RSS

ఆదివారం వెరైటీ లంచ్ !!


    కుటుంబం అందరం కలిసి భోజనం చేసి చాలా కాలం అయిందని, మా కోడలు ఈ వేళ మా అమ్మాయీ, అల్లుడూ, పిల్లల్నీ భోజనానికి పిలిచింది. ముందరే కండిషన్ ఏమిటంటే, రోజూ ఉండేవాటికి విభిన్నంగా ఉండాలని. మా శ్రీవారికి మొదట్లోనే గుండెలో రాయి పడింది. హొటళ్ళకెళ్ళినప్పుడు, ఏదో తింటూంటాము కదా, మళ్ళీ ఇంట్లో కూడా ఎందుకూ అని నస మొదలెట్టారు. అయినా మెజారిటీ అభిప్రాయానికి తల వంచవలసి వచ్చింది పాపం !

    మెనూ ఏమిటంటే 1.జల్ జీరా ( త్రాగడానికి), 2.భేల్ పూరీ 3. దహి పూరీ 4.పానీ పూరీ 5. పావ్ భాజీ 6. రగడా ప్యాటిస్, ఇవి కాకుండా మామిడికాయ పులిహార, మామిడికాయ పప్పు, అన్నం. బాగుందా మెనూ.

    అమ్మాయీ,అల్లుడూ, పిల్లలూ 12.30 కి వచ్చారు. ముందుగా జల్ జీరా ఇచ్చాము. కొంతమందికి ఘాటుగా ఉందని కొంచెం నీళ్ళు కలుపుకుని త్రాగారు. మా శ్రీవారికి ముందరే చెప్పాను, మెల్లిగా ఖబుర్లు చెప్పుకుంటూ త్రాగాలని. అయినా సరే ఓ పని ఐపోతుందికదా అని, శ్రీరామ నవమి పానకంలా ఓ గుక్కలో త్రాగేశారు ! పోన్లెండి ఎవరి ఆనందం వాళ్ళదీ.

    "బఫే" కాబట్టి ఎవరి ప్లేట్లు వాళ్ళే తెచ్చుకుని తినడం మొదలెట్టారు.మా శ్రీవారు ఏం చేస్తున్నారో అని చూద్దును కదా, మొత్తం అన్నీ ఓ బౌల్ లో వేసేసికుని, దాంట్లో ఓ అరడజను పూరీలు వేసేసికుని, దాంట్లో "పానీ' కలుపుకుని లాగించేశారు. అలా కాదండీ, పూరీకి ఓ చిన్న చిల్లు చేసి, దాంట్లో ఆ మిగిలినవి వేసికుని, పానీలో ముంచుకుని తాగాలండీ అని చెప్పేలోపలే, తన పధ్ధతిలో పూర్తి చేసేశారు. పాపం పళ్ళులేవుగా, పోన్లే డాడీ కి కావలిసినట్లుగా తింటారూ వదిలేయ్ అన్నారు పిల్లలు. అసలు 'ఈస్థటిక్ సెన్స్ ' లేదు ఈ మనిషికి అని సరిపెట్టెసుకున్నాను.
నాకు చిట్ పార్టీల్లో తినడం వల్ల అలవాటుంది, పిల్లలు కూడా అప్పుడప్పుడు బయట తింటూంటారు కాబట్టి ఫర్వాలేదు. ఎదో ఒకటి, మళ్ళీ కందా బచ్చలీ అనకుండా మాతో తినేశారు.ఈ మాత్రం అదృష్టం చాల్లే అనుకున్నాను.

    ఇవన్నీ తిన్న తరువాత, మామిడికాయ పప్పూ అన్నం ఎవరికి కావాలీ. మళ్ళీ సాయంత్రం ఇంకేమీ చేసుకోకుండా మొత్తానికి ఆదివారం హాయిగా గడిపాము.అన్నిటికంటే ఆఖరున 'బాస్కిన్ రాబిన్స్' ఐస్ క్రీం తో ' భోజనం ' పూర్తి చేశాము.అస్తమానూ పప్పూ, పులుసూ, కూరా పచ్చడీ తోనే కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీ గా కూడా తింటూంటే బాగుంటుంది.

    దీని వలన మా శ్రీవారికి జరిగిన ఉపకారం ఏమిటయ్యా అంటే, ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఆ పానీపూరీ, భేల్ కొట్లదగ్గర ఎవరైనా తింటూన్నప్పుడు, నోరు వెళ్ళబెట్టుకుని చూడఖ్ఖర్లేదుట! తినాలని ఉంటుందీ పాపం,బయట తినడానికి మొహమ్మాటం.

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes