RSS

ముగ్గు చూడు.. ముగ్గందం చూడు..

    సంక్రాంతి అంటే ఎంత హడావిడో కదూ ! ఇప్పుడంటే గూగులమ్మని అడిగితే చాలు లెఖ్ఖలేనన్ని ముగ్గులు దొరికేస్తాయి. కానీ ఆరోజుల్లోనో , ఎవరైనా ఏ యాత్రలకైనా వెళ్ళినప్పుడు ముగ్గుల పుస్తకాలు తెప్పించుకోవడమో, లేకపోతే ఏ పక్కింటి పిన్నిగారో ఏ వారపత్రికైనా తెప్పిస్తూంటే అందులోని ముగ్గులు తీసికోవడమో.,అమ్మమ్మలు,అమ్మక్కయ్యల ముగ్గుల ఖజానా నుండి పెద్ద పెద్ద ముగ్గులు తీసుకోవడం, ఎన్నెన్ని చుక్కలు , ఎంత పెద్దముగ్గులోనూ, కొన్ని ముగ్గులు ఎక్కడ మొదలుపెడితే పూర్తి అయేది కూడా మళ్ళీ మొదటి చుక్క దగ్గరేను. పైగా మొదటి ఆట సినిమా వదిలిన తరువాత మొదలుపెట్టేవారు.వారికి అనుగుణంగా వెలుతురు కనిపించేందుకు లాంతరు పట్టుకొవడం పిల్లల డ్యూటి.ఇప్పుడూ అంతంత ముగ్గులు పెట్టే ఓపిక లేదూ, సమయం లేదూ,ముఖ్యంగా స్థలమూ లేదు. అయినా ముగ్గులు అన్నది ఆడపిల్ల్లల స్వంతం.ఎలాగో చిన్న జాగా అయినా ముగ్గు పెట్టుకోను మురిసిపోని చిన్నది వుంటుందంటారా? మా అమ్మమ్మగారు చెప్పెవారు జనకమహరాజు గారి పుత్రిక సీతాదేవి కూడా పెట్టేవారుట.

    ఆవు పేడ తెచ్చి అయినిళ్ళు అలికి

    గోవు పేడ తెచ్చి గోపురాలలికి

    ముత్యాల వాకిట్లో ముగ్గులేయించి

    రత్నాల వాకిట్లో రంగులేయించి---- అంటూ పాటలో నూ, మరోక పాట చెప్పేవారూ-- ఇల్లు చూడూ -- ఇల్లందము చూడూ-- ఇంటిలోని ఇల్లాలిని చూడూ--

    ముగ్గు చూడూ-- ముగ్గందము చూడూ -- ముగ్గులో వున్న మురిపము చూడూ--

    రంగు చూడూ-- రంగందము చూడూ-- రంగులోని రమ్యతను చూడూ-- అంటూ భలే తమాషా గా చెప్పెవారు.

    ఆ వాతావరణం లో పెరిగిన నాకు పాత పుస్తకంలో తీసిన ముగ్గులు , అల్లిక డిజైనులు , వంటలు తీసి జాగ్రత్త చేయడం అలవాటయింది.ఇదివరకు తీసినవి ఎవరికో ఇచ్చేసాను. ఈ మధ్య ప్రెస్ అకాడమి వారి పాత పత్రికలు చదువుతుంటే కొన్ని కనిపించాయి. అవి మీతో పంచుకుందామనే ఉద్దేశ్యంతోనూ, ఆ పంపినవారు మీవాళ్ళే ఎవరయినా అవవచ్చును కదా!

అష్టవినాయక దర్శనం

    ఓం గం గణపతయే నమః

    అష్ట వినాయక దర్శనం

    ఇన్ని సంవత్సరాలనుండీ పూణె లోనే ఉంటున్నా, అష్టవినాయక దర్శనాన్ని చేసుకోలేకపోయాము. కోరిక మాత్రం ఉండేది. దూరదూర ప్రాంతాలనుండి అష్టవినాయక దర్శనానికి వస్తూంటారు. కానీ, మేమో... అందుకే అంటారేమో దేనికైనా ఘటన అనేది ఉండాలి అని. మనం అనుకుంటే సరిపోతుందా, ఆ గణపతి ఆశీర్వాదం కూడా ఉండాలిగా ! కొత్తసంవత్సరంలో , మాకు దర్శనం ప్రసాదించాలని అనుకున్నట్టున్నారు, మొన్న కార్తీక పౌర్ణమి నాడు, ఓ కొత్త మిత్రులు పరిచయం అయ్యారు.అదేరోజు దంపతులు మా ఇంటికి వచ్చారు. మాటల్లో పూణె కి దగ్గరలో ఉండే పుణ్యక్షేత్రాలగురించి, మాట్టాడుతూ, "అష్టవినాయక దర్శనం " గురించి కూడా ప్రస్తావించాము. నడుము నొప్పితో నేనూ, మోకాలి నొప్పితో మావారూ.. మేము వెళ్ళలేకపోయినా, వారికైనా తెలియచేసే ఉద్దేశ్యంతో. చెప్పేనుగా గణపతి మా కోరిక అంగీకరించారేమో అన్నట్టు, పదిరోజుల క్రితం, మా స్నేహితుడు శ్రీ రవిచంద్ర ఫోను చేసి, ఫలానా రోజుకి మనమందరమూ కలిసి అష్టవినాయక దర్శనానికి వెళ్తున్నామూ,"మీరుకూడా మాతో వస్తున్నారూ..టిక్కెట్లు కూడా బుక్ చేసేశనూ.." అని చెప్పారు.తనూ, భార్య శ్రీమతి ఆదిలక్ష్మి, మా దంపతులూ కలిసి నలుగురమూ, కొత్త సంవత్సరంలో మొన్న శనివారం ఉదయమే బయలుదేరి, ఆదివారంరాత్రికి తిరిగి వచ్చాము. ప్రసన్న ట్రావెల్స్ లో మొదటి రెండు సీట్లూ మాఇద్దరికీ, రెండో వరుస మొదట్లో వారిద్దరికీ సీట్లు దొరికాయి.

    శనివారం (4-1-2014) ఉదయం 6 గంటలకి మేముండే ఇంటిదగ్గరే పరిహార్ చౌక్ దగ్గర, ఓ పిక్ అప్ వ్యానులో , బస్సుదగ్గరకి తీసికెళ్ళారు. శివాజీనగర్ నుండి సరీగ్గా 7.30 కి బయలుదేరాము. అందరికీ క్యాప్పు లిచ్చారు, గుర్తుపట్టడానికి వీలుగా.

    సరీగ్గా 9.30 కి " మోర్ గావ్" చేరుకున్నాము.

" మోర్" అంటే నెమలి అని అర్ధం. ఈ గ్రామం నెమలి ఆకారంలో ఉండడం వలన " మోర్ గావ్" అనీ, ఇక్కడి గణపతిని
" మోరేశ్వర్" అనీ పిలుస్తారు. ఇంకొక విశేషమేమిటంటే, మొదటి వినాయకుడిని దర్శించుకునేటప్పుడే ఒక కొబ్బరి కాయ తీసికుని, అదే కొబ్బరికాయని , మనం దర్శించుకునే మిగిలిన ఏడు వినాయకులకీ సమర్పించి అదే కాయని ఇంటికి తెచ్చుకుని, ప్రసాదంగా స్వీకరించాలని మా గైడు చెప్పారు. మనం వెళ్ళిన ఎనిమిది దేవాలయాలలోనూ, అష్ట వినాయక అని చెప్పగానే, ఒకసారి దేవుడికి చూపించి, మనకి ఇచ్చేస్తారు. చూసేందుకు మసీదు ఆకారంలో ఉండి, ఎత్తైన గోడలమధ్య నల్లరాతి బండల నిర్మాణంతో, నాలుగుద్వారాలతో, లోపల ప్రవేశించి, ఎడమవైపున ఉన్న నగ్నభైరవమూర్తిని దర్శించుకుని, గణపతి దర్శనం చేసికోవాలి. దర్శనానికి 45 నిముషాలు పట్టింది. దర్శనం అయిన తరువాత "నాస్తా, చాయ్" పూర్తిచేసికుని, రెండో గణపతి దర్శనానికి బయలుదేరాము.

    2.సిధ్ధివినాయకుడు ( సిద్దటెక్):

    పూణె-సోలాపూర్ మార్గంలో భీమా నది ఒడ్డున సిద్దటెక్ గ్రామంలో కొలువై ఉన్నారు.12.30 కి చేరుకున్నాము. రిధ్ధి, సిధ్ధి లతో కుడివైపు తొండంతో ఉన్న గణపతిని దర్శించుకున్నాము. అక్కడి వాటర్ ట్యాంకు తమాషాగా ఉంది కదూ !

అక్కడినుండి బయలుదేరి "దోండ్" లో మధ్యాన్న భోజన కార్యక్రమం పూర్తిచేసికుని, 2.30 కి మూడవ గణపతి దర్శనానికి "తేవూర్" బయలుదేరాము.

    3. చింతామణి గణపతి : తేవూర్

    కపిల మహాముని శివుడినుండి పొందిన "చింతామణి" ని, కదంబవృక్ష నీడలో ఉన్న గణపతి కంఠంలో దాచాడని ప్రతీతి. ఈ గణపతి దర్శనంతో చింతలన్నీ దూరమౌతాయని విశ్వాసం. దర్శనం చేసికుని, చాయ్ త్రాగి, 5.00 గంటలకి "రంజన్ గావ్" బయలుదేరాము. అక్కడకి చేరడానికి ఒక గంట పట్టింది.

    4. మహాగణపతి : రంజన్ గావ్.

    పూణె-అహ్మద్ నగర్ మార్గంలో ఉంది రంజన్ గావ్. ఈ దేవాలయాన్ని 9,10 శతాబ్దాలకాలంలో నిర్మించారుట. సూర్యుడి కిరణాలు మూలవిరాట్టు పై పడడం ఇక్కడి విశేషం. ప్రస్తుతం మనం చూసే మూర్తికి క్రింద భూగర్భంలో మహాగణపతి మూర్తి ఉందట. ఆ మూర్తి 10 తొండాలూ, 20 హస్తాలూ కలిగి ఉంటుందట. ఇక్కడ మాత్రం రద్దీ ఎక్కువగా ఉండడంతో 50 రూపాయల పాస్ తీసికుని దర్శనం చేసికున్నాము.

    అక్కడితో మొదటి రోజు నాలుగు వినాయకుల దర్శనమూ పూర్తి చేసుకుని,లెన్యాద్రి కి చేరుకున్నాము. రాత్రి భోజనమూ, బసా అక్కడే.ట్రావెల్ వారు ఒకరూమ్ములో ఆరుగురికి పడకలు ఏర్పాటుచేస్తారు, కానీ మేము విడిగా రూమ్ము ( 600 రూపాయలు) తీసికున్నాము.

    5. గిరిజాత్మజ వినాయకుడు : లెన్యాద్రి

    కూకడి నదీతీరంలో, లెన్యాద్రి పర్వత శ్రేణిలో వెలిసిన వినాయకుడు. సుమారు 100 అడుగుల ఎత్తులో, 300 మెట్లతో , బుధ్ధుని కాలంలో 18 గుహలలో 8 వ గుహలో వినాయకుడు దర్శనం ఇస్తారు. ఈ గుడి ఆర్కియాలజీ వారి నిర్వహణలో ఉంది. ఉదయం 5.30 కి బయలుదేరి, పది నిముషాల్లో కొండ దిగువభాగానికి చేరాము. అంతా చీకటి. ఆరుగంటలకి మెట్లు ఎక్కడానికి గేటు తెరిచారు. కొండమాత్రం చాలా స్టీప్ గా ఉంది. ఎక్కడం కొద్దిగా కష్టమే అనుకోవాలి. ప్రక్కనే పట్టుకోడానికి కూడా ఏమీ లేకపోవడంతో చాలా చాలా జాగ్రత్తగా ఎక్కాల్సొస్తుంది. ఎక్కలేనివారికి "డోలీ" సదుపాయంకూడా ఉంది, రానూపోనూ 500 రూపాయలు తీసికుంటారుట. నా మాటెలా ఉన్నా, మా శ్రీవారు అన్ని మెట్లెక్కగలరా అని సందేహమైతే వచ్చింది, ఆయనకి మోకాలికి ఆపరేషను చేయాలన్నారు, కానీ మాత్రలూ, ఎక్సర్సైజులతో కానిచ్చేస్తున్నారు, అందుకన్నమాట. కానీ మాతో కలిసివచ్చిన దంపతుల ప్రోత్సాహంతోనూ, ఆ గణపతి దయతోనూ మొత్తానికి ఆ 100 అడుగులూ ఎక్కి, దర్శనం చేసికున్నాము. ఆ గుహలోపల చాలా విశాలంగా ఉండి, ఎంతో ప్రశాంతంగా ఉంది. ఆ తరువాత మమ్మల్ని బ్రేక్ ఫాస్టుకి తీసికెళ్ళి, ఓజర్ కి బయలుదేరాము.

    6. శ్రీ విఘ్నేశ్వరుడు : ఓఝర్.

    ఓఝర్ ఊరు కూడా " కూకడ్" నదీ తీరంలోనే ఉంది.ఇక్కడ సిద్ది, రిధ్ధిలతో, తెల్లటి పాలరాతి మూషికంతో దుండిరాజ్ విగ్రహంలో ఈ వినాయకుడుంటాడు. ఇక్కడ మామూలుగా ఉండే దుకాణాలతోపాటు, తాజా కురగాయల దుకాణాలు కూడా ఉంటాయి. ఇక్కడ భారిగా ఉత్సవాలు జరుగుతూంటాయి.ఇక్కడ దర్శనం పూర్తిచేసికుని , "మహడ్" బయలుదేరాము.

    7. శ్రీవరద వినాయకుడు : మహాడ్.

ఇక్కడి విగ్రహం నీటిలో దొరికిందట.ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏమిటంటే మనతో తీసికెళ్ళిన పూదండలు మనమే స్వయంగా వినాయకుడి విగ్రహానికి అలంకరించుకోవచ్చు.రద్దీ ఎక్కువగా ఉండడంతో దర్శనానికి చాలా సమయం పట్టింది. ఇక్కడే మధ్యాన్న భోజనం ఏర్పాటుచేశారు. 2 గంటలకు 8 వ వినాయకుడిని దర్శించుకోడానికి "పాలీ" బయలుదేరాము.

    8. బల్లాలేశ్వర్ వినాయకుడు : పాలీ.

    ఈ గ్రామం "కర్జత్" నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. భక్తుడైన బల్లాలేశ్వర్ ను కాపాడడానికి వినాయకుడు అక్కడే స్థిరపడిపోయి "బల్లాలేశ్వర్ గణపతి" గా అవతరించాడుట. ఈ దేవాలయం కరిగించిన సీసం, రాతి గోడలతో నిర్మించారుట.

    ఇక్కడి వినాయకుడిని కూడా దర్శించుకుని, తిరిగి రాత్రి 8 గంటలకు పూణె చేరాము.

   అష్టవినాయక ప్రాశస్త్యం గురించి ఇక్కడ చదవండి . ఈ టపాలో జోడించిన ఫొటోలు " గూగులమ్మ" సౌజన్యంతో...

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes