RSS

అలాటి రోజులు మళ్ళీ వస్తాయంటారా....

   మేము రాజమండ్రీ లో ఏణ్ణర్ధం, అదీ గోదావరి గట్టుమీద ఎపార్ట్మెంటు అద్దెకు తీసికుని మరీ ఉన్నాము. గోదావరి ఘాట్లకు వెళ్ళి, ఏదో దోశిట్లో నీళ్ళు తీసికుని,నెత్తిమీద చల్లుకోడం తప్పించి, స్నానం చేసే ధైర్యం ఎప్పుడూ చేయలేకపోయాము. మా శ్రీవారికి నీళ్ళంటే, భయం మూలాన స్నానం చేయలేదనుకోవచ్చు కానీ, నదీస్నాలంటే ఎంతో ఇష్టం ఉన్న నేను కూడా స్నానం చేయలేదంటే కారణం-ఒడ్డున పేరుకుపోయిన, చెత్తా చెదారం చూసి భయపడి పోవడమే!
స్నానం చేస్తే, ఏం రోగం పట్టుకుంటుందో అనే భయం! మన నదీ పరివాహక ప్రాంతాలు, అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాయి. ఊళ్ళో ఉన్న చెత్తా చెదారం, ఏ పట్టింపూ లేకుండా, గోదావరిలోకి వదిలేయడమే.పేపర్లలో మాత్రం, మన నాయకులందరూ,పర్యావరణం రక్షించవలసిన బాధ్యత అందరిదీ అని లెక్చర్లు ఇస్తూంటారు.ఏ ఒక్కరికి పట్టినా ఇలా ఉండేది కాదు. చట్టాలదారి చట్టాలదే.

   ఈ సందర్భం లో, నా చిన్నప్పుడు, మా అమ్మమ్మ తెల్లవారుఝామునే, లేచి మా ఇంటికి వెనక్కాల ప్రవహించే 'కాలవ' కి కాలవ అంటే ఒప్పుకోరు మా తణుకు వాళ్ళు,గోస్థనీ నది అనాలి.ఏదో ఒకటి, పేరులో ఏముందిలెండి,అక్కడికి వెళ్ళి,నదిలో దిగి స్నానం చేసి ఓ పెద్ద గుండ్రటి ఇత్తడి బిందె తో నీళ్లు మడిగా తెచ్చి మా తాత గారి సంధ్యావందనం సమయానికి తయారుగా వుంచేది, అంటే సూర్యోదయానికి ముందరే తెచ్చేసెదన్నమాట. ఏ కాలమైనా సరే! ఒండ్రు మట్టి ఒంటికి రాసుకొని పచ్చి పసుపు కొమ్ము అరగదీసి మొహానికి రాసుకొని లేకపొతే యింత పసుపు రాసుకొని నిత్యం కాలవ స్నానం వలనో ఏమో మరి తెలీదు చివరి వరకూ కూడా జుట్టు పూర్తిగా తెల్లబడకుండా నల్ల జుట్టు వుంది. బహుశా ఆ ఒండ్రు మట్టి యిప్పటి ముల్తాని మట్టి లా పని చేసేదనుకుంటాను.సాయంత్రానికి కొబ్బరికాయలు ఆడించిన స్వచ్చమైన కొబ్బరి నూనె తలకి పట్టించి నున్నగా దువ్వుకొని వేలు ముడి వేసేసుకొనేది. కాళ్ళకి కూడా నూనె మర్ధనా చేసుకొని, అరికాళ్ళకి రాసుకునేది.చెప్పులు వాడకం తక్కువే ఆ రోజ్జుల్లొ అయినా కాళ్ళ పగుళ్లు అవీ వుండేవికావు.దోసకాయలు పచ్చడి కోసం తరిగినా, టమాటాలు తరిగినా, పుచ్చకాయలు కోసినా,ఆ తొక్కలతో చేతులకి మొహానికి రాసుకునే వారు,ఎవరికయినా బత్తాయి రసం తీస్తే ఆ పిప్పి రాసుకునేవారు, బహుశా యిప్పటి ఫ్రూట్ ఫేషియల్ లాంటిదే అనుకుంటాను, ఇంక ఆదివారం వచ్చిదంటే మా పిల్లలందరికి ఇంత నూనె రాసి సున్నిపిండితో నలుగు పెట్టి, మందార ఆకులు కుంకుడు కాయల రసంతో తలరుద్ది సాంబ్రాణి పొగ వేస్తే స్వర్గానికి బెత్తెడు దూరంలో వున్నామా అన్నంత హాయిగా వుండేది, సాంబ్రాణి వాసన తలవెంట్రుకల్కి పట్టి సువాసన వస్తూ వుండేది.ఇవి అన్ని ఏ తాళపత్ర గ్రంధా లలొ చదివారో తెలీదు. ( వాళ్ళింట్లొ తాళపత్ర గ్రంధాలు వుండేవి లెండి అప్పట్లో) నిజానికి యిప్పుడున్న స్పా బాత్ లు అవీ వీటిముందు ఎందుకూ పనికిరావనుకుంటాను.

   అన్నట్లు చెప్పడం మరిచిపోయాను, ఓ సారి యిలాగే స్నానికి వెళ్ళి, ముందుగా ఇత్తడిబిందె తోమేసి, గట్టుమీద పెట్టుకుని, నీళ్ళల్లోకి దిగింది,స్నానం చేద్దామని. ఆ నదీ ప్రవాహానికీ, వడికీ తట్టుకోలేక,కొట్టుకుపోయింది. చేతికి అందిన ఓ పుల్ల పట్టుకుని,ఆ ప్రవాహంలో కొట్టుకుపోతూండగా, ఆ పై రేవులో ఎవరో చూసి, అరే మన సుందరం అక్కయ్యర్రా అంటూ, రక్షించి గట్టుమీదకు తెచ్చారు. అదృష్టంకొద్దీ మా అమ్మమ్మగారి పుట్టింటి వారి ఇల్లు,ఆ గట్టుకి దగ్గరలోనే ఉంది.ఈవిడకి స్పృహ వచ్చిన తరువాత, ఈ హడావిడంతా చూసి, 'అయ్యో అయ్యో మన రేవులో గట్టుమీద ఇత్తడిబిందె పెట్టానే, ముందర ఉందో ,ఎవడైనా ఎత్తుకు చక్కాపోయాడో చూడండే' అంటూ ఒకటే గోలట!

   ప్రొద్దుటే స్నానాలు చేయడం, బిందెతో మడినీళ్ళు తీసికోవడం, పదైయ్యేసరికి గుడ్డలుతుక్కోవడం, కొద్ది దూరంలో పశువుల్ని కడగడం,అయినా సరే, ఆ నదిలోని నీళ్ళు స్వచ్చంగానే ఉండేవి. ఎప్పుడు చూసినా ప్రవహిస్తూనే ఉండేది.కొత్తనీళ్ళొచ్చినప్పుడు,ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు బలైపోయేవారు. దాంట్లో అంటూ మునిగిపోతే, మళ్ళీ పెరవలి లాకుల దగ్గరే తేలడం!!

   అటువంటి రోజులు వచ్చి, మన పవిత్ర నదీజలాల్లో స్నానాలు చేసే అవకాశం ఉంటుందంటారా?

మిగిలినవి జ్ఞాపకాలే

   'మా'టి.వీ. లో ప్రతీరోజూ ఉదయం 8.30 నుండి ప్రసారం అయే 'అర్ధనారీశ్వర స్తోత్రం/తత్వం' మీద శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి, అద్భుతమైన వ్యాఖ్యానాలు అందరూ వింటూన్నారనే అనుకుంటాను. ఎవరైనా ఇప్పటివరకూ చూడకపోతే, ఒక్కసారి చూడండి.దంపతుల అన్యోన్యత అంటే ఏమిటో అర్ధం అవుతుంది.ఆయన చెప్పే ప్రవచనాలు వింటూంటే, ఎప్పుడో చిన్నతనం లో జరిగినవెన్నో జ్ఞాపకం వస్తాయి.ఆరోజుల్లో అమ్మ అలాగే ఎందుకుచేసేదో,అప్పుడు తెలిసేదికాదు.ఇప్పుడు శ్రీ చాగంటి వారు చెప్పే ప్రవచనాలవలన, వాటిలో అంతరార్ధం తెలుస్తోంది.

   ఈవేళ్టి కార్యక్రమం లో, భార్య భోజనం వడ్డించినప్పుడు నాన్నగారికే ముందుగా వడ్డించేదో, మా అమ్మమ్మ తాతయ్య తిన్న ఆకులోనే ఎందుకు తినేవారో తెలుస్తోంది. ఆ రోజులే వేరు. నా చిన్నతనంలో మా యింట్లో సాయంత్రం భోజనాలకి అందరం కలసే తినేవాళ్ళం. పగలయితే కుదిరేదికాదు. పిల్లలు ఎలిమెంటరీ స్కూల్, అమ్మ ఎలిమెంటరి స్కూల్ టీచరు. నాన్నగారు హైస్కూల్ టీచరు. నేను పెద్దదాన్ని కనక పొద్దునే 9 గంటలకి నాన్న గారికి అన్నంపెట్టే పని నాకప్పగించేది. రోజూ చేసేపనయినా సరే! రోజూ-- ఎలా పెట్టాలో చెప్పి వెళ్ళేది.అయినా ఓ రోజు మంచినీళ్లు మరచిపోయి, ఇంకో రోజు పచ్చడి మరచిపోయి చివాట్లు తినేదాన్ని.మా నాన్నగారు ఏమీ అనేవారు కాదు కాని మా అమ్మ మాత్రం శలవు రోజుల్లో సాయంత్రం భోజానాల సమయంలో మాకు నేర్పేది. అన్నాలకి ముందు మాచెల్లి కంచాలు పెట్టడం, మంచినీళ్ళు పెట్టడం , ఆ తరువాత మా అమ్మ ఆన్నం వడ్డీంచేది. అప్పుడే లోకాభిరామాయాణం,ఏవో కబుర్లు బాగానే వుండేవి కాని హోమ్ వర్కు, పరీక్షలు, మార్కులు విషయాలు మాత్రం నచ్చేదికాదు. భగవంతుడా! ఈ ప్రసంగం రాకుండా చూడూ తండ్రీ! అనుకునేవాళ్ళం,అన్నాలు తినడం అయిన తరువాత ఎంగిలి కంచాలు తీయడం, నీళ్లగ్లాసులు కడగడం నా పని. వంటిల్లు కడుక్కోవడం పొయ్యి శుభ్రపరచుకోవడం,ముగ్గు వేసుకోవడం అమ్మ పని. ఆ తరువాత నేను కొంచెం పెద్దదాన్ని అయిన తరువాత అమ్మ పని నేను నాపని మా చెల్లెలు,అలా అంచలంచలుగా మారుతూ వచ్చింది.అలాంటి వాతావరణంలో పెరిగిన నాకు పెళ్ళయిన తరువాత కూడా మా యింట్లోఅలాగే వుండేది. శలవు రోజుల్లో, సాయంత్రాలు,మాత్రమే కుదిరేది. అన్నం తిన్న తరువాత ఎవరి కంచాలు వాళ్ళు వాష్ బేసిన్ లో వేయడమనే అలవాటు చేసాను.ఆదివారాలు స్పెషలుగా పదార్ధాలు చేసుకొని అందరం కిందకూర్చుని అరటి ఆకులలో తినేవాళ్ళం. ఆ రోజులు ఎంత ఆనందంగా వుండేదో చెప్పలేను.

   ఇక యిప్పుడంటరా అదీ చెప్పలేకపోతున్నాము.ఎవరికి సమయమే వుండటం లేదు, ఆదివారాలు ఆలస్యంగా లేవడాలు,పనులు ఆలస్యం, అందరిదీ తలో రకం బ్రేక్ ఫాస్టు తో మొదలవుతుంది, అదీ 10 గంటలకో 11 గంటలకో,ఇంక అందరూ కలిసి భోజనం చేసే అవకాశం ఎక్కడా?పోనీ ముందుగా నిశ్చయించుకుని కూర్చుందామా అంటే, అంతట్లోకే ఇంటికి ఎవరో రావడం, ఆదరా బాదరాగా ఏదో అయిందనిపించేయడం.ఇదివరకటి రోజుల్లో అంటే, పిల్లలు మన చేతుల్లో ఉన్నంతకాలం, ఏదో నెలకొసారైనా వీలు పడేది. తరువాత్తరువాత, ఇంట్లొకి చిన్న పిల్లలు రావడంతో, ఆ బాబునో, పాపనో చూడ్డానికి ఎవరో ఒకరు భోజనం అందరికంటే ముందుగానో, చివరలోనో చేయవలసిన పరిస్థితీ !

   పోనీ ఇదివరకటి రోజుల్లోలాగ పనసపొట్టు కూరా, కందా బచ్చలి కూరలా అంటే అవీ లేవూ!ఎక్కడ చూసినా నూనెక్కువయిందీ, ఫిగరు మైంటైన్ చేయడం,కాలొరీలూ ధర్మమా అని, సలాడ్లూ,రైతాలూ ఇవీ !పోనీ వాటినైనా ఓ టేబుల్ చుట్టూరా కూర్చుని తింటారా అంటే అదీ లేదు. టి.వీ. లో కార్యక్రమాలు మిస్ అవకూడదని డ్రాయింగు రూం లో సోఫాలమీద చతికిలబడి తినడం. చేసిన పదార్ధాలన్నీ టేబుల్ మీద పెట్టేయడం, ఎవరిక్కావలిసినవి వాళ్ళే తీసికోడం, దీనితో వడ్డించడమనే కాన్సెప్టు కొండెక్కేసింది.

   ఇంక మిగిలిందేమిటయ్యా అంటే, ప్రవచనాలు విని, చిన్నప్పటి జ్ఞాపకాలు నెమరువేసికుని ఆనందించడమే !

కొత్త వ్యసనం

   ఇదివరకటి రోజుల్లో, పేకాటా,త్రాగుడు, నల్లమందూ వ్యసనాలనేవారు. అవి అలాగే ఉన్నాయి, కానీ ఈ ఆధునిక కాలం లో వాటికి మరోటి జత కలిసింది. అదేమిటో కనిపెట్టేశారనుకుంటాను. అదేనండి బ్లాగింగు !ఇదెక్కడి వ్యసనం అండి బాబూ? ఇదివరకైతే ఏ విషయం విన్నా, ఏ పేపరులోనో చదివినా, దాన్ని ఇంకోళ్ళకి చెప్పేదాకా ఊరుకునేవారు కాదు. వాటికి ముందుగా బలైపోయారెవరయ్యా అంటే, ఇంట్లో పెళ్ళాం పిల్లలు! ఏదో ఉద్యోగాల్లో ఉండేవారు కాబట్టి, ఆఫీసుల్లో అందరూ కాకపోయినా, వీళ్ళ కింద పనిచేసేవారు చచ్చినట్లు వినేవారు.క్రమక్రమంగా, వినేవాళ్ళు తక్కువైపోయారు.

   ఉద్యోగం అయిపోయి రిటైరైపోయిన తరువాత, వీళ్ళ కబుర్లెవరు వింటారూ? ఏదొ అదృష్టం కొద్దీ, ఏ మనవడో, మనవరాలో ఉన్నారా వాళ్ళ పనైపోయినట్లే!ఆ మనవడికి ఎంత వయస్సుంటుందండీ, మహా అయితే ఏడాదిపైన ఓ నెలో రెండు నెలలో. వాణ్ణి బయటకు షికారు తీసికెళ్ళినట్లు తీసికెళ్ళడమూ, వాడితో తను విన్నవీ, కన్నవీ చెప్పుకోవడమూనూ.వాడేమైనా ఆరుస్తాడా తీరుస్తాడా? అయినా సరే, మన కడుపుబ్బరం తగ్గుతుంది కదా.ఏదో వాడికి మాటా, నడకా వచ్చేదాకానే ఈ సంబడం.ఆ రెండూ వచ్చేయంటే, మిగిలిన ఒక్క శ్రోతా పార్టీ మార్చేస్తాడు.

   ఏదో ఇంట్లో పిల్లలుండడం తో, కంప్యూటరేదో నేర్చుకోడం,పైగా ఎవరికీ రాదన్నట్లు తెలుగులో వ్రాయడమోటి కూడా నేర్చేసికుంటే, ఇంక మనల్ని పట్టేవాళ్ళెవరూ? ఇన్నాళ్ళూ 'నష్ట' పోయిన టైమంతా ఇంక రోజుకో టపా వ్రాసేసికుంటే, అడిగేవాడెవడూ?రాత్రిళ్ళు వ్రాయడం, ఆ వ్రాసినప్పటినుండీ, హారం లో వచ్చిందా, కూడలిలో వచ్చిందా, ఈ మధ్యన సమూహం, సంకలినీ, వీటికి తోడయ్యాయి, అని చూసుకోడం. మళ్ళీ తెల్లారేటప్పటికి, ఎంతమంది వ్యాఖ్యలు పెట్టారూ, ఎన్ని హిట్స్ వచ్చాయీ అనే రంధి ! ఓ మాట లేదు, ఓ మంతిలెదు ఇరవైనాలుగ్గంటలూ ఇదే గొడవ. ఎవరైనా ఇంటికి వచ్చారా అయిపోయారే! ఆ మాటా ఈమాటా చెప్పి,మాటల్లో ముగ్గులోకి లాగేయడం 'నాకు బ్లాగులు వ్రాయడం హాబీ అండీ' అంటూ!అదేదో మనకి రాదూ, పోన్లే చూద్దాం, ఎంతైనా కాఫీ ఇచ్చారుకదా అని, పాపం వాళ్ళూ బుట్టలో పడిపోతారు. ఒకటా రెండా, అయిదు వందల పై మాటే.అందులో సగం చూడ్డానికైనా ఓ గంటో రెండు గంటలో పడుతుందిగా.మొత్తం మూడు గంటలు. మర్నాడు మళ్ళీ ఓ టపా వ్రాసుకోడం, మా ఇంటికి ఎవరైనా వస్తే కనీసం మూడు గంటలైనా గడుపుతారూ అని. కానీ, వాళ్ళని ఆపడానికి వెనక్కాల జరిగిన కథంతా చెప్పరుగా!ఏమిటో వెళ్ళిపోతూంది జీవితం!

రాకోయి చందమామ

   నిన్ననే ఏదో ట్.వ్. చానల్ లో రేపు రాబోయే 19 వ. తేదిన చంద్రుడు భూమికి దగ్గరగా వస్తాడని దాని వలన భూకంపాలు, సునామీ రావచ్చని, ఇలా వచ్చె చంద్రుణ్ణి ఎక్సుట్రీమలీ సూపర్ మూన్ అంటారని చెప్పారు. ఇదివరకు 1974 లో సూపర్ మూన్ వచ్చిందని చెబితే విన్నాను. అయితే దాని ప్రభావమేనా జపాన్ లో వచ్చిన భూకంపం, సునామీను, చూస్తే భయం వేస్తోంది. ఎంత ఘోరం, మనిషి ఎంత ప్రగతి పధంలో దూసుకు వెళ్ళినా ప్రకృతి పరిణామాలను మాత్రం ఎదుర్కోలేడా? ఏమిటీ ఎక్కడో జపానులో దాని గురించి బాధ పడుతున్నారు? మన దేశంలో టాంకుబండు మీద విధ్వంసమైన విగ్రహాల గురించి బాధ లేదంటారా? ఎలా విచారం , బాధ కలుగుతాయి చెప్పండి? తిన్న తిండి అరగక, పని పాటు లేక వేసే వేషాలు కాకపోతేను? యిప్పుడు చూడండి మళ్ళి అన్ని పెడతామంటారు? మళ్ళి టెండర్లు, తినేవాళ్ళకి తినగలిగినంత మేత, బొక్కసం నింపుకునే వాళ్లకి అవకాశం, మేమింత చేశాం , అంత చేశామని చంకలు గుద్దుకుంటూ రాజకీయ ప్రచారాలు? అబ్బో ఎన్నో, ఎన్నెన్నో? మనమిలా కొట్టుకు పొతూవుంటే ఎప్పుడో ఏ చంద్రుడో, సూర్యుడో, వరుణుడో వచ్చి వాళ్ళ ప్రతాపం చూపిస్తారు, అన్నీ తుడిచి పెట్టుకు పోతాయి. మనం మాత్రం సాటి మానవుడి కన్నీరు తుడవం, ఆదుకోము,ఆదరాభిమానాలు చూపం, పెద్దలు పూర్వులు చేసిన మంచి పనులు,వారి కట్టడాలు, వారి జ్ఞాపకాలను మాత్రం శాయశక్తులా చెరిపి ఎంతో గొప్ప వాళ్ళమని మురిసిపోదాము, ఏమంటారు? కలియుగమండి, బాబూ, కలియుగం. ఛ, చిరాకు కోపం బాధ, ఏడుపు అన్ని వచ్చేస్తున్నాయి.మన వాళ్ళను గురించి తలచుకుంటే అసహ్యం, ఘృణ వేస్తొంది.
ఇంతకీ ఈవేళ వచ్చిన సునామీకీ, రాబోయే ఎక్స్ట్రీమ్లీ సూపర్ మూన్ కీ ఏదైనా సంబంధం ఉందంటారా? ఉంటే 'రాకోయి చందమామా' !

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes