RSS

విఠ్ఠల..విఠ్ఠల.. పాండురంగ విఠ్ఠల..

    జయ జయ విఠల పాండురంగ! జయ కృష్ణ ముకుందా మురారీ! పాటలు, సతీ సక్కుబాయి పేరు వినేసరికి పాండురంగమహత్యం, భక్తతుకారం ,గుర్తుకివస్తాయికదా, అలాంటి పాండురంగక్షేత్రమైన పండరీపురానికి రమ్మని ఆ పాండురంగని ఆదేశం అయింది.మేము, మా స్నేహితులు ఆనంద రవిచంద్ర లము కలిసి బుధవారం 6 గంటలకు మా ఇంటినుండి ఇండికా ఎ సి కారులో బయలుదేరాము.కు దైవదర్శన భాగ్యం కలిగించేందుకు ఆ భగవంతుడు చక్కని మిత్రులను దేవదూతలుగా పంపుతూవుంటాడు.అది మేము చేసుకున్న అదృష్టం. భక్త తుకారాం, జ్ఞానేశ్వర్ ల పాదుకలు మా పుణె దగ్గరవున్న ఆళంది, దేహూ గ్రామాలనుండి ప్రతీ ఆషాడీ కి పాల్కి బయలుదేరుతుంది.భక్తులు పాదయాత్ర

చేస్తూ మధ్య మధ్యలో ఆగుతూ వెడుతూవుంటారు. వీలున్నంతవరకూ దర్శనం చేసుకోవడం వారికి కొంత సేవ చేసుకునేవాళ్ళం. వీరిని' వార్కరీ ' లని అంటారు.దీని పై ఇదివరకు ఒక టపా రాసాను.వీరిని చూసినప్పుడల్లా మాకు ఎప్పటికయ్యా నీ దర్శన భాగ్యం అనుకునేదాన్ని. ఇదుగో ఇప్పటికి కలిగింది. మా శ్రీవారు కూడా టపా రాసారు.

   చంద్రభాగానదీ తీరానా ( ప్రస్తుత భీమానది) పుణెకి 225 కి.మి దూరంలో వుంది.వేసవికాలం కదా ఊష్ణోగ్రత 40 డిగ్రి ల పైనే వుంది. అయినా భక్తుల సంఖ్య రోజుకి 30 వేల పైనే వస్తూవుంటారు.ఉదయం 6 గంటలకు బయలుదేరిన మేము ఎనిమిది గంటలకు ఓ చోట ఆగి ఫలహారం తీసుకొని బయలుదేరి 11 గంటలకు పండరీపురం చేరుకున్నాము.లోపలికి సంచీలు, ఆడవాళ్ళ హేండుబాగ్ , సెల్ ఫోనులూ, కెమెరాలూ ఏవీ కూడా తీసుకువెళ్ళనివ్వరు. ప్రవేశ మార్గానికి ఎదురుగా బాగ్ లకి ,పక్కగా సెల్ ఫొనులు , కెమెరాలకి లాకర్లు వున్నాయి. అక్కడ భద్రపరచుకొని , డబ్బులు చిన్న పర్సులో పెట్టుకొని, సెక్యూరిటి చెక్ తరువాత," క్యూ" లో ప్రవేశించాము.మంచినీళ్ళ బాటిల్ అనుమతిస్తారు.మొత్తం "క్యూ" అంతా ఓ మల్టిస్టోరి బిల్డింగ్ లో

నడుస్తుంది. మధ్యలో కూర్చునేందుకు అక్కడ అక్కడ బెంచీల సదుపాయం వుంది. కూలర్లు , ఫాన్లు వున్నాయి.మధ్యలో మెట్లు ఎక్కడం , దిగడం , కొంత నడక ,
విఠోబా నామ స్మరణ తో ఓ గంట సమయం పట్టింది మాకు ఆలయప్రవేశానికి. ముందర గణపతి దర్శనం ఆ తరువాత కూడా దేవతామూర్తులు కనిపిస్తారు. గోడల మీద చిత్రాలు వున్నా మా దృష్టి పాండురంగడి మీదేనూ.. ఇంకొకసారి వెడితే మిగిలిన వాటిపైదృష్టి వుంటుందేమొనూ...లోపల ఫుట్ ప్రింట్ మెషీన్ వుంది. దాని ప్రకారం మేము 6,974, 75, 76, 77.దర్శించుకున్న భక్తులం.

   ఇక్కడి విశేషత ఏమిటంటే నడుం మీద చేతులు పెట్టుకొన్న విఠోబా ని చూస్తూవుంటే మన విన్నపాలు, భజనలు ఎంతో శ్రద్ధగా వింటూన్నట్లే వుంటుంది.గర్భగుడిలోపలికి వెళ్ళి మూలవిరాట్టుని ముట్టుకొని ఆయన పాదస్పర్స సేవ చేసుకొని మన నుదురు ఆయన పాదములకి తాకించి తృప్తిగా బయటకు రావచ్చును. అదీ బుధవారమైతే మరీ మంచిదట. మాకు తెలియకుండా మేము బుధవారమే వెళ్ళాము.పక్కనే వున్న" రుక్మిణి దేవి " దర్శించుకొని గుడి అందాలు చూసుకుంటూ " సత్యభామ" " రాధాదేవి" లను దర్శించుకొని మిగిలిన దేవతా మూర్తులను చూసుకొని " వెంకటేశ్వరుని" దర్శించుకొని తిరుపతి లో చూసేందుకై గగనమైతే ఇక్కడ హయిగా ఆయన పాదాలను స్పృశించి మరీ సేవించుకోవచ్చును. అన్ని దేవతా మూర్తులకు పాదస్పర్శ చేసుకోవచ్చు. ఇక్కడ లడ్డు ప్రసాదం విక్రయిస్తున్నారు. అది తీసుకున్నాము. ప్రాంగణం బయటకు వచ్చి " కాకడై" మహరాజ్ మఠ్ కి వెళ్ళాము. అక్కడ అందరి దేవతా మూర్తుల కధలతో బొమ్మలు బాగా పెట్టారు. అది ఈ మధ్యనే కట్టారట. మేము చేసుకున్నది ధర్మదర్శనం . అది కాకుండా తొందరగా కావాలనుకుంటే ముఖదర్శనం కూడా వుంది. గోపాలుని గుడి వుందట. అక్కడ విష్ణుమూర్తి పాద చిహ్నాలు వుంటాయట. మాకు తెలీక వెళ్ళలేకపోయాము. నది లో స్నానం చేయలేకపోయాము. అసలు నీళ్ళే లేవు ఆ వున్నవి పరిశుభ్రంగా లేవు. వాన పడితే నిండుగా వుంటుందిట. అన్నట్లు ప్రవేశద్వారం దగ్గర బేగ్ లు , సెల్ ఫోన్లు పెట్టి వెళ్ళాము కదా! తిరిగి బయటకు ఇంకో గేట్ నుండి వచ్చాము. చెప్పుల దగ్గరకు వెళ్ళే లోపులో ఎండకి కాళ్ళు బొబ్బలు ఎక్కిపోయాయి. పైన ఏదో కవర్ చేసినా లాభం లేకపోయింది. ఆ తరువాత చల్లని లస్సి తాగిన తరువాత ప్రాణం కుదుటబడింది.

    వృద్ధాప్యంలో వున్నా తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో తెలిపే క్షేత్రమిది.పండరిపురం నుండి " అక్కల్ కోట్" బయలుదేరాము. ....

సరదా..సరదాగా.. మహాబలేశ్వర్...

   మొన్న మా స్నేహితులు ఆనంద రవిచంద్ర ల తో కలసి మహబలేశ్వర్ వెళ్ళివచ్చాము. ఇదివరకు చూడలేకపోయినవి మరి కొన్ని చూశాము.చల్లటి వాతావరణం లో హాయిగా 6 గంటలకు భక్తి పాటలు వింటూ బయలుదేరాము. ఓ రెండు గంటల ప్రయాణం తరువాత ఓ చక్కని హుటెల్ లో ఫలహారాలు కానిచ్చి కబుర్లు చెప్పుకుంటూ , పాత మహబలేశ్వర్ చేరుకున్నాము. అది అంతా బ్రహ్మ అరణ్యమట.ఈ శివమందిరం చాలా పురాతనమైనది.
స్వయంభూలింగం. బ్రహ్మ, విష్ణు, మహేష్ ల త్రిగుణాత్మస్వరూపం. రుద్రాక్ష రూపంలో దర్శనమిస్తుంది.ఈ లింగం మీద స్వయం జలధారలతో అభిషేకం జరుగుతున్నట్లు గా సదా నీటి ధారలు వుంటాయి. ఎలా ఎక్కడనుండి ఉబుకుతాయో తెలీదు.జనం ఎక్కువగా లేకపోవడంతో మేము చాలాసేపు గడిపి బయటకు వచ్చాము. బహుశా అప్పుడే ఓ టూరిష్టు బస్ వచ్చినట్లుంది జనం బోలెడు మంది బిరబిరలాడుతూ లోపలకి వస్తూన్నారు. మేము అక్కడ కొన్ని ఫోటోలు తీసుకొని ఆ పక్కనే వున్న " అతిబలేశ్వర్" మందిరం దర్శించుకొని దాని పక్కనే వున్న " పంచగంగ" టెంపుల్ వెళ్ళాము.
    గాయత్రి, సావిత్రి, కొయన, వెన, కృష్ణ నదులు విడి విడి గా ఇక్కడినుండే ప్రవహించి ఈ పంచగంగ దగ్గర అన్ని మిశ్రమమై ఒకే ధారగా గొముఖము నుండి సదా ప్రవహిస్తూ వుంటుంది. విడి విడి ధారలను దర్శించి , గోముఖమునుండి వచ్చినధారను
తీర్ధముగా తీసుకున్నాము. కొంతమంది సీసాల్లొ ఈ పవిత్ర జలాన్ని పట్టి తీసుకువెడుతున్నారు. నిజానికి నాకయితే ఈ రెండు మందిర్ లు ఎన్ని సార్లు చూసినా తని తీరదు. ఆ తరువాత పార్కింగ్ నుండి ఓ రెండు మూడు నిమిషాల నడక దూరంలో " కృష్ణ మాయి" మందిరం వుంది. " కొంతమంది " కృష్ణబాయి" మందిరంటారు. మన "కృష్ణా నది " మందిరమేనూ. ఇది పాండవులు కట్టించారట. బాగా పాతబడి పోయి వుంది.లోపల అంతా చీకటి.
ఓ మనిషి టార్చి లైటు సాయంతో చూపిస్తాడు.ఓ పెద్ద పానుగొట్టం ,దానిపై డమరుకం, ఆ పైన రుద్రాక్షలు , దానిపైన శివలింగం. చాలా బాగుంది.ఆ పానుగోట్టంలో సదా నీటి చెలమ వుంటుంది. అక్కడినుండి బయటకు ఓ గోముఖము నుండి బయటకు వస్త్తుంది.
భక్తులకు తీర్ధముగా సేవించుటకోసమని. అదే కృష్ణ. ఈ గుడి కిందనుండి కృష్ణ ఒయ్యారంగా ముందుకి సాగి పోతూంది.
   ప్రకృతి దృశ్యాలు చూసేందుకు అనువుగా ఎన్నో వ్యూ పాయింట్లు వున్నాయి.ఆర్ధర్ సీట్, ఎకోపాయింటు, హంటింగ్ పాయింట్, మంకీ పాయింట్ , సావిత్రిపాయింట్, టైగర్ పాయింట్, అన్నింటినుండి మనం ఆ దృశ్యాలని చూసి
మన మనసులో పెట్టుకోవాలే కాని ఏ కెమెరా నుంచీ కూడా వాటిని బందించలేమనిపించింది. టైగర్ పాయింటు లో ఓ నీటి స్రింగ్ నుండి ఎప్పూడూ స్వచ్చమైన నీరు వస్తూవుంటూంది.పులులు అక్కడికి వచ్చి నీళ్ళు తాగేవట.ఇప్పుడు ఎక్కడవస్తాయనుకోండీ, ఒకామె కూర్చుని అందరికి గాజు గ్లాసు తో తాగినన్ని నీళ్ళు యిస్తోంది. మేము కూడా తీసుకున్నాము. చాలా చల్లగా , తీయగా వున్నాయి.
   మందిరాలవరకూ పెద్దవాళ్ళకు ఒకె. కాని పిల్లలతో వెడితే బాగా ఎంజాయ్ చేయవచ్చును. మరో చోట ఫ్రీ గార్డెను విజిట్ కూడా వుంది. అక్కడ స్ట్రాబెరీస్, బ్రాకోలి , లెట్యూస్, కేబేజీ, ఫ్లవర్, మల్బరీ చెట్టూ అన్నిచూశాము.
మనకి కావసినవి కూరలు మన ఎదుటే గార్డెన్ లోంచి తీసి యిస్తారు. మేము కొన్ని తెచ్చుకొని స్ట్రాబెరి ఐస్ క్రీమ్ తీసుకొనికాసేపు అటు ఇటూ తిరిగి ఆ చెట్ల నీడలో ఇంటిదగ్గరనుండి తీసుకెళ్ళిన కొత్త ఆవకాయఆన్నం,( ఇలా గుళ్ళూ గోపురాలకీ వెళ్ళి కొత్తావకాయ అన్నం తినేవారిలో మేమే మొదటివారం అయుంటాం !!) ఆనంద తెచ్చిన పెరుగుఅన్నం, బాదాంహల్వా తిని తిరుగు ప్రయాణం లో మాప్రో గార్డెను చూసి
వస్తూ వస్తూ బనేశ్వేర్ వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకొని రాత్రి 8 గంటలకి ఇంటికి చేరుకున్నాము.
పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes