!మా శ్రీవారు 'ఊరికే ఏవేవో ఊహించేసికుని, వాళ్ళందరితోనూ కచ్చి చెప్పేశావు.అందరికీ ఎవరో ఒకరు ఉండాలి,just for change of scene' అని!

ज्योत से ज्योत जगाके चलो-జ్యోత్ సె జ్యోత్ జగాకె చలో...

    మేము రాజమండ్రీ లో ఉండగా,మా శ్రీవారు బ్లాగులోకంలో ప్రవేశించినప్పుడు, మన జ్యోతి తో పరిచయం అయింది.అదికూడా,మావారి బ్లాగు రూపం మార్చే సందర్భం లో.అంతవరకూ ఏదో స్కూల్లో వ్రాసే కాంపోజిషన్లా ఉండేది ఆయన బ్లాగు రూపం! అలాగే ఉంటుంది కాబోసు అనుకున్నాను.నాకేం తెలుసూ? క్రమక్రమంగా అంతర్జాలంలోని మిగిలినవారివి, అందులో జ్యోతి గారి బ్లాగులు చూసిన తరువాత తెలిసింది- బ్లాగుని ఎంత అందంగా తయారు చేసికోవచ్చో-మావారికేమీ ఈ కంప్యూటర్లూ వ్యవహారం తెలియదూ, ఏం చేయడం? ఆవిడనే అడిగేస్తే పోలా అన్నారు.మరీ కొత్తవాళ్ళని అడిగితే బాగుండదేమో అన్నాను.మనమేం అప్పడుగుతున్నామా ఏమిటీ,మా బ్లాగుకి కొద్దిగా అలంకారాలు చేసి పెట్టమ్మా అని అడగ్గానే, చేసి పెట్టేశారు.

   'లక్ష్మి గారిచేత కూడా ఓ బ్లాగు మొదలెట్టించకూడదా' అని అడగ్గానే,ఆ పని కూడా చేసేసి,దానికి డెకొరేషనూ వ్యవహారం తనే చేసి,'అబ్బో ఇలా ఉంటుందా బ్లాగాలంకారం' అనిపించేలా చేశారు. తరువాత్తరువాత, మాకూ కమ్యూనికేషనూ పెరిగింది. మధ్య మధ్యలో,ఏదో విషయం మీద టపాలు వ్రాయమని అడగడం ( వనభోజనాల టపా) వగైరా వగైరా..నా బ్లాగు గురించి తెలుగు పేపర్లో వచ్చినప్పుడు, మాకు ఫోను చేసి చెప్పడం..

    ఆవిడకీ, మాకూ చుట్టరికం ఏమీలేదు.ఇప్పటిదాకా ఒకళ్ళనొకళ్ళు చూసుకోలేదు, అయినా సరే ఏదో ఆత్మబంధువులా దగ్గరయ్యారు. ప్రతీ పరిచయం కమర్షియల్ అవుతున్న ఈ రోజుల్లో,ఎటువంటి పరిచయం లేని వారికి, స్వలాభాపేక్ష లేకుండా, అడిగిన వెంటనే సహాయం చేయడంలోనే కనిపిస్తోంది, జ్యోతి అభిమానం, స్నేహ భావం.

    నేను కొత్తగా కంప్యూటరు నేర్చుకున్న రోజుల్లో, షడ్రుచులు అనే బ్లాగులోకి వెళ్ళి, కొత్త కొత్త వంటలు చూసేదాన్ని. ఆ తరువాత, ఈ బ్లాగు నిర్వహిస్తున్నది మన జ్యోతి అని తెలిసిన తరువాత చాలా సంతొషం అయింది. అలాగే, నన్ను 'పొద్దు' లో గడి నింపకూడదా అని మెయిల్ పంపారు. వీటికి సహాయంగా, చిన్నప్పుడెప్పుడో చదివిన గైడ్ లాగ, గడి స్లిప్పులు ఒకటీ!

    జ్యొతి కి ఇంత టైమెలా ఉంటుందా ,ఇన్ని బ్లాగులు నిర్వహించడానికీ, వీటికి సాయం న్యూస్ పేపర్లలో వ్యాసాలు వ్రాయడానికీ అని ఆశ్చర్యపడిపొతూంటాను.అన్నన్ని వెరైటీ టాపిక్కులమీద వ్రాయడానికి ఎంతో జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఒకటే సరిపోదు, వ్రాయడానికి ఓర్పూ, సహనం ఉండాలి.నాకు నెలకో టపా వ్రాయడానికే ప్రాణం మీదికి వస్తోంది.అంత ఓపిక ఎక్కడిదమ్మా?

    ఇలాగే తెలుగు బ్లాగర్లకీ ఇంకా ఎన్నెన్నో విషయాలమీద టపాలు వ్రాస్తూ,తనకి తెలిసిన సంగతులు అందరితో పంచుకుంటూ, వారి ఆనందాన్ని ఇంకా పెంచుతూ,ఆయురారోగ్యాలతో ఎన్నెన్నో ఇలాటి పుట్టిన రోజులు జరుపుకోవాలని, ఆ భగవంతుడిని ప్రార్ధిస్తూ, మన జ్యోతి కి జన్మదిన శుభాకాంక్షలు.

    ఈ సందర్భంలో మాకు అత్యంత ఇష్టమైన ఈ పాట వినండి.

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes