RSS

ఎందుకొచ్చిన వ్యాఖ్యానాలు చెప్పండి?

    మీకెందుకొచ్చిన గొడవండి బాబూ, తీరికూర్చుని మీ అభిప్రాయాలన్నీ అందరిమీదా రుద్దుతారూ, ఎంతమందికి కోపాలొచ్చాయో ఏమిటో, ఇకపైన మీ టపాలకేసి కన్నెత్తికూడా చూడ్డం మానేస్తారు కూడానూ. షిరిడీ శాయిమీదా, సీతమ్మ వాకిట్లో.. మీదా అంతే, ప్రపంచం అంతా "నీరాంజనాలు" పట్టే సినిమాల్లో, మీకెక్కడో ఏదో కనిపిస్తుంది, ఇంక పేట్రేగిపోవడం.అసలు మిమ్మల్నెవరడిగారూ, సినిమా బావుందా లేదా అనీ? వయస్సుతో పాటు చాదస్తం కూడా ఎక్కువైపోతోంది, ఎవరెలాపోతే మీకెందుకూ అసలూ? ఆ సినిమా ఇక్కడకి రాలేదూ, డీవీడీ కూడా దొరకలేదూ ఓ గొడవొదిలిందనుకున్నంతసేపు పట్టలేదు, వరూధిని గారు, ఆవిడా ఊరికే కూర్చోకుండా, తన దారిన తను సినిమా చూడొచ్చుగా మళ్ళీ టపాల్లో ఆ లింకేదో పెట్టడం, మనం చూడ్డం. పోనీ చూసేసి ఊరుకుంటారా అంటే అదీ లేదు.ఇంకోళ్ళెవరో మలయాళంలో ఇదే కథని తీశారుట, దాని లింకేమో మనం పెట్టడం, ఎందుకొచ్చిన హైరాణ స్వామీ హాయిగా కూర్చోక?

    సరే ఒప్పుకున్నాం, మీరు 1998 లోనే మిథునం చదివేసి శ్రీరమణ గారికి ఉత్తరం వ్రాసేశారు. పైగా అదేదో సరిపోనట్టు,ఆ కథని xerox తీయించి మరీ, తెలిసున్నవారందరిచేతా చదివించారు. పోనీ దానివలన మీకేమైనా ఒరిగిందా అంటే మీరేమన్నారూ అప్పుడూ, "తెలుగు భాషొచ్చిన ప్రతీవాడూ చదవ్వలసిన కథోయ్ ఇదీ" అన్నారు, బావుంది.పైగా రెండేళ్ళకి మీ ఆరాధ్యదైవం శ్రీ బాపూగారి దస్తూరీతిలకంతో, మళ్ళీమళ్ళీ ఈ కథ చదవడం, అదేసంవత్సరం మీ దేముడు శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి అభిప్రాయం మిథునం మీద మళ్ళీ శ్రీబాపూగారి దస్తూరీతిలకమే--

    "అలాగే భార్యాభర్తలు కూడా- ఓపిక పోయి, కోరికలు తీరి శృంగారావసరాలు లేని వయసులో ఒకరినొకరు ప్రేమించుకోడమే అత్యుత్తమ శృంగారం.వారి చుట్టూ పెరిగి అల్లుకునే అనురాగమనురాగలత శోభాయమానమైనది.లోకోత్తర సౌరభాలతో వెల్లివిరిసేది. పెనుగాలి వీచినా చెదరని ప్రదీప కళిక. అటువంటి దీపాన్ని మనకి చూపించే గొప్ప కథ- శ్రీరమణ గారి 'మిథునం'. ఆ కథలో ఆలుమగలు పండు ముసిలివాళ్ళు.పసిపిల్లల చురుకుతనం, పడుచువాళ్ళ శక్తిచైతన్యాలూ పెద్దల వాత్సల్యవివేకాలూ అక్షరమైన స్నేహం కలబోసిన వాళ్ళు-ఒకరినొకరు వెక్కిరిస్తూ తిట్టుకుంటూ దెప్పుతూ గిల్లుతూ( కె.పి.ఎస్ కాదు) అల్లరి పెడుతూ నవ్వుతూ నవ్విస్తూ పున్నమినాటి సముద్ర కెరటాల్లా ఎగిసిపడి లేస్తూ బతుకే నిత్యకల్యాణ మండపంగా ఇల సాటి లేని జంటలా ఉంటారు.

    ఇక వేళ అయిందనిపించిన వేళ తను లేని ఒంటరి తనాన్ని భర్త భరించలేడని తలిచి-

    భర్త వడిలో సుమంగళి గా వెళ్ళిపోవాలనే ఇల్లాలి కోరికను చంపుకుని-

   తన వడిలో తలవుంచి ఆయనే ముందుగా హాయిగా వెళ్ళిపోవాలని

   కోరుకున్న ఉత్తమ యిల్లాలు ఆవిడ.

   జీవికి జాగ్రత,నిద్ర,స్వప్నం, అదీ దాటాక తురీయమైన ఆనందం- ఇలా నాలుగు అవస్థలుంటాయంటారు.

   అలాగే రసరాజమైన శృంగార పథయాత్రికులకు- కోరిక, ప్రయత్నం, ప్రతిఫలం తరవాత తురీయమైన ప్రేమసామ్రాజ్యసిధ్ధిని ఈ కథ ఆవిష్కరించింది".

   పాపం వెర్రి మనిషండీ మా శ్రీవారు, మిథునం కథ 1998 లో చదవడం తరవాయి, శ్రీరమణ గారికి ఉత్తరం వ్రాసేయడమేమిటి, ఆయన దగ్గరనుంచి వచ్చిన జవాబు పటం కట్టించేసి అడిగినవాడికీ, అడగనివాడికీ చూపించేసికోడం, ఇదేదో సరిపోదన్నట్టు సరీగ్గా పదేళ్ళకి భాగ్యనగరంలో శ్రీరమణ గారిని కలిసి, ఆయనతో మూడు నాలుగుగంటలు గడిపేదాకా తృప్తి పడలేదు.అదీ ఆకథంటే ఆయనకున్న అభిమానం.ఆ కథలో చదివిన తరువాత ఎప్పుడో స్వర్గస్థులైన తన అమ్మమ్మ గారిని ఊహించుకునేవారు.మా అమ్మమ్మా, తాతయ్య బతికుంటే ఇలాగే ఉండేవారేమో కదూ అంటూ రాత్రీపగలూ ఒకటే గొడవ. అక్కడితో ఆగకుండా, ప్రముఖ తెలుగురచయితల మిథునాభిప్రాయలన్నీ చదివి, ఇంకా ప్రభావితులైపోయారు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా అప్పదాసుగారూ, బుచ్చిలక్ష్మిగారే.

   ఇంత ప్రభావితులవడం మరీ ఎక్కువేమో అని ఈ పదిహేనేళ్ళలోనూ ఆయనతో అంటూండేదానిని. అప్పుడెప్పుడో విన్నారు మిథునం సినిమాగా తీస్తున్నారూ అని. తీరా ఈ ఊళ్ళో రాకపోయేటప్పటికి తుస్సుమన్నారు.ఏదో నెట్ లో వచ్చిందని ముందర చెప్పిందికూడా నేనే

   పోనీ ఇద్దరమూ కలిసి చూద్దామనైనా లేకుండా, టీవీ లో శ్రీ చాగంటి వారి ప్రవచనం కూడా మానుకుని, ఒక్కరూ చూసేశారు. పోన్లెద్దూ తరువాత చూద్దాములే అనేసికుని, సినిమా ఎలా ఉందండీ అన్నాను.అడగడం పాపం," అదేమిటోయ్ అప్పదాసుగారు, బుచ్చిలక్ష్మి గారూ మరీ ఇలా ఉంటారా? కథలో ఉన్న ఒక్కటీ సరీగ్గా చూపించనేలేదూ,అప్పదాసుగారు జామపండు నమిలి బుచ్చిలక్ష్మిగారి నోట్లో ఆ గుజ్జు ఎలా పెడతారో చూసి ఆనందిద్దామనుకుంటే అసలా సీనే లేదూ, పోనీ ఆ తోటైనా శ్రీరమణ గారు కథలో వర్ణించినట్టుగా కాకుండా, అదేదో హైబ్రిడ్డు ఎరువులేసినట్టుగా ఉందీ.. ఏమిటో సినిమాలు తీద్దామని ఉబలాటమే కానీ, తీరువుగా తీద్దమనెందుకనిపించదో మనవాళ్ళకి"

   కోనసీమవారైనా లౌక్యాలు వంటబట్టలేదు పాపం. ప్రపంచం అంతా పొగుడుతున్న మిథునం సినిమా మాత్రమే ఈయనకి నచ్చలేదూ,సరే, ఊరంతా చెప్పుకోడం దేనికీ? బహుశా ఎన్నెన్నో expectations పెట్టుకున్నారేమో...

The day after...

   ఇదివరకటి రోజుల్లో మనవైపు ఊర్లన్నీ దగ్గర దగ్గరగా ఉండడంవలన పుట్టింటికీ, అత్తారింటికీ బస్సులో ఓ రెండు గంటలు కూర్చుంటే వెళ్ళిపోగలిగేవారం. రెండు చోట్లా చుట్టాలకేమీ కొదవుండేది కాదు.ఈ ఊరినుంచి ఆ ఊరికీ, ఆ ఊరునుంచి ఈ ఊరికీ ఏమైనా సరుకులు తీసికెళ్ళడానికి, తరచూ ప్రయాణాలు చేసేవారు బలైపోయేవారు. ఎప్పుడైనా అత్తారింటికి వెళ్తున్నామని తెలిస్తే, మా ఊళ్ళో ఉండే మా పెద్దత్తగారికి ఎక్కళ్ళేనీ సరుకులన్నీ గుర్తొచ్చేవి. "అప్పుడెప్పుడో మీ అత్తగారు పాపం, నోటికి హితవుగా ఉంటుందీ, నిమ్మకాయ ఊరగాయుంటే పంపించూ అందే. కిందటిసారొచ్చినప్పుడు తన తువ్వాలోటి మర్చిపోయింది, ఓ సీసాలో ఊరగాయపెట్టి, ఆ తువ్వాలుకి చుట్టబెట్టిస్తానూ, వచ్చి తీసికెళ్ళడం మర్చిపోకే.." అనేవారు.పైగా కోడలు వరసోటి కదా, మనింటికి తెచ్చి ఇవ్వడం నామోషీ, వాళ్ళింటికే వెళ్ళి, ఆ సరుకులేవో తీసికోడం,అత్తారింట్లో ఇవ్వడం. అక్కడితో అయిపోతే గొడవే లేదు, తిరిగొచ్చేటప్పుడు మళ్ళీ పెద్దత్తగారు అభిమానంతో అడిగిన వస్తువులు, అసలత్తగారు ఇవ్వగా ఈ ఊళ్ళోఉండే పెద్దత్తగారికీ..డబ్బుల్లేని "కొరియర్" సర్వీసన్నమాట.అసలు వీటినుండి బయటపడతామా లేదా జీవితమంతా వీళ్ళ సరుకులు బట్వాడా చేస్తూనే బతకాలా అనిపించేది.

    చాలామందికి అనుభవంలోకి వచ్చేఉండాలి, కాలక్రమేణా ఈ ఉచిత బట్వాడా వృత్తి ఖండాంతరాలు కూడా పాకింది. ఎక్కడో అమెరికాలో ఉండే, పక్కింటి పిన్నిగారి కూతురో కోడలో "నీళ్ళోసుకుందని" తెలియడం తరవాయి, ఈ విషయం తెలిసిన ఈ పిన్నిగారు నాలుగు నెలల ముందునుంచీ, ఎక్కళ్ళేని ప్రేమా అభిమానం ఒలికించేసి, రోజు విడిచి రోజు వీళ్ళింటికి( ఎవరి కూతురో/కోడలో నీళ్ళోసుకున్నావిడ) వెళ్ళడం, " పిల్లెలా ఉందండీ, వేవిళ్ళూ అవీ లేవుకదా.." అంటూ, "ఫోన్లలో క్షేమసమాచారాలు తెలిసికుంటున్నారా, అసలే తొల్చూరు కూడానూ.." అంటూ అక్కడకా పిల్లంటే ఎంతో ప్రేమా అభిమానమూ అన్నట్టు ప్రతీరోజూ అటెండెన్సు వేయించుకుంటుంది. ఆ పిల్లమీద అభిమానమూ కాదూ, సింగినాదమూ కాదు, ఈవిడెల్లాగూ మూడు నాలుగు నెలల్లో అమెరికా వెళ్తుంది, అక్కడ అమెరికాలో ఉండే తన కూతురికీ, మనవడూ, మనవరాలుకీ, ఏమైనా ఊరగాయలూ, అవీ ఖర్చులేకుండా పంపించొచ్చనీ.

   Systematic గా పావులు కదుపుతూంటుంది ఈ నాలుగు నెలలూనూ," అన్నయ్యగారికి నచ్చుతుందేమో అని, ఓ నాలుక్కాయలు మెంతావకాయ పెట్టాను.." అని ఒకసారీ, "ఈవేళ మీ అన్నయ్యగారు మార్కెట్ లో దొరికిందని బచ్చలి కూర తెచ్చారు, కందా బచ్చలీ చేశానూ, మీ వాడికి కాస్త నేతి చుక్క దిట్టంగా పట్టించి కలిపిపెట్టు, మళ్ళీ వదులుతాడేమో చూడు.." అని ఇంకోసారీ.. ఇలా ఈ నాలుగునెలలూ ఓ "దగ్గరతనం" "చనువూ" లాటివి ఏర్పరిచేసికుంటుంది. పాపం ఈ పిన్నిగారికి ( ఎవరి కూతురు/కోడలో నీళ్ళోసుకున్నావిడ) ఏమీ అర్ధం అవదు. "పాపం ఆ పక్కింటి పిన్నిగారికి మనం అంటే ఎంత ప్రేమా అభిమానమో చూశారా.." అని కొడుకుతోనూ, భర్తతోనూ చెప్తూంటుంది.ప్రతీరోజూ సమాచారం తెలిసికుంటూంటుంది పాస్పోర్టు వ్యవహారం ఎక్కడిదాకా వచ్చిందో, వీసా ఎక్కడిదాకా వచ్చిందో లాటి విషయాలు.పైగా ఏదైనా అవసరం ఉంటే చెప్పండీ లాటి ఆశ్వాసన్ లు కూడా, ధారాళంగా ఇస్తూంటుంది.

    అసలు విషయం అంతా వీళ్ళు అమెరికా వెళ్ళే సమయానికి ఓ నాలుగురోజులుముందు, వీళ్ళు సామాన్లు సద్దుకుంటుండగా తెలుస్తుంది. కొంగుచాటున ఏ ఊరగాయో తెచ్చి, " ఏమిటీ హడావిడీ ప్రయాణం దగ్గరకొచ్చేసిందేవిటీ, ఏవనుకోనంటే ఓ చిన్న సహాయం చేయాలి వదినా, మా పిల్లదానికి ఇష్టమని కొద్దిగా ఊరగాయా, కందిపొడీ అవీ చేశానూ, శ్రమనుకోకుండా ఆ బుల్లి పాకెట్టు కూడా మీ బట్టల్లో సద్దేసి, ఎలాగోలాగ తీసికెళ్ళారంటే, వాళ్ళే వచ్చి తీసికుంటారు..". తప్పుతుందా, నాలుగునెల్లబట్టి అవీ ఇవీ ఇచ్చి మేపిందే, అనే ఓ గిల్టీ ఫీలింగోటొచ్చి, మొహమ్మాటానికి "సరేనమ్మా దానికేముందీ, మేమేమైనా మొయ్యాలా ఏమిటీ.." అని ఒప్పేసికుని తన కూతురికి తీసికెళ్ళే సమాన్లలో కొన్నిటిని "త్యాగం" చేసేసి, నాలుగునెలల ఋణాన్నీ తీర్చుకుంటుంది.

   పై అనుభవాలు కొన్ని అనుభవించినవీ, కొన్ని విన్నవీ దృష్ట్యా ఎప్పుడైనా ఏ ఊరైనా వెళ్దామని అనుకున్నా ఎవరికీ చెప్పుకోకూడదూ అని ఓ దృఢ నిశ్చయానికొచ్చేశాము. ఇప్పుడు ఇంకోరకం "హింస"

   ఎప్పుడైనా ఏ ఉరైనా చూడ్డానికి వెళ్ళేముందర, ఎవరితోనూ చెప్పకూడదని, ఒక ఫీలింగుండేది ఇదివరకటి రొజుల్లో, కారణం మరేమీ లేదూ, మనం ఎవరికైతే చెప్పామో, వారు అప్పటికే ఆ ఊరు వెళ్ళొచ్చేరనుకోండి, దొరికాము కదా అని, ఫలానాది చూడండీ, ఫలానాది చూడండే.. అని ఊదరకొట్టేస్తారు. పైగా ఎక్కడికో వెళ్తున్నామని ఊరంతా టముకు వేస్తే, చివరకి అసలు ఆ ప్రయాణమే చేయలేమేమో అని ఓ వెర్రినమ్మకం... అయినా జన్మానికో శివరాత్రన్నట్టు అయిదారేళ్లకి, మా శ్రీవారికి మూడ్ వచ్చి ఇల్లు కదలడమే పెద్ద విశేషం, ఈమాత్రం దానికి ఊరంతా చెప్పుకోడమోటా? అందుకే , పిల్లలతో తప్పించి ఇంకెవరికీ చెప్పలేదు. పాపం మా శ్రీవారుమాత్రం ఉండబట్టుకోలేక తన టపాలో వ్రాసేసికున్నారు. తన టపాలు ఎవరైనా మిస్సయిపోతారేమో అని పాపం తనకో అపోహ ! హాయిగ్గా ఉంటారులెండి మీవాళ్ళందరూ అంటే బాధపడిపోతారు...

    వెళ్ళేముందరే కాదు, వెళ్ళొచ్చిన తరువాత కూడా, ఎవరికీ చెప్పుకోకూడదని ఇప్పుడు తెలిసింది ! నేనెవరితో అయితే చెప్పానో, వారి వారి రియాక్షన్ లు చూసి/విని ఇటుపైన అసలు ఎక్కడికీ వెళ్ళేకూడదూ, అధవా వెళ్ళినా ఎవరికీ చెప్పుకోకూడదూ అనే వైరాగ్యం వచ్చేసింది. సరదాగా ఉంటుందని సిమ్లా వెళ్ళినట్టు చెప్పడమేమిటి కులూ, మనాలీ వెళ్ళేరా అనేవారొకరూ. హరిద్వార్ లో హారతి చూసేమంటే,అయ్యో.. ఋషీకేష్ లో చూడలేదా అనేవారింకోరూ. కేదార్నాథ్ కూడా వెళ్ళొచ్చేయవలసిందీ అని ఓ ఉచిత సలహా ఇచ్చేవారొకరూ. మేము వెళ్ళిందా రెండురోజులు సిమ్లాలోనూ, రెండురోజులు హరిద్వార్ లోనూ గడపడానికి, వీలున్నన్ని చూడ్డానికీనూ

   ఇవన్నీ ఒకెత్తూ, కొందరైతే "మీకేమిటిలెండి, పిల్లలున్నారుగా వాళ్లు పంపించుంటారు..". మా వాడైతే ఫ్లైట్ లో తీసికెళ్ళి చూపించాడు అనేవాళ్ళొకరు.హరిద్వార్ లో ఏ ఆశ్రమంలో ఉన్నారూ, ఎవరైనా ట్రావెల్స్ వాళ్ళతో కానీ వెళ్ళారా ఏమిటీ అనేవాళ్ళు కొంతమందీ.

    ఇంకొరైతే, "ఈమధ్యన మా ఫ్రెండొకావిడ యాత్ర్లకెళ్ళిందీ, నాకు తెలిసేటప్పటికే టిక్కెట్లయిపోయాయిట, ఈసారి మీరెళ్తూంటే చెప్పండే, నేనూ వస్తానూ.." అనీ, ఓరినాయనోయ్ ప్రయాణాలైనా మానుకోవాలి, లేదా చడీచప్పుడూ లేకుండా వెళ్ళైనా రావాలి బాబూ.మా శ్రీవారన్నారు హాయిగా ఓ placard ఒకటి పెట్టేసి దానిమీద వ్రాసేయ్...

   1. మేము హరిద్వార్, ఋషీకేష్ లకు మాత్రమే వెళ్ళాము. టైముకుదరక మిగిలినవాటికి వెళ్ళలేదూ...

   2. సిమ్లా దాకానే అనుకున్నామూ.. అసలే పిడచకట్టుకుపోయే చలి కూడానూ, దీనికే మాకు ప్రాణం మీదకొచ్చేసిందీ...

   3. మా ప్రయాణాలు ఎవరూ sponsor చేయలేదూ... మా డబ్బులతోనే వెళ్ళామూ...

   4.మాకు రైళ్ళలోనే వెళ్ళడం హాయీ.. ప్లేన్లూ అవీ ఎక్కమూ...

   5. టూర్లవాళ్ళతోనూ, ట్రావెల్స్ వాళ్ళతోనూ వెళ్ళలేదూ...వెళ్ళే ఉద్దేశ్యంకూడా ప్రస్తుతానికైతే లేదూ....

   ఇంకా సందేహాలేమైనా ఉంటే అడగండీ, మీరెలా వెళ్ళారో, ఎప్పుడు వెళ్ళారో, ఎవరితో వెళ్ళారో, ఎవరు పంపించగా వెళ్ళారో ఇత్యాది విశేషాల మీద మాకు ఆసక్తి లేదూ...

ఎంత పుణ్యం చేసికున్నానో కదా...

   అమ్మా! గంగమ్మతల్లీ! గంగని ఒక్కసారి కాకుండా అమ్మా, గంగమ్మ, తల్లీ అని మూడు సార్లు తలిస్తేనే కాని మనసు తీరదు. ఎక్కడ గంగ వుంటే అక్కడే పుణ్యస్థలం. గంగా జలం అమృతం తో సమానం. సాధారణంగా మన దేవుడి గదిలో గంగాజల చెంబులు చూస్తూవుంటాం ( సీలు వెసిన కాశీ చెంబు) .మరణ సమయంలో కొద్దిగా గంగాజలం నోట్లో పోస్తే స్వర్గం దొరుకుతుందని అంటారు. అవి అందుకే వుంచేవారనుకుంటాను. కాని హస్పటల్ మరణాల వల్ల అదీ కుదరటంలేదనుకోండి. అయినా అదంతా ఎందుకనుకోడి ఇప్పుదు. గంగమ్మతల్లి ని తలుచుకుంటే ఓ చిన్న కధ గుర్తు వస్తోంది అందరికి తెలిసే వుంటుందనుకుంటాను.

    నారదుడు గంగ దగ్గరకి వెళ్ళి స్నానం చేయకుండా నమస్కరించి వెళ్ళిపోయేవారట.ఎప్పుడు వచ్చినా అలా వెళ్ళిపోతూవుంటే ఆ తల్లికి చిరాకు కలిగిందట. చివరికి ఓ సారి అడిగేసిందట. నా ప్రవాహంలో గొప్ప గొప్ప ఋషులు, తప్పకుండా స్నానం చేస్తారు మీరు ఇలా ఓ నమస్కారం పెట్టి వెళ్ళిపోతున్నారు, విషయం ఏమిటని ? అందుకు నారదుడు అమ్మా! నిన్ను దర్శించినంతనే సకల పాపాలు పోయి ముక్తి లభిస్తుంది.ఇంక స్నానం చేయటం వలన అధిక ఫలం ఏముంటుంది తల్లీ? అన్నారట. అదీ గంగమ్మతల్లి వైభవం , గొప్పతనం.

    గంగ గంగోత్రి దగ్గర బయలు దేరి ప్రజలకి సుఖ సంపదలు , పుణ్య ప్రాప్తి కలిగించి గంగాసాగర్ వద్ద సముద్రంలో కలసిపోతుంది. అటువంటి పరమ పవిత్రమైన గంగానదిలో స్నానం చేసే అదృష్టం మాకు కలిగి, మా జన్మ తరించిదని సంతోషంగా వుంది. హరిద్వార్ లోని గంగమ్మను గంగాసాగరు లోని గంగమ్మను చూసే " హర హర గంగే.. హరహర గంగే అంటూ వేసిన మునక తో శరీరం , అత్మ పవిత్రమయ్యానే భావం కలిగింది. ఇక్కడ ఒకటి చెబుతాను. " మానొతో మై గంగా మా హుం, నా మానొతొ బహతా పానీ " పాట గుర్తుంది కదూ !

    హృషీకేశ్ లోని గంగమ్మ,భారత్ మందిర్, రామమందిర్, రామ్ ఝూలా, లక్ష్మణ్ ఝూలా, అన్ని చూసుకొని హరిద్వార్ వెళ్ళాము. శివాలిక్ పర్వత శిఖరాల లొయలొ గంగానది కుడివైపున హరిద్వారు వుంది. పరమ పవిత్రక్షేత్రాలో అగ్రగణ్యమైన దీన్ని దర్శిండం నాకు ఒక కల కాదుకదా అనిపిస్తోంది. హరిద్వార్ కి హృదయంలాంటి హరిపౌడి లో స్నానం , గంగమ్మహారతి వావ్! పండిత జగన్నాధ శాస్త్రి గారి హారతి ! తెలుగు వారి అదృష్టం. దీపాల వెలుగులో గంగమ్మ సౌందర్యం అనిర్వచనీయం. మా శ్రీవారు ఓ మూడు విడియోలు తీశారు. వాటిని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడా చూడండి.

    ముఖ్యంగా నాకు మరినూ! ఎత్తులన్నా, లోయలన్నా, నీళ్ళన్నా, మండిపడే మా శ్రీవారి తో మానసా దేవి మందిర్, చండీ దేవి మందిర్, దర్శించుకోవడం, అదీ ఉడన్ కటోలాలొ. ( రోప్ వే).అందుకే అంటారనుకుంటాను యోగం వుంటే అలా కలసి వస్తుందనుకుంటాను. మా మిత్రులు అమరేంద్ర గారి ప్రోత్సాహంతో అలా కుదిరింది. అందరికి మామూలు విషయంగా వుండచ్చును కాని నాకు మాత్రం ఈ ప్రయాణం అద్బుతం. అపూర్వం.

    ఇంతే కాదండోయ్.. గంగా తీరంలో దశహరా స్తోత్రం కూడా చదువుకునే భాగ్యం కలిగింది.

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes