RSS

అష్టవినాయకులు to అయినవిల్లి వినాయకుడు--2014...


   దైవదర్శనం యోగం ఉంటే, ఆయనే తీసుకువెడతారు అంటారు..మాకు ఆ యోగం వచ్చిందనుకుంటా. అనుకోకుండా, మా చెల్లెలు, ప్యాకేజీ టూర్ లో తిరుమల వెడుతూన్నట్టు, ముందుగానే అన్నీ బుక్ చేసికున్నట్టూ ఫోనుచేసింది. మా శ్రీవారికి సప్తతి పుట్టినరోజు గిఫ్ట్ గా బాగుంటుందేమో, అని అనడం తరవాయి, వెంటనే బుకింగు చేసేశారు..ఇదంతా ఎప్పుడూ..12 వ తారీకున.. పుట్టినరోజు 15 , పిల్లలతో గడిపి, 17 న బయలుదేరేట్టుగా, అదేం చిత్రమో అన్నీ confirmed tickets కూడా దొరికాయి..పూణె నుండి, తిరుపతికి దొరక్కపోతే, వయా సికిందరాబాద్ తీసికుని, మొత్తానికి 18 వతేదీ రాత్రికి తిరుపతి చేరాము. అప్పటికే ట్రావెల్స్ వారి టాక్సీ రెడీగా ఉంది.
   19  వ తారీకుకి స్వామివారి దర్శనానికి 300 రూపాయల టిక్కెట్టు ముందుగానే, ట్రావెల్స్ వారు బుక్ చేయడంతో, ఆరోజు ఉదయమే 11 గంటలకి కొండమీదకు చేరాము. ముందుగా , మావారు తలనీలాలు సమర్పించి, స్నానం చేసి, వరాహనరసింహస్వామి దర్శనం చేసికుని, ఒంటిగంటకు క్యూలో నుంచుని, మూడు గంటలయేసరికి ఆ శ్రీవెంకటేశ్వరుని దర్శనం చేసికుని, తిరిగి వచ్చేటప్పుడు, కపిలేశ్వరస్వామి దర్శనం చేసికుని, తిరుచానూరులో అమ్మవారి దర్శనం, గోవిందరాజస్వామివారి దర్శనం చేసికుని, మొదటిరోజు కార్యక్రమం, సంతృప్తిగా పూర్తిచేశాము.
    ఇంక రెండోరోజు (20 వ తారీకు) ఉదయమే, 10.30 కి కాణిపాకం చేరుకుని, వినాయకుడి నిజరూప దర్శనం చేసికుని, అక్కడినుండి, వెల్లూరులోని, లక్ష్మీపురం చేరుకుని, అక్కడ 1500 రూపాయల టిక్కెట్టు కొనుక్కుని, అమ్మవారి సన్నిధిలో ఓ 40 నిముషాలు గడిపి, తరువాత అన్నప్రసాదం తీసికుని, తిరుగుప్రయాణంలో , శ్రీనివాసమంగాపురం దర్శించుకుని,సాయంత్రానికి  హొటల్ కి చేరాము.
    మూడో రోజు ( 21 వ తారీకు) ఉదయం 11 గంటలకి శ్రీకాళహస్తి చేరుకుని, చెరో 200 రూపాయల టిక్కెట్టు తీసికుని, ఏ క్యూలోనూ నుంచోకుండా, నేరుగా స్వామివారి సన్నిధికి చేరుకుని, ఓ పది నిముషాలు, స్వామివారి ఎదురుగా ధ్యానం చేసికునే అదృష్టం, అలాగే అమ్మవారి సన్నిధిలో ఓ అయిదు నిముషాలు నుంచునే భాగ్యం కూడా కలిగింది. తిరిగి బయలుదేరి, దారిలో "శరవణ భవన్ " లో  లంచ్ తీసికుని హొటల్ కి చేరాము. ఆరోజు సాయంత్రం,  నా స్నేహితురాలి ఇంటికి, వాళ్ళ అబ్బాయీ, కోడలూ వచ్చి తీసికెళ్ళారు. నేనూ, తనూ కలిసి 40 సంవత్సరాలయింది. అక్కడే డిన్నర్ తీసికుని, హొటల్ కి వచ్చేశాము.
 మాకు రాజమండ్రీ వెళ్ళే ట్రైను 22 న మధ్యాన్నం 12.30 కి. ఇంతలో, మా స్నేహితులు ఆనందలక్ష్మి, రవి, వచ్చి కలిశారు.
    18 రాత్రి స్టేషన్ కి వచ్చి హొటల్ కి ,  తీసుకునివెళ్ళి, 22 న తిరిగి స్టేషన్ లో దింపేదాకా, పూర్తిబాధ్యత, ట్రావెల్స్ వారే తీసికున్నారు.  మా ఇద్దరికీ ఒక టాక్సీ ఏర్పాటుచేసి, ఎటువంటి అసౌకర్యమూ లేకుండా, లక్షణమైన డ్రైవరు ను ఏర్పాటు చేయడంతో తిరుపతి యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసికుని, 22 రాత్రికి రాజమండ్రీ, చేరుకుని, మర్నాడు, మా అమ్మ, చెల్లెళ్ళతో గడపడానికి తణుకు చేరాను.
 24  న మండపాక ఎల్లారమ్మ దర్శనం చేసికున్నాను.ఆ మర్నాడు అంటే 25 న ప్రొద్దుటే, 10 గంటలకల్లా, మా వారూ, మరిదీ, తోటికోడలూ, రాజమండ్రీనుండి టాక్సీలో వచ్చి, కోనసీమ కు బయలుదేరాము.
    12.00 గంటలకి, అయినవిల్లి సిధ్ధివినాయకుడి
దర్శనమూ, ముక్తేశ్వరంలో క్షణముక్తేశ్వర
దర్శనమూ చేసికుని, అమలాపురంలో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామినీ,
భూపయ్య అగ్రహారంలో శ్రీరామచంద్రుడినీ
దర్శించి, పాశర్లపూడి లో మావారి స్నేహితుడి ఇంట్లో కాఫీ తాగి, తిరుగుప్రయాణంలో , పలివెల లో కొప్పులింగేశ్వరస్వామి
దర్శనం చేసికుని, రాజమండ్రీ చేరుకుని, రాత్రి 2.00 గంటలకి ట్రైను ఎక్కి, మర్నాడు అర్ధరాత్రి 1.00 గంటకి పూణే చేరుకున్నాము.
    మొదట్లో చెప్పినట్టుగా దైవదర్శనం జరగాలని, రాసిపెట్టుంటే , ఆ భగవంతుడే అన్నీ క్షణాల్లో ఏర్పాటు చేసేస్తాడు అన్నది మా విషయంలో జరిగింది.
 " అష్టవినాయక " దర్శనంతో ప్రారంభమైన  2014 వ సంవత్సరం, "అయినవిల్లి" వినాయకుడి దర్శనంతో ఎంతో సంతృప్తిగా  ముగిసింది.
    ఈ 2015 లో ఆ భగవంతుడు ఇంకా ఏమేమి వరాలిస్తాడో....
పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes