RSS

సదా బహార్ దసరా....

దసరా గురించి ఎన్నిసార్లు చదివినా , తాజాగానే ఉంటుంది. నేను ఇదివరలో వ్రాసిన టపాయే ఇంకోసారి......


   అమ్మ పరాశక్తి. అమ్మవారి రూపాలు, లీలలు,అసంఖ్యాకం. దుర్గ, లక్ష్మి, సరస్వతి, కాళీ, చండి, చాముండి,లలితాత్రిపురసుందరి,బాలాత్రిపురసుందరి,రాజరాజేశ్వరి,గాయత్రి, స్వాహా,స్వధ,ఇలా ఎన్ని రూపాలు, ఎన్నెన్ని లీలలు చెప్పనలవికానిది. ఆమె శక్తి స్వరూపిణి, శక్తి లేనిదె శివం లేదు, శివం లేనిదే శక్తి లేదు, ఆ శక్తి స్వరూపమే దుర్గ. సంవత్సరంలొ శరన్నవరాత్రులు చాలా తొందరగా గడచిపోతాయి. అమ్మవారి నిత్యపారాయణతో, మాతారాణీ పాటలతో, ఎపుడు తెల్లవారుతుందో ఎప్పుడు చీకటి పడుతుందో కూడా తెలీదు.అందరి యిండ్లలోను ఓ రకమయినా సంతోషం, ఉద్వేగం, ఆనందం,మరొ పక్క మన ఏడుకొండలవాని బ్రహ్మోత్సవాలు,పూజ త్వరగా ముగించి , టెలివిజన్లో బ్రహ్మోత్సవాలు వీక్షించడం కోసం,ట్.వి. ని అతుక్కుపోవడం, సాయంత్రం కీర్తనలు, భజనలు, పూజలు, పేరంటాలు ఒకటే హాడావిడి.
    మా బెంగాలి స్నేహితులయితే ఇంట్లొ ఒక అడుగు, దుర్గ మందిరంలొ మరొ అడుగునూ, వారి ముద్దులగుమ్మ దుర్గని, వారి యింటి గారాలపట్టి, సంవత్సరంలొ ఆ మూడు రోజులు పుట్టింటికి వస్తుందని,పరమశివుడు వారి జామాతని అంటారు.ఇంటికి వచ్చిన ముద్దుల కుమార్తెని ఆప్యాయతతో, ఆనందంతో, అభిమానంగా,ఆదరించి పూజిస్తారు. షడ్రచులతో,భక్ష్యాలు దేవికి సమర్పిస్త్తారు సామూహికంగా మందిరంలోనె వాళ్ళ భోజనాలు అవీను. సాయంత్రం మళ్ళి పూజలు, సాంస్క్రృతికార్యక్రమాలు, రోజూ రెండు పూటలా కొత్తచీరలు, చెప్పలెని ఆనందం, సంతోషం.
    మా నార్తు స్నేహితులయితే శరన్నవరాత్రులను మాతారాణి భజనలతో, రామయణ గానంతో, పరవశింపచేసేస్తారు, వయసుతో నిమిత్తం లేకుండా అందరూ చక్కని నృత్యాలతో,ఉల్లాసంగా గడుపుతారు.కొంతమది కన్యకలకి భొజనం,విభిన్న వస్తువులిచ్చి సంస్కృతి, సంప్రాదాయననుసరించి వారిశక్తి కొద్దీ జరుపుతూవుంటారు. మనవారు బొమ్మలకొలువుతో,ఇంద్రకీలాద్రి కనకదుర్గ పూజలతో,లలితాసహస్రనామార్చనలతో, గడచిపోతుంది. దేవి ఉపాసకులయితే వారి పూజా విధానం, అదీ చాలా శ్రద్దగా నియమ నిష్టలతో చేస్తారు.
    దసరా అంటే గుర్తుకువచ్చేది మా
చిన్నపుడు అయ్యవారికిచాలు, ఐదు వరహాలూ, పిల్లవాళ్ళకు చాలు పప్పుబెల్లాలు, జయా విజయీభవ, దిగ్విజయీభవా, అంటూ యింటింటికి వెళ్ళిన రోజులు గుర్తుకు వస్తాయి,ఆ రోజులు తలచుకుంటే, ఎంత వయసు వారికయినా మనలోని చిన్నపిల్ల మనస్తత్వం బయటపడుతుంది. ఇక్కడ పూణె లో " చతుర్ శ్రింగి మాత" ఆలయంలో చక్కని పూజలు, మేళా వుంటుంది ఆదేవి దర్శనానికి పొరుగూరినుండి భక్తులు వస్తూంటారు. ఆందరం కలసి విభిన్నసంస్కృతులతో అమ్మని కొలుస్తాము. ఏ ఆర్బాటాలు ఆడంబరాలు లేకుండా నిష్కల్మషమయిన మనసుతో పవత్రమైన భక్తితో, అర్చించినా ఆరాదించినా పూజించినా చాలు కదండీ! సర్వశక్తిమయీ, అభయప్రదాయిని, ఆనందదాయిని, ఆనందరూపిణీ, అయిన ఆతల్లి అనుగ్రహం మనకందరికి కలగాలని కోరుతూ



--------

అడిగేవాళ్ళు లేపోతే. సరీ.....

   ఏదో నా దారిన నేను ఏవో దేముళ్ళూ, దేవతలూ, పూజలూ, పునస్కారాల గురించీ వ్రాసుకుంటున్నాను. ఈ మధ్యన వ్యాఖ్యలు పెట్టేవాళ్ళే కనిపించడం లేదు. ఔనులెండి మా వారి బ్లాగుల్లాగ ఉంటాయా ఏమిటీ? ఏదో ఉపవాసం రోజున చప్పిడిపిండి తిన్నట్లుంటాయి. కొంతమందికి శనివారం ఫలహారం ఇడ్లీలూ, మినపట్లూ ఉంటేనే కానీ నచ్చదు. పోనిద్దురూ ఎవరిష్టం వారిది. తుపాకీ గురి పెట్టి బలవంతంగా వ్యాఖ్యలు వ్రాయించుకోలేముగా.

   అడిగేవాళ్ళెవరూ లేరని, మా శ్రీవారు ఈమధ్యన పేట్రేగిపోతున్నారు. ఆయన జోక్కులన్నీ నామీదే. ఊళ్ళోవాళ్ళమీదేస్తే ఎవరూరుకుంటారు? తేరగా దొరికేది కట్టుకున్నదే కదా!.కన్న కొడుకైనా, కూతురైనా వాళ్ళమీద జోకులేయడం మొదలెడితే, ఏదో కన్న తండ్రికదా అని నాల్రోజులోపికపడతారు. మరీ ఎక్కువైపోతే చూడు నాన్నా ఇనఫ్ ఈజ్ ఇనఫ్ అని చెప్పేస్తారు! ఇంక మిగిలిందెవరూ, నేనే కదా. ఏదో వయస్సులో పెద్దాయనా, చిన్నప్పటినుండీ పెద్దలకు గౌరవం ఇవ్వాలీ అని నేర్చుకోడం చేత, ఇన్నాళ్ళూ ఓపిక పట్టాను. ఊరుకుంటూంటే నెత్తికెక్కేస్తున్నారు హన్నా !.

   అందుకే నిన్నెప్పుడో వ్రాశిన టపా మీద శ్రీ శర్మ గారో వ్యాఖ్య పెట్టారు--"భమిడిపాటి వారు ఉత్తి కబుర్ల పోగులు..."--అని. ఓ మెతుకు చూస్తే తెలియదూ అన్నం పూర్తిగా ఉడికిందో లేదో? అందుకే మరి, ఊరికే ఎడాపెడా రాసేయడం కాదు బాబూ, ఎంతమంది నమ్ముతారూ అనికూడా చూసుకోవాలి. చూడండి ఎలా అంటున్నారో," పి.ఏ. డ్యూటీ చేస్తున్నారా.." నమ్మేమాటేనా ఇదీ?

   ఏదో నాలుగు ముఖస్థుతి మాటలు చెప్పేయడం ముందర తరువాత తాటాకులు కట్టేయడం. కోనసీమవారండి బాబూ. తెలిసినవారూ, ఏదో చుట్టరికం కూడా ఉందిలెండి, అని కట్టబెట్టారు. ఈమాత్రం పెళ్ళికొడుకే దొరక్కపోతాడా మా ప.గో.జి లోనూ! ఏమిటో అంతా రాసిపెట్టుంది,ఈయన పాలిట పడ్డాను. ఒకటా రెండా, దాదాపు నలభైఏళ్లనుండి ఆడేసికుంటున్నారు. ఇదివరకైతే ఇంటికొచ్చిన ప్రతీ వాళ్ళతోనూ నామీద జోక్కులే! ఉద్యోగంలోంచి రిటైరయినప్పటినుండీ, పాపం ఈయన చెప్పే కబుర్లు వినడానికి ఎవరూ దొరకడం లేదు, ఇదివరకేమిటీ విధాయకం కాబట్టి వినేవారు. కానీ ఇప్పుడలాకాదుగా మరి, కొడుకేదో కంప్యూటరిచ్చేటప్పటికి ఇదిగో ఇలా ఊరిమీద పడ్డారు. చదివేవాళ్ళకేముందీ, ఇంకో భార్యాభర్తల విషయాలు entertainmen టేగా! అదండి మావారి సీక్రెట్టూ!

   ఈయనకేనా, నాకుమాత్రం తెలుగులో టైపు చేయడం రాదా అనుకుని నేనూ మొదలెట్టాను. రాయడం వరకే నాపని, దానికి హంగులూ, అలంకారాలూ పాపం ఆయనే చేస్తూంటారులెండి. అలా ఒప్పుకోకపోతే, దానిమీద కూడా ఓ టపా రాయగల సమర్ధులు మా శ్రీవారు, ఒప్పుకుంటే పోలే !ఒక్క విషయం ఒప్పుకోవాలిలెండి, పాపం అల్పసంతోషి. ఈమాత్రం రాస్తే చాలు సంబరపడిపోతారు. ఆయన సంతోషాన్నెందుకు కాదనాలీ? పోనిస్తురూ!ఏదో చేయమన్నానుకదా అని పెత్తనం ఇస్తే, మరీ "పేనుకి పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందిట" లాగ చేతికొచ్చిందల్లా రాస్తే ఎలాగా?

   అదేదో సెల్ ఫోనూ, డిజిటల్ డైరీ కొన్నానని వ్రాశారు. ఛస్తానా, పుట్టినరోజుకి రెండు మూడు నెలలముందునుంచీ, అదేదో లౌడ్ థింకింగుట, నాకు ఈ పుట్టినరోజుకి ఇలాటిదుంటే బావుండునూ అని కలవరింతల్లో కూడా అదే సొద. ఏదో అప్పుడూ ఇప్పుడూ పిక్కించిందీ, పోపుల డబ్బాలో దాచుకున్నదీ, ఎప్పుడో పుట్టింటికి వెళ్ళినప్పుడు, అమ్మో నాన్నో చేతిలో పెట్టిందీ, అదికూడా సరిపోపోతే, పిల్లల్ని అప్పడిగీ, మా పక్క లేడీడాక్టరుగారి సహాయంతో కొనిపెట్టాను.ఈమాత్రం దానికే "అస్థిత్వం" అంటూ ఉబ్బేయడం! అదేమిటండీ మీ చేతిలో ఖర్చులకి డబ్బియ్యరా అనడక్కండి. ఆ ముచ్చటా తీరింది- ఎప్పుడో పెళ్ళైన రెండో రోజున అనుకుంటా, అత్తారింట్లో మావాళ్ళతో కలిసి కబుర్లు చెప్పుకుంటూంటే, ఈ పెద్దమనిషి పేద్ద గొప్పగా వచ్చి, తన చేతిలో ఉన్న పర్సు నాచేతిలో పెట్టేశారు. అందరూ అనుకున్నారు, అక్కడ మా ఆడపడుచుకూడా ఉందిలెండి, అబ్బో మా వదినదే అంతా కంట్రోలూ అనీ, ఆహా ఓహో మా అమ్మాయిదెంతదృష్టం అని మావాళ్ళూ అనుకోడానికి తప్పించి, మళ్ళీ ఈ నలభైఏళ్ళలోనూ, ఆయన జీతం ఎంతో తెలియదు, పోనీ పెన్షనేనా తెలుస్తుందా అంటే అదీ లేదు. ఇదండి బాబూ నా కంట్రోల్! ఆ పర్సూ, దాంట్లోని వందరూపాయలూ మాత్రం ఇంకా నా దగ్గరే ఉన్నాయి. ఆయనమాత్రం ఓ వంద పర్సులైనా మార్చుంటారు!

   మళ్ళీ ఈమధ్యన ఇంకో టపా వ్రాసినట్లున్నారు. రోజూ పోరగా పోరగా మొత్తానికో ముహూర్తం చూసుకుని, ఆ పెన్షనెకౌంటేదో జాయింటు చేశారు. చేయడం అంటే చేయించారుకానీ, దాని డెబిట్ కార్డు ఎక్కడుందో బ్రహ్మకైనా తెలియదు. ఇంకెందుకూ ఆ జాయింటూ చూసుకుంటూ పులుసులో వేసికోడానికా! ఏదో పబ్లిసిటీకోసం చేయించారు కానీ, అదేమైనా ఆరుస్తుందా తీరుస్తుందా? ఏమిటో రోజులెళ్ళిపోతున్నాయి.......

గౌరీ గణపతి పూజ




ఫాక్టరీలో మావారితో పనిచేసిన ఒక మహరాష్ట్రియన్ స్నేహితుడు, ఈమధ్యనే రిటైరయ్యారు. ఇంకొద్దిరోజుల్లో క్వార్టర్ వదిలేసి, స్వంత ఫ్లాట్ కి వెళ్ళిపోతారని, మరీ దూరం అయిపోతుందని, ఈవేళ చూడ్డానికి వెళ్ళాము. అదే కాదనుకోండి, ఇంకో కారణం కూడా ఉంది-- ఇక్కడ మహరాష్ట్రీయులు గౌరీ పూజ అని ఒక పూజ చేస్తారు, గణపతి నవరాత్రుల్లో. మూడు రోజులు. గౌరీదేవి రెండురూపాల్లో గణేశుడి అక్కగార్లరూపం లో, తమ్ముణ్ణి వెదుక్కుంటూ వస్తారని నమ్మకం. వారిపేర్లు కొంతమంది జ్యేష్ట్హ, కనిష్ఠ అంటారు, కొంతమంది గౌరి, లక్ష్మి అంటారు. పేర్లేమైతేనేం, ఆ రెండు మూర్తులకీ చేసే అలంకరణ చాలా బాగుంటుంది. తెలిసినవారందరినీ పేరంటానికి పిలిచి, పసుపు కుంకాలూ, కొబ్బరికాయా ఇచ్చుకుంటారు. అమ్మవారికి ఆరోజు ఆరు రకాల నైవెద్యాలు పెడతారు.
ఈ అమ్మవార్లమూర్తులు, వారికి వంశపారంపర్యంగా వస్తాయి. ఈ సందర్భంలో తీసిన ఓ చిన్న వీడియో ని ఇక్కడ చూడండి.

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes