RSS

సరదా..సరదాగా.. మహాబలేశ్వర్...

   మొన్న మా స్నేహితులు ఆనంద రవిచంద్ర ల తో కలసి మహబలేశ్వర్ వెళ్ళివచ్చాము. ఇదివరకు చూడలేకపోయినవి మరి కొన్ని చూశాము.చల్లటి వాతావరణం లో హాయిగా 6 గంటలకు భక్తి పాటలు వింటూ బయలుదేరాము. ఓ రెండు గంటల ప్రయాణం తరువాత ఓ చక్కని హుటెల్ లో ఫలహారాలు కానిచ్చి కబుర్లు చెప్పుకుంటూ , పాత మహబలేశ్వర్ చేరుకున్నాము. అది అంతా బ్రహ్మ అరణ్యమట.ఈ శివమందిరం చాలా పురాతనమైనది.
స్వయంభూలింగం. బ్రహ్మ, విష్ణు, మహేష్ ల త్రిగుణాత్మస్వరూపం. రుద్రాక్ష రూపంలో దర్శనమిస్తుంది.ఈ లింగం మీద స్వయం జలధారలతో అభిషేకం జరుగుతున్నట్లు గా సదా నీటి ధారలు వుంటాయి. ఎలా ఎక్కడనుండి ఉబుకుతాయో తెలీదు.జనం ఎక్కువగా లేకపోవడంతో మేము చాలాసేపు గడిపి బయటకు వచ్చాము. బహుశా అప్పుడే ఓ టూరిష్టు బస్ వచ్చినట్లుంది జనం బోలెడు మంది బిరబిరలాడుతూ లోపలకి వస్తూన్నారు. మేము అక్కడ కొన్ని ఫోటోలు తీసుకొని ఆ పక్కనే వున్న " అతిబలేశ్వర్" మందిరం దర్శించుకొని దాని పక్కనే వున్న " పంచగంగ" టెంపుల్ వెళ్ళాము.
    గాయత్రి, సావిత్రి, కొయన, వెన, కృష్ణ నదులు విడి విడి గా ఇక్కడినుండే ప్రవహించి ఈ పంచగంగ దగ్గర అన్ని మిశ్రమమై ఒకే ధారగా గొముఖము నుండి సదా ప్రవహిస్తూ వుంటుంది. విడి విడి ధారలను దర్శించి , గోముఖమునుండి వచ్చినధారను
తీర్ధముగా తీసుకున్నాము. కొంతమంది సీసాల్లొ ఈ పవిత్ర జలాన్ని పట్టి తీసుకువెడుతున్నారు. నిజానికి నాకయితే ఈ రెండు మందిర్ లు ఎన్ని సార్లు చూసినా తని తీరదు. ఆ తరువాత పార్కింగ్ నుండి ఓ రెండు మూడు నిమిషాల నడక దూరంలో " కృష్ణ మాయి" మందిరం వుంది. " కొంతమంది " కృష్ణబాయి" మందిరంటారు. మన "కృష్ణా నది " మందిరమేనూ. ఇది పాండవులు కట్టించారట. బాగా పాతబడి పోయి వుంది.లోపల అంతా చీకటి.
ఓ మనిషి టార్చి లైటు సాయంతో చూపిస్తాడు.ఓ పెద్ద పానుగొట్టం ,దానిపై డమరుకం, ఆ పైన రుద్రాక్షలు , దానిపైన శివలింగం. చాలా బాగుంది.ఆ పానుగోట్టంలో సదా నీటి చెలమ వుంటుంది. అక్కడినుండి బయటకు ఓ గోముఖము నుండి బయటకు వస్త్తుంది.
భక్తులకు తీర్ధముగా సేవించుటకోసమని. అదే కృష్ణ. ఈ గుడి కిందనుండి కృష్ణ ఒయ్యారంగా ముందుకి సాగి పోతూంది.
   ప్రకృతి దృశ్యాలు చూసేందుకు అనువుగా ఎన్నో వ్యూ పాయింట్లు వున్నాయి.ఆర్ధర్ సీట్, ఎకోపాయింటు, హంటింగ్ పాయింట్, మంకీ పాయింట్ , సావిత్రిపాయింట్, టైగర్ పాయింట్, అన్నింటినుండి మనం ఆ దృశ్యాలని చూసి
మన మనసులో పెట్టుకోవాలే కాని ఏ కెమెరా నుంచీ కూడా వాటిని బందించలేమనిపించింది. టైగర్ పాయింటు లో ఓ నీటి స్రింగ్ నుండి ఎప్పూడూ స్వచ్చమైన నీరు వస్తూవుంటూంది.పులులు అక్కడికి వచ్చి నీళ్ళు తాగేవట.ఇప్పుడు ఎక్కడవస్తాయనుకోండీ, ఒకామె కూర్చుని అందరికి గాజు గ్లాసు తో తాగినన్ని నీళ్ళు యిస్తోంది. మేము కూడా తీసుకున్నాము. చాలా చల్లగా , తీయగా వున్నాయి.
   మందిరాలవరకూ పెద్దవాళ్ళకు ఒకె. కాని పిల్లలతో వెడితే బాగా ఎంజాయ్ చేయవచ్చును. మరో చోట ఫ్రీ గార్డెను విజిట్ కూడా వుంది. అక్కడ స్ట్రాబెరీస్, బ్రాకోలి , లెట్యూస్, కేబేజీ, ఫ్లవర్, మల్బరీ చెట్టూ అన్నిచూశాము.
మనకి కావసినవి కూరలు మన ఎదుటే గార్డెన్ లోంచి తీసి యిస్తారు. మేము కొన్ని తెచ్చుకొని స్ట్రాబెరి ఐస్ క్రీమ్ తీసుకొనికాసేపు అటు ఇటూ తిరిగి ఆ చెట్ల నీడలో ఇంటిదగ్గరనుండి తీసుకెళ్ళిన కొత్త ఆవకాయఆన్నం,( ఇలా గుళ్ళూ గోపురాలకీ వెళ్ళి కొత్తావకాయ అన్నం తినేవారిలో మేమే మొదటివారం అయుంటాం !!) ఆనంద తెచ్చిన పెరుగుఅన్నం, బాదాంహల్వా తిని తిరుగు ప్రయాణం లో మాప్రో గార్డెను చూసి
వస్తూ వస్తూ బనేశ్వేర్ వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకొని రాత్రి 8 గంటలకి ఇంటికి చేరుకున్నాము.








5 కామెంట్‌లు:

శ్రీలలిత చెప్పారు...


బాగుందండీ మీ మహాబలేశ్వర్ యాత్ర. ఫొటోలు కూడా బాగున్నాయి. యెప్పుడైనా వెళ్ళి చూడాలనిపించింది.

psm.lakshmi చెప్పారు...

దోవ, దూరం, ప్రయాణ సౌకర్యాలగురించి కూడా చెబితే బాగుంటుంది.
psmlakshmi

rajachandra చెప్పారు...

chala bagundi

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

శ్రీలలితగారూ,

మీ స్పందనకు ధన్యవాదాలండి.

psmలక్ష్మిగారూ,

మేము పూణె నుండి వెళ్ళాము. దూరం 120 కిలోమీటర్లదాకా ఉంటుంది. ఫ్రెండ్స్ తో వారి కారులోనే వెళ్ళాము. ఓ రెండు గంటలు పట్టింది. సామాన్యంగా New Mahabaleswar కి కొత్త జంటలు హనీమూన్ కి వెళ్తూంటారు. మేము అక్కడి చారిత్రాత్మక దేవాలయాలు చూసే ఉద్దేశ్యంతో, old Mahabaleswar కి మాత్రమే వెళ్ళాము. ప్రొద్దుటే వెళ్ళి సాయంకాలానికి వచ్చేయొచ్చు కాబట్టి, వసతి సౌకర్యాల విషయం చూడలేదు. కానీ, వాటికేమీ లోటులేదు. సావకాశంగా అన్నిటినీ చూడొచ్చు. ఇంకా వివరాలు కావాలంటే http://en.wikipedia.org/wiki/Mahabaleshwar చూస్తే ఇంకా వివరంగా తెలుస్తుంది.

మీస్పందనకు ధన్యవాదాలు..

రాజా చంద్ర గారూ,

మీ ప్రోత్సాహపూరితమైన వ్యాఖ్యకి ధన్యవాదాలు.

Ramachandrudu చెప్పారు...

బొంబాయి వచ్చి 50 సంవత్సరాలు అయింది. మహాబలేశ్వర్ చూడలేదు. మీరు కళ్ళకి కట్టినట్టు చూపించెరు. పూర్తిగా చదవడానికి కళ్ళు నిరాకరిస్తున్నాయి. ఆనందు వెళ్ళి స్ట్రాబెర్రీలే మోసుకొచ్చేడు.

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes