RSS

దిన దిన గండం

   నిన్న మద్ద్యాన్నం మా కోడలు కంప్యూటర్ మీద పని చేసికొంటూ సడన్ గా బయటకు వెళ్తూ, 'బాబుని చూసుకోండి, నేను స్కూలికి వెళ్ళి నవ్యని తీసుకొస్తాను,ఇప్పుడే మెయిల్ వచ్చింది'అని. వెళ్తూ వెళ్తూ, మా అమ్మాయికి కూడా ఫోన్ చేసింది.మా మనవడు ఆదిత్య కూడా ఆ స్కూల్లోనే ఉన్నాడు.
స్కూలువాళ్ళు ఏం మెయిల్ చేశారంటే, ' పిల్లలందరినీ, పెద్ద స్కూలికి తీసికెళ్ళిపోతున్నాము,పేరెంట్స్ అందరూ వచ్చి, వాళ్ళవాళ్ళ పిల్లల్ని కలెక్ట్ చేసికోవాలీ, ఏమీ ఖంగారు పడకండీ' అని సారాంశం. మా అమ్మాయి ఇంటినుండే పనిచేస్తూండడం వలన, మా కోడలు ఫోన్ రాగానే,'ఇంటిదగ్గరే నాకోసం వెయిట్ చెయ్యీ, నేను కారేసుకుని 10 నిమిషాల్లో వస్తున్నానూ'అని చెప్పింది.ఈ లోపులో మాకోడలు, తనకి తెలిసిన పేరెంట్స్ అందరికీ ఫోన్ చేసి చెప్పింది.ఇంతలో మా అమ్మాయి రావడం, కారులో ఇద్దరూ కలిసి స్కూలుకి వెళ్ళారు.

   ఇంక ఇంట్లో నాకు ఖంగారూ-కోడలు లేనప్పుడు మనవడు పాలకోసం పేచీ పెడతాడేమో అని, పైపాలూ,గ్లాసూ, స్పూన్నూ అన్నీ రెడీగా పెట్టుకొని ఉన్నాను.మా శ్రీవారేమో, ఇంట్లో లేరూ,ఆయన మేము అద్దెకుపుచ్చుకున్న ఫ్లాట్ కి వెళ్ళారు. నాకైతే కాళ్ళూ చేతులూ ఆడడంలేదు.ఏం చెయ్యాలో తెలియదు. పోనీ టి.వీ. న్యూస్ లో ఏమైనా చూపిస్తారేమో అంటే, ఏ చానెల్ చూసినా రైల్వే బడ్జెట్ గురించే.

    మా శ్రీవారు ఫోన్ చేశారు-ప్రొద్దుటే అబ్బాయి ఫోన్ చేసి అడిగాడుట-డాడీ ఎక్కడున్నావూ అని ( ఈయన ఈ మధ్యన మంత్లీ పాస్ తీసికొని బస్సుల్లో ఎక్కెడెక్కడో తిరుగుతూంటారు!), డెక్కన్ జింఖానాలో ఫైర్ అయి అంతా హడావిడిగా ఉందని.నేను ఒక్కర్తినీ ఇంట్లో ఉండి మనవడిని ఒళ్ళో పెట్టుకొని, అమాయీ, కోడలూ పిల్లలూ వచ్చేదాకా పడ్డ ఆందోళన ఎవరితోనూ పంచుకోలేకపోయాను. ఈ హడావిడిలో, మా అమ్మాయి కారు ఎలా డ్రైవు చేస్తుందో అని ఓ ఖంగారూ. మొత్తానికి ఓ గంట అయిన తరువాత అందరూ క్షేమంగా ఇల్లు చేరారు.

    అసలు జరిగిందేమిటంటే, మా పిల్లల స్కూలు 'గురుకుల్'జూనియర్, ఉండేది భండార్కర్ రోడ్డు లో ఉన్న 'ఐ.ఎల్.ఎస్' క్యాంపస్ లో ఉంది.నిన్న 'ఐ.ఎల్.ఎస్' వాళ్ళకి బాంబ్ త్రెట్ వచ్చిందిట. ఆ సందర్భంలో ఆ కాంపౌండ్ లో ఉన్న అన్నీ ఖాళీ చేయిస్తూ, మా పిల్లల స్కూలు కూడా ఖాళీ చేయించి, 'ఈ స్క్వేర్' దగ్గరలో ఉన్న పెద్ద ' గురుకుల్' కి పోలీసుల సహాయంతో మార్చేరు.
ఈ మధ్యన 'జర్మన్ బేకరీ' లో జరిగిన బ్లాస్ట్ తరువాత, పోలీసులు కూడా, ఎటువంటి ఛాన్సూ తీసికోవడం లేదు. అదే కాకుండా, ప్రతీ ఇంటికీ పోలీసులు వచ్చి, అక్కడ ఎవరెవరుంటున్నారో, వాళ్ళ ఐడింటిటీ చెక్ చేయడం వగైరా మొదలెట్టారు.

    ఏది ఏమైనా బయటకు వెళ్ళినవాళ్ళు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేవరకూ టెన్షనే. ఆరోజు గడిచిందంటే అమ్మయ్యా అనుకోవడం- చూశారా ఎంత స్వార్ధమో!

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes