RSS

ఒక్కసారి చేసేటప్పటికే టముకేసికోవాలా...

    టపా పెట్టి అప్పుడే చాలా రోజులయిపోయింది. అలాగని పెద్ద పనేమీ చేస్తున్నట్టూ కాదూ, మా పిల్లలు వేసవి శలవల్లో తిరగడానికి, హిమాలయాలకి వెళ్ళినప్పటినుంచీ, అస్సలు తోచడమే లేదు. నేనెక్కడ బయటకి తీసికెళ్ళమంటానో అని, మా శ్రీవారు నెట్ లోంచి ఓ అరడజను పుస్తకాలు డౌన్ లోడ్ చేసి, నా మొహాన్న పడేశారు. ఇంక పుస్తకం ఉంటే నిద్రా, ఆకలీ హూష్ కాకీ ..అయిపోతాయి. ఆ సందర్భం లోనే ఈ ఏడాది ఆవకాయ కలపడం మా వారికి outsource చేసేశాను. ఏమిటో ఎంతో శ్రమపడిపోయినట్టూ, నేనేదో ఆయన్ని ఆరళ్ళు పెట్టేస్తున్నట్టూ ఓ టపా కూడా పెట్టేసికున్నారు. మరి ఇన్నేళ్ళూ,తిన్నట్టు లేదూ? ఒక్క రోజంటే ఒక్కరోజైనా ఆవకాయ లేకుండగా ముద్ద దిగిందా? పైగా బయటినుంచి తేకూడదూ, ఇంట్లోనే, పిల్లల్ని చూసుకుంటూ, ఆయనకి కావాల్సినవన్నీ చేస్తూ, వంటపనీ, ఇంటిపనీ చూసుకుంటూ ప్రతీ ఏడాదీ ఊరగాయలు పెట్టడమంటే మాటలా మరి? అదేం జాతకమో నాది, ఓ పనిమనిషికూడా లేదు, అప్పుడెప్పుడో మా ఫ్రెండు ఒకమ్మాయిని పంపింది. ఓ నెల రోజులు చేసింది, బాగానే చేసేదిలెండి, అయినా నా అదృష్టానికి తనుమాత్రం ఏం చేయకలదూ, చెప్పా పెట్టకుండా ఓ రోజు రాలేదు. తీరా తెలిసిందేమిటీ అంటే, పాపం ఆ పిల్ల తన భర్తతోనో కొడుకుతోనో స్కూటరు మీద వస్తూంటే ఓ గోతిలో పడిందిట, చెయ్యి కాస్తా విరిగింది. దీనితో ఆ పనిమనిషి ముచ్చట కాస్తా మూణ్ణాళ్ళ ముచ్చటైపోయింది.తను పనికి వచ్చిన నెలరోజుల్లోనూ నాకు బధ్ధకం పెరిగిపోయి, మళ్ళీ పనిచేసికోవడం మొదలెట్టడంతో, ఒళ్ళు ఒంగదాయె. నుంచుంటే కూర్చోలేను, కూర్చుంటే నుంచోలేను. మరి ఇలాటి విపత్కర పరిస్థితుల్లో ఓ చేయ్యేస్తే ఏం పోయిందిట? ఈమాత్రం దానికి ఊరిమీదపడి టపాలు పెట్టుకోవాలా, మరీ చిత్రం కాపోతే.పైగా ఏమైనా ఆయన్ని రాళ్ళు కొట్టమన్నానా, శిల్పాలు చెక్కమన్నానా, ఆవపిండీ, ఉప్పూ, కారం నేనే కొలిచి ఓ పేపరుమీద వేసి, శుభ్రంగా కలపమన్నాను. అదీ తప్పేనామ్మా? సుతారంగా కలిపితే సరిపోతుందా మరీ, ఆవకాయ ఏడాదంతా ఉండొద్దూ, లేకపోతే మళ్ళీ ఆవకాయ వేసికున్నప్పుడల్లా, "ఉప్పు సరీగ్గా కలిసినట్టులేదోయ్.. ఇంకొంచం మెంతులు తగిలిస్తే బావుండేదేమో, ఆవఘాటే పట్టడంలేదోయ్.." అని ఏడాది పొడూగునా వేసే డయలాగ్గులు, ఈ ఏడాది కుదరదూ అనే దుగ్ధే కనిపించింది నాకైతే. అయినా ఎన్నేళ్ళు చేస్తామండీ ఈ చాకిరీ? తెలిసొచ్చింది ఇప్పుడు, వచ్చే ఏడాదీ ఇలాగే కానిచ్చేస్తే సరి ! కావల్సినన్ని టపాలు వ్రాసుకోమనండి, నాకో పని తప్పిందికదా !!

    ఈమధ్యన ఓ కొత్త వ్యాపకమోటి పెట్టుకున్నాను, మనవడూ, మనవరాలూ ప్రస్తుతం ఇక్కడ లేరుకదా అందుకన్నమాట. ప్రతీవారికీ కొద్దో గొప్పో స్నేహితులనేవాళ్ళుంటారు కదా, వాళ్ళని ఎప్పుడూ ఒకే దృష్టితో చూస్తూంటాము. మన యోగక్షేమాలు కనుక్కుంటూంటారు, ఒకరికొకరు సహాయపడుతూంటారూ, మరీ ప్రతీరోజూ కాకపోయినా వారంలో ఒక్కసారైనా కలుస్తూ ఉండడమో ఫోన్లు చేసికోడమో చేస్తూంటారు.ఇవన్నే కాకుండా, వాళ్ళలో ఉండే ఇంకా extra special qualities వాళ్ళల్లో ఏముంటాయీ అనే జిజ్ఞాస ఒకటి మొదలయింది. అలాటి ఆలోచన రావాలేకానీ, గుర్తుచేసుకూంటే కావలిసినన్ని గుర్తొచ్చాయి. మా స్నేహితురాలు ఒకావిడ ఉన్నారు. అందరికీ తలలో నాలుకలా ఉంటారు. అడగ్గానే సలహా ఇస్తూంటారు, వాళ్ళ సొసైటీలో కూడా అందరితో మంచిగా ఉంటూంటారు. అవన్నీ ఉండబట్టేకదా మా ఇద్దరి స్నేహమూ గత 15 సంవత్సరాలనుండీ నిరాటంకంగా సాగుతోంది. ఇన్ని ఉన్నా పాపం ఆవిడలో ఓ బలహీనత కనిపించింది. మేము మామూలుగా ప్రతీ నెలా స్నేహుతులమందరమూ కలుస్తూంటాము చిట్ పార్టీ పేరుపెట్టి.లంచో, బ్రంచో ఏర్పాటుచేస్తూంటాము. అన్నిభాషలవాళ్ళూ ఉండడం చేత, వివిధరకాలైన వంటకాలూ చేసి పార్టీ ఇస్తూంటారు. వాళ్ళకి ఏదో ఒక వంటకమో, పిండివంటో, ఓ పచ్చడో ఇంకోటో ప్రత్యేకంగా చేసిపెట్టడం ఓ ఆనవాయితీ.చెప్పడానికేముందీ తప్పకుండా బాగానే ఉంటుంది. వచ్చిన గొడవల్లా ఏమిటంటే, మా స్నేహితురాలన్నానే ఆవిడా, ఆ పార్టీలో ఏదో నోట్లో వేసేసికుని ఆహా.. ఓహో.. క్యా టేస్ట్ హై.. అంటూ గుర్రం ఎక్కించేస్తుంది. అక్కడితో పోనీ అయిందా, అంటే ఎప్పుడో వాళ్ళింటికి వెళ్ళినప్పుడు, ఆ వచ్చినవాళ్ళతో.. " ఆప్ కా ఘర్ మే ఉస్ దిన్ బనాయా థా, ఓ బహుత్ అఛ్ఛా థా.. హమ్ కో భీ శిఖావోనా లక్ష్మీ.." అని అడిగేసి, ఊరుకుంటుందా అబ్బే, కిచెన్ లోకి తీసికెళ్ళి, ఆప్ బనాకే దేవోనా.. ఆప్ కా హాథ్ కా బనాయా బహుత్ టేస్టీ లగతాహై.." అంటూ ఆ వచ్చిన వాళ్ళని by default ఓ వంటమనిషిగా చేసేస్తూంటుంది. తప్పుతుందా మరి, మంత్రసాని పనికొప్పుకున్న తరువాతా? మామూలుగా మనవాళ్ళకేదైనా వంటకం నచ్చితే ( చాలా సందర్భాల్లో నచ్చదులెండి, అది వేరే సంగతి),ఎలా చేశారనో, ఏమేమి వేయాలో వగైరాలు అడిగేసి, వింటాము. ఇంటికెళ్ళిన తరువాత ఒకసారి ప్రయత్నించి. తేడాపాడాలొస్తే ఓసారి ఫోను చేసి అడుగుతాము. అంతేకానీ ఏదో చుట్టపుచూపుగా మనింటికి వచ్చినప్పుడు, వాళ్ళచేత సాధారణంగా మరీ చేయించేసికోము. ఏమిటో ఒక్కక్కళ్ళకి ఒక్కో రకమైన తెలివితేటలూ.

   చాలారోజుల తరువాత, మాకూ శలవలే కాబట్టీ, వాళ్ళకీ శలవులే అవడం చేత ( ప్రస్తుతం మా ఇద్దరి మనవళ్ళూ ఊరికి వెళ్ళడం చేత), మా స్నేహితురాలూ, భర్తా మమ్మల్ని కలుద్దామని వచ్చారు. కబుర్లకేముందీ, మనవళ్ళతో ఎలా కాలక్షేపం అయ్యేదో, తీరా వాళ్ళు లేకపోవడంతో ఎంతలా తోచడంలేదో వగైరాలు. ఓ ఇద్దరు జంటలు అదీ సమవయస్కులు కలిసినప్పుడు ఇవేగా కబుర్లూ? వాళ్ళ మనవడి ముద్దుముచ్చట్లూ అవీనూ. భోజనానికి ఉండిపోండీ అంటే, కాదూ టిఫిన్ మాత్రమే చేస్తామూ అన్నారు. భోజనానికైతే ఒకలాగ ఓ కూరా, పులుసూ, పచ్చడీ చేద్దును. కానీ టిఫినే చేస్తామనడంతో, మరీ ఈరోజుల్లో పిల్లల్లాగ బిస్కట్లూ, అవీ పెట్టేసి, ఓ కూల్ డ్రింకిచ్చేసి ఊరుకోలేముగా, ఏదో మనకొచ్చిందే ఏదో ఒకటి చేసి పెట్టాలనిపిస్తుంది.ఓ గ్లాసుడు మినప్పప్పు నానపెట్టి వడలుగానూ, సేమ్యాతో ఉప్మా, మామిడిపండుతో ఆంరస్ చేసి, ఆ వడల్లో నలుచుకోడానికి కొత్తగా పెట్టిన మామిడి పచ్చడి పెట్టాను. వాళ్ళకీ నచ్చిందీ. ఇంతలో ఆవకాయమాటొచ్చింది. తనే కలిపేరని చెప్పుకుంటే నవ్వుతారేమో అని భయం. కిక్కురుమనకుండా కూర్చున్నారు. వెళ్ళేటప్పుడు ఓ సీసాలో పెట్టి ఇమ్మన్నారు. చెప్పొచ్చేదేమిటంటే, మా శ్రీవారు ఎంతో "శ్రమ" పడి కలిపిన ఆవకాయ వాళ్ళక్కూడా నచ్చింది. అదండీ విషయం...

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes