RSS

ఏమిటో తోచడం లేదు...

   మొత్తానికి ఈ ఏడాది ఊరగాయ( పెద్ద ఏమీ ఎక్కువేం కాదూ, ఆవకాయా, మాగాయా)ల ప్రకరణం పూర్తయింది.అమ్మాయికొక బాటిలూ, అబ్బాయికో బాటిలూ,మాకో బాటిలూ, ఏదో ఈ ఏడాదెళ్ళిపోతుంది. మధ్యలో అయిపోయినా, మదర్స్ డైరీ, ప్రియా ఎలాగూ ఉన్నాయి. అదేమిటో, ప్రతీ రోజూ ఊరగాయ లేకపోతే ముద్ద దిగదు మా శ్రీవారికి.పప్పులోకి ఏ రోజైనా వేసికోడానికి ఓ రోజు చుక్క కూరా, ఓ రోజు టమాటాలూ, ఏదీ లేకపోయినప్పుడు, మామిడికాయ ఒరుగులూ . మా పిల్లలకి కూడా ఈ ఒరుగులు వంట పట్టాయి లెండి.మా అబ్బాయి వాళ్ళింటికి వెళ్ళినప్పుడు, వాళ్ళ కుక్కు ఆ పప్పులో బీరకాయలో, పాలకూరో వేస్తూంటుంది, మా శ్రీవారికి అది తినడానికి చిరాకూ.

   మొన్న శనివారం నవ్యని వాళ్ళ అమ్మమ్మ,తాత గార్లవద్ద దిగబెట్టడానికి, అబ్బాయీ,కోడలూ, అగస్థ్యా కారులో హైదరాబాద్ వెళ్ళి వచ్చారు. వాళ్ళు తిరిగి వచ్చేదాకా టెన్షనే, కారులో వెళ్ళారూ, పిల్లలు అంతంతసేపు కారులో ఎలా కూర్చున్నారో అని. ఏమిటో చెబితే వినే రోజులా, హాయిగా కొద్దిరోజులు ముందుగా ప్లాన్ చేసేసికుని రైల్లో వెళ్ళి రావచ్చుకదా.అలాటివి మనం చెప్పకూడదూ, వాళ్ళు వినకూడదూ. రేపెప్పుడో వీళ్ళ పిల్లలూ పెద్దాళ్ళయిన తరువాత తెలుస్తాయి, ఎంత టెన్షన్ గా ఉంటుందో? అదే జీవిత చక్రం అంటే, మనం మాత్రం మన పెద్దాళ్ళు చెప్పినప్పుడు విన్నామా ఏమిటీ? అందుకే అంటారు 'తనదాకా వస్తేనే కానీ...' అని.

   బ్లాగులు వ్రాస్తూంటాడే శ్రీనివాసు , అతని తల్లితండ్రులు వచ్చారు ఈ మధ్యన, మమ్మల్ని కలవాలని ఉందంటే, ఎలాగూ మా స్వంత ఫ్లాట్ చూసినట్లుంటుందని, అక్కడికే తీసికుని రమ్మన్నాము. ఏం లేదూ, వాళ్ళు మా తణుకు వాళ్ళు, ఇదో కారణం లెండి, మేము నలుగురం కలసి, ఒక్కసారైనా మా శ్రీవారిని ( తూ.గో.జి) ఏడిపించొచ్చూ అని! మరీ శ్రీనివాసు తండ్రిగారు మొహమ్మాటస్థులూ, పోన్లెండి పెద్దవారు, మరీ నలుగురం కలిసి ఆయనని కష్టపెట్టడం భావ్యం కాదూ అనేసరికి పోన్లే అని వదిలేశాము!ఆయన చాలా కాలం తణుకు లో పనిచేశారుట, మా నాన్నగారిని చూసిన గుర్తుందీ, అయినా ఓసారి ఫొటో చూపించండీ, అన్నారు కదా, మా నాన్నగారి ఫొటో, తొందరగా దొరకలేదని, మా అమ్మాయి పెళ్ళి ఆల్బం తెచ్చాను. వాళ్ళది ఎలాగు తీశానుకదా అని మా అబ్బాయి పెళ్ళి ఆల్బం కూడా చూపించాను. వాళ్ళు చూస్తున్నంతసేపూ, మా శ్రీవారూ, శ్రీనివాసూ ఒకటే నవ్వూ. ఏం లేదులెండి, మా శ్రీవారు అప్పుడెప్పుడో ఓ టపా పెట్టారు, ఎవరింటికైనా వెళ్ళినప్పుడు పడే ఆల్బం బాధల గురించి. అందుకే అంటాను, అందరూ మనంత మంచివాళ్ళు కాదూ, ఛాన్సొస్తే వదలరూ అని. చూశారా ఏదో ఒంటరివారైపోయారని, మన ప.గో.జి వారు ఆయన్ని ఏడిపించకుండా వదిలామని విశ్వాసమైనా లేకుండా, ఏదో ఆ వచ్చినవారు, అభిమానంతో పిల్లల ఆల్బమ్ములు చూస్తూంటే నవ్వులూ వేళాకోళాలూనూ.ఏం చేసినా బాగుపడరు.

   ఈవేళ ప్రొద్దుటే, మా అమ్మాయికివ్వడానికి మాగాయా,మామిడి ఒరుగులూ ఇచ్చి పంపించాను.ఎప్పుడో కానీ, మా అమ్మాయి దగ్గరకు ఆయనొక్కరే వెళ్తూంటారు,బస్సులో వెళ్ళొచ్చని. మళ్ళీ నన్నైతే ఆటోలో తీసికెళ్ళాలని.ఎక్కువ పనేమీ లేదుకదా, ఒకసారి ఫ్లోరింగూ, మిగిలినవీ అన్నీ శుభ్రపరుద్దామని, కిరసనాయిల్లో ఓ గుడ్డ ముంచి, క్లీనింగు మొదలెట్టాను. ఇల్లంతా ఆ కిరసనాయిలు వాసనే. బయటకి కూడా వస్తోందిట. ఆవిడెవరో, ఏమనుకుందో ఏమో, ఏ బ్రైడ్ బర్నింగో ఏదో జరుగుతోందనుకుందో ఏమిటో ఖర్మ, వచ్చేసి ఇంట్లోంచి కిరసనాయిలు వాసనేస్తుందేమిటీ అంటూ పంచనామా మొదలెట్టింది. ఏం లేదు తల్లీ ఏదో ఇల్లంతా క్లీనింగు చేసికుంటున్నానూ అని, కిరసనాయిలు గుడ్డ చూపించాను!

   అప్పుడనిపించింది, ఇరుగుపొరుగు వాళ్ళకి ఈమాత్రం awareness ఉండుంటే, ఎన్నెన్ని బలవంతపు చావులు తప్పేవో కదా అని!

గొణుక్కోవడం...

   అమ్మయ్య! నా టపాకి ఒక్కరూ కామెంటు పెట్టలేదూ, బతికిపోయాను. లేకపోతే నేను తన శైలి లో రాయడం జనాలు బాగుందనడంతో మా శ్రీవారికి కాస్తంత ... వద్దులెండి. మళ్ళి అవసరమయితే హెల్పు చేయరు.అయినా నా పద్దతిలో రాసుకొక తన పద్దతిలో రాయడం ఏమిటట? ఎరువు సొమ్ము దిగేసుకున్నట్లు? నా పద్దతిలో నేను రాసుకుంటాను. ఎవరు చదివితే ఏమిటట? చదవకపోతే ఏంటట? నా టపా నా యిష్టం అవునంటారా, కాదా?అయినా మొదట బార్యకి వినోదం, తరువాత భర్తకి వినోదం, ఆ తరువాత వీరిద్దరిని చూసి ఊళ్ళో వాళ్ళకి వినోదమట. అలా వుంది మా పరిస్థితి. నా మాట ఆయన వినరు, తన మాట నేను వినను.కాని మా యిద్దరిమాటలు ( తగాదాలే అనుకోండి) మిగిలిన వారికి ఆనందంగా వున్నాయంటే సంతోషంగానే వుంది.ఇంతకీ చెప్పోచ్చేదేమిటంటే మొన్ననే నేను ఆంధ్రా వెళ్ళోచ్చాను కదా ! ఇప్పుడు తను కూడా వెళ్ళాలే, అదే మరి వంతంటే,వంతుల వీరయ్య అనుకోండీ, పైగా నా కోసమని టిక్కెట్టు కి ట్రై చేశారట, దొరకలేదట.పెద్ద గొంతుక తో శ్రీనివాసుకి ఫోనులో చెప్పటం,నేను నమ్మాలన్న మాట.ఇంక మా పిల్లలు వాళ్ళ డాడి కి ప్రయాణపు జాగర్తలు చెప్పటం,ఎండలు కదా మరి, అందుకని,మొన్న నేను వెళ్ళినపుడు ఎండల్లొ కాక మలయమారుతం లో వెళ్లినట్లు, అయినా దేనికయినా పెట్టి పుట్టాలండి బాబూ,తన కెప్పుడూ రాజ యోగమేనూ,....

   ఏవో కొద్దిగా మాగాయకి మామిడికాయలు తెచ్చారు,తరిగి పోశాను. శ్రీవారు ఊరునుండి వచ్చిన తరువాత ఆవకాయకి కాయలు తెస్తారట.కారం, ఆవపిండి తెచ్చుకోవాలి కదా!నాకు కుదరలెదు, తేలేకపోయాను.అయినా మనం తెఛ్ఛేస్తే తనని అనేందుకు( ఆడిపోసుకొందుకు) అవకాశం వుండదు కదా!ఏ మంటారు? కాళ్ళు విరగకొడతారు, నాకు తెలుసు ఆందరూ ఆయన ఆప్తులు, అభిమానులని. అయినా ఎంత పెద్ద కందయినా కత్తి పీటకి.........లోకువేట !

నేనూ చేసికున్నాను ఇన్నాళ్ళకి ఓ నోము...

   ఇంతదూరం వచ్చి, మా ఎల్లారమ్మతల్లి దర్శనం చేసికోకుండా ఎలా ఉంటాను? రెండో రోజు ఆ కార్యక్రమం పెట్టుకున్నాను. నన్ను బయటకి రావద్దని, మా చెల్లెలు, తనే రానూపోనూ,ఓ ఆటో మాట్లాడేసింది. నన్నూ, నా వేషాన్నీ చూస్తే డబ్బులు ఎక్కువ అడుగుతారనీట,అదేం చిత్రమమ్మా? నిజమేకాబోసనిపించింది, మేము రాజమండ్రీలో ఉన్నప్పుడు కూడా, నేనెప్పుడైనా, ఆటో మాట్లాడితే మామూలుగా తీసికునేదానికంటే ఎక్కువే అడిగేవారు!అదేదో 'సంతూర్'యాడ్ అనుకోకండి, ఏదో ఉన్నదేదో చెప్పాను!మా శ్రీవారు చెప్పేశారు, ప్రతీదానికీ, నువ్వు ముందరకి రాకూ అని!ఇలాటివి వింటూంటే బావుంటుంది కదూ !

    అక్కడ పూజచేయించుకుని,మా టెండర్ లీవ్స్ గురించి ప్రార్ధించేసికుని, తిరిగివచ్చేశాము. ప్రతీ ఏడాదీ ఫిబ్రవరి 28 న పూజ చేయించి, ప్రసాదం పంపమని డబ్బు కట్టాము రెండేళ్ళ క్రితం. మాకు ఆ ప్రసాదం వచ్చిన సూచనలేమీ కనిపించకపోవడంతో, అక్కడ అడిగితే, లెడ్జరు చెక్ చేసి, పంపుతున్నట్లు చెప్పారు. పూజచేయించడంవరకూ మన బాధ్యత, తరువాతి పాపం పుణ్యం వాళ్ళకే చెందుతుంది.

   అక్కడ ఎండలు చూసి హడలెత్తిపోయాను. మర్నాడేమో, 'గ్రామకుంకం నోము' చేసికుని, అయిదు వీధుల్లో,గడపదాటకుండా, గడప వదలకుండా, పసుపూకుంకాలు పంచిపెట్టుకోవాలిట! అసలు ఈ ఎండలో వెళ్ళకలనో లేక ఏ స్కార్ఫూ,కూలింగ్ గ్లాసులు పెట్టుకుని వెళ్ళాలేమో అని భయపడిపోయాను! పైగా పూజ చేసికుని, పసుపుకుంకాలు పంచిబెట్టేదాకా ఏక్ దం సైలెన్స్! ఎవరితోనూ మాట్లాడకూడదు. అందుకే ఆ ముందురోజే మా శ్రీవారికి చెప్పేశాను ఫోన్లూ వగైరా చేయొద్దని.పుజయింతరువాత నేనే చేస్తానని.సుఖపడ్డారు ఓ కాల్ డబ్బులు మిగిలాయి!

   ఓ సైకిలు రిక్షాలో మా ముగ్గురివీ ( నాదీ, నా చెల్లెలుదీ,మరదలుదీ) పసుపూ కుంకాల క్యాన్లూ,అరటిపళ్ళ గెలలూ వేసికుని ఊరేగింపుగా బయలుదేరాము కాలనీ లోకి! మా గురించి చెప్పడానికి మా ఇంకో చెల్లెలూ, మా తమ్ముడికూతురూ ముందర వెళ్ళడం.ప్రతీ ఇంటికి వెళ్ళి తలుపుకొట్టి, 'మూడు పళ్ళేలు ఇవ్వండీ' అని అడగడం, ఆ ఇంటివాళ్ళు తెచ్చిన పళ్ళాల్లో, మేము ముగ్గురం ఒకరితరువాత ఒకళ్ళు,గడప దాటకుండా, రెండరిటిపళ్ళూ, దక్షిణా, గరిటెతో తీసి పసుపూ కుంకం పెట్టడం, ఇంకో గడపకెళ్ళడం. ఓ మాటలేదు, మంతిలేదు.ఏమిటో ఈ వ్రతాలూ నోములూనూ! మెము రాజమండ్రీలోనే ఉండేటట్టయితే, మా అమ్మా, చెల్లెళ్ళూ నాచేత ప్రపంచంలో ఉన్న వ్రతాలూ నోములూ చేయించేసేవారు.మరి అక్కడినుండి వచ్చేయడం దురదృష్టం అనుకోనా, లేక ఘటన లేదనుకోనా? అవకాశం వచ్చిందీ, చేసికున్నాను. మిగిలినవన్నీ ఆ 'అమ్మ' కే వదిలేశాను.

   ఆ పసుపుకుంకాలు ఇవ్వడం బలేగా ఉంది. మావాళ్ళు వెళ్ళడం, కొన్ని చోట్ల, మగాళ్ళే తలుపు తీసి,గడపకి బొట్టుపెట్టేసి వెళ్ళండమ్మా అనడం. అబ్బా అలా ఎలా వీలౌతుందీ?ఆవిడకు రావడానికి వీలవకపొతే, ఇంటాయనైనా పళ్ళెం పుచ్చుకు రావల్సిందే. మా చెల్లెలా వదిలేది? అకస్మాత్తుగా వెళ్ళి మూడు పళ్ళేలు ఇవ్వండీ అంటే, వాళ్ళిళ్ళల్లో ఉండొద్దూ? కొందరు టిఫిన్ ప్లేట్లూ, కొందరు పులిహారకలుపుకునే పళ్ళాలూ! ఎవరికి వీలయినవి వాళ్ళు తెచ్చారు. మొత్తానికి ఆ కార్యక్రమం పూర్తిచేసికుని ఇంటికి చేరాము. అమ్మయ్యా మొత్తానికి నేనూ చేసికున్నాను జీవితంలో రెండో నోము!మొదటిది శ్రావణ మంగళగౌరీ నోమూ, ఇదిగో ఇప్పుడు ఈ గ్రామకుంకం నోమూ.

   మర్నాడు శుక్రవారం, మా మరదలు 'సంపద శుక్రవారం నోము' చేసికుంది. ఆరోజు అయిదుగురు ముత్తైదువలకి,విందు చేసి, ఓ వెండి కుంకం భరిణ, ఓ చీరా బ్లౌజు పీసూ పెట్టుకోవాలిట.నేనూ, మా ఇద్దరు చెల్లెళ్ళూ( ఇంకో చెల్లెలు రాలేకపోయింది), వాళ్ళ అమ్మగారూ,పెద్దమ్మగారూ, మొత్తం అయిదుగురూ విందు భోజనం చేశాము. ఓ వంటావిణ్ణి కుదిర్చి, షడ్రసోపెతంగా విందు చేసింది. అయ్యో మా శ్రీవారు రాలేకపోయారే, ఎంతలా ఎంజాయ్ చేసేవారో అనుకున్నాను!
దేనికైనా 'దంతసిరి' అనేదుండాలిలెండి!

   మా మరదలు వయస్సులో చిన్నదైనా, ఎన్నో రకాల నోములు శ్రధ్ధగా చేసికోవడం చూసి ముచ్చటేసింది.మర్నాడు శనివారం మళ్ళీ కేసినేని ట్రావెల్స్ లో ఎక్కి ఆదివారం ప్రొద్దుటే హైదరాబాద్ చేరి, ఆరోజంతా, మా చెల్లెలుతో గడిపి, మళ్ళీ కెసినేని ట్రావెల్స్ లో పూణె క్షేమంగా చేరాను. మళ్ళీ ఇల్లూ, శ్రీవారూ, పిల్లలూ, ఎక్కడ తిరిగినా ఏం చేసినా అన్ని రోజులు వీళ్ళందరినీ మిస్సయి, తిరిగి వాళ్ళందరినీ చూడ్డంలోఉండే ఆనందం వేరూ !

పుట్టింటికి పంపించేశారు...

   ఇన్నాళ్ళకి నన్ను ఒక్కత్తినీ పుట్టింటికి పంపించారండి మా శ్రీవారు! ఇద్దరు పిల్లలూ, ఇద్దరు మనవరాళ్ళూ, ఇద్దరు మనవలూ వచ్చిన తరువాత ఇదేం అఘాయిత్యం అనుకోకండి!మా మరదలు మంగళూరులో ఉంటోంది లెండి, తను ఏవో వ్రతాలూ,పూజలూ చేసికొందామని, అత్తారింటికి ( మా అమ్మగారి వద్దకు) వచ్చింది.ఆడపడుచులందరూ కూడా ఉంటే బావుంటుందని,మా అమ్మగారు ఫోను చేస్తే, ఏదో పేద్ద ఉపకారం చేస్తున్నట్లు టిక్కెట్లకోసం ప్రయత్నించారు.అంత తక్కువ టైములో ఎలాగూ దొరకవూ, ఈ వంక పెట్టి పంపించఖ్ఖర్లేదూ అనుకుని పాపం. ఆయన అనుకున్నట్లుగానే టిక్కెట్లు దొరకలేదు. రైళ్ళలో అన్నీ వెయిటింగు లిస్టులే.అమ్మయ్యా అని ఊపిరిపీల్చుకునే లోపల, మా కోడలు ఆన్లైన్ లోబస్సులకోసం వెదికింది.దొరికేశాయి!

   పూణె నుండి, హైదరాబాద్ దాకా, శతాబ్దిలో చేయించింది,అదే రోజున వాళ్ళ అమ్మగారూ, నాన్నగారూ ఎలాగూ అదే ట్రైనులో వెళ్తున్నారుకదా అని. సాయంత్రం 5.30 కి ఆడుతూ పాడుతూ చేరింది. కాఫీ త్రాగేసి,బస్సుకోసం ఖైరతాబాద్ వెళ్ళి,అక్కడ ఆ ట్రావెల్స్ వాళ్ళు, ఏదో కిడ్నాప్ చేసేవాళ్ళలాగ ఓ మినీ బస్సులో కుదేసి, ఇంకెక్కడికో తీసికెళ్ళి కాకినాడ వెళ్ళే బస్సులో కూర్చోపెట్టారు.అదో స్లీపర్ బస్సూ.బాగానే ఉందనుకోండి.కానీ, మార్గంలో ఏసీ పనిచేయడం మానెసింది.టాప్ మీదుండే డోర్ తెరిచేయడం వలన చల్లగాలి వేయడంతో ప్రయాణం బాగానే ఉంది.

   తణుకు లో మా ఇంటి దగ్గరే ఉన్న 'బెల్లం మార్కెట్' దగ్గర దింపేయమనడంతో, తెల్లవారుఝాము 4.30 కి అక్కడ దిగాను.అటు నడకకి ఎక్కువా, రిక్షాకి తక్కువా అన్నట్లుంది. అయినా ఆ సమయంలో అక్కడ రిక్షాలెక్కడ దొరుకుతాయి?హైవే మీద ఝూమ్మని వెళ్ళే ట్రక్కులూ,బస్సులూ ఓవైపూ, ఇంకోవైపు భౌభౌ మని మొరుగుతున్న కుక్కలూ, మధ్యలో నేనూ ! ఓ చేత్తో సూట్ కేసు డ్రాగ్ చేస్తూ, భుజానికి బ్యాగ్గు తగిలించుకుని, అలోలక్ష్మణా అనుకుంటూ నా పాదయాత్ర ప్రారంభించాను. ఆ క్షణంలో అనుకున్నానులెండి, ఆయనకూడా ఉంటే ఎంత బాగుండేది, ఆ బ్యాగ్గైనా తగిలించుకునేవారూ అని! ఒపిక ఉన్నన్నాళ్ళూ ఎప్పుడూ అవకాశమే రాలేదు ఒక్కర్తినీ ప్రయాణం చేయడానికి, తీరా వచ్చేసరికేమో ఉన్న ఓపిక కాస్తా హుళక్కయిపోయింది.ఆపసోపాలు పడుతూ బయలుదేరేసరికి, మా చెల్లెలు కనిపించింది అమ్మయ్యా అనుకున్నాను.ఆ బ్యాగ్గు కాస్తా చెరోవైపూ పట్టుకుని, ఇంటికి చేరాము.

   వెళ్ళి కూర్చున్నానో లేదో,శ్రీవారి దగ్గరనుండి ఫోనూ-'ఆంధ్రభూమి ఆదివారం పేపర్లో తను వ్రాసిన వ్యాసం వచ్చిందీ అని.పోనీ మా శ్రీవారి ఘనకార్యం అందరితోనూ చెప్పుకోవచ్చు అని, ఆ పేపరుకోసం, ఊళ్ళోకి బయలుదేరాను. ఆంధ్రభూమి,ఏరోజుదారోజే దిక్కులేదు, ముందురోజుదెక్కడదొరుకుతుందీ? ఆంధ్రభూమి ఇక్కడెవరూ తెప్పించుకోరండి అనేవాడొకడూ.ఆఖరికి నిన్నటి రద్దీలో దొరికినా డబ్బిచ్చి తీసికుంటానూ అన్నా దొరకలేదు. ఇవన్నీ ఆయనకి చెప్పి ఆయన ఫీలింగ్స్ హర్ట్ చేయడం ఎందుకూ అని చెప్పలేదు.

   ఎలాగూ బజారులోకి వచ్చానుకదా అని,పిల్లలందరూ తింటారని ఐస్క్రీం ఫ్యామిలీ ప్యాక్కొకటి తీసికున్నాను. ఇంటికి వచ్చి, మా అమ్మాయి వాళ్ళ పిన్నులకి,అమ్మమ్మకీ, అత్తకీ ఇచ్చిన బ్యాగ్గులూ, మా కోడలు తన పిన్నత్తగార్లకి ఇచ్చిన గిఫ్టులూ పంచేశాను. మా మేనల్లుడు, చిన్నవాడు కదా అని, ఓ వాచ్చీ, తినే సరుకులూ ఇచ్చాను.వాటిదారిన వాటిని తీసికుని, మా అక్కకేదేదో ఇచ్చావూ, నాకేమీ లేదూ అని అల్లరి పెట్టేస్తే, వాణ్ణి ఊరుకోపెట్టడానికి,సర్లెనాయనా బజారుకెళ్ళి నీక్కావలిసినదేదో తెస్తానూ, అన్న పాపానికి నన్నుకూర్చోనిస్తేనా ప్రతీ అరగంటకీ 'అత్తా బజారెప్పుడు వెళ్తున్నావూ' అని ఒకటే గోల! మొత్తానికి అయిదున్నరకి మళ్ళీ బజారుకి వెళ్ళి వాడికోసమే ప్రత్యేకంగా ఓ స్క్రాబుల్ బోర్డూ, ఏరొప్లెన్ విత్ రిమోట్ తెచ్చి ఇచ్చాను. మొదటి రోజు అలా పూర్తయిందండి.

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes