RSS

మాశ్రీవారు-- Break Faaaast !!!

   మా శ్రీవారు ఫాక్టరీలో ఉద్యోగంలో ఉన్నన్నాళ్ళూ, పూనాలో ఉన్నంతకాలం షిఫ్టుల్లో వెళ్ళేవారు.అప్పటిదాకా క్యాంటీన్ లో భోజనం చేసే మనిషి, ఇంక నేను వచ్చేశానుకదా అని,నన్నే డబ్బా
(మనవైపు క్యారీరు) చేసి ఇమ్మనేవారు.పోనీ ఎండలో ఇంటికి రావడం కష్టమౌతుందీ అని, ప్రొద్దుటే లేచి, ముందుగా బ్రేక్ఫాస్టూ, ఆ తరువాత నాలుగు గిన్నెల్లోకీ కూర,పచ్చడి,పులుసూ, అన్నం పెట్టి ఇచ్చేదాన్ని.కొన్నిరోజులు ఓ కుర్రాడిని పెట్టుకున్నాము,12.30 కి డబ్బా తీసికెళ్ళడానికి. ప్రతీరోజూ ఇంటికి తిరిగి వచ్చిన తరువాత, డబ్బాలో పెట్టిన కూర ఎలాఉందో, చెప్తారేమో అంటే, దాని ప్రసక్తే ఉండేది కాదు.పోనీ మొహం మీద పొగడడం ఇష్టం లేదేమో అనుకుని ఊరుకునేదానిని.పైగా కొత్తా!

    ఇంట్లోకి సామాన్లు కొనమంటే, మొట్టమొదట ఓ కత్తిపీట తెచ్చారు! ఇదేం టేస్టురా బాబూ, అని భయపడిపోయి, కొంచెం జాగ్రత్తగానే ఉండేదాన్ని.ఏం అంటే ఏం గొడవొస్తుందో బాబూ అనుకొని. అందువలన డబ్బాలో పెట్టిన పదార్ధాలగురించి ఆయన అభిప్రాయం ఎప్పుడూ అడగలేదు! ఆయన ఆ సంగతి ప్రస్తావించకపోడానికి కారణం కొన్ని రోజుల తరువాత తెలిసింది.చూసి చూసి ఓ రోజు అడిగేశారు--ప్రతీ రోజూ కూరా అదీలేకుండా ఖాళీ డబ్బా పెడతావెందుకూ అని. ఓ రోజు కూరుండేది కాదు, ఇంకోరోజు పచ్చడుండేది కాదు.కారణం ఏమిటయ్యా అంటే, డబ్బా తీసికెళ్ళే కుర్రాడు ఆకలేసినప్పుడల్లా దారిలో ఈయన డబ్బా తెరిచి, అందులో ఏం ఉంటే దానితో వాడు తెచ్చుకున్న చపాతీతో నలుచుకుని తినేసి, వాడు తినగా మిగిలినదేదో తీసికెళ్ళిచ్చేవాడుట! ఇంక ఇలాగ కాదని ప్రొద్దుటే అన్నీ తయారుచేసేసి ఇచ్చేదాన్ని.

    దీనితో ఇంక ఓ అలవాటు అయిపోయింది, ప్రతీ రోజూ ప్రొద్దుటే బ్రేక్ ఫాస్ట్ తినడం. పైగా పిల్లలకి కూడా స్కూలికి వెళ్ళేముందర ఏదో ఒకటి పెట్టాలికదా. వాళ్ళతో అంత సమస్య ఉండేదికాదనుకోండి. స్కూలు మా క్వార్టర్స్ కి ఎదురుగానే ఉండేది.స్కూలునుండి రాగానే అన్నం తినేసి చదువుకునేవారు.

    దీంతో చివరకు జరిగిందేమిటంటే, ఈయనకి ప్రొద్దుటే 8.00 గంటలకి ముందే బ్రేక్ ఫాస్ట్ తినడం. ఎప్పుడైనా మా ఇంటికి వెళ్ళినప్పుడల్లా, ఇదో పెద్ద సమస్య అయిపోయేది. మనవైపు ప్రొద్దుటే టిఫిన్లు తినడం అదీ అలవాటుండేది కాదు. కానీ ఈయన వచ్చినప్పుడల్లా, మా అమ్మ అల్లుడుగారొచ్చారూ( ఎంతైనా ఇంటికి పెద్దల్లుడు), నానా హైరాణా పడిపోయి, ముందురోజు పప్పు నానబెట్టి ఇడ్లీకో, దోశలకో పోయడం.బయట హొటల్ నుండి తెప్పిస్తే అల్లుడుగారేమనుకుంటారో అని ఓ భయం. ( అంతకుముందే ఆయన మొదటిసారి ఇంట్లోకి కొన్న కత్తిపీట గురించి చెప్పాను!). ఈయనకి ఆ టిఫినేదో పెట్టి వంట చేసి, పాపం స్కూలుకి వెళ్ళేది.అలాగని అమలాపురం మా అత్తగారింటికి వెళ్ళినప్పుడు మాత్రం,ఉన్న పదిరోజులూ, దగ్గరలో ఉన్న హొటల్ కి వెళ్ళి టిఫిన్ కానిచ్చేసేవారు.అమ్మని కష్ట పెట్టకూడదుగా ! అంటే జరుగుతూంటే జరిపించుకోవడం అన్నమాట!

    ఒకసారి మా అమ్మాయి ముంబైలో ఉండగా, మా మనవరాలి మొదటి పుట్టిన రోజుకి వెళ్ళడానికి ఉదయం 6.00 గంటల ట్రైనులో రిజర్వేషన్ చేయించి, మర్నాడు ప్రొద్దుటే 5.30 కి బ్రేక్ ఫాస్ట్ తీసికుని వెళ్దాం అన్నారు! చెప్పేదేమిటంటే, ఆయన బ్రేక్ ఫాస్ట్ లేకుండా రోజు ప్రారంభించరు! ఎప్పుడో ఏవో పూజలు చేయించే రోజుల్లోనూ, మా మామగారి, అత్తగార్ల తిథి రోజున మాత్రం బ్రేక్ ఫాస్ట్ 'త్యాగం' చేసేస్తారు.అప్పుడుకూడా, ఏదో చాలారోజులనుండీ ఏమీ తినడం లేనట్లుగా ఓ పోజూ!

    2008 లో రాజమండ్రీ కాపురం పెట్టించారు. పోనీ స్థలం మార్పుతో ఏమైనా ఈయనలో కూడా మార్పొస్తుందేమో అనుకున్నాను. అబ్బే, అక్కడ ఇంకా అన్యాయం. అక్కడ వెలుగు తొందరగా వచ్చేస్తుండనే వంకతో, 6.00 గంటలకే లేచి, స్నాన పానాదులు పూర్తిచేసి రెడీ అయిపోయేవారు! 'అదేమిటండీ మనం రాజమండ్రీ ఎందుకు వచ్చామో మర్చిపోయారా, హాయిగా స్నానం చేసి, గోదావరి గట్టుమీదుండే దేవాలయాలు అన్నీ తిరిగి వస్తూండండి, ఈలోపులో నాకూ టైముంటుంది, మీకు బ్రేక్ ఫాస్ట్ రెడీ చేస్తాను' అన్నాను.కాఫీ త్రాగేసి వెళ్ళిపోయేవారు. అంతకు ముందు రోజు ఇడ్లీలకో, దోశలకో ఓ కప్పు పప్పు నానబెట్టి, ఏదో ఒకటి చేసేదానిని.ఎప్పుడైనా అదృష్టం బాగోక పప్పు నానపెట్టకపోతే, 'పోన్లే రేపు బ్రెడ్డు తెచ్చుకుని లాగించేస్తాను' అని ఓ బెదిరింపు! ప్రతీ రోజూ ఒక్కొక్కప్పుడు 8.30 దాకా వచ్చేవారు కాదు, అయినా నేను పెట్టిన బ్రేక్ ఫాస్ట్ మీద అంత ఆసక్తీ చూపించేవారు కాదు, ఫర్వాలేదు, దేముడు నా మొర ఆలకించాడూ అనుకున్నంత సేపు పట్టలేదు, కారణం ఏమిటంటే అష్టలక్ష్మి గుడిలో ప్రతీ రోజూ దధ్ధోజనము, పులిహార, ప్రసాదంగా ఇచ్చేవారుట! ఇంక ఆదేముడే ఆయనని కాపాడుతూంటే, మానవమాత్రురాలినైన నేనెంత ! అదృష్టవంతుడిని పాడిచేసేవారుండరుట !

    2009 లో పూణే తిరిగి వచ్చేశాము. ఇక్కడ కూడా దగ్గరలో ఉన్న దేవాలయాలకి వెళ్ళడానికి, ప్రొద్దుటే వెళ్ళి 8.30 కి వచ్చేవారు.మా అబ్బాయీ వాళ్ళూ ఓ వంట మనిషిని పెట్టారు,ఆవిడ ప్రతీరోజూ చపాతీలో, పరోఠాలో బ్రేక్ ఫాస్ట్ చేసేవారు. ఖర్మ కాలి ఏ రోజైనా ఆలశ్యం అయిందా, చెప్పా పెట్టకుండా ఎదురుగా ఉండే హొటల్ కి వెళ్ళి ఏదో తింటేనే కానీ ఈయనకి రోజు ప్రారంభం అవదు. మా కోడలు, 'అదేమిటీ మామయ్య గారు బ్రేక్ ఫాస్ట్ తీసికోలేదా'అంటే 'పాపం మీ మామయ్యగారు ఆకలికి ఓపలేరమ్మా' అని ఎక్కడ చెప్పుకోనూ,'వెరైటీ కోసం ఎదురుగా ఉన్న హొటల్ లో తినేశారు' అని సర్ది చెప్పుకోవలసివస్తోంది!

    ఏం చేస్తాను ఈ బ్రేక్ ఫాస్ట్ నేను చేసిన అలవాటే, భరించాలి! ఈ 38 ఏళ్ళలోనూ, మా అమ్మాయి పుట్టినప్పుడు ఈయనని వదిలి ఉన్న నాలుగు నెలలూ తప్పించి, ఈయన నన్ను ఒక్కర్తినీ ఎక్కడికీ పంపలేదు. అదంతా ఏదో 'అమర ప్రేమ' అనుకోకండి, నెను లెకపోతే బ్రేక్ ఫాస్ట్ ఉండదేమో అనే భయంతో !!

    ఆఖరికి మేము రాజమండ్రీ లో ఉన్నంతకాలం, పూణే రావడానికి తెల్లవారుఝామున 5.30 కి భావనగర్ ఎక్స్ ప్రెస్స్ లో బయలుదేరినా సరే,బ్రేక్ ఫాస్ట్ లేకుండా బయలుదేరలేదు.అలాగని ఆయనకు డయాబెటిక్ సమస్యేం లేదు, ఉండకలరు ఏమీ తినకుండానూ ( కోపాలూ తాపాలూ వచ్చినప్పుడు ఉండడంలేదూ), అదో జరుగుబాటు ! అంతే !

ఆవకాయ--The other side of the coin !

    నేను ఈ మధ్య మా మనవడు చి.అగస్త్య తో చాలా బిజీ అయ్యాను.తనని చూడడానికి ఓ పిల్లని పెట్టారు, అయినా అదేం అదృష్టమో, ఆ పిల్ల నన్ను చూడగానే, బాబుని వదిలేసి, ఇంకేదో పని చూసుకోవడానికి వెళ్ళిపోతుంది! దానితో రోజులో సగం భాగం,నేనే చూడావలసివస్తోంది.పాపం వాడేమీ ఏడవడం అదీ లేదు కానీ, మెళుకువగా ఉన్నప్పుడు వాడితో కబుర్లు చెప్పకపోతే అరుస్తాడు!

    దీనికి సాయం ఊరగాయలు పెట్టడం ఒకటీ. ఈ హడావిడిలో పడి, మా శ్రీవారు బ్లాగ్గుల్లో ఏం వ్రాస్తున్నారో పట్టించుకోవడానికి సమయమే కుదరడం లేదు. ఇదివరకు రాజమండ్రీ లో ఉన్నప్పుడు, తన బ్లాగ్గు పోస్ట్ చేసేముందు చూపించేవారు.ఇప్పుడు ఛాన్స్ దొరికిందికదా అని, నా మీద అవాకులూ చవాకులూ వ్రాసేస్తున్నారు. చూడండిఅక్కడికి నేనేదో ఆయనని గత 38 ఏళ్ళనుండీ హింస పెట్టేస్తున్నట్లూ, పాపం తనే ఏదో ఓర్పుగా ఉండి ఆవకాయ పెట్టేస్తున్నట్లుగా, వ్రాసేశారు! ఆవకాయ లేందే ముద్ద దిగదు.కానీ ఊరగాయలు పెట్టడానికి, ఆయన నన్ను పెట్టే తిప్పలు ఎవరితో చెప్పుకోను? ఒక్కటంటే ఒక్క పనీ సవ్యంగా ఉండదు.ఎన్ని కాయలు తెమ్మంటావూ తో ప్రారంభం, ఇదేమీ మొదటిసారా, పెళ్ళైన మూడో ఏటినుండి తెస్తున్నారు. ప్రతీ సారీ కొత్తే!

    నేను మా ఇంట్లో మా అమ్మా,అమ్మమ్మా పెట్టేటప్పుడు తెలిసిన పరిజ్ఞానంతో( వాళ్ళు మాత్రం ఏమైనా కాయలూ అవీ తూచేవారా, ఏదో ఓ గిన్నెతో ఆవపిండీ, కారం,ఉప్పూ,నూనె కొలిచి, వాటికి సరిపడే ఇంకో నాలుగు గిన్నెల ముక్కలు వేసేవారు). అప్పటికీ చెప్పాను అమ్మమ్మగారు ( అంటే మా అత్తగారు) కూడా అలాగే పెడతారూ అని.అందుకని ఇక్కడ కూడా,మా అందరికీ ఏడాది పొడుగునా సరిపోయేటట్లు ( అంటే మాకూ,మా అమ్మాయికీ,అబ్బాయికీ), ఓ గిన్నెడు ముక్కలు ఈయన వేవిళ్ళకోరిక( ఉల్లావకాయ), మొత్తం నాలుగు గిన్నెలకి సరిపోయేలా తెమ్మంటూంటాను. మన గిన్నె కొలత కొట్టువాడికెలా తెలుస్తుందోయ్ అంటారు. పోనీ అలాగని ఓ పాతిక కాయలు తెండీ అంటే, నిమ్మకాయ సైజులో ఓ పాతిక కాయలు ముక్కలు కొట్టించి తెచ్చేవారు, ఇదేమిటీ ఇవి మెంతిబద్దల్లోకి కూడా సరిపోవూ అంటే ఇంకోసారి పెద్ద పంపరపనాసకాయ ( అంటె పేద్ద నారింజకాయకంటె పెద్దది) సైజులో తెచ్చారు.వాటితో ఊళ్ళోవాళ్ళందరికీ సరిపడేటట్లుగా పెట్టేయొచ్చు! ఈయన్ని బాగుచేయడం ఇంక దేముడికూడా సాధ్యం కాదనుకొని,(పైగా ఆయన కోనసీమలో పుట్టానని ఓ గర్వం కూడానూ, వీలున్నప్పుడల్లా తూ.గో. ప.గో అంటూ వేళాకోళాలోటీ, నాది తణుకు కదా),చేత్తో సైజు చూపించి, ఇలాటివి, నాలుగు గిన్నెల ముక్కలు తీసుకురండి మహాప్రభో కి సెటిల్ ఐపోయాను.లేకపోతే ఆ గిన్నె పట్టుకుని మార్కెట్ కి వెళ్తారేమో అని ఓ భయం, అదో అప్రతిష్ట!

    అక్కడికి కాయలు ఎన్ని తేవాలో ఓ కొలిక్కి వచ్చిందా,ఇంక నూనె సంగతి, ఎప్పుడూ కొత్తే, ఏం నూనె అంటూ, అదేదో బారెల్స్ లో తెచ్చేస్తూన్నట్లుగా ఓ పోజు పెట్టేయడం.మనవేపైతే, పప్పునూనె అంటె తెలుస్తుంది. ఏం పప్పూ అంటారు మొత్తానికి 'తిల్' అని చెప్పేక, కొట్టులోకి వెళ్ళీ, ఈయనేం అడుగుతారో,వాళ్ళేం ఇస్తారో తెలియదుకానీ, ఓ రెండు లీటర్ల నూనె తెస్తారు.నువ్వుల్ని 'తిల్' అంటారని తెలియలేదంటే ఎలా నమ్మాలి? పైగా 48 ఏళ్ళనుండీ, మహరాష్ట్రలో ఉంటున్నానని ఓ బడాయీ!ఏదో తీసుకొచ్చారు కదా అని, చూసుకోకుండా మాగాయి పెట్టే రోజున బాటిల్ ఓపెన్ చేస్తునుకదా, అదేమో ఆవ నూనె ( సరసోం కా తేల్). ఇదేమిటండీ, నేను తెమ్మంది తిల్ ఆయిల్ కదా, మిమ్మల్ని నమ్ముకుంటే ఆవనూనె తెచ్చారూ అంటే, కోపం ఒకటీ. ఏమైతేనే మిట్ట మధ్యాన్నం ఎండలో వెళ్ళి, ఆ తిల్ ఆయిలేదో తెచ్చి నామొహాన్న పడేశారు ( మాగాయ కావాలి కదా!). సాయంత్రానికి మాగాయేదో కలిపేసి పెట్టేశాను.

    ఆవకాయకి కాయలు ఎప్పుడు తెమ్మంటావూ అని రోజూ అడగడం. ఎక్కడ పెట్టడం మానేస్తానో అని భయం.ఈయన సంగతి తెలుసుగా, ఇంట్లో పెట్టకపోతే, ఊళ్ళో వాళ్ళందరూ ఇచ్చింది, అపురూపంగా, ఆవురావురుమంటూ తింటారు, లేకపోతే 'ప్రియా' సీసా తెచ్చేస్తారు! ఆ మాత్రం దానికి నేను వెల్తి పడడం ఎందుకులే అనుకొని,ఈ సారైనా జాగ్రత్తగా చూసుకొని తీసుకు రండీ అన్నాను.వచ్చేటప్పుడు నూనె సరీగ్గా చూసుకుని తీసుకురండీ అనికూడా చెప్పాను.అదిగో అలా చెప్తే మళ్ళీకోపం. ఏం తమాషాగా ఉందా ,ప్రతీసారీ కళ్ళూమూసుకుని తెస్తానా ఏమిటీ అంటూ. మొత్తానికి అక్కడ మార్కెట్లో ఈయనేం అడిగారో, వాళ్ళేం ఇచ్చారో తెలియదు కానీ, కాయలు కోయించి తెచ్చారు.అందులో సగానికి సగం లేతవి. ఇదేమిటీ ఈ ముక్కలతో పెడితే, ముక్క మెత్తబడిపోయి నిలవ ఉండదూ అంటే మళ్ళీ కోపం!పైగా ముక్క మెత్తగా ఉంటే హాయిగా తినేయొచ్చూ అని ఓ సమర్ధనోటీ (పళ్ళులేవుగా), మా అమ్మమ్మ గారి పధ్ధతే, ఆవిడా అంతే, వాళ్ళు చేసిన తప్పుని సమర్ధించుకోవడంలో వాళ్ళంతటి వాళ్ళులేరు ( ఏమైనా కోనసీమ వాళ్ళు కదా!).

    ఆ మెత్తగా ఉన్నముక్కలన్నీ మళ్ళీ ఓ కత్తిపీట ముందేసుకుని, తొక్కతీసి ఉప్పులో వేసి, ఎండలో పెట్టాల్సొచ్చింది.మొత్తానికి అంతకు ముందు ఎండపెట్టిన ఒరుగులూ, ఇవీ కలిపి ఏడాదంతా సరిపోతాయి.ఈయన ఆవకాయ కోసం తెచ్చిన కొన్ని ముక్కలెంత మెత్తగా ఉన్నాయీ అంటే, వాటిలో పంచదార కలిపేస్తే మురబ్బాలా తయారైపోతుంది.రోజూ టెర్రెస్ మీదకు వెళ్ళడం, ఎండలో పెట్టడం, ఎప్పటికి ఎండుతాయో.

    ఒక సంగతి మాత్రం చెప్పుకోవాలి, నేను పెట్టిన ఆవకాయ మాత్రం ప్రతీరోజూ, భోజనానికి ముందే టేబుల్ మీద పెట్టేసుకోవడం, భోజనం చేసేటప్పుడు మా మనవరాలు, నాకూ పచ్చడీ అన్నం కావాలీ అని పేచీపెట్టడం, పిల్లలు తనని కోప్పడడం తప్పడం లేదు. ఈయనకి చెప్పాలేరు, తనని ఆపాలేరు. ఇదో గొడవ!
ఇంత శ్రమా పడి పెట్టిన తరువాత రుచి చూశాను బాగానే ఉందండోయ్ !

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes