RSS

ఓ చిరు విజ్ఞప్తి...

   మేము భుసావల్ దగ్గరలో ఉన్న వరంగాం లో ఉన్నప్పటి రోజులు. అప్పటికింకా భుసావల్ నుండి విజయవాడకి డైరెక్టు ట్రైన్ లేని రోజులన్నమాట. భుసావల్ నుండి వార్ధా దాకా వెళ్ళడమూ, అక్కణ్ణుంచి ఏదో మెయిన్ లైన్ మీద ( గ్రాండ్ ట్రంక్ రూట్) వెళ్ళే రైలెక్కి, విజయవాడ దాకా వెళ్ళి, అక్కడ ఏ బస్సో, ఇంకోటేదో ఎక్కి తణుకు చేరడమూనూ, ఆ రోజులన్నమాట. మా నాన్నగారికి పెద్దకూతురునాయె, పైగా 'తాతయ్య' ని కూడా చేసేశామూ, ఒకసారా, రెండు సార్లు కూడానూ. మాఇద్దరిమీదా అభిమానం ఉందో లేదో తెలియదుకానీ, మనవరాలూ, మనవడూ అంటే మాత్రం ఎంత ప్రేమో. దూరాభారం తో పని లేకుండా, ఏడాది కోసారైనా పిల్లల్ని చూస్తేనే కానీ తోచేది కాదు ఆయనకు. ఇంతంత దూరాలు రావడం అంత సులభమా మరి, పైగా భాష ఓ సమస్య. ఏదో మనవైపైతే ఎలాగోలాగ కాలక్షేపం చేయొచ్చు కానీ ఇలాగ పరాయి రాష్ట్రాల్లో పిల్లలుంటే, ఇదేనండి కష్టం. కానీ ఈ పెద్దాళ్ళా వినేవాళ్ళూ? పిల్లల్ని చూడాలీ అని అనుకోవడం తరవాయి, చెప్పాపెట్టకుండా వచ్చేయడమే. పైగా ఆ రోజుల్లో ఫోన్లా ఏమిటీ? మొక్కుబడి కోసం ఓ ఉత్తరం ముక్క వ్రాసేయడం, ఆ ఉత్తరం మనకి చేరేలోపల, ఈయనే వచ్చేస్తారు. అదేమిటి నాన్నా ఓ ఉత్తరం ముక్కోటి రాయొచ్చుగా, ఆయన స్టేషన్ కి వచ్చేవారూ, అంటే " రాసేనే అమ్మాయీ, అందలేదా...". సరీగ్గా ఆ ఉత్తరం కూడా ఈయనొచ్చిన మర్నాటికి చేరేది. అక్కడికి ఆయనకి కావలిసిన సర్ప్రైజు ఎలిమెంటూ ఉండేదీ, ఉత్తరం రాసినట్టూ ఉండేది. వచ్చిన గొడవల్లా, తిరిగి వెళ్ళడానికి టిక్కెట్ట్ల వద్దే. నాకైతే ఓ వారం రోజులుంటే బావుండునూ అనిపిస్తుంది. కానీ, అక్కడ ఉద్యోగం, సంసారం చూసుకోవాలి, అందుకోసం చెప్పుల్లో కాళ్ళెట్టుకునే రావడం.

    ఇలాటి ఓ ప్రయాణం లో, మా అందరికీ చూపిద్దామని తన దగ్గరున్న పాత ఫొటో ఆల్బమ్మోటి కూడా తెచ్చారు. అందులో మా తాతయ్య, మామ్మ గార్ల ఒకే ఒక ఫొటో, ఇంకా మా కుటుంబ సభ్యుల కొన్ని ఫొటోలూ, మాకు చూపిద్దామని తెచ్చారు పాపం. ఓ రెండురోజులుండి, వెనక్కి ప్రయాణం, అప్పటికప్పుడు రిజర్వేషను దొరకడం అంత సులభమా, ఏదో జనరల్ కంపార్టుమెంట్లోనే, గుమ్మం దగ్గరే, ఓ తువ్వాలు పరుచుకుని కూర్చున్నారుట. అకోలా స్టేషన్ దాటుతూండగానే, కొద్దిగా నిద్ర పట్టేసింది. తీరా వార్ధా చెరేటప్పటికి ఏముందీ, ఆయన బ్యాగ్గు ఎవడో కొట్టేశాడు. అదృష్టం కొద్దీ, ఆ టిక్కెట్టేదో జేబులోనే పెట్టుకోడం ధర్మమా అని, కట్టుబట్టలతో ఎలాగో ఇంటికి చేరారు. నాలుగు రోజుల తరువాత ఓ ఉత్తరం- ఇలా అయిందీ అని. ఎంత బాధేసిందో, ఆరోజున మా నాన్నగారు ఎలా బాధపడి ఉంటారో ఊహించుకోవాలంటే, ఈ మధ్యన మా మిత్రులు శ్రీ దాసరి అమరేంద్ర గారు, ఆరోజుల్లో వ్రాసిన ఓ "కవిత" చదివితే తెలుస్తుంది...

   ఓ చిరు విజ్ఞప్తి

   అవున్నేను ఏ జాగ్రత్తా పడకుండా
ఆదమరిచి నిద్రపోయిన మాట నిజమే..
ఏమంటారన్న స్పృహైనా లేకుండా
రైలు బండి ఊయలలో ఇల మరచిన మాటా నిజమే
మీ పని మీరు చేశారు--తప్పు పట్టను

   పట్టుకుపోయిన పెట్టి తెరిచే ఉంటారీపాటికి-
కొర్రుపడిన తెల్ల చొక్కా కనిపించిందా?
నా మొదటి జీతం లో కొనుక్కున్నానది.
రంగు వెలిసిన ఉన్ని టొపీ ఉంది చూశారూ
ఊటీ వెళ్ళినప్పుడు తిసికొన్నదది.
అట్టడుగున రంగు మాసిన ఫొటో కనిపించుండాలే..
పాతికేళ్ళనాటి మా ఫ్యామిలీ ఫొటో అది.
వెళ్ళిపోయిన కొంతమంది మిగిల్చిన ఒకే ఒక గుర్తు.

   బరబర శబ్దాల ట్రాన్సిస్టర్ చూశారా?
ఓ చిన్ననాటి నేస్తం ఇచ్చిన ప్రేమ కానుక.
పని చేసీ చెయ్యని పాత వాచీ ఉండాలి కదూ
డిగ్రీ పాసయినప్పుడు అమ్మ కొనిపెట్టిందది
అట్ట చిరిగిన ఆల్బం కనిపించిందా?
కాలేజీ రోజుల అపురూప జ్ఞాపిక అది.
పెట్టిపై అరలో ఓ ఉత్తరాల కట్టుందికదూ..
మా ఇంటి మహాలక్ష్మి రాసిన లేఖా సుమాలు అవి.
బట్టల మాటున ఓ చవక కెమేరా కనిపించిందా?
టీనేజ్ లోకడుగు పెట్టినప్పుడు నాన్న ఇచ్చిన బహుమతి..
దేశమంతా నా వెంట తిరిగి చూసిన ప్రియ నేస్తం అది.

   దొంగలో దొరలో మీరెవరైతేనేం
ఆ వస్తువులన్నీ నాకు వాపసివ్వరూ!
పెట్టెలో ఉన్న డబ్బూ సర్టిఫికేట్ల సంగతా !!
మళ్ళీ సంపాదించుకోవచ్చు, మళ్ళీ పుట్టించుకోనూవచ్చు
జ్ఞాపకాలూ జ్ఞాపికలూ తిరిగి సృష్టించుకోలేం గదా!
ఆ వస్తువుల్నీ జ్ఞాపకాల్నీ నాకు తిరిగివ్వరూ....


పై కవిత ఆగస్టు 1998 "రచన" సంచికలో ప్రచురించారు. పాత పుస్తకాలు చదువుతూంటే కనిపించింది. ఎంత బావుందో కదూ ! ఈమధ్యనే పరిచయం అయిన, మా కుటుంబ మిత్రులు శ్రీ దాసరి అమరేంద్ర గారికి హృదయపూర్వక కృతజ్ఞతల తో.....

.

అలాటి అవసరం రాకూడదనే ......

   మా చిన్నపుడు ఆదివారాలు తలంట్ల కార్యక్రమంలో మా అమ్మమ్మ చెబుతు వుండేవారూ భూలోకంలో " నిత్యతలంటు, వార భోజనం" అని దండోరా వేసి రమ్మని బ్రహ్మదేవుడు పంపితే వాడు ఇక్కడికి వచ్చి " వార తలంటు, నిత్య భోజనం " అని వేసాడట. దాంతో వారం వారం తలంట్లు, రోజూ భొజనాలు మొదలయ్యాయట. లేకపోతే బియ్యానికి బదులుగా కుంకుళ్ళు,కుంకుళ్ళకి బదులుగాబియ్యం తీసుకునే పరిస్థితి వచ్చి వుండేదన్నమాట.

    పెద్ద పెద్ద సంసారాలు, పరిమితం కాని కుటుంబాలు . మధ్య తరగతి లోని ఇల్లాలు వండి వడ్డించలేక సతమతమైపోయేదట. ఓ మహా ఇల్లాలు దేవుని పేరు చెప్పి శని వారాలు ఓ పూట ఉపవాసం మొదలుపెట్టించిదట. సరే! ఇది బాగానే వుంది , పుణ్యానికి పుణ్యం, భోజనానికి బదులుగా పాలు, పండ్లు తీసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్య మని చాలా మంది మొదలుపెట్టారట.రాను రానూ పాలు, పండ్లు మానిన, మానకపోయినా ఛేంజ్ ఆఫ్ ఫ్హుడ్ అంటూ ఇడ్లీలు, దోశలూ, చపాతీలు, పూరీలు, పెసరట్లు మొదలయి ఇంటి ఇల్లాలుకి నడుంవిరిగే పని పెరిగిపోయింది. అలా,అలా దేవుని పై భక్తో, పుణ్యమో తెలీదుకాని , మేము శనివారం ఫలానాది చేసుకున్నామని చెప్పుకోవడం ఓ ఫాషను అయిపోయింది. వెంకటరమణుడిని తలచుకోకపోయినా ,శనివారం అనేసరికి బంగాళ్దుంప కూరతో చపాతిలు, ఉల్లిపాయతో సాంబారు లో ఇడ్లీలు తినే భక్తులని చూస్తూ వుండిపోయాడు...

   వెర్రి వెయ్యి తలల్తో విజృంభిస్తున్న సమయంలొ ఓ మహాఇల్లాలు " జై జవాన్, జైకిసాన్", నారా తో శాస్త్రి గారి మాటలకు ఉత్తేజపడి " సోమవారం" సాయంత్రం భోజానాలు మాని ఉపవాసం మొదలు పెట్టేసరికి ,అలా అలలా , ఇల్లిల్లు , ఊరు ఊరు చేయడం మొదలుపెట్టారు. ఆ సమయంలో మా ఇంట్లోనూ చెసేవారు. అంతే కాదూ, రోజూ ఎసట్లో బియ్యం పోసె ముందు ఓ గుప్పెడు బియ్యం తీసి వేరే డబ్బాలో పోసి పొదుపు చేసేవారు. దైవ భక్తి కంటె దేశభక్తి తో ఉపవాసం వుండేవారు, తినేటప్పుడు శుభ్రంగా తినేవారు, పొదుపు చేసేవారు.ఇంటి పట్టున వుండేవారు.

   ఇప్పుడు రోజూ, షాంపూ స్నానాలు, డబ్బాలో భోజనాలు. వంటావిడకి ఉదయమే వచ్చి చేసేందుకు కుదరదు కనుక రుచి పచి లేని కూరలు చపాతిలు అదీ నూనె లేకుండా, కారం వుండకూడదు.టోన్డు పాలతో తోడుపెట్టిన పెరుగు.ఇదీ భోజనం. ఏడువారాల నగల్లాగ రొజుకో "సిరియల్" బ్రేక్ ఫాస్ట్. వారంలో 5 రొజులు ఇదే తిండి. వారాంతానికి రెండు రొజుల్లో ఓ రోజు పాస్తా, నూడిల్సు, లేకపోతే పిజ్జ. అది మళ్ళీ చీజ్ ది, ఇంకో రోజు భోజనానికని చెప్పి ఓ 5 కిలోమీటర్లో 10 కిలోమీటర్లో వెళ్ళి 5 నక్షత్రాల హుటెల్ లో తనివి తీర కడుపు నిండా తినొచ్చి అలసిపోవడం, దీనితో అనారోగ్యం సరిగా నిద్ర లేకపోవడం, వర్కు ఫ్రెం హోమ్ అనిచెప్పి రాత్రి పని , కాల్సు. సమతల ఆహారం , నిద్ర లేక అనారోగ్యం, ఊరిపోయే ఊబకాయం, దాని కోసం త్రెడ్ మిల్లులు, సైకిలింగులు. పిల్లల ఆటలు, చదువులు ఒకటె గందరగొళం, ఇంచుమించుగా అందరింట్లోను ఇదే తంతు.

   తలంటు స్నానాల తరువాత సాంబ్రాణి పొగ తో జుట్టు ఆరబెట్టుకొవడం,వదులు జడ, రెండు జడలు, పర్సు జడ, ఈత ఆకు జడ.. పెద్దలయితే జడ అల్లి సిగ, ఒకరు జుట్టు మెలిపెట్టి సిగ, మరొకరు బన్ పెట్టి ముడి.రింగు పెట్ట్టి ముడి ఎలాంటి అలంకరణ అవండీ, ఆ సీజను లో దొరికే పువ్వులు పెట్టుకోవడం లో ఓ రకమైన ఆనందం.ఈ తరం వారికి పిల్లలకి, పెద్దలకి కూడా " బాయ్ కట్" బాబ్డ్ కట్" " యు కట్" తప్పితే జడలు అల్లడం తెలియదనే చెప్పుకొవాలి. ఓ క్లిప్ పెట్టేసుకొవడం, బస్! అంతేనూ.... పువ్వులంటారా ఆ సంగతే వదిలేయండీ!

    మా లాంటి వాళ్ళం పూర్వపు వారిలాగా వుండలేం, ఇప్పటి తరం వాళ్ళ వేగానికి, పరుగులకి తట్టుకోలేం, ఇంతకీ చెప్పేదేమిటంటే షాంపు స్నానమైన ఏదో ఒకటి నిత్య తలంటు వచ్చేసింది. కడుపు నిండా తినే భోజనం వారానికి ఓ సారే అవుతోంది. ఈ తరంలో కూడా ఓ మహా ఇల్లాలు పూనుకొని మంచి స్నానం, సమయానికి సరైన భోజనం, కంటి నిండుగా నిద్ర పోవాలని బోధించే సమయం రావాలని అశిస్తూన్నాను సైకియాట్రిస్టుల దగ్గరకి వెళ్ళవలసిన, అవసరం రాకూడదని ఆశిస్తూ.....

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes